కొలెస్టరాల్
కొలెస్టరాల్ లేదా కొలెస్టరోల్ (ఆంగ్లం Cholesterol) అనేది మన శరీరాలలో ఉండే ఒక రకం కావరం (lipid) లేదా ఒక రకం కొవ్వు (fat) పదార్ధం. శాస్త్రీయ భాష మాట్లాడేటప్పుడు కొవ్వు(fat)కీ కావరం (lipid)కీ అర్ధంలో రవ్వంత తేడా ఉంది; కాని సాధారణంగా ప్రజలు ఈ తేడాని గుర్తించరు. ఇంగ్లీషులో ఈ cholesterol మాట చివర '-ol' శబ్దం గమనార్హం. రసాయన శాస్త్రంలో పేరు చివర '-ol' శబ్దం వచ్చే పదార్ధాలన్నీ ఆల్కహాలు (alcohol) జాతికి చెందినవని అర్ధం చేసుకోవాలి. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇంగ్లీషులో రాసినప్పుడు cholesterol అని రాసి, పలికినప్పుడు 'కొలెస్టరోల్' అని పలకాలి. కాని మన చెవికి 'కొలెస్టరోల్' కీ 'కొలెస్టరాల్' కీ మధ్య ఉన్న తేడా బాగా పట్టదు. అందుకని 'కొలెస్టరాల్' అని నిర్లక్ష్యంగా అనెస్తాం. వచ్చిన చిక్కు ఏమిటంటే రసాయన శాస్త్రంలో పేరు చివర '-al' శteబ్దం వచ్చే పదార్ధాలన్నీ ఆల్డిహైడులు(aldehydes) అని మరొక జాతికి చెందినవి. ఇంగ్లీషు స్పెల్లింగులో ఈ తేడా గమనించి తీరాలి. తెలుగులో శాస్త్రం చదవటం, రాయటం అలవాటు అయిన రోజున ఈ తేడా మనం కూడా గమనించవలసి వస్తుంది.
ఇంతకీ కొలెస్టరోల్ కావరమా? ఆల్కహాలా? కొలెస్టరోల్ (cholesterol) అన్నది స్టీరాయిడ్ (steroid) అన్న పదార్ధమూ, ఆల్కహాల్ (alcohol) అన్న పదార్ధమూ కలియగా వచ్చిన స్టీరాయిడ్ + ఆల్కహాల్ = స్టీరాల్ (sterol).
విషయ సూచిక |
పేరు వెనక గాధ [మార్చు]
ఇంగ్లీషులో కొలెస్టరోల్ అన్న పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవసరం వెంబడి దీనికి తెలుగులో పేరు పెట్టుకోవచ్చు. కనీసం ఇంగ్లీషులో ఈ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే శాస్త్రజ్ఞులు పేర్లు ఎలా పెడతారో అర్ధం అవుతుంది. గ్రీకు భాషలో 'కోలె' (chole) అంటే పిత్తరసం(bile), స్టీరోస్ (stereos) అంటే ఘన పదార్ధం. పేరు చివర '-ol' అనే తోక ఈ పదార్ధం ఆల్కహాల్ జాతికి చెందింది అని చెబుతోంది. మొదట్లో, 1769లో పిత్తాశయం (gall bladder) లో ఉండే పైత్యపు బెడ్డలు (gall stones) లో ఈ పదార్ధాన్ని చూసేరు. పైత్యరసం కాలేయంలో తయారయి పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. అప్పుడప్పుడు ఇది బెడ్డలుగా మారుతుంది. ఈ బెడ్డలలో కనిపించింది కదా అని మొదట్లో దీనికి 'కొలెస్టరీన్' అని పేరు పెట్టేరు. నెమ్మది మీద ఇది ఆల్కహోల్ జాతి పదార్ధం అని అర్ధం అవగానే దీని పేరు, అంతర్జాతీయ ఒప్పందానికి అనుకూలంగా, 'కొలెస్టరోల్' అని మార్చేరు. ఈ కథనాన్ని దృష్టిలో పెట్టుకుని కొలెస్టరోల్ ని తెలుగులో పిత్తఘృతోల్ అనొచ్చు. పిత్త = కోలె, ఘృత = నెయ్యి (ఘన రూపంలో ఉండే ఒక కొవ్వు పదార్ధం), ఓల్ = ఆల్కహోల్. కాని మనందరికీ ఆల్కహాల్ అనటం అలవాటయిపోయింది కనుకనున్నూ, -ఓల్ శబ్దంతో అంతం అయే మాట్ మరొకటి ప్రస్తుతానికి పోటీగా లేదు కనుకనున్నూ మనం ఇటు పైన ఆల్కహాలు, కొలెస్టరాలు, పిత్తఘృతాలు అని -ఆల్ శబ్దంతో అంతం అయే మాతలనే వాడుదాం.
కొలెస్టరాల్ స్వభావం [మార్చు]
కొలెస్టరాల్ అనేది సర్వసాధారణంగా జంతుజాతి కణజాలం (tissue) లోని కణకవచంలో (cell membrane) కనిపించే ఒక కావరం (lipid). జంతువుల రక్తం లోని రసి (plasma) ద్వారా ఇది ఒక చోటు నుండి మరొక చోటుకి రవాణా అవుతుంది. జంతువుల శరీరాలు సహజ ప్రక్రియల ద్వారా ఈ కొలెస్ట్రోల్ ని ఉత్పత్తి చేస్తాయి; కనుక జంతు సంబంధమైన పదార్ధాలు తిన్నప్పుడు ఈ కొలెస్టరాల్ మనకి ఆహారం ద్వారా కూడ లభ్యం అవుతుంది.
కొలెస్టరాల్ రక్తంలో కరగదు కనుక పాలల్లో వెన్నపూసలాంటి కావరప్రాణ్యాలు (lipoproteins) సహాయంతో ఒక చోట నుండి మరొక చోటికి రవాణా చెయ్యబడుతుంది. ఈ కావరప్రాణ్యాలు చిన్న చిన్న గోళాకారపు పూసలలా రక్తంలో తేలియాడుతూ ఉంటాయి. బల్లిగుడ్లలో ఆవగింజ మాదిరి ఈ పూసల మధ్య నీటిలో కరగని కొవ్వులు, కొలెస్టరోల్ దాగొని కావరప్రాణ్యాలతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ కావరప్రాణ్యాలు రకరకాల సైజులలో, రకరకాల పేర్లతో ఉంటాయి. పెద్ద సైజు నుండి చిన్న సైజుకి వెళుతూ ఉంటే వాటిలో కొన్ని పేర్లు: కనిష్ఠ సాంద్రత కావరప్రాణ్యాలు (very low density lipoproteins or VLDL), మధ్యే సాంద్రత కావరప్రాణ్యాలు (intermediate density lipoproteins or IDL), తక్కువ సాంద్రత కావరప్రాణ్యాలు (low density lipoproteins or LDL), ఎక్కువ సాంద్రత కావరప్రాణ్యాలు (high density lopoproteins or HDL). రక్తంలో ఎక్కువ సాంద్రత కావరప్రాణ్యాలు తక్కువగానూ, తక్కువ సాంద్రత కావరప్రాణ్యాలు ఎక్కువగానూ ఉంటే గుండెజబ్బూ, రక్తనాళాల జబ్బూ వస్తుందని ఉటంకింఛే సిద్ధాంతాన్ని కావర సిద్ధాంతం (lipid theory) అంటారు. ఈ పరిస్థితిలో రక్తనాళాలు గట్టిపడటం, పూడుకుపోవటం (atherosclerosis) జరుగుతుంది. ఇలా పూడుకుపోవటమనేది గుండెకాయకి రక్తం సరఫరా చేసే నాళాల్లో జరిగితే గుండెలోని కణజాలం చచ్చిపోతుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో myocardial infarction అనిన్నీ, సామాన్యుల భాషలో heart attack అనిన్నీ, తెలుగులో గుండెపోటు అనిన్నీ అంటారు.
వనరులు [మార్చు]
- V. Vemuri, "Cholesterol: The Good Villain," Science Reporter, pp 40-42, Jan 1994, CSIR, New Delhi.
బయటి లింకులు [మార్చు]
- Detection, Evaluation, and Treatment of High Blood Cholesterol in Adults US National Institutes of Health Adult Treatment Panel III
- Aspects of fat digestion and metabolism – UN/WHO Report 1994
- American Heart Association – "About Cholesterol"