ఓషధులు, మూలికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఔషధానికి (డ్రగ్, మెడిసిన్) పనికి వచ్చే మొక్కలు ఓషధులు (మెడిసినల్ హెర్బ్స్). ఔషధానికి పనికి వచ్చే మొక్కల వేళ్ళు మూలికలు (మెడిసినల్ రూట్స్). ఏయే మొక్కలు ఔషధానికి పనికివస్తాయో ఆష్టాంగ హృదయం (సా. శ. 600) ఆధ్యాయం 9, సూత్రం 10 లో ఇలా చెప్పబడ్డాది:

"జగత్‌ ఏవమ్ అనౌషధం

న కించిత్ విద్యతే ద్రవ్యం

వషాన్నార్తయోగాయో"

ఈ జగత్తులో వైద్యానికి పనికిరానిది అంటూ ఏదీ లేదు; అనేక అవసరాలకి అనేక పద్ధతులలో అన్నీ పనికొస్తాయి. అయినప్పటికీ మొక్కలన్నిటినీ ఓషధులని అనము. ఏదో ఒక వైద్య పద్ధతిలో (అంటే ఆయుర్వేదంలో కాని, హొమియోపతీలో కాని, ఎల్లోపతీలో కాని, యునానీలో కాని, సిద్ధలో కాని - ఆఖరికి నాటు వైద్యంలో కాని - ఏ మొక్క భాగాన్నయినా మందుగా వాడిన యెడల అప్పుడు దాన్ని ఓషధిగా పరిగణిస్తారు. ఉదాహరణకి, ఒక లెక్క ప్రకారం, కొంచెం ఇటూ అటూగా, ఆయుర్వేదంలో,1769 ఓషధులని వాడతారు. వీటిలో 731 ఓషధులు నాటు వైద్యం (ఫోక్ మెడిసిన్) లోనూ, 164 హోమియోపతీలోనూ, 55 ఎల్లోపతీలోనూ (ఇంగ్లీషు మందులు), 743 సిద్ధలోనూ, 653 యునానీలోనూ కూడా వాడతారు. ఆ మాటకొస్తే యావద్భారతదేశంలోనూ నాటు వైద్యులు వాడే మొక్కలు, మూలికలు లెక్క వేస్తే దరిదాపు 5000 ఉంటాయని అంచనా వేసేరు. వీటిలో ఆయుర్వేదం గుర్తించినది 731. హోమియోపతీ గుర్తించినది 147, ఎల్లోపతీ గుర్తించినది 56. దీని బట్టి తేలేది ఏమిటంటే ఇంగ్లీషు వైద్యంలో ఓషధుల వాడకం పెరగటానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకుని వీటిని మేధోసంపత్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టి) గా మార్చుకునే అవకాశం, హక్కు భారతీయులకి ఎంతైనా ఉంది.

మొక్కలని, మొక్కల వివిధ భాగాలనీ మందులుగా వాడే ఆచారం భారతదేశంలో వేద కాలం నుండి ఉంది.

చరక సంహితంలో ఉన్న "యస్మిన్ దేషే తు జాతా తస్మిన్ తజ్జోషధం హితం" అన్న శ్లోకాన్ని బట్టి ఆసేతుహిమాచల పర్యంతం భారతదేశంలో ప్రజలు తమ తమ పరిసర ప్రాంతాల్లో పెరిగే మొక్కలని వైద్యానికి ఉపయోగించటం నేర్చుకున్నారని అర్ధం అవుతోంది.

వస్తుగుణదీపిక[మార్చు]

అధర్వణ వేదంలో వస్తుగుణదీపిక (pharmacopoeia) - అంటే ఏయే పదార్ధాలకి ఏయే ఔషధ లక్షణాలు ఉన్నాయో సాధికార స్వరంతో ఉద్ఘాటించే పట్టిక లేక పుస్తకం - ఉందంటారు. ఇందులో దరిదాపు 290 మొక్కల గురించి ప్రస్తావన ఉందిట. వేదకాలం నుండి దరిదాపు సా. శ. 500 వరకు ఉన్న మధ్య కాలంలోనే చరకుడు, సుస్రుతుడు జీవించారు. ఈ కాలంలోనే అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం రచించబడ్డాయి. ఈ కాలంలోనే అనేక కొత్త ఓషధులు వస్తుగుణదీపికలో చేరాయి; పనికిమాలినవి తొలగించబడ్డాయి. ఈ వస్తుగుణదీపికని పోలిన పుస్తకం మరొకటి ఉంది. దానిని ఇంగ్లీషులో 'మెటీరియా మెడికా ' అంటారు. ఆయుర్వేదంలో 'నిఘంటువు' అంటారు. ఇందులో పదార్ధాల ఔషధ లక్షణాల ప్రస్తావనే కాకుండా వాటిని మందులుగా మార్చి వాడినప్పుడు మనకి సమకూరే లాభనష్టాలు ఏమిటో వగైరా విషయాలు మరింత విస్తృతంగా ఉంటాయి. ఈ రకం పుస్తకాలు ఆయుర్వేదంలో లేకపోలేదు. ఈ రకం పుస్తకాలలో ఈ దిగువ రకం విషయాలు భద్రపరచి ఉంటాయి: (1) ఓషధి దొరికే చోటు, గుర్తుపట్టే విధానం, (2) మొక్కలో ఉపయోగపడే భాగం (ఆకు, పువ్వు, పండు, గింజ, పాలు (లాటెక్స్), బంక (గమ్), సజ్జరసం (రెసిన్), బెరడు (బార్క్), వేరు), (3) శుద్ధిచేసే పద్ధతి, (4) ఏయే లక్షణాలు పొడచూపినప్పుడు వాడాలి, (5) దోషకర్మ (ఎఫెక్ట్ ఆన్ ఫిజియోలాజికల్ సిస్టమ్స్ ), (6) ధాతుకర్మ (ఎఫెక్ట్ ఆఫ్ టిష్యూస్), (7) గుణం (క్వాలిటీ ), (8) వీర్యం ( మెటబాలిక్ ఏక్టివిటీ ), (9) విపాకం (పోస్ట్ డైజెస్టివ్- ఎఫెక్ట్ ), (10) గణ (డ్రగ్ కేటగిరీ, (11) యోగ (థిరప్యూటిక్ క్లాస్), (12) కల్పన (ప్రొసెసింగ్ మెతడ్), మొదలైనవి. ఇలా ఒక క్రమ పద్ధతిలో వేలకొద్దీ మొక్కలని అధ్యనం చేసి, దరిదాపు 25,000 పైబడి మందులని తయారు చేసి, వాటి మోతాదులని నిర్ణయించి ఎంతో ప్రగతి సాధించేరు. వారు వాడిన పద్ధతులు పారిశ్రామిక విప్లవం తరువాత వచ్చిన అధునాతన పద్ధతులకి సరితూగ లేకపోవచ్చు. కాని నాటి రోజులకి అవే అత్యాధునిక పద్ధతులు.

ఓషధులు, మూలికలు లభ్యమయే వృక్ష సంపదని మూడు విభాగాలు చెయ్యవచ్చు: (1) చెట్లు, (2) తుప్పలు, (3) మొక్కలు, లతలు, గడ్డి, మొదలైనవి. పువ్వులు పూసే వృక్ష సంపద నుండి మందులు ఎక్కువ లభ్యమవుతాయి. ఈ వృక్ష సంపద భారతదేశం నలుమూలలా సమానంగా సర్దుకుని లేదు; కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ. దరిదాపు 70 శాతం మొక్కలు ఉష్ణమండలాలు (tropics) లో - ముఖ్యంగా పడమటి కనుమలలోను, తూర్పు కనుమలలోనూ, వింధ్య పర్వతాలలోనూ, చోటానాగపూరు లోనూ, అరవల్లీ కొండలలోనూ, హిమాలయా పర్వతాల దిగువ ఉన్న అడవులలోనూ, అస్సామ్ ప్రాంతాలలోనూ - దొరుకుతున్నాయి. శీతల ప్రదేశాలలోనూ, సతతహరితారణ్యాలలోనూ దొరికే ఓషధులు ముప్పయ్ శాతం ఉంటాయేమో.

ఓషధులని గుర్తించడానికి వాటికో పేరు ఉండాలి కదా. భారతదేశంలో అయితే ఒకే ఓషధికి ఒక సంస్కృతం పేరు, ప్రతి ప్రాంతీయ భాషలో సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉంటూ ఉంటాయి. భాషలలో మాండలికాలు ఉన్నట్లే ఒకే మొక్కకి ఒకొక్క చోట ఒకొక్క పేరు ఉండొచ్చు. అంతే కాకుండా దాని ఆకారాన్ని బట్టి, వాడుకని బట్టి వివిధమైన పేర్లు ఉండొచ్చు. కనుక మొక్కలకి లేటిన్ పేర్లు పెట్టటంలో కొంత సౌకర్యం ఉంది. అవి ప్రపంచ వ్యాప్తంగా అర్దం అవుతాయి. ఉదాహరణకి Tinospora cordifolia అనే మొక్కని తీసుకుందాం. ఈ మొక్కకి సంస్కృతంలో దరిదాపు 52 పేర్లు ఉన్నాయి. అమృతవల్లి (అమృతంలా పనిచేసే లత), మండలి (గుండ్రంగా ఉన్నది), నాగకుమారి (పాములా ఉండే కాండం), మధుపర్ణి (తేనె వంటి ఆకులు కలది), వత్సాధని (పశువులు మేసే ఆకులు కలది), శ్యామ (నల్లనిది), ధార (జారీ వంటి చారికలు ఉన్న ఆకులు కలది), మొదలగు పేర్లు. ఈ జాబితాకి మిగిలిన దేశభాషల పేర్లు కూడా కలిపితే మనకి కలిగే శ్రమ ఇంతా అంతా కాదు. ఇన్ని పేర్లతో తంటాలు పడే కంటే ఒక్క లేటిన్‌ పేరు నేర్చుకుంటే సౌకర్యంగా ఉంటుంది.

ఇలా ప్రతి ఓషధికీ ఎన్నో పేర్లు ఉన్నట్లే చాల వాటికి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి అడవి ఉసిరి (Emblica officianalis) ఉంది. ఈ ఫలాన్ని దరిదాపు వంద సందర్భాలలో వాడొచ్చు.

ఓషధులని అధ్యయనం చేసేటప్పుడు వాటిని వర్గాలుగా విడగొట్టి అధ్యయనం చెయ్యటం అనూచానంగా వస్తూన్న ఆచారం. కాని ఈ విభజన పద్ధతిలో భారతీయ సంప్రదాయానికీ, పాశ్చాత్య సంప్రదాయానికీ తేడా ఉంది. పాశ్చాత్యులు రసాయన లక్షణాలని ఆధారం చేసుకుని వారి వస్తుగుణదీపికని రచించుకుంటే భారతీయులు ఓషధి లక్షణాలని ఆధారంగా 'ద్రవ్య గుణ శాస్త్రం' తయారు చేసుకున్నారు.

ఉదాహరణకి పిప్పలిని లేటిన్ లో 'పైపర్ లాంగమ్' అంటారు. దీని లక్షణాలని అధ్యయనం చెయ్యటానికి ఆయుర్వేదంలో వాడే పరామాత్రలు (parameters) ఏమిటో చూద్దాం: (1) రస (taste), (2) గుణ (Quality), (3) విపాక (Metaboloc property), (4) ప్రభవ (Biological effect), (5) వీర్య (Potency) (6) గణ (Pharmaceutical class), (7) వర్గ (therapuetic class), (8) దోషకర్మ (physiological effect), (9) కర్మ (primary biological action). పిప్పలికి మూడు రుచులు ఉన్నాయి: తిక్త, కసయ, మధుర. ఇదే ఇంగ్లీషులో చెప్పాలంటే - Piper longum's properties can be described using nine parameters. The 'taste' parameter, in turn, assumes three distinct values, namely, bitter, astringent and sweet. ఇలా ప్రతి గుణాన్ని వర్ణిస్తారు. అదే ధోరణిలో ప్రతీ ఓషధినీ వర్ణిస్తారు.

ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాలలో ఎక్కువ ప్రాచుర్యం లోకి వచ్చిన కొన్ని ఓషధులు, మూలికలు ఈ దిగువ పొందుపరచటమైనది"

  • పసుపు (Turmeric). కీళ్ళ నొప్పులు, ఆల్‌జైమర్ డిసీజ్ (Alzheimer's disease), దెబ్బలని మాన్చటం (wound healing) మొదలైన వాటికి దీనిని మందుగా వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్వం మన్యపు ప్రాంతాలలో మన్యపు జ్వరం (Malaria) రాకుండా రోజూ చిటికెడు పసుపు వేడి అన్నంలో కలుపుకు తినమనే వారు.
  • గుగ్గిలం (Commiphora mukul or guggul). ఇది గుగ్గిలపు చెట్టు నుండి కారే రసాన్ని ఎండబెట్టి తయారు చేస్తారు. దీనికి కొలెస్టరాల్ని తగ్గించే గుణం ఉందని అంటున్నారు.

వినాయక పత్రిలో ఔషధగుణాలు[మార్చు]

  • మాచీ పత్రి (మాసుపత్రి, మాచిపత్రి)- నేత్రవ్యాధుల నివారణ.
  • బృహతీ పత్రం అంటే నేలమునగ లేక వాకుడాకు - మూలశంక, దగ్గు, మలబద్దకం నివారణ.
  • బిల్వ పత్రం దీనిని మారేడు అని కూడా అంటారు - మధుమేహం లేక చక్కెర వ్యాధి (షుగర్ వ్యాధి) నివారణ.
  • దూర్వాయుగ్మం అంటే జంట గరిక - మూత్రసంబంధ వ్యాధుల నివారణ.
  • దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు - మానసిక రోగ నివారణ.
  • బదరీ అంటే రేగు - బాలారిష్టం నివారణ.
  • అపామార్గం అంటే ఉత్తరేణి - దంత వ్యాధులు, చర్మవ్యాధుల నివారణ.
  • తులసి - వాంతులు, నులి పురుగులు, దగ్గు నివారణ.
  • చూత పత్రం అంటే మామిడి ఆకు - అతిసారం, చర్మవ్యాధి, కాలి గోళ్ళ పగుళ్ళు.
  • కరవీరం అంటే గన్నేరు - జ్వర తీవ్రతను తగ్గిస్తుంది.
  • విష్ణు క్రాంత - మేధో వికాసం, నరాల బలహీనతల నివారణ.
  • దాడిమీ అంటే దానిమ్మ పత్రం - దగ్గు, ఉబ్బసం, అజీర్తి నివారణ.
  • మరువక పత్రం అంటే మరువం - శరీర దుర్వాసన నివారణ.
  • దేవదారు- శ్వాశకోశ వ్యాధుల నివారణ.
  • సింధువారంటే వావిలి ఆకు - బాలింత వాతం, ఒంటి నొప్పుల నివారణ.
  • జాజి - నోటి దుర్వాసన నివారణ.
  • శమీ అంటే జమ్మి- కుష్టు, అవాంఛిత రోమాల నివారణ.
  • అశ్వత్థం అంటే రావి - శ్వాశ కోశ వ్యాధుల నివారణ.
  • అర్జున(మద్ది)- వ్రణాలు తగ్గటానికి.
  • అర్క అంటే జిల్లేడు- చర్మకాంతి కోసం.
  • నింబ అంటే నిమ్మ- నులి పురుగులు, చర్మరోగాల నివారణ.

ఆధార గ్రంధావళి[మార్చు]

  • Siram Vemuri, "Role of Medicinal Plants in the Rural Development of India," in V. Rao Vemuri and Sriram Vemuri (Eds.), Biocomplexity, Sustainable Development and Information Technology: India's Opportunities and Challenges, Published by Eco Foundation, Hyderabad, India, 2000. Copy no longer available at http://www.ecofoundation.org
  • The Hindu Folio: Special Issue on Indian Health Traditions, October 8, 2000
  • V. Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002. English-Telugu version is also available on-line at http://www.sahiti.org Archived 2007-04-27 at the Wayback Machine
  • Sacred Groves of India, Wikipedia
  • Bhav Prakash Nighantu, Chowkhamba Prakashan, Varanasi
  • Camp Reports, FRLGHT, 1995, 1996, 1997.
  • Charak Samhita, Chowkhamba Prakashan, Varanasi
  • D. K. Ved, et al, Medicinal Plants of India, FRLHT, 1998
  • Gadgil, M. and Vartak, V.D. ; Sacred Groves of India : A plea for continued conservation Journal of Bombay Natural History Society, 72 : 314-320, 1975
  • Raj Nighantu, Chowkhamba Prakashan, Varanasi
  • R. P. Palekar, Study of LHT of the Thakur Tribals of Raigad District, 1994.
  • Sushrut Samhita, Chowkhamba Prakashan, Varanasi
  • VHAI Report of State of India's Health,1992.