ఆంధ్ర ప్రదేశ్
వికీపీడియా నుండి
| ఆంధ్ర ప్రదేశ్ | |
| రాజధాని - Coordinates |
హైదరాబాదు - |
| పెద్ద నగరము | హైదరాబాదు |
| జనాభా (2001) - జనసాంద్రత |
75,727,000 (5వది) - 275/చ.కి.మీ |
| విస్తీర్ణము - జిల్లాలు |
275,068 చ.కి.మీ (4వది) - 23 |
| సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
| అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
నవంబర్ 1 ,1956 - నారాయణదత్ తివారీ - కొణిజేటి రోశయ్య - రెండు సభలు (294, 90) |
| అధికార బాష (లు) | తెలుగు, ఉర్దూ |
| పొడిపదం (ISO) | IN-AP |
| వెబ్‌సైటు: www.aponline.gov.in | |
|
ఆంధ్ర ప్రదేశ్ రాజముద్ర |
|
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రమై ఉత్తర, దక్షిణాలకు వారధిలా ఉన్నది. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ. 1953, అక్టోబర్ 1 న తొలుత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డపుడు కర్నూలు, రాష్ట్ర రాజాధానిగా ఉండేది. 1956, నవంబర్ 1న రాజధాని హైదరాబాదు కు మార్చబడింది.
ఆంధ్రప్రదేశ్ 12o37', 19o54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76o46', 84o46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82o30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ గుండా పోతుంది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
- ప్రధాన వ్యాసము: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.
[మార్చు] భారత దేశ స్వాతంత్ర్యానంతరము
1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948 భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.
మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
ఆంధ్ర ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమీషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.
[మార్చు] రాజకీయాలు
నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసారు.
అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.
2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఐదేళ్ళ అనతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భాజపాలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సొంతంగా మెజారిటీ స్థానాలు సంపాదించి వరుసగా రెండోసారి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సెప్టెంబరు 2, 2009న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.
[మార్చు] భౌగోళిక పరిస్థితి
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ. రాష్ట్రములో 23 జిల్లాలు కలవు. హైదరాబాదు, రాష్ట్ర రాజధాని మరియు అతి పెద్ద నగరము. ఇతర ముఖ్య నగరాలు విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి,కర్నూలు, కడప, వరంగల్లు, గుంటూరు. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహిస్తూ కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయుటకు తోడ్పడుతున్నాయి.
[మార్చు] శాసన వ్యవస్థ
ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి (ఎగువ సభ)లో 90[1] స్థానాలు, శాసనసభ (దిగువసభ) లో 294 స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభ లో సభ్యుల సంఖ్య 295. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 60 స్థానాలు కలవు - రాజ్యసభలో 18 మరియు లోక్‌సభ లో 42.
[మార్చు] జిల్లాలు
1956 లో 20 జిల్లాలతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.తరువాత 1970 లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979 లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి.ప్రస్తుతం 23 జిల్లాలున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు చూడండి.
[మార్చు] ఆర్ధిక రంగము
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. భారత దేశములోని రెండు ప్రధాన నదులు, గోదావరి మరియు కృష్ణ రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి. వరి, పొగాకు, ప్రత్తి, మిర్చి, మరియు చెరుకు రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటలు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నది.
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. దేశంలోనే ఐదవ పెద్ద నగరము. మేలైన సంస్కృతీ సాంప్రదాయాలు, ధీటైన చరిత్ర, పారిశ్రామికాభివృద్ధి, మరియు సాంకేతిక పరిజ్ఞానం సహజీవనం సాగించే విభిన్నమైన అతి కొద్ది నగరములలో హైదరాబాదు ఒకటి. గతిశీల నాయకత్వంతో రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసూటికల్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, నిర్మాణము తదితర రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, అపారమైన వ్యాపార అవకాశాలకు నెలవై ఉన్నది.
[మార్చు] భాష-సంస్కృతి
తెలుగు రాష్ట్ర అధికార భాష. ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా హైదరాబాదులో ఉన్నారు.
కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. మహా భాగవతమును బమ్మెర పోతన అనువదించాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, డా.సి.నారాయణరెడ్డి మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు.
ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము కలదు. అన్నమాచార్య, త్యాగరాజు తదితర గొప్ప కర్ణాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు.
కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. అలాగే నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల ఆంధ్రనాట్యం కూడా ప్రజాదరణ పొందింది.
ఆంధ్రులు గత 40 సంవత్సరాలుగా సినిమాను విపరీతముగా పెంచి పోషించారు. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 70 సినిమాలు రూపొందుతాయి. ఆదాయపరంగా తెలుగు సినిమా ఒక పెద్ద పరిశ్రమ, కానీ తక్కిన భారత దేశములో పెద్దగా గుర్తింపు పొందలేదు. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు ("ఏ.ఎన్.ఆర్", దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత), ఎస్.వి.రంగారావు, ఘంటసాల, చిరంజీవి , కె.విశ్వనాధ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి, జమున, శారద, షావుకారు జానకి, జయప్రద మొదలైనవారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పలు సంగ్రహాలయాలు (మ్యూజియం) కలవు, అందులో సాలార్ జంగ్ మ్యూజియం, పురావస్తుశాఖ మ్యూజియం ముఖ్యమైనవి. వీనిలో పలు శిల్పాలు, చిత్రాలు, హిందూ మరియు బౌద్ధ మత శిల్పాలు, కళాఖండాల సేకరణలు ప్రదర్శంచబడినవి. ఈ రెండు సంగ్రహాలయాలు హైదరాబాదులో ఉన్నాయి.
[మార్చు] విద్యారంగము
ఆంధ్ర ప్రదేశ్ నందు ఎన్నో విశ్వవిద్యాలయములు మరియు కళాశాలలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదు.
- ఆంధ్ర విశ్వవిద్యాలయము, విశాఖపట్నం.
- హైదరాబాదు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలేజీ, వరంగల్లు.
- జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలేజీ, హైదరాబాదు.
- ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము, విజయవాడ.
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము, గుంటూరు.
- శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి.
- కాకతీయ విశ్వవిద్యాలయము,వరంగల్లు.
- డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపురం.
- ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము, రాజమండ్రి.
- యోగి వేమన విశ్వవిద్యాలయము, కడప.
- తెలంగాణ విశ్వవిద్యాలయము, నిజామాబాదు.
- భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, పుట్టపర్తి.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ, హైదరాబాదు
- ఉద్యానశాస్త్ర విశ్వవిద్యాలయము, తాడేపల్లిగూడెం
- కృష్ణా విశ్వవిద్యాలయము, మచిలీపట్నము
[మార్చు] పండుగలు
ఆంధ్ర ప్రదేశ్ లో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:
- సంక్రాంతి: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగ ను జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి 14 న వస్తుంది.
- ఉగాది: తెలుగు నూతన సంవత్సర ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. సాధారణంగా ఇది మార్చి/ఏప్రిల్ నెలల లో వస్తుంది.
- వినాయక చవితి: భాద్రపద శుద్ధ చవితి. ఆగష్టు/సెప్టెంబరు నెలలలో వస్తుంది.
- బతుకమ్మ: ఆశ్వయుజ మాసంలో వస్తుంది.
- దసరా: ఆశ్వయుజ శుద్ధ దశమి. అక్టోబరు నెలలో వస్తుంది.
- దీపావళి: ఆశ్వయుజ బహుళ అమావాస్య. నవంబరు నెలలో వస్తుంది .
- శ్రీరామనవమి: చైత్ర శుద్ధ నవమి. మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
- మహా శివరాత్రి: ఫిబ్రవరి /మార్చి నెలలలో వస్తుంది.
- రంజాన్ / ఈదుల్ ఫితర్ : రంజాన్ మాసం ముగిసిన (షవ్వాల్ నెల, నెలవంక చూసిన) మరుసటి రోజు.
- బక్రీద్ / ఈదుల్-అజ్ హా : జిల్ హజ్జా మాసపు 12 వ రోజు.
- మీలాద్-ఉన్-నబి : మహమ్మదు ప్రవక్త జననం
- మొహర్రం
బోనాలు: సాదారణంగా తెలంగాణ ప్రజలు ఈ బోనాల పండుగను ఆషాడమాసములో జరుపుకుంటారు . ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారికి భక్తి, శ్రద్దలతో బొనం [ ప్రసాదం] వండు కుని, ఆ ప్రసాదాన్ని కుండ లలొ పెట్టుకుని ఊరేగింపుగా వెల్లి అమ్మ వార్లకు నైవేధ్యం సమర్పించుటయే భొనం అంటారు.
[మార్చు] రాష్ట్ర గుర్తులు
→ రాష్ట్ర భాష--తెలుగు
→ రాష్ట్ర గుర్తు--పూర్ణకుంభం
→ రాష్ట్ర గీతం--మా తెలుగు తల్లికి మల్లె పూదండ
→ రాష్ట్ర జంతువు--కృష్ణ జింక
→ రాష్ట్ర పక్షి--పాలపిట్ట
→ రాష్ట్ర వృక్షం--వేప చెట్టు
→ రాష్ట్ర ఆట-- చెడుగుడు(కబడ్డీ)
→ రాష్ట్ర నృత్యం--కూచిపూడి
→ రాష్ట్ర పుష్పము--కలువ పువ్వు (వాటర్ లిల్లి)
[మార్చు] పర్యాటక రంగము
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, శ్రీశైలం, శ్రీ కాళహస్తి, సింహాచలము, అన్నవరం, యాదగిరి గుట్ట, వేములవాడ , మహానంది, కానిపాకం మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. వరంగల్ నగరమునందలి వేయిస్తంభాల దేవాలయము, రామప్ప దేవాలయము కాకతీయుల కాలమునాటి శిల్పకళకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తోంది.పర్యాటక ప్రదేశాలలో విశాఖపట్నం ఒకటి చెప్పుకొదగినది.
[మార్చు] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ఆంధ్రప్రదేశ్ అంతర్జాలంలో గవాక్షాన్ని కలిగివుంది. దీనిని ఎపి ఆన్లైన్అంటారు. దీనిలో ఇంగ్లీషు, తెలుగులలో, ప్రభుత్వ సమాచారాన్నిపొందుపరిచారు.
[మార్చు] ఇవికూడా చూడండి
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
- ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
- హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
- ఆంధ్ర ప్రదేశ్ అవతరణ
- ఇటీవలి చరిత్ర
- సుప్రసిద్ధ ఆంధ్రులు
- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు
- ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
- ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
- ఆంధ్రప్రదేశ్ విధానమండలి నియోజకవర్గాలు
- ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డివిజన్లు
- ఆంధ్రప్రదేశ్ మండలాలు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు
|
|
|
|---|---|
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · అరుణాచల్ ప్రదేశ్ · అసోం · బీహార్ · ఛత్తీస్‌గఢ్ · గోవా · గుజరాత్ · హర్యానా · హిమాచల్ ప్రదేశ్ · జమ్మూ కాశ్మీరు · జార్ఖండ్ · కర్ణాటక · కేరళ · మధ్య ప్రదేశ్ · మహారాష్ట్ర · మణిపూర్ · మేఘాలయ · మిజోరాం · నాగాలాండ్ · ఒరిస్సా · పంజాబ్ · రాజస్థాన్ · సిక్కిం · తమిళనాడు · త్రిపుర · ఉత్తరాంచల్ · ఉత్తర ప్రదేశ్ · పశ్చిమ బెంగాల్ |
| కేంద్రపాలిత ప్రాంతములు | అండమాన్ నికోబార్ దీవులు · చండీగఢ్ · దాద్రా నగరు హవేలీ · డామన్ డయ్యు · లక్షద్వీపములు · పుదుచ్చేరి |

