కె.బాలగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. బాలగోపాల్
జననంకందల్ల బాలగోపాల్
1952, జూన్ 10
Indiaబళ్ళారి,కర్ణాటక
మరణం2009, అక్టోబర్ 8
హైదరాబాద్, తెలంగాణా
వృత్తిమానవ హక్కుల సంఘ కార్యకర్త
భార్య / భర్తవసంత లక్ష్మి

కె. బాలగోపాల్ స్వస్థలం: అనంతపురం జిల్లాలోని కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం. మాతామహుడు: ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మఈటీవీ2లో చాలాకాలం తెలుగువెలుగు కార్యక్రమానికి నిర్వాహకురాలిగా పనిచేసిన మృణాళిని ఈయన చెల్లెలు.

జీవితచరిత్ర[మార్చు]

విద్యాభ్యాసం: ఒకటి నుంచి డిగ్రీ వరకు తిరుపతిలో. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి, వరంగల్‌లోని ఆర్ఈసీ నుంచి గణితంలో పీహెచ్‌డీ, 1980లో కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరిక, 1985లో ఉద్యోగానికి రాజీనామా, అప్పటినుంచి హక్కుల ఉద్యమానికే పూర్తిగా అంకితం అయ్యారు. మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి సలిపిన ప్రముఖ హక్కుల నేత, న్యాయవాది, హేతువాది మేధావి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రియాకాలనీలో నివసించారు. ఆయన భార్య వసంత లక్ష్మి ఆంధ్రజ్యోతి పత్రికలో పాత్రికేయురాలు. కుమారుడు ప్రభాత్. బాలగోపాల్ దీర్ఘకాలంగా అల్సర్‌తో బాధపడ్డారు. 8.10.2009 గురువారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

హక్కుల ఉద్యమ రంగం[మార్చు]

పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన బాలగోపాల్ జీవితాంతం ఉద్యమంలో కొనసాగారు. గణితశాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన మానవతా విలువలకోసం పోరాడారు. ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకుపోయిన నాయకుడాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడారు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై ఎన్నోసార్లు భౌతిక దాడులు జరిగినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లను వెలుగులోకి తేవడంతో పోలీసులు ఆయనపై నక్సలైట్‌గా ముద్రవేశారు. కొత్తగూడెంలో ఓసారి ఆయనపై దాడికి పాల్పడిన పోలీసులు చనిపోయాడని భావించి మురికికాల్వలో పడేసి వెళ్లగా పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆయన్ను కాపాడారు.

పౌరహక్కుల నుంచి మానవహక్కుల వైపు[మార్చు]

రాజ్యహింసతోపాటు ప్రైవేటుహింసను ఆయన వ్యతిరేకించాడు. పౌరహక్కుల సంఘం నుంచి ఆయన 1996లో విభేదించి బయటకొచ్చి మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ను ఏర్పాటుచేశారు. ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసీ నక్సలైట్లు రాజ్యహింసకు వ్యతిరేకంగా హింసా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన ఖండించారు. రాజ్యహింసతో పాటు ప్రజలపై గుండాలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు చేసే హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారు. మార్క్సిజం నుంచి ఆయన పక్కకు పోవడంపై అప్పట్లో రచయిత్రి రంగనాయకమ్మ 'కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు' పుస్తకం రాశారు. నక్సల్బరీ ఉద్యమానికి ఎంతోమంది కార్యకర్తలను అందించిన ఆయన ఆ తర్వాత క్రమంలో విప్లవపార్టీల వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు చేరువకావడంలో ఎం.ఎల్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆయన రాసిన 'నక్సల్బరీ ఉద్యమం, గమ్యం, గమనం', 'చీకటి కోణం' పుస్తకాలు సంచలనం సృష్టించాయి.

ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్యానేరం నమోదు చేయాలని ఆయన గట్టిగా వాదించి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టని పల్లె లేదు, పట్టణం లేదు. అరణ్యాల నుంచి జనారణ్యాల వరకూ ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయనతప్పనిసరిగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం చేసేవారు. అందుకే మన భౌగోళిక, నైసర్గిక స్థితిగతులపై ఆయనకున్న జ్ఞానం అపారం. కాలుష్యం, విద్యా వ్యాపారం, సెజ్‌లు, నిర్వాసితులు, మురికివాడలు, కాశ్మీర్ సంక్షోభం, మైనారిటీ హక్కులు, మహిళా హక్కులు, విద్యార్థి హక్కులు, సంప్రదాయ వృత్తులు, అణుపరిజ్ఞానం, గిరిజనుల ఆనారోగ్యం.. ఇలా మన రాష్ట్రం, దేశం ఎదర్కొంటున్న ఏ సమస్యపైన అయినా ఆయన లోతైన అవగాహన కనబరుస్తూ మాట్లాడేవారు.

మేధోశక్తి, వ్యక్తిత్వం[మార్చు]

26-27 సంవత్సరాలకే గణితశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన అసమాన ప్రతిభా సంపన్నుడు. చదివింది గణితశాస్త్రం అయినా.. సామాజిక శాస్త్రాలు, పౌరహక్కులు, చరిత్ర, సాహిత్యం, రాజ్యాంగం.. ఇలా భిన్నరంగాల్లో లోతైన అవగాహన గల మేథావి. నిరాడంబరుడు. సామాజిక పరిస్థితుల అధ్యయనంలో భాగంగా వందలాది కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. విఖ్యాత రాజనీతిజ్ఞుడైన బెర్ట్రాండ్ రస్సెల్ దార్శనికత స్ఫూర్తిగా ప్రతి సామాజిక సంక్షోభంలోనూ ప్రజల తరఫున నిలబడటానికి ప్రయత్నించారు. ఎన్నో చరిత్ర గ్రంథాలను, డీడీ కోశాంబి వంటి తత్వవేత్తలను తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ పుస్తకాలు రాశారు. హైకోర్టులో పేదలు, కార్మికులు, నిర్వాసితుల వంటి బాధితుల పక్షానే వాదించారు. నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి సంపదను కోట్లాది మంది జీవనోపాధికి ఉపయోగించాలి. సెజ్‌లు వంటి అభివృద్ధి పథకాల పేరుతో ప్రభుత్వం స్థానిక ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తోందని, వారి జీవనోపాధికి విఘాతం కలిగిస్తోందని నిర్భయంగా చెప్పే వాడు. ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.

రచనలు[మార్చు]

  • దళిత
  • నిగాహ్
  • మతతత్వం పై బాలగొపాల్
  • రాజ్యం సంక్షేమం
  • సాహిత్యం పై బాలగొపాల్
  • హక్కుల ఉద్యమం
  • ముస్లిం ఐడెంటిటీ : హిందుత్వ రాజకీయాలు
  • కల్లొల లోయ
  • జల పాఠాలు

మూలాలు[మార్చు]