ఇటికాల మధుసూదనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇటికాల మధుసూదనరావు
జననంఏప్రిల్ 5, 1918
భీంపల్లి గ్రామం, కమలాపూర్ మండలం, హన్మకొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
వృత్తిరాజకీయ నాయకుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
మతంహిందూ
భార్య / భర్తఅనసూయాదేవి
పిల్లలుఇద్దరు కుమారులు
తల్లిదండ్రులుబుచ్చయ్య, గోవిందమ్మ

ఇటికాల మధుసూదనరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1957, 1962) పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. హైదరాబాద్ రాష్ట్రం 1938లో మొదటి సత్యాగ్రహిగా జైలు శిక్ష అనుభవించాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టును ఎదుర్కొన్నాడు. 1947లో రజాకార్ల దౌర్జన్యాలకు సాయుధ వ్యతిరేకత ఉద్యమంలో పాల్గొని పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించచాడు.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

మధుసూదనరావు 1918, ఏప్రిల్ 5న తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం, భీంపల్లి గ్రామంలో ఇటికాల బుచ్చయ్య, గోవిందమ్మ దంపతులకు మధుసూదనరావు జన్మించాడు. హన్మకొండలో విద్యాభ్యాసం జరిగింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1963లో అనసూయాదేవితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు.

సామాజిక కార్యకలాపాలు[మార్చు]

అప్పటి రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు కొనసాగించలేకపోయాడు. యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఉర్దూ అధికార భాషగా ఉన్న ఆ రోజుల్లో హిందీ ప్రచారోద్యమంలో పాల్గొన్నాడు. పోరాటంలో తనతో పాటు తన జీవిత సహచరి అనసూయాదేవిని కూడా భాగస్వామిగా చేశాడు. ఉద్యమ అవసరాల రీత్యా దేశమంతా పర్యటించాడు. కొంతకాలం ఆర్యసమాజ్ వీరదళ్ కమాండర్ పనిచేశాడు. రజాకార్ల దాడులను ఎదుర్కొనేందుకు మూడువేల మంది యువకులకు మిలిటరీ తర్ఫీదునిచ్చాడే. విద్యాలయాల్లో గ్రంథాలయాలతో పాటు వ్యయామశాలలను ఏర్పాటు చేయించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమమే నడిపాడు.

రాజకీయ జీవితం[మార్చు]

మధుసూదనరావు వరంగల్ జిల్లాలోని మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1957, 1962) పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] విద్యావ్యవస్థ అభివృద్ధిలోనే ప్రజల నిజమైన అభివృద్ధి దాగుందని నమ్మి, ఆ దిశగా కృషి చేశాడు. తిరుపతికి వెళ్లాల్సిన రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (నేటి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్) ని కేంద్రంతో పోరాడి వరంగల్ లో నెలకోల్పేలా చేశాడు. నాటి ప్రధాని నెహ్రూను వరంగల్ కు రప్పించి ఆయన చేతుల మీదుగా ప్రారంభింపచేశాడు. వైద్య, విద్యసంస్థల ఏర్పాటుతో పాటు పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్థాపనలోనూ కీలకపాత్ర పోషించాడు. పోరాటాలతోనే ఆయన జీవితం కొనసాగించాడు. రాత్రి పాఠశాలలు ప్రారంభించడం, పబ్లిక్ లైబ్రరీలు తెరవడం, హరిజన-గిరిజన-వెనుకబడిన వర్గాల కోసం బావులు నిర్మించడం, వ్యాధుల నిర్మూలన-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాపనలో కీలక పాత్ర పోషించాడు.

నిర్వర్తించిన పదవులు[మార్చు]

  • వరంగల్ నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (1948)
  • జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ మెంబర్
  • హైదరాబాద్ రాజ్య హిందీ ప్రచార సభ సభ్యడు, వర్కింగ్ సెక్రటరీ
  • వరంగల్ హిందీ మహా విద్యాలయ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు
  • వరంగల్ జిల్లా ఆదివాసీ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు (1950)
  • జిల్లా వెనుకబడిన తరగతుల సంఘం వ్యవస్థాపక-అధ్యక్షుడు
  • హరిజన సంఘం వ్యవస్థాపక-అధ్యక్షుడు
  • తెలంగాణ ఆదివాసీ సేవా సంఘ్ సలహాదారు సభ్యుడు
  • లేబర్ అడ్వైజరీ బోర్డు సలహాదారు సభ్యుడు
  • వరంగల్ భారతీయ కళా మందిర్ అధ్యక్షుడు
  • వరంగల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు

మరణం[మార్చు]

పోలీస్ దెబ్బలు, కఠినకారాగార శిక్షతో ఆరోగ్యం క్షీణించి 46 ఏళ్ల వయసులోనే అమరులయ్యారు. రెండుసార్లు ఎంపీ అయినా తనకోసం చిల్లిగవ్వ కూడా దాచుకోని నిస్వార్థజీవి మధుసూదనరావు. ఆయన అంత్యక్రియలకు సైతం డబ్బులు లేకపోతే ప్రజలు చందాలు వేసుకొని మరీ తమ ప్రియతమనాయకుడిని సాగనంపారు.

మూలాలు[మార్చు]

  1. "hird Lok Sabha Members Bioprofile RAO, SHRI E. MADHUSUDAN". www.loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-30.
  2. Eenadu (10 November 2023). "విద్యాసంస్థల స్థాపనలో చెరగని ముద్ర 'ఇటికాల'". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  3. "Second Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2020-08-09. Retrieved 2021-12-30.