కమలా సొహోనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమలా సొహోనీ
కమలా సొహోనీ
జననంకమలా భగవత్
1912 జూన్ 18
మరణం1998 జూన్ 28(1998-06-28) (వయసు 86)
జాతీయతభారతీయులు
రంగములుజీవరసాయనశాస్త్రం
చదువుకున్న సంస్థలుబొంబాయి విశ్వవిద్యాలయం, ముంబై

కమలా సొహోనీ (1912 జూన్ 18 – 1998 జూన్ 28) భారత దేశానికి చెందిన జీవరసాయన శాస్త్రవేత్త. ఈమె భారతదేశంలో శాస్త్రీయరంగాలలో పి.హెచ్.డి పొందిన మొట్టమొదటి మహిళ.[1][2]

ప్రారంభ జీవితం[మార్చు]

కమలా సొహోనీ 1912లో జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్ రసాయన శాస్త్రవేత్త. తండ్రి, పినతండ్రి ఇద్దరూ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఉత్తీర్ణులైన తొలి పట్టభద్రుల్లో వీరిరువురు ఉన్నారు.

కమల బొంబాయి విశ్వవిద్యాలయం నుండి బి.యస్సీ (భౌతిక, రసాయన శాస్త్రాలు) పూర్తిచేశారు. ఈమె బొంబాయి విశ్వవిద్యాలయం నుండి స్వర్ణపతకం (గోల్డ్‌మెడల్) సాధించింది. తన తండ్రి, బాబాయిల బాటలో ఈమె రీసెర్చ్ ఫెలోషిప్ కొరకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో దరఖాస్తు చేశారు. కానీ మహిళలు పరిశోధన కొనసాగించేందుకు తగినంత సమర్థత కలిగి ఉండరనే కారణంగా ఈమె అభ్యర్థనను ఆ సంస్థ డైరక్టరైన సి.వి.రామన్ తిరస్కరించాడు.[1] కొంత ఒప్పించగలిగిన తర్వాత ఆమెను ఐ.ఐ.ఎస్.సిలో మొదటి సంవత్సరం పరిశోధనకు గాను కొన్ని నిబంధనల మేరకు చేర్చుకోవడం జరిగింది.[3]

కెరీర్ , పరిశోధనలు[మార్చు]

1933లో ఐ.ఐ.ఎస్.సిలో సి.వి.రామన్ యొక్క నిబంధనలకు అంగీకరించి తన పరిశోధనలు ప్రారంభించారు. ఆమె గురువు శ్రీ శ్రీనివాసయ్య, ప్రొఫెసర్ రామన్ లను ఆమె పనితనం ఆకట్టుకుంది , తదుపరి పరిశోధన కొనసాగించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆమె ఆహార పదార్థాలలో కల మాంసకృత్తులపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధన ఆమెకు ఎం.యస్సీ డిగ్రీని బయో కెమిస్ట్రీలో వచ్చేందుకు తోడ్పడ్డాయి. దాంతో డా. డెరిక్ రిక్టర్ వద్ద పని చేయుటకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఆహ్వానింపబడ్డారు. కొన్నాళ్లకు తన పరిశోధనా మార్గదర్శకుడు రిక్టర్ వేరే విశ్వవిద్యాలయానికి తరలి వెళ్ళగా, రాబిన్ హిల్ మార్గదర్శకత్వంలో పరిశోధన కొనసాగించింది. రాబిన్ హిల్ వద్ద పనిచేస్తూ మొక్కలలో మొదటిసారిగా "సైటోక్రోమ్‌ అక్సిడేజ్" అనే ఎంజైమును కనుగొన్నది. ఈ పరిశోధనల వలన మొక్కలలో కూడా కణాల స్థాయిలో శక్తియొక్క ఉత్పాదన జంతువులలో జరిగినట్టే సైటోక్రోముల వలన జరుగుతున్నదని ఋజువైనది.[4] ఈ పరిశోధనకు ఆమెకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పి.హెచ్.డి ప్రధానం చేసింది. ఈమె పరిశోధనా ఫలితాలు 40 పేజీలలోనే పొందుపరచబడ్డాయి. ఇది చాలా అసాధారణమైన విషయం. సాధారణంగా పీ.హెచ్.డి పట్ట ప్రధానం చేసే పరిశోధనా ఫలితాలు వందల పేజీలలో ఉంటాయి. ఈ పరిశోధనకు పి.హెచ్.డీ పట్టా ఇవ్వటం పరిశోధనలో కనుగొన్న విషయాల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నది.

అనంతరం 1939 లో కమల భారతదేశానికి తిరిగి వచ్చి న్యూఢిల్లీ లోని "లేడీ హార్డింగ్ వైద్య కళాశాల" లోని బయోకెమిస్ట్రీ విభాగానికి ప్రొఫెసర్, అధిపతిగా నియమింపబడ్డారు. తర్వాత ఆమె కాన్పూరులో గల ఆహారపోషక పరిశోధనా ప్రయోగశాలలో పనిచేశారు.[4] 1947లో ఎం.వి.సొహోనీని వివాహమాడి తదనంతరం బొంబాయికి మారారు. అచట రాయల్ ఇనిస్టిట్యూట్ లో చేరి బయోకెమిస్ట్రీ విభాగానికి ప్రొఫెసర్ గా నియమించబడ్డారు. ఈ సంస్థలో ఆమె పప్పుదినుసుల ( లెగ్యూమ్స్) యొక్క పోషక విలువలపై పరిశోధనలు చేశారు. నీరా పానీయంపై చేసిన పరిశోధనకుగాను రాష్ట్రపతి అవార్డు లభించింది. ఈ పానీయం పోషకాహార లోపం గల పిల్లలకు ముఖ్యమైనది.[4] ఈమె బెంగళూరు లో గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు డైరక్టర్ గా కూడా తన సేవలు అందిచారు.

కమలా సొహోనీ న్యూఢిల్లీలో నిర్వహించబడిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ఆమెను గౌరవిస్తున్న సమయంలో మరణించారు.

సూచికలు[మార్చు]

  1. 1.0 1.1 Gupta, Aravind. "Kamala Sohonie" (PDF). Indian National Science Academy. Retrieved 19 October 2012.
  2. "The Glass Ceiling: The why and therefore" (PDF). Vigyansagar. Government of India. Archived from the original (PDF) on 7 జనవరి 2019. Retrieved 19 October 2012.
  3. "Kamala Sohonie". Streeshakti. Retrieved 19 October 2012.
  4. 4.0 4.1 4.2 Dhuru, Vasumathi. "The scientist lady" (PDF). Indian Association of Scientists. Retrieved 19 October 2012.

వెలుపలి లింకులు[మార్చు]