అనంతామాత్యుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భోజరాజీయము
కృతికర్త: అనంతామాత్యుడు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథలు
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు
విడుదల: 1952, 1969

అనంతామాత్యుడు భోజరాజీయము అనే కావ్యం రచించిన కవి.

తెలుగు వారి ఇంటింటికి పరిచయమైన ఆవు పులి కథను రచించిన కవి పేరు అనంతామాత్యుడు. 1435 ప్రాంతంవాడు. అహోబిల నరసింహుని భక్తుడు అనతామాత్యుడు. తన మొదటి కావ్యాన్ని ఇతనికే అంకితమిచ్చ్హాడు. భోజరాజీయము అనే కావ్యాన్ని రచించాడు. తన కావ్యం నూతనంబయ్యు పురాకృతులట్లు సంతత శ్రవ్యమై పరగుతూ ఉంటుందని ఇందు చెప్పబడిన కథలన్నియు ప్రశస్త ధర్మోపదేశాలనీ అనంతుని విశ్వాసం. భోజరాజీయంలో అనంతామాత్యుడు మహాభారతంలోనుండి తనకు కావలసినంత తీసుకొన్నాడు. శకుంతలోపాఖ్యానంలో నన్నయ రచించిన - నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృతవ్రత యొక బావి మేలు అనే పద్యాన్ని

శతకూపాధిక దీర్షిక
శతవ్యాపధికంబు గ్రతువు శత యఙ్ఞ సము
న్నతు డొక్క సుతుడు దత్సుత
సతకంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా.

భోజరాజీయంలోని గోవ్యాఘ్ర సంవాదం అనంతామాత్యుని రచనా కల్పనా చాతురికి నిదర్శనము. ఈ గోవ్యాఘ్ర సంవాదంలో మూడు పెద్ద ఉపకథలున్నాయి.

  1. యోగికథ
  2. ఆవు చెప్పిన మదన రేఖ కథ
  3. మిత్రద్రోహి తెచ్చి పెట్టిన కష్టాల కథ

ఈ ఉపాఖ్యానాలను, ఉపకథలను అనంతామాత్యుడు చాలా చాకచక్యంగా, అష్టాదశవర్ణనలు పెట్టి సజీవమైన భాషలో సామెతలూ పలుకుబళ్ళు వాడుతూ రచించాడు.

అనంతామాత్యుడు ఛందోదర్పణమనే ఛందోగ్రంధాన్ని కూడా రచించాడు. ఇందులో నాలుగు ఆశ్వాసాలున్నాయి. మొదటి ఆశ్వాసంలో గద్య పద్యాది కావ్య లక్షణాలు, గురులఘు నిర్ణయం, గణ నిరూపణ రెండో ఆశ్వాసంలో ఛందో నామాలు, మూదో ఆశ్వాసంలో దేశీయ వృత్తాలు, నాలుగో ఆశ్వాసంలో సంధి, సమాసాలు, దశదోషాలు ఉన్నాయి.

అనంతామాత్యుడు రసాభరణం అనే మరో కావ్యాన్ని కూడా రచించాడు. పోతన వంటి మహాకవి అనంతామాత్యుని అనుకరించాడు అంటే అనంతుని కవితా రచనలోని విశిష్టత అర్థమవుతుంది.