ఉప్పల వేంకటశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పల వేంకటశాస్తి
జననంఉప్పల వేంకటశాస్తి
1902, డిసెంబరు 10
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంమండలం ముడివేముల గ్రామం
మరణం1978, జూన్ 6
ప్రసిద్ధిఅవధాని,కవి
మతంహిందూ
తండ్రిఉప్పల సింహాద్రి నృసింహకవి
తల్లిఈశ్వరాంబ

ఉత్తమశ్రేణికి చెందిన కవి ఉప్పల వేంకటశాస్త్రి (డిసెంబరు 10, 1902 - జూన్ 6, 1978).

జననం[మార్చు]

1902, డిసెంబరు 10 వ తేదీ ముడివేముల గ్రామం (అప్పటి కర్నూలు జిల్లా, మార్కాపురం తాలూకా)లో సింహాద్రి నృసింహకవి, ఈశ్వరాంబ దంపతులకు జన్మించాడు. బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రుడు. ఇతనిది పండిత వంశము. ఇతడి తండ్రి శివపూజాఘనదీక్షా తత్పరుడు. తాత కోటయ్యకవి శ్రీపార్వతీశంకర పరిణయం అనే కావ్యం వ్రాసినవాడు. ఇతని పూర్వీకులైన వేంకటేంద్రకవి సత్యభామావిజయం, శేషకవి ధృవోపాఖ్యానం కావ్యాలను వ్రాశారు. ఇతడి పెద్దన్నయ్య పూర్ణయ్యశాస్త్రి చిన్నప్పుడే ఇతనికి వసుచరిత్ర మొదలైన గ్రంథాలను బోధించాడు. ఉప్పల పిచ్చయ్య, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి ఇతడికి విద్యను నేర్పిన గురువులు.

మరణం[మార్చు]

ఇతడు 1978, జూన్ 6 వతేదీ తనువు చాలించాడు.

రచనలు[మార్చు]

  1. శ్రీకృష్ణగీత
  2. ఖండభారతము
  3. ఉత్తర
  4. శ్రీజయదేవచరిత్రము
  5. వైదర్భి
  6. హరిహరానందలహరి
  7. చెంచులక్ష్మి (నాటకం)
  8. పుష్పాశయము
  9. విశ్వజ్యోతి
  10. కుమారవిలాసము
  11. శ్రీరామవిలాసము
  12. శ్రీశైలమహాత్మ్యము
  13. హరిధ్యానము
  14. పుళింద సుందరి
  15. ఊర్మిళ
  16. కవితాశ్రీ
  17. లేపాక్షి దేవాలయ ధ్యానస్తోత్ర రత్నావళి
  18. బాలబ్రహ్మేశ్వర స్తోత్రము
  19. వసంతసేన
  20. శల్యసారథ్యము
  21. తేజోగి వెంకటేశ్వర సుప్రభాతము
  22. జానకి
  23. రాఘవేంద్ర చరిత్రము
  24. భారతోప కథామంజరి
  25. చతుర బృందావిలాసము
  26. కాలకంఠ విజయము
  27. అస్త్ర ప్రధానము

బిరుదములు[మార్చు]

  • అభినవోదయ కవిమిత్ర
  • కవిభూషణ
  • కవికోకిల
  • కవితావిశారద
  • శతావధాని

రచనలనుండి ఉదాహరణలు[మార్చు]

వినుము నిశ్చల చిత్తుడై వెలసియున్న
యోగి ఆత్మను, సంధాన భోగ మహిమ
దెలియగా గోరి, గాడుపు మెలగ నట్టి
కడల నుండిన, దీపము కరణి నుండు
(కృష్ణగీత నుండి)
రారమ్మబ్జభవాండ భూతనిచయారాధ్యా! రమానాయకా!
రారమ్మాగమవేద్య భక్తసులభా! రాజీవ పతాక్ష! రా
రారమ్మచ్యుత! చక్రధారకు శరీరంబిచ్చెద న్నిన్నునే
జేరన్వచ్చెద పూర్వపుణ్య ఫల సంసిద్ధిన్ బ్రహ్మర్షించెదన్
(ఖండభారతము నుండి)
ఆ వేళన్ వనసీమ సాధ్వియగు మాయత్తయ్య, బాంచాలి గొం
పోవంగా నినుముట్టి పట్టుకొని నొప్పుల్ బుట్టగాదన్ని, దు
ర్భావా! చంపక వీడు పాండవుల నేరం బింతకున్ దెచ్చె, రా
డా వివ్వచ్పుడు? రేపు నిన్ను దునుమాడన్ దిక్కుమ్రొక్కున్నదే!
(ఉత్తర నుండి)
భిక్షుక వృత్తినుండు నిరుపేద శివుండు వసుంధరా ధరా
ధ్యక్షుని బిడ్డ, వో తనివి యాతని యందము చెప్పుటే! విరూ
పాక్షుడు నీ వయోజల రుహాక్షివి వాడెద దాల్చెడు రు
ద్రాక్షలె నీకు సౌఖ్య మిడునంచు దలంచి వివాహమాడెదే!
(కుమార విలాసము నుండి)
కంబమా! కానవా? కాళియఫణి ఫణి
నాట్యరంగస్థల నటవతంసు
కుడ్యమా! చూపవా? గోగోప గోపికా
పాలకుడైన కుచేల వరదు
వేదికా! కంటివా? విమలేంద్ర నీల మ
ణిచ్ఛాయఁ దేరెడు నిర్మలాంగు
ద్వారమా! తిలకింపవా? వేణుగాన క
ళా విశారదుని విలాసమూర్తి
యరయవా! దర్పణంబ! లీలావతార
ధారి మురవైరి కలుషవిదారి శౌరి
చిత్తరువు బొమ్మ నీవు వీక్షింపలేదె?
లోకనాయకు మా యశోదా కుమారు
(శ్రీ జయదేవ చరిత్రమునుండి)
కుక్కుట రూపధారియయి కొక్కొరోకో యని బిట్టుగూసి, ము
న్నక్కట తిక్కబాపని నియద్ధుని కంపి, యహల్య తోడఁ, దా
మక్కువ గూడి కాపురము మాపిన దుర్విటు డింద్రు డిప్డు తా
నిక్కడికేల వచ్చె, దమయంతి యభాగ్యపు మాచకమ్మయే?
(వైదర్భి నుండి)

మూలాలు[మార్చు]