ఐదుకల్లు సదాశివన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐదుకల్లు సదాశివన్[1] అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ కమ్యూనిష్ఠు నాయకుడు. హరిజనోద్ధారకుడు. స్వాతంత్ర్య సమరయోధుడు.

ఐదుకల్లు సదాశివన్
జననంఐదుకల్లు సదాశివన్
1912
India ఐదుకల్లు గ్రామం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1988 అక్టోబరు 12
వృత్తిరాజకీయాలు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు, హరిజనోద్ధారకుడు
మతంహిందూ

1930లో కల్లూరు సుబ్బారావు ఉపన్యాసం విని ఉత్తేజితుడై స్వాతంత్ర్యోద్యమంలో దూకిన యువకులలో ఐదుకల్లు సదాశివన్ ఒకడు. స్వాతంత్ర్యోద్యమకాలంలో కొన్ని సంవత్సరాలు బళ్ళారి సెంట్రల్ జైలులో గడిపాడు. ఆ సమయంలో బ్రిటీషు పోలీసుల పైశాచిక చర్యలపై ఎదురు తిరిగి పోరాడాడు. చక్రవర్తి రాజగోపాలాచారి సూచన మేరకు స్వచ్ఛందసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్కూలు ఫైనల్ వరకు మాత్రమే చదివిన ఐదుకల్లు సదాశివన్ జైలు జీవితంలో రాజకీయ శిక్షణా శిబిరాలలో పాల్గొని అనేక విషయాలు నేర్చుకున్నాడు. పట్టాభి సీతారామయ్య, ముట్నూరు కృష్ణారావుల ఆధ్వర్యంలో నడుస్తున్న మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో చేరాడు. కాలేజీలో చదివినన్ని రోజులు అనంతపురం జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు నుండి ఇతనికి నెలకు 15రు. స్కాలర్‌షిప్ లభించింది. 1934లో మచిలీపట్నం వచ్చిన గాంధీజీ ఇతని లక్షణాలను గమనించి దగ్గరకు పిలిచి అభినందించాడు. 1934లో నిడుబ్రోలులో ఎన్.జి.రంగా నిర్వహించిన వేసవి రాజకీయ శిక్షణాతరగతులకు కూడా హాజరయ్యాడు.

హరిజన సేవ[మార్చు]

1935లో అనంతపురంలో గట్టు వెంకటరమణప్ప సహకారంతో కేశవ విద్యానికేతన్ పేరుతో హరిజన హాస్టల్‌ నిర్వహణ బాధ్యతను చేపట్టాడు. ఈ హాస్టల్‌ను బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించాడు. ఇతడు పల్లె పల్లెలో ఇంటింటికి తిరిగి కొర్రలు, జొన్నలు వసూలు చేసుకుని తెచ్చి హాస్టల్‌లోని పిల్లలకు వండిపెట్టే వాడు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఈ హాస్టల్ విద్యార్థి. హరిజనులకు పారిశుద్ధ్యం నేర్పించే పనీలో భాగంగా హరిజనుల ఇళ్ళకు వెళ్ళి వీధులు ఊడ్చడం, వారి పిల్లలకు స్నానం చేయించడం వంటి పనులు చేసేవాడు. చచ్చిన గొడ్డు మాంసం తినరాదని ప్రచారం చేసేవాడు. 1941 తర్వాత కమ్యూనిష్ఠు నాయకుడిగా జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఎదిగినా కూడా హరిజనులకు గృహాలు, భూములు మొదలైన సదుపాయాలు కల్పించాడు.[2] అనంతపురం పట్టణంలో రాణినగర్‌, ఫెర్రర్‌ నగర్‌లను హరిజనులకోసం ఏర్పాటు చేశాడు.

కమ్యూనిస్టు యోధుడు[మార్చు]

రంగా నిర్వహించిన రాజకీయ పాఠశాలలో సోషలిస్ట్ సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకున్న ఐదుకల్లు సదాశివన్ అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య వంటి కమ్యూనిస్టు నాయకుల పరిచయాల ప్రభావంతో కమ్యూనిస్టుగా మారాడు. నీలం రాజశేఖరరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, వి.కె.ఆదినారాయణ రెడ్డిలతో కలిసి జిల్లాలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.కళ్యాణదుర్గం, కదిరి తదితర ప్రాంతాలలో ఫ్యూడల్ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, పెత్తందారి వ్యతిరేక పోరాటాలు నిర్వహించాడు. ఎమ్మెల్సీగా పనిచేసినా సాధారణ జీవితాన్ని గడిపి ఎంతోమందికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. అసెంబ్లీకి కూడా నడుచుకుంటూ వచ్చేవాడు.[3]

నీతికి, నిజాయితీకి, నిష్కళంక రాజకీయ జీవితానికి, ప్రజాప్రయోజనాల రాజకీయ నిబద్ధతకు మారుపేరైన ఐదుకల్లు సదాశివన్ 1988లో అక్టోబరు 12వ తేదీ చివరిశ్వాస వదిలాడు.

మూలాలు[మార్చు]

  1. వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక అనంతనేత్రం పుట 23
  2. అనంతదర్శిని(అనంతపురం జిల్లా సమాచార దర్శిని) -174వ పేజీ
  3. [1][permanent dead link]కమ్యూనిస్టులందరికీ ఆదర్శప్రాయుడు