భారతదేశంలో కోడి పందాలు

వికీపీడియా నుండి
(కుక్కుట శాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పల్నాడు యుద్ధంలో కోడిపందాలను చూపే శిల్పం

భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి. [1] [2]

అవలోకనం

అడవి కోళ్లు, ఇంటి కోళ్లు వంటి పక్షుల మధ్య పోరాటాలు ప్రాచీన భారతదేశంలో వినోద విధానం. [3] పల్నాడు యుద్ధం (1178–1182) ఫలితం కోడి పందాల పోరాటం ద్వారా నిర్ణయించబడిందని నమోదు చేయబడింది. తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. [4] బొబ్బిలి యుద్ధంలో కూడా కోడి పందాలు జరిగాయి.[ఆధారం చూపాలి] శతాబ్దాల కాలం నుండి ఆంధ్ర క్షత్రియులు (రాజులు) తమ పౌరుషానికి ప్రతీకగా కుక్కుట శాస్తాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు. చట్టబద్దం కాకపోయినా ఈ పందాలు ఇంకా నిర్వహించబడుతున్నాయి.[5]

ప్రస్తుత రోజుల్లో కోడి పందాలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాక కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా లలో కూడా జరుగుతున్నాయి. [3]

కోడిపందాల కోసం కోడిపుంజులను ప్రత్యేకంగా పెంచుతారు. కత్తులు, బ్లేడ్లు వాటి కాళ్ళకు కట్టతారు. సాధారణంగా ఈ పోరాటంలో పక్షులలో ఒకటి మరణించుతుంది. [6] కోడిపుంజులకు ఏడాది పొడవునా పోరాటాల కోసం శిక్షణ ఇస్తారు. వాటి విలువ అత్యధికంగా ₹ 50,000 వరకు పలికింది. సంక్రాంతి సమయంలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి కార్యక్రమం వేలాది మందిని ఆకర్షిస్తుంది. [1]

నిషేధం

జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం 1960 ను అమలు చేసినప్పటి నుండి భారతదేశంలో కోడిపందాలు చట్టవిరుద్ధం. 2015 లో భారత అత్యున్నత న్యాయస్థానం,[7] 2016 లో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు నిషేధాన్ని సమర్ధించాయి. [8] కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి 2018 జనవరిలో అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. [9]

నిషేధం ఉన్నప్పటికీ, [2] ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు ఇప్పటికీ జరగుతున్నాయి. దీనిలో పందాల మొత్తం 2019లో ₹ 900 కోట్లుగా అంచనా వేశారు. [10] రాష్ట్రంలో పందాలకు 200,000 కోడిపుంజులు వాడుతున్నట్లుగా అంచనా వేశారు. [10]

సంఘటనలు

కుక్కుట శాస్త్రం

కుక్కుట శాస్త్రం అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగం.[13] [14] సంస్కృత భాషలో కుక్కుటము అనగా కోడిపుంజు. ఉభయ గోదావరి జిల్లాలలో కుక్కుట శాస్త్రాన్ని కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో పందెము వేయాలి, కోడి పుంజు జన్మ నక్షత్రము, కోడి పుంజు జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. పందెంలోకి వెళ్ళే కోడిపుంజుని పందెం కోడి అని అంటారు. కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు అనేది తెలియదు.


పందెం కోడిపుంజుల రకాలు

పచ్చకాకి
పింగళగా పిలిచే కోడిపుంజు

ఈకల రంగులు బట్టి పందెం కోళ్ళ రకాలు విభజింపబడ్డాయి. అవి-

  • కాకి - నల్లని ఈకలు గల కోడి పుంజు
  • సేతు - తెల్లని ఈకలు గల కోడి పుంజు
  • పర్ల - మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజు
  • సవల - మెడపై నల్లని ఈకలు గల కోడి పుంజు
  • కొక్కిరాయి (కోడి) - నల్లటి శరీరం, 2, 3 రంగుల ఈకలు గల కోడి పుంజు
  • డేగ - ఎర్రటి ఈకలు గల కోడి పుంజు
  • నెమలి - రెక్కలపై, లేక వీపు పై పసుపు రంగు ఈకలు గల కోడి పుంజు
  • కౌజు - నలుపు, ఎరుపు, పసుపు ఈకలు గల కోడి పుంజు
  • మైల - ఎరుపు, బూడిద రంగుల ఈకలు గల కోడి పుంజు
  • పూల - ఒక్కొక్క ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులు గల కోడిపుంజు
  • పింగళ - తెలుపు రెక్కల పై అక్కడక్కడా నలుపు రంగు, లేత గోధుమ రంగు ఈకలు గల కోడి పుంజు
  • నల్లబోర
  • ఎర్రపొడ
  • ముంగిస - ముంగిస జూలు రంగు గల పుంజు
  • అబ్రాసు - లేత బంగారు రంగు ఈకలు గల పుంజు
  • గేరువా - తెలుపు, లేత ఎరుపు ఈకలు గల పుంజు

మిశ్రమ రకాలు: కోడి నెమలి, కాకి నెమలి, పచ్చ కాకి, తెలుపు గౌడు (నలుపు, తెలుపు ఈకలు గల కోడి పుంజు), ఎరుపు గౌడు (నలుపు, ఎరుపు ఈకలు గల కోడి పుంజు), నల్ల సవల (రెక్కల పై నల్ల మచ్చలు గల కోడిపుంజు), నల్ల మచ్చల సేతు (తెల్లని ఈకలపై నల్ల మచ్చలు గల కోడి పుంజు). ఈ కోడి పుంజులలో కాకి, పచ్చ కాకి, కాకి నెమలి, డేగ ప్రసిద్దములైనవి, ఖరీదైనవి

నక్షత్ర ఫలితాలు

నక్షత్ర ప్రభావం కేవలం మానవుల మీదనే కాకుండా పక్షులు, జంతువుల మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా కోడిపుంజుల్లో రక్త ప్రసరణ పై గ్రహ ప్రభావం ఉంటుంది. క్రింది ఇవ్వబడినవి 27 నక్షత్రాలు, పందెం కోళ్ళపై వాటి ప్రభావాలు.

  • అశ్వని : నెమలి - డేగ/కోడి మీద; కాకి- కోడి మీద ; గౌడు- పింగళి మీద గెలుపు ; ఎర్ర కోడి
  • భరణి : నల్ల సవల - నెమలి/ఈటుక ఎరుపు కోడి మీద; పిచ్చుక రంగు గౌడు- నెమలి, ఎర్రపొడ మీద; ఎర్రటి కాకి- కాకి మీద గెలుపు
  • కృత్తిక : ఎర్ర కాకి- కాకి మీద; పిచ్చుక రంగు గౌడు- నెమలి మీద, ఎర్రపొడ మీద గెలుపు
  • రోహిణి : నెమలి- నల్ల మైల మీద; పింగళి- ఎర్రకోడి మీద; కాకి- ఎర్రగౌడు, కోడి మీద గెలుపు
  • మృగశిర : కాకి డేగ మీద; డేగ- పసుపు కాకి మీద; పింగళి- కాకి మీద; ఇటుకరంగు డేగ- ముంగిస మీద; కోడి- నెమలి, డేగ మీద గెలుపు
  • ఆరుద్ర: డేగ - కాకి మీద; కాకి - పింగళి/నల్లమైల/నెమలి మీద; డేగ - పసిమి కాకి మీద; కోడి - వెన్నెపొడ కోడి మీద; నల్లపొడ కోడి - ఎర్రపొడ కోడి/పిచ్చుక రంగు గౌడు మీద గెలుపు
  • పునర్వాస: కాకి - కోడి మీద, సుద్ద కాకి - కోడి మీద; నెమలి - డేగ మీద; పిచ్చుకరంగు గౌడు - నల్లబోర, ఎర్రకోడి మీద గెలుపు
  • పుష్య: కాకి - కోడి మీద; పసిమి కాకి - నల్ల కాకి మీద; పింగళి - డేగ, నెమలి మీద; కోడి - నెమలి మీద; కాకి - పింగళి మీద గెలుపు
  • అస్లేష: నెమలి - డేగ మీద; పింగళి - తుమ్మెద రంగు కాకి మీద; పసుపు రంగు కాకి - డేగ మీద; కాకి - పిచ్చుక రంగు కోడి మీద; ఎర్ర కోడి - నల్లబోర మీద గెలుపు
  • మాఘ: డేగ - నెమలి మీద; కోడి - పింగళి మీద; పసుపు రంగు కాకి - డేగ మీద; ఎరుపు నెమలి - నలుపు డేగ మీద; కోడి - గోధుమ రంగు డేగ మీద గెలుపు
  • పూర్వ ఫల్గుణి/పుబ్బ: కాకి - నెమలి, డేగ, కోడి మీద; నెమలి - పింగళి, కోడి మీద; పింగళి - 3 డేగల మీద గెలుపు
  • ఉత్తర ఫల్గుణి: కోడి - నెమలి మీద; కాకి - కోడి, డేగ, పింగళి మీద; గోధుమ రంగు డేగ - నలుపు డేగ మీద గెలుపు
  • హస్త: డేగ - నల్ల మైల మీద; పింగళి - నెమలి మీద; నెమలి - ఎర్రపొడ కోడి మీద; డేగ -పింగళి మీద; పసుపు రంగు కోడి - నెమలి మీద గెలుపు
  • చిత్త: కోడి - డేగ మీద; నెమలి - కాకి, ఎర్రపొడి కోడి మీద; ఎర్రపొడ కోడి - పిచ్చుక రంగు గౌడు మీద; కాకి - కోడి మీద గెలుపు
  • స్వాతి: నెమలి - డేగ మీద; నల్ల డేగ - తెల్ల డేగ మీద; పింగళి - ఎర్ర గౌడు, శుద్ధ కాకి మీద; పసుపు రంగు కాకి - నలుపు పొడ కోడి మీద; పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద గెలుపు; కాకి తుంటి నిర్జించును
  • విశాఖ: కోడి - నెమలి, డేగ, పింగళి, కాకి మీద; పసుపు రంగు కోడి - డేగ మీద; ఎరుపు రంగు గౌడు - శుద్ధ మైల మీద; ఎరుపు రంగు నెమలి - పింగళి మీద గెలుపు
  • అనూరాధ: కాకి - నెమలి, నల్ల మైల మీద; నెమలి - కోడి మీద గెలుపు
  • జ్యేష్టా: పింగళి - కోడి, డేగ మీద; పిచ్చుక రంగు గౌడు - డేగ మీద; పసుపు రంగు కాకి - శుద్ధ కాకి మీద; ఇటుక రంగు పింగళి - నెమలి, కోడి మీద గెలుపు
  • మూల: కాకి - గోధుమ రంగు డేగ మీద; నెమలి రంగు గౌడు - నల్లపొడ కోడి, నలుపు రంగు కాకి మీద; శుద్ధ కాకి - పసుపు రంగు కాకి మీద; నల్ల సవల - కోడి మీద గెలుపు
  • పూర్వాషాఢ: డేగ - నెమలి మీద; పసుపు రంగు కాకి - తుమ్మెద రంగు కాకి మీద గెలుపు
  • ఉత్తరాషాఢ: డేగ - కాకి మీద; నెమలి రంగు గౌడు - నల్ల మెడ గల ఎర్ర కోడి మీద గెలుపు
  • శ్రావణ: గోధుమ రంగు డేగ - కాకి మీద; కోడి - కాకి, డేగ, పింగళి మీద; తెలుపు నెమలి - నల్ల నెమలి మీద గెలుపు
  • ధనిష్ట: నెమలి వన్నె కాకి - ఎరుపు రంగు కాకి, కోడి మీద; కోడి - పసుపు రంగు డేగ, నల్లపొడ కోడి మీద గెలుపు
  • శతభిష: పసుపు రంగు డేగ - నల్లపొడ కోడి మీద; కోడి - కాకి మీద; తెలుపు రంగు నెమలి - శుద్ధ డేగ, శుద్ధ కాకి మీద గెలుపు
  • పూర్వాభద్ర: కోడి - నెమలి, పసుపు రంగు కాకి మీద గెలుపు
  • ఉత్తరాభద్ర: నెమలి - కోడి, కాకి మీద; పింగళి - నెమలి, కాకి మీద; డేగ - నెమలి, కాకి మీద గెలుపు
  • రేవతి: పింగళి వన్నె గౌడు - కోడి మీద; కోడి - డేగ మీద; కాకి - డేగ, పింగళి మీద; పసుపు రంగు కోడి - డేగ, పింగళి మీద;నెమలి - డేగ, కోడి మీద గెలుపు

వార ఫలాలు

ఏ రోజున ఏ దిశలో కోడిపుంజును పందెమునకు వదలాలి?

  • ఆదివారం, శుక్రవారం -- ఉత్తర దిశలో
  • సోమవారం, శనివారం -- దక్షిణ దిశలో
  • మంగళవారం -- తూర్పు దిశలో
  • బుధవారం, గురువారం -- పడమర దిశలో

వారాలను, పక్షాలను అనుసరించి కొన్ని జాతుల కోడిపుంజుల జీర్ణశక్తి కొరవడి ఉంటుంది. జీర్ణశక్తి మందగించిన కోడిపుంజు పందెంలో అపజయంపాలవుతుంది. కనుక శుక్లపక్షంలో ఏ రోజుల్లో ఏ కోడి పుంజు యొక్క జీర్ణ శక్తి కొరవడుతుందో ఈ కింది పట్టిక చూడవలెను.

ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం
పింగళి కాకి కోడి నెమలి డేగ పింగళి డేగ

అలాగే కృష్ణపక్షంలో ఏ రోజుల్లో ఏ కోడి పుంజు యొక్క జీర్ణ శక్తి కొరవడుతుందో ఈ కింది పట్టిక చూడవలెను.

ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం
కాకి నెమలి డేగ నెమలి కోడి నెమలి కోడి

దిశార్వణం

కోడి పందెము కట్టువాడు తన ఇంటికి పందెములు కట్టు స్థలం ఏ దిక్కున ఉందో తెలుసుకోవాలి. దిశార్వణం (దిశ+అర్వణం) అనగా ఇంటి నుండి పందెము కట్టు స్థలానికి ఏ దిశలో బయల్దేరాలో తెలుసుకోవడం. అర్వణం అనగా ప్రయాణం. ఈ అర్వణం పందెం కట్టుటకు పోవువాని పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫలితం ఉంటుంది. పందెము కట్టు వారి పేరు మొదటి అక్షరం అచ్చు అయితే అటువంటి వారికి ఇంటికి పందెం కట్టు స్థలం తూర్పు గాని, ఆగ్నేయం గాని, దక్షిణాన గాని, ఉత్తరాన గాని, ఈశాన్యాన గాని ఉండటం మంచిది. దిశార్వణాలు ఏవనగా - కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు, యవర్గు, శవర్గు.

8 దిశలు
  • కవర్గు: పందెం కట్టువాని పేరులో మొదటి అక్షరం - క, ఖ, గ, ఘ, ఙ లలో ఏదో ఒకటైతే అతనిది కవర్గు అంటారు. కవర్గు వారు తమ ఇంటికి పందెము కట్టు స్థలం ఆగ్నేయాన గాని, దక్షిణాన గాని, నైరుతి న గాని, ఈశాన్యం గాని ఉండటం లాభం. ఇతర దిక్కుల్లో నష్టం కలుగుతుంది.
  • చవర్గు: పందెం కట్టువాని పేరులో మొదటి అక్షరం - చ, ఛ, జ, ఝ, ఞ లలో ఏదో ఒకటైతే అతనిది చవర్గు అంటారు. చవర్గు వారు తమ ఇంటికి పందెము కట్టు స్థలం తూర్పున గాని, నైరుతిన గాని, పశ్చిమాన గాని, దక్షిణాన గాని ఉండటం లాభం. ఇతర దిక్కుల్లో నష్టం కలుగుతుంది.
  • టవర్గు: పందెం కట్టువాని పేరులో మొదటి అక్షరం ట, ఠ, డ, ఢ, ణ లలో ఏదో ఒకటైతే అతనిది టవర్గు అవుతుంది. టవర్గు వారు తమ ఇంటికి పందెము కట్టు స్థలం అగ్నేయమందు గాని, నైరుతియందు గాని, పశ్చిమయందు గాని వాయువ్వమందు గాని ఉండటం లాభం. ఇతర దిక్కుల్లో నష్టం కలుగుతుంది.
  • తవర్గు: పందెం కట్టువాని పేరులో మొదటి అక్షరం త, థ, ద, ధ, న లలో ఏదో ఒకటైతే అతనిది తవర్గు అవుతుంది. తవర్గు వారు తమ ఇంటికి పందెము కట్టు స్థలం దక్షిణమందు గాని, పశ్చిమానగాని, వాయువ్వమందు గాని, ఉత్తరమందు గాని ఉండటం లాభం. ఇతర దిక్కుల్లో నష్టం కలుగుతుంది.
  • పవర్గు: పందెం కట్టువాని పేరులో మొదటి అక్షరం ప, ఫ, బ, భ, మ లలో ఏదో ఒకటైతే అతనిది పవర్గు అవుతుంది. పవర్గు వారు తమ ఇంటికి పందెము కట్టు స్థలం నైరుతి యందు గాని, వాయువ్వమందు గాని, ఉత్తరమందుగాని, ఈశాన్యమందు గాని ఉండటం లాభం. ఇతర దిక్కుల్లో నష్టం కలుగుతుంది.
  • యవర్గు: పందెం కట్టువాని పేరులో మొదటి అక్షరం య, ర, ల, వ లలో ఏదో ఒకటైతే అతనిది యవర్గు అవుతుంది. యవర్గు వారు తమ ఇంటికి పందెము కట్టు స్థలం తూర్పునందు గాని, పశ్చిమమందుగాని, ఉత్తరాన గాని, ఈశాన్యమందు గాని ఉండటం లాభం. ఇతర దిక్కుల్లో నష్టం కలుగుతుంది.
  • శవర్గు: పందెం కట్టువాని పేరులో మొదటి అక్షరం శ, స, ష, హ, ళ లలో ఏదో ఒకటైతే అతనిది శవర్గు అవుతుంది. శవర్గు వారు తమ ఇంటికి పందెము కట్టు స్థలం తర్పునందు గాని, ఆగ్నేయమందు గాని, వాయువ్వమందు గాని, ఈశాన్యమందు గాని ఉండటం లాభం. ఇతర దిక్కుల్లో నష్టం కలుగుతుంది.

నిషిద్ధ ముఖము

పందెం కట్టుటలో ముఖ్యముగా బ్రహ్మకు ఆధిపత్యం గల రోహిణీ నక్షత్రమందును, ఆర్యమునకు ఆధిపత్యం గల ఉత్తర ఫల్గుణీ నక్షత్రమందును, ఇంద్ర ఆధిపత్యం గల జ్యేష్టా నక్షత్రమందును, అజచరణుని ఆధిపత్యం గల పూర్వ భద్రా నక్షత్రమందును జాగ్రత్త అవసరం.

  • రోహిణీ నక్షత్రం: ఇది ధ్రువ సంజ్ఞ గలది. ఈ నక్షత్రంతో కూడిన ఆదివారమునందుగాని, గురువారమునందు గాని, శుక్రవారమునందు గాని పందెము పశ్చిమ ముఖముగా నిలువబడి పుంజును విడువరాదు.
  • ఉత్తర ఫల్గుణీ నక్షత్రం: ఇది ధ్రువ సంజ్ఞ గలది. ఈ నక్షత్రంతో కూడిన మంగళవారమునందు గాని, బుధవారమునందు గాని ఉత్తర ముఖముగా నిలువబడి పుంజును విడువరాదు.
  • జ్యేష్టా నక్షత్రం: ఇది దారుణ (తీక్ష) సంజ్ఞ గలది. ఈ నక్షత్రంతో కూడిన సోమవారములో గాని, శనివారమునందు గాని తూర్పు ముఖముగా నిలువబడి పుంజును విడువరాదు.
  • పూర్వాభద్రా నక్షత్రం: ఇది ఉగ్ర (క్రూర) నక్షత్రము. ఈ నక్షత్రంతో కూడిన గురువారమునందు పందెమును దక్షిణ ముఖముగా నిలువబడి పుంజును విడువరాదు.

అవస్థా భేదాలు

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు సమయాన్ని అనుసరించి అవస్థా భేదాలు లెక్కించబడును. పక్షి జాతులలో పగటి సమయమందు గల ఐదు జాములకు ఐదు అవస్థలు చెప్పబడినవి.

  • భోజవావస్థ: ఈ అవస్థ పక్షులకు విజయప్ర్రదమైనది. ఈ అవస్థలో విడిచిన పుంజు విజయమును సాధించును
  • వృష సలావస్థ / రాజ్యావస్థ: ఈ అవస్థలో పుంజు సులభంగా జయం పొందుతుంది.
  • గమనావస్థ: ఈ అవస్థలో పుంజు పందెమునకు వినియోగిస్తే సామాన్య లాభం మాత్రమే కలుగగలదు. కనుక ఈ స్థితి అంత శుభప్రదము కాదు.
  • నిద్రావస్థ: ఈ అవస్థలో పుంజును పందెమునకు విడిచిన అపజయము కలుగును.
  • జపావస్థ / మరణావస్థ: ఈ అవస్థలో పుంజును పందెమునకు విడిచిన మృతి చెందును. కనుక ఈ స్థితి శుభప్రదము కాదు.

గమనిక: జాము అనగా 30/5 = 6 ఘటికలు = 24*6 నిముషములు = 2 గంటల 24 నిముషాలు.

సంక్రాంతి పండగ రోజులు

సంక్రాంతి పండగ రోజులలో పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేసి పందేలు వేస్తారు. 13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు, 14వ తేదీ యాసర కాకి డేగలు, కాకి నెమలిలు, పసిమగల్ల కాకులు, కాకి డేగలకు చెందిన పుంజులు, 15వ తేదీ డేగలు, ఎర్రకాకి డేగలు గెలుపొందుతాయని నమ్మకం

ఇవీ చూడండి

మూలాలు

  1. 1.0 1.1 Slater, Joanna (5 February 2019). "Inside India's illegal 'Super Bowl' of cockfighting, where the roosters wear razors". The Washington Post (in ఇంగ్లీష్). Retrieved 2020-08-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 Srinivas, Rajulapudi (2020-01-12). "Despite ban, stage being set for cockfighting in Andhra Pradesh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-08-22.
  3. 3.0 3.1 "Bird Fights". Beauty Without Cruelty - India. Retrieved 2020-08-24.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  4. Bhattacharjee, Sumit (2020-01-12). "A favourite pastime". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-08-25.
  5. కె, శ్రీనివాస్ (2011-01-12). "కోట్ల రూపాయల కోడి పందేలు". సూర్య. Archived from the original on 2014-01-13. Retrieved 2014-01-13.
  6. "Cockfights continue across Andhra Pradesh despite court ban | Vijayawada News - Times of India". The Times of India.
  7. Mitra, Esha. "Man dies after rooster attack on way to cockfight".
  8. "Despite Ban, Roosters and Punters Ready for the Cockfights".
  9. "SC allows conduct of cockfights in 'traditional manner' in coastal Andhra".
  10. 10.0 10.1 "cockfights: Cockfights have turned into a multi-crore biz in coastal Andhra Pradesh - Times of India". The Times of India. Retrieved 2020-08-22.
  11. "Master dies in rooster revolt". 14 December 2010.
  12. "Man killed by chicken at illegal cockfight". 2020-01-22.
  13. "Kukkuta sastram in Telugu: కుక్కట శాస్త్రం, కోడి పుంజులు, రకాలు'". Teluguaction. Retrieved 2024-01-09.
  14. ఏలూరి సీతారామ్. కుక్కుట శాస్త్రం. రాజమండ్రి: ఉమా ఆఫ్ సెట్ ప్రింటర్స్.


బయటి లింకులు