ఇబ్రహీం కులీ కుతుబ్ షా
వికీపీడియా నుండి
| ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ | |
| పరిపాలన | 1550–1580 |
|---|---|
| ఇంతకు ముందున్నవారు | సుభాన్ కులీ కుతుబ్ షా |
| తరువాతి వారు | మహమ్మద్ కులీ కుతుబ్ షా |
| రాజకుటుంబము | గోల్కొండ కోట |
ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన మూడవ నవాబు. ఈయన 1550 నుండి 1580 వరకు గోల్కొండను పరిపాలించాడు.
ఇబ్రహీం సోదరుడు, జంషీద్ కులీ కుతుబ్ షా, తండ్రిని చంపి, సోదరున్ని కళ్లు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా, విజయనగరానికి పారిపోయి రామరాయలను ఆశ్రయించి అక్కడ రాజఅతిధిగా జీవించాడు. విజయనగరంలో ఉండగా తెలుగు భాషపై అభిమానం పెంచుకున్నాడు. తరువాత తన పాలనాకాలంలో తెలుగు భాషను ఆదరించి, కవులను పోషించాడు. జంషీద్, ఆ తరువాత జషీద్ యొక్క కొడుకు సుభాన్ చనిపోయిన తర్వాత ఇబ్రహీం గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టాడు.
కళాపోషకుడిగా ఇబ్రహీం సభలో అనేకమంది కవులకు ఆశ్రమమిచ్చాడు. అందులో సింగనాచార్యుడు, అద్దంకి గంగాధరుడు మరియు కందుకూరి రుద్రకవి మొదలైనవారు ప్రసిద్ధులు. సాంప్రదాయంగా వస్తున్న అరబ్బీ మరియు పారశీక కవులతో పాటు తెలుగు కవులను కూడా పోషించాడు. ఇబ్రహీం కులీ ప్రజా సంక్షేమంపై శ్రద్ధవహించాడు. గోల్కొండ కోటకు మరమ్మత్తులు చేయించి కోటను ధృడపరిచాడు. హుస్సేన్ సాగర్ సరస్సును మరియు ఇబ్రహీంభాగ్ ను అభివృద్ధిపరచాడు. గోల్కొండ కోటలోని మక్కీ దర్వాజాపై చెక్కబడిన ఒక శాసనంలో అత్యంత మహోన్నతమైన చక్రవర్తిగా కీర్తించబడ్డాడు.
ఇబ్రహీం కులీ, భాగీరధి అనే తెలుగువనిత వివాహమాడినాడు. 1565లో బహుమనీ సుల్తానులతో కలిసి సమైఖ్యంగా తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యంపై యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో యువకునిగా తనకు ఆశ్రయమిచ్చిన ఆళియ రామరాయలును స్వయంగా సంహరించినట్లు భావిస్తారు. కొంతకాలం అస్వస్థత తర్వాత ఇబ్రహీం కులీ 1580లో మరణించాడు.
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
| సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ · జంషీద్ కులీ కుతుబ్ షా · సుభాన్ కులీ కుతుబ్ షా · ఇబ్రహీం కులీ కుతుబ్ షా · మహమ్మద్ కులీ కుతుబ్ షా · సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా · అబ్దుల్లా కుతుబ్ షా · అబుల్ హసన్ కుతుబ్ షా |