Coordinates: 14°24′N 79°00′E / 14.4°N 79°E / 14.4; 79

ఒంటిమిట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 14°24′N 79°00′E / 14.4°N 79°E / 14.4; 79
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండలంఒంటిమిట్ట మండలం
Area
 • మొత్తం19.64 km2 (7.58 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం16,067
 • Density820/km2 (2,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి972
Area code+91 ( 08589 Edit this on Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


ఒంటిమిట్ట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ జిల్లా, ఒంటిమిట్ట మండలం లోని గ్రామం. ఇది సమీప పట్టణమైన కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3915 ఇళ్లతో, 16067 జనాభాతో 1964 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8147, ఆడవారి సంఖ్య 7920. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3735 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 303. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 593383[2].పిన్ కోడ్: 516213. ఇది ఒంటిమిట్ట మండలానికి కేంద్రం. ఇక్కడ గల కోదండ రామాలయం కారణంగా ప్రముఖ పర్యాటక కేంద్రం.

గ్రామచరిత్ర[మార్చు]

ఒంటిమిట్ట పేరులో ఒంటి పూర్వపదం, మిట్ట ఉత్తరపదం. వీటిలో మిట్ట అనే ఉత్తరపదానికి ఎత్తైన భూప్రదేశాన్ని సూచించే జనావాసం అన్న అర్థం ఉంది.[3] ఒక మిట్ట పైన రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఇంకొక కథనం ప్రకారం, ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీగా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందంటారు.[4]

మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే.

ఈ గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్రాచరిత్రయైన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రలో భాగంగా మజిలీలైన అత్తిరాల నుంచి భాకరాపేట వెళ్ళే మార్గమధ్యలో ఒంటిమిట్టను దాటి వెళ్ళారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో నాల్గుపక్కల కొండలు కలిగిన భారీ చెరువున్నది. చెరువు కట్టమీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగింది. ఆ ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళు ఉన్నాయన్నారు. గ్రామంలో ఓ ముసాఫరుఖానా (యాత్రికుల నిలయం) ఉండేదని, అప్పటికే అది బస్తీ గ్రామమని పేర్కొన్నారు.[5]

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3915 ఇళ్లతో, 16,067 జనాభా, 19.64 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8147, ఆడవారి సంఖ్య 7920.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 19, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కడపలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

  • కడప-తిరుపతి రహదారిపై కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
  • రైలులో రాజంపేట లేక కడప సమీప రైల్వేస్టేషన్లు.
  • తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.

భూమి వినియోగం[మార్చు]

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 781 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 256 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 32 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 261 హెక్టార్లు
  • బంజరు భూమి: 365 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 265 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 476 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 416 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 261 హెక్టార్లు
    • చెరువులు: 154 హెక్టార్లు

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

కోదండ రామాలయం[మార్చు]

ఒంటిమిట్ట కోదండరామాలయ సముదాయం

ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం.

ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు.[6] ఒంటిమిట్ట నివాసి, ఆంధ్రవాల్మీకి అని పేరొందిన వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఇతను టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

మృకుందాశ్రమం[మార్చు]

ఏకశిలానగరానికి పడమరవైపున, ఒక కి.మీ.దూరంలో ఉన్న ఈ ఆశ్రమం, పూర్వం మృకుందమహర్షి చే నిర్మితమైనదని పురాణాల ఉవాచ. ఆయన ఈ ఆశ్రమంలో కొలువైన ముక్కంటిని నిత్యం ఆరాధించేవారని పూర్వీకుల కథనం. అందువలన ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఈ ఆలయానికి సమీపంలోని ఉన్న ఒక 'వంక (వాగు), దక్షిణం నుండి ఉత్తరంవైపు ప్రవహించుచూ ఉండటంతో, ఇందులోని జలధారను భక్తులు పవిత్రమైనదిగా భావించుచున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఫలాలు, ఔషధ మొక్కలూ అధికంగా అందుబాటులో ఉండేవి. యఙయాగాదులు, తపస్సుల నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో, మునులు, మహర్షులు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు. మృకుందాశ్రమానికీ, ఈ ముకుందాపురానికీ జైనమతంతో సంబంధం ఉన్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు కట్టా నరసింహులు అభిప్రాయపడ్డాడు. స్కంద పురాణంలో ఈ ఆశ్రమ ప్రస్తావన ఉన్నట్లు గూడా ఆయన వివరించాడు. ఇక్కడ పరమేశ్వరుని లింగం, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, భ్రమరాంబ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కాలభైరవుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది.

వ్యక్తులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved 10 March 2015.
  4. ఏప్రిల్ 5, 2009 ఈనాడు ఆదివారం సంచిక
  5. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  6. కట్టా, నరసింహులు. "పౌరాణిక భౌగోళిక చారిత్రక ప్రాధాన్యాన్ని నింపుకొన్న ఒంటిమిట్ట". Archived from the original on 2015-06-03. Retrieved 2020-05-19.

వెలుపలి లంకెలు[మార్చు]