ఆలె నరేంద్ర
వికీపీడియా నుండి
| ఆలె నరేంద్ర | |
| ఫైలు:Replace this image male.svg |
|
|
మాజీ కేంద్ర మంత్రి
రాజ్యసభ సభ్యుడు |
|
| Succeeded by | పదవిలో ఉన్నారు |
|---|---|
| నియోజకవర్గము | మెదక్ (2004-09 |
|
|
|
| జననం | ఆగష్టు 21 1946 (వయసు 63) హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ |
| రాజకీయ పార్టీ | బహుజన సమాజ్ పార్టీ |
| భార్య/భర్త | ఆలె లలిత |
| సంతానము | 2 కుమారులు మరియు 1 కుమార్తె |
| నివాసము | హైదరాబాదు |
| As of జనవరి 8, 2008 Source: (ఆంగ్లము) |
|
ఆలె నరేంద్ర ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. భారత కేంద్ర ప్రభుత్వములో మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర, అనుచరవర్గములో టైగర్‌గా ప్రసిద్ధుడు. 2003 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించిన నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఒక రాజకీయ వేదికను ప్రారంభించాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను కె.చంద్రశేఖరరావు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశాడు.
2004 ఎన్నికలలో మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి తెరాస పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైన నరేంద్ర, తెరాస యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యాడు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని తెరాస కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర తెరాస మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి మాయావతి ఆధ్వర్యములోని బహుజన సమాజ్ పార్టీలో చేరాడు.[1] ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనాడు.
[మార్చు] బాల్యం, విద్యాభ్యాసం
ఆలె నరేంద్ర 1946, ఆగష్టు 21న హైదరాబాదులో పుష్పవతి, రామలింగం దంపతులకు జన్మించాడు[2]. స్థానికంగా హైదరాబాదులోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బియస్సీ పూర్తిచేశాడు.
[మార్చు] రాజకీయ జీవితం
ప్రారంభం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యుడైన నరేంద్ర 1983 నుంచి 1994 మధ్యకాలంలో భాజపా తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనాడు. 1978లో ఖైరతాబాదు నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలోకేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయాడు[3]. 1980లో హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.నారాయణ చేతిలో పరాజయం పొందినాడు. 1983లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పి.ఉపేంద్ర పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టినాడు. 1985లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందినాడు. 1992లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి శాసనసభలొ అడుగుపెట్టినాడు. 1994లో తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణయాదవ్ పై ఓడిపోయాడు.1999లో భారతీయ జనతా పార్టీ తరఫున లోకసభకు కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డిపై విజయం సాధించి తొలిసారి లోకసభ సభ్యుడైనాడు. 2003 వరకు భాజపా లో మంచి పేరు సంపాదించుకొని అభిమానులచే టైగర్‌గా పిలుపించుకున్నాడు. ప్రత్యేక తెలంగాణా వాదంతో కె.చంద్ర శేఖర్ రావు ప్రారంభించిన పార్టీలో చేరి ఆ పార్టీలో రెండో ముఖ్య నాయకుడిగా వ్యవహరించాడు. 2004లో మళ్ళీ మెదక్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి భాజపాకు చెందిన పి.రామచంద్రారెడ్డిపై 1,23,756 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో పర్యాయం లోకసభలో అడుగుపెట్టడమే కాకుండా మే 23న కేంద్రంలో మన్మోహన్ సింగ్ నేతృత్వం లోని యుపిఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిపదవిని పొందినాడు.
నకిలీ వీసా కేసులో చిక్కుకొని ఏప్రిల్ 2007లో తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి బహిష్కృతుడై [4], ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించాడు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో 2008 జనవరి 8న హైదరాబాదులో మాయావతి సమక్షంలో బహుజన సమాజ్ పార్టీలో చేరినాడు. [5] అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనాడు.
[మార్చు] మూలాలు
- ↑ (ఆంగ్లము) బహుజన సమాజ్ పార్టీలో చేరిక. మేరీన్యూస్.కాం (ఏప్రిల్ 24, 2008).
- ↑ (ఆంగ్లము) నరేంద్ర బయోడేటా. భారత ప్రభుత్వము (ఏప్రిల్ 24, 2008).
- ↑ (ఆంగ్లము) రాజకీయాలు. తెలంగాణా.కాం (ఏప్రిల్ 24, 2008).
- ↑ (ఆంగ్లము) వార్తలు. రెడిఫ్.కాం (ఏప్రిల్ 24, 2008).
- ↑ (ఆంగ్లము) బహుజన సమాజ్ పార్టీలో చేరిక. మేరీన్యూస్.కాం (ఏప్రిల్ 24, 2008).