కీసర

వికీపీడియా నుండి
  ?కీసర మండలం
రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్
రంగారెడ్డి జిల్లా పటములో కీసర మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో కీసర మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°31′N 78°40′E / 17.523746, 78.667045
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము కీసర
జిల్లా(లు) రంగారెడ్డి
గ్రామాలు 15
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,97,145 (2001)
• 102191
• 94954
• 77.52
• 84.20
• 70.27


కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉన్నది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గములో భాగమైన ఈ మండలంలో 15 గ్రామాలు ఉన్నవి. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు.

విషయ సూచిక

[మార్చు] శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం

[మార్చు] స్థలపురాణము

త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వనవిహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.

అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు.

ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్టించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చినది.

తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ట జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద 'కేసరి గిరి'గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్టించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము.

కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రము కీసరగుట్ట'గా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖముగా ఉండుట విశేషము.

[మార్చు] చరిత్ర

చారిత్రక పరిశోధకుల అభిప్రాయము ప్రకారం క్రీ.శ. 4వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి 7వ శతాబ్దం పూర్వార్థం వరకు ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశమునకు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వీరి రాజముత్రిక లంఘించు సింహం (కేసరి).

విష్ణుకుండినులు మొదట ఇంద్రపురిని (నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం) రాజధానిగా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలన చేశారు. కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖవారి త్రవ్వకపు పరిశోధనలలో 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞ కుండాలు వెలుగుచూశాయి. ఈ వంశంలోని మొదటి గోవింద వర్మ బలపరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యాలను జయించి బౌద్ధారామ విహారాలను, చైత్యములను, దేవాలయములను నిర్మించి ప్రసిద్ధిచెందినట్లుగా ఇంద్రపురి (ఇంద్రపాల నగరం) లో లభించిన తామ్రశాసనం ద్వారా తెలుస్తోంది. విష్ణుకుండినులు తెలుగుబాషను అధికార బాషగా మొట్టమొదట గుర్తించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తున్నది.[1]

ఈ వంశీయులు అపురూపమైన దేవాలయాలను, గుహాలయాలను నిర్మించారు. నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం, తుమ్మలగూడెం లోని రామేశ్వర, అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ సమీపంలోని ఉత్తరరాజ రామలింగేశ్వరాలయం, కందూరు రామలింగేశ్వరాలయం, గుంటూరు జిల్లా వేల్పూరు రామలింగేశ్వరాలయం వీటిలో కొన్ని దేవాలయాలు.

క్రీ.శ. 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు. దానిలో శ్రీ లక్ష్మీనృశింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం కలదు. ఈ స్తంభంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, ఆంజనేయ విగ్రహాలు చెక్కబడి ఉన్నవి.

[మార్చు] ఉత్సవములు

[మార్చు] విద్యా సౌకర్యాలు

  • వేద సంస్కృత పాఠశాల : దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు 1981 సంవత్సరము నుండి నిర్వహించుచున్నది. ఇక్కడ గురుకుల పద్ధతిలో కృష్ణ యజుర్వేదము, సంస్కృత శాస్త్రములు బోధింపబదుచున్నవి.
  • గురుకుల విద్యాలయము : ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల సంస్థ 1972 సంవత్సరంలో ఒక సంస్థను ప్రారంభించి, 1980 లో డా. మర్రి చెన్నారెడ్డి గారు పాఠశాలకు శంకుస్థాపన చేశారు.

==వసతులు== తిరుమల... తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల వున్నది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యాటకాభివృద్ది సంస్థ వారు నిర్మించిన నిర్మించిన హరిత హోటల్ కలదు. ఇందులో భోజనం మరియు వసతి సదుపాయం కలదు. జిల్లా పరిషత్ వారు, ఆర్ అండ్ బి వారు నిర్మించిన గదులు కూడ కలవు. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం వున్నది. బ్రాంహణులకు నిత్యాన్నదాన పథకం కూడ వున్నది. +రవాణ సౌకర్యాలు. ఈక్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో వున్నది. జంట నగరాలలోని సికింద్రాబాద్, ఇ.సి.ఐ.ఎల్., అఫ్జల్ గంజి నుండి చాల బస్సులు వున్నాయి. ప్రవేటు వాహనాలు కూడ వున్నవి.

[మార్చు] రాజకీయాలు=

ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగము. 2009లో జరిగిన శసనసభ ఎన్నికలలో మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది. [2] కాంగ్రెస్ పార్టీకి 11313 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 10875 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి 4661 ఓట్లు వచ్చాయి.

[మార్చు] దర్శనీయ ప్రదేశములు

[మార్చు] శీర్షిక పాఠ్యం

  • శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రధాన దేవాలయము
[మార్చు] శీర్షిక పాఠ్యం
  • భవానీ, విఘ్నేశ్వర విగ్రహములు
  • స్వామి పుష్కరిణి
  • విజయ స్తంభము, నంది స్తంభములు
  • అక్కన్న, మాదన్నల లక్ష్మీ నృసింహస్వామి దేవాలయము
  • ఆళ్వారుల విగ్రహములు
  • ఆంజనేయస్వామి దేవాలయము
  • సీతమ్మవారి దేవతాస్థానము
  • శైవ విఘ్నేశ్వరాలయము
  • సీతాసరోవరము, తామరకొలను
  • క్షేత్రపాలక, భైరవ విగ్రహములు
  • సన్యాసి మఠము
  • 101 శివలింగములు
  • కాశీబుగ్గ వద్దనున్న గుహ
  • శ్రీరాములవారి పాదములు
  • నందిసేవిత శివలింగము
  • ప్రాచీన జైన విగ్రహము
  • పురావస్తుశాఖ త్రవ్వకాలు: శివాలయము, యజ్ఞవాటిక
  • ముప్పైమూడు అడుగుల బారి ఆంజనేయ స్వామి విగ్రహం:
  • కీసర గుట్టకు ప్రక్కనే వున్న మరో గుట్టపై నిజాముల కాలంలో కట్టిన పెద్ద ద్వారం.
  • గుట్టపై ప్రాచీన కాలంలో కట్టిన బౌద్ధ స్థూపాల ఆనవాలు. వీటిని అతి పెద్ద ఇటుకలతో వృత్తాకరంలో కట్టివున్నవి.

[మార్చు] మండలంలోని పట్టణాలు

[మార్చు] మండలంలోని గ్రామాలు

కీసర మండలం
గ్రామము విస్తీర్ణము(ఎకరాలు) జనాభా
అహ్మద్‌గూడా 576 1,803
బోగారం 2,347 1,954
చీర్యాల్ 2,792 3,070
దమ్మాయిగూడ
ధర్మారం 1,083 418
గోదుమకుంట 886 1,276
హరిదాస్‌పల్లి 784 135
కుందన్‌పల్లి 1,645 1,084
నర్సంపల్లి 510 505
తిమ్మాయిపల్లి 1,500 768
యాద్గార్‌పల్లి (తూర్పు) 1,449 2,968
యాద్గార్‌పల్లి (పడమర) 1,122 729
కీసర 7,449 6,232
కీసర దాయిరా 772 818
రాంపల్లి (కీసర)
రాంపల్లి దాయర
నాగారం 3,643 6,291

[మార్చు] మూలాలు

  • కేసరిగిరి క్షేత్ర మహిమ, రచయిత: శ్రీ ఎం. సత్యనారాయణ, 1995.
  1. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 11
  2. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009

[మార్చు] బయటి లింకులు


"http://te.wikipedia.org/w/index.php?title=కీసర&oldid=724400" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు