అయ్యదేవర కాళేశ్వరరావు

వికీపీడియా నుండి
అయ్యదేవర కాళేశ్వరరావు

అయ్యదేవర కాళేశ్వరరావు (జనవరి 22,1882 - ఫిబ్రవరి 26,1962) స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. ఈయన జీవిత చరిత్ర నవ్యాంధ్ర - నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది.


వీరు కృష్ణా జిల్లా నందిగామ లో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.


రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను వీరు పనిచేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.


రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు.

ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతొమందికి విద్యాదానము చేసారు.

[మార్చు] మూలాలు

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె