అక్కుర్తి మూటలమ్మ

వికీపీడియా నుండి
(అక్కూర్తి మూటలమ్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అక్కుర్తి మూటలమ్మ
జననం
జ్యోతి

రాచపాలెం, నెల్లూరు జిల్లా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
యోగిని
తల్లిదండ్రులువెంకటసుబ్బమ్మ, వెంకటకృష్ణారెడ్డి

అక్కూర్తి మూటలమ్మ (1882-1943) ప్రముఖ యోగిని. అక్కుర్తి రైల్వేస్టేషన్ కు సమీపంలోని మైదానంలో ఈమెకు ఆలయం ఉంది.

బాల్యం[మార్చు]

ఆమె నెల్లూరు సమీపాన 10 కి.మీ. దూరంలో గల రాసపాళెం గ్రామంలో వెంకట సుబ్బమ్మ, వెంకటకృష్ణారెడ్డి దంపతులకు జన్మించారు. ఆ దంపతులకు లేక లేక పుట్టిన కుమార్తె అయిన ఈమెకు వారు"జ్యోతి" అని నామకరణం చేసారు. ఆతర్వాత ఆమె మూటలమ్మగా ప్రసిద్ధిచెందింది. బాల్యంలో ఆమె తండ్రి మరణించడం వలన ఆమె తల్లితో పాటు ఆమె అనాథ అయినది. పుట్టినది రెడ్ల యింట కనుక వెంకట సుబ్బమ్మ ధర్మ నిరతురాలై తమ పురోహితులింటనే పనిపాటలు చేస్తూ కన్నబిడ్డను గారాబంగా పెంచింది. ఒక ఏడాదిలోగా ఆమె కూడా మరణించింది. కన్నతల్లిదండ్రులను కోల్పోయిన జ్యోతిని ఆ బ్రాహ్మణ దంపతులు తమ స్వంత పుత్రికగా పెంచారు. పూర్వజన్మ సుకృతం వలన ఆమెకు అన్నీ మంచి గుణాలే అలవడినాయి. బాల్యం నుండి ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకున్నది. ఆమె తన సుగుణాల వల్ల ఆ బ్రాహ్మణదంపతుల ప్రేమకు పాత్రురాలైంది. ఆమె ఎనిమిదవ యేట ఉండగానే ఆ దంపతులు కాశీ యాత్రకు ప్రయాణమైనారు. వారు జ్యోతిని కూడా తమతో తీసుకొని పోయినారు.

కాశీ యాత్ర[మార్చు]

కాశీ క్షేత్రంలో వాళ్ళు ఒక బ్రాహ్మణోత్తముని యింట బస చేసారు. ఆ బ్రాహ్మణుడు సాధారణ వ్యక్తి కాదు. మహా భక్తుడు, గొప్ప తపస్సంపన్నుడు. ఆయన కృపా కటాక్షములు ఈ అనాథ బాలికపై పడింది. 0జ్యోతికి కూడా ఆ మహనీయునిపై భక్తి విశ్వాసాలు కుదిరినవి. ఆమె ఆ మహాత్ముని సన్నిధిలోనే ఉండిపోవాలనే కోరిక కలిగింది. జ్యోతి సామాన్యురాలు కాదని ఆమెకు గొప్ప భవిష్యత్తు ఉందని కనుక ఆమెను తమ వద్దనే విడిచి పెట్టాలని ఆ కాశీ పండితుడు బ్రాహ్మణ దంపతులను కోరాడు. ఆ దంపతులు విడవలేక విడువలేక ఆమెను వదలి తమ గ్రామానికి ప్రయాణమైనారు.

ఆధ్యాత్మిక జ్ఞానం[మార్చు]

కాశీలో ఆ గురువు గారి సన్నిధిలో 11 సంవత్సరాలు ఉండి జపతపాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం ఒంటబట్టించుకున్నది. ఆమెకు దివ్యదృష్టి అలవడినది. అప్పటికామె వయస్సు 20 యేండ్లు. ఆ సమయమున ఆ గురువు ఆమెకు పెళ్ళి ప్రయత్నములు చేస్తూండగా ఆమె నిరాకరించింది. ఆమె తనకు పరాత్పరుడే పతి యని, అన్య మానవులకు వివాహం చేసుకొననని చెప్పింది. పరమపద ప్రాప్తియే తన ధ్యేయమని ఆమె గురువుగారికి మనవి చేసింది. కాశీ పండితుడు ఆమె కారణజన్యురాలుగా భావించి మంత్రోపదేశం చేసాడు. మంత్రోపదేశంతో శమదమాదులు జ్యోతికి చెలిమి కత్తెలైనవి. నాటి నుండి ఆమె సంగం వర్జించి తీవ్ర ధ్యానంలో మునిగిపోయింది. మంత్రమిచ్చిన గురువుగారి సేవలు కోరింది. ఆ మహాత్ముడు జ్యోతిని ఆశీర్వదించాడు. ఆమె అనేక ప్రదేశాలు, క్షేత్రాలు తిరిగి ఎందరో మహాత్ములను దర్శించింది. చివరకు దక్షిణ భారతదేశానికి తిరిగివచ్చి చెల్లూరు స్వగ్రామం రాసపాళెం, వెంకటగిరి, అంబూరు, ఉత్తరార్కాడు, గుడియాత్తం సంచారం చేసింది. ఇట్లా తిరుగుతుండగా ఆమె అంతర్‌దృష్టి ఆనాటి మహాపురుషుడైన సొరకాయల స్వామి గోచరించాడు. ఆ దినాలలో సొరకాయల స్వామి రేణిగుంట, పందికాల్వ తిరుగుతుండినారు. జ్యోతి సొరకాయల స్వామిని దర్శించి సాష్టాంగపడింది. తనకు శిష్యురాలిగా అనుగ్రహించవలసినదని కోరింది. పరిపక్వస్థితి వచ్చిన ఆమెకు సొరకాయల స్వామి చక్షుర్దీక్ష ప్రసాదించాడు. జ్యోతి అంతరంగ బహిరంగములు జ్యోతిర్మయములైనవి.

ఉపదేశాల ప్రచారం[మార్చు]

జ్యోతి అనేక ప్రదేశములు తిరుగుతూ తన గురువుగారు సొరకాయల స్వామిని దర్శిస్తూ ఉండేది. స్వామివారి ఇతర శిష్యులైన ముడుగు స్వాములు, చట్తిపరదేశి, ముంతపరదేశి, నందనార్ స్వాములతో ఆమెకు పరిచయమేర్పడినది. ఈ విధంగా ఆమె అనేక గ్రామాలు తిరుగుతూ సొరకాయల స్వామి మహిమలు చాటుతుండేది. ఎవరేది పెట్టినా తింటూ తిరిగేదే కాని తానై ఎన్నడూ ఏమీ అడిగేదికాదు. ఏమీ లేనిచోట ఆమె నిరాహారిగానే ఉండేది. ఆమె చంకలో ఎప్పుడూ ఒక బట్టల మూట ఉండటం చేత ఆమెను జనులు మూటలమ్మ అని మూటల లక్ష్మమ్మ అని పిలిచేవారు. ఆమె ఈ విధంగా దేశ సంచారం చేస్తూ కాళహస్తి సమీపాన పెద్ద కన్నని గ్రామం పొలిమెరలో దారిప్రక్కన ఒక చెట్టు నీడలో తన మూట పెట్టుకొని నిద్రించింది. ఆమె ముఖం చుట్టున్న ప్రభామండలం గమనించిన అక్కడివారు ఆశ్చర్యపోయారు. ఆమెను బాగా ఆదరించి గౌరవించసాగారు. పెద్దకన్నని చుట్తుపట్టు గ్రామాల్లో ఆమె తిరుగుతూ ఉంటే వెలిసినవాళ్ళూ అహమహమికతో భిక్షచేసేవారు. తెలియని వాళ్ళు పిచ్చిబిచ్చగత్తె అని ఉపేక్షించేవారు. మూటలమ్మది మౌనవ్రతం కనుక ఎవరేమి అడిగినా ఆమె మారుమాట్లాడేది కాదు.

మహిమలు[మార్చు]

శ్రీకాళహస్తి సమీప గ్రామాలలో ఆమె తిరుగుతుండగా అక్కడి ప్రజలు మూటలమ్మకు తమ కష్టాలు నివేదించుకొనేవారు. ఆమె కారుణ్యదృష్టి సోకితే రోగాలు బాధలు తొలగిపోయేవి. కొందరు గృహస్తులు ఆమెను తమ యిండ్లలో నిలువుకోవడానికి ప్రయత్నించారు. ఆమె మెట్టిన యింట్లో చింతలు దూరమై సిరులు పొంగేవి. అధివ్యాధులు తొలగిపోయి ఆనందం తాండవించేది.ఆమె ఎప్పుడూ ఒకరి యింట శాశ్వతంగా ఉండలేదు.మూటలమ్మకు ఖండయోగం కూడా బాగా తెలుసు. ఆ దినాల్లో కన్నలి, తాటిపర్తి, పొయ్యి, పూడి, కమ్మకొత్తూరు, అక్కుర్తి, చోడవరం గ్రామాల్లో అమ్మ ఎక్కువగా తిరుగుతుండేది. శ్రీకాళహస్తి ప్రాంతాల్లో అమ్మ మహాత్మ్యం మొదట గుర్తించిన ముఖ్యులు పి.వి.రామచంద్రరావు, పల్లం మునిస్వామి ప్రభృతులు. అమ్మ చాలా సంవత్సరాలు సంచారజీవితం గడిపారు. చివరకు అక్కుర్తి గ్రామం వెలుపల రైల్వేస్టేషన్ మైదానంలో స్థిరపడినారు.

ఇది గమనించిన అక్కూర్తి ప్రజలు ఆమెకు గ్రామంలో ఒక పూరిపాక వేసినారు. ఆ ప్రాంతానికి అనేక ప్రదేశాల నుండి భక్తులు వచ్చేవారు. ఆమె పాపులకు దగ్గరిరికి రానిచ్చేవారుకాదు. ఆమె వారువస్తే రాళ్ళు రువ్వేది. కొన్నిసార్లు రాత్రులు ఆ గుడిసె కాలుతున్నట్లు మంటలు అందరికీ కనిపించేవి. తీరా ఆర్పుటకు వస్తె ఏమీ ఉండెదికాదు. అమ్మ గురువుకు తగిన శిష్యురాలు. గురువుగారి వలెనే అమ్మ కూడా దీనులను, ఆర్తులను ఆదుకొని సుఖ స్ంతోషాలు పంచిన ఆ తల్లి ఒకనాడు తనువు చాలించే ఉద్దేశం ముందుగానే తెలియజేసింది. ఆమె కాలం చేసిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని యధావిధిగా భద్రం చేసారు. కాలక్రమేణా సమాధిపై గుడి నిర్మించారు. ఏటేటా ఆరాధనోత్సవాలు జరుగుతున్నవి.

మూలాలు[మార్చు]

  • సొరకాయలస్వామి చరిత్ర - 1999, డాక్టర్ బి.రుక్మిణి, సొరకాయలస్వామి కైంకర్యసమాజం, నారాయణవరం - చిత్తూరుజిల్లా.
  • ఆంధ్ర యోగులు - బి.రామరాజు.

ఇతర లింకులు[మార్చు]