గద్వాల
| ?గద్వాల మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | గద్వాల |
| జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
| గ్రామాలు | 19 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
96,370 (2001) • 49180 • 47180 • 49.70 • 60.55 • 38.34 |
గద్వాల (ఆంగ్లం: Gadwal) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం కూడా. పట్టణం నడిబొడ్డున సంస్థానాధీశుల కాలం నాటి పూర్తిగా మట్టితో నిర్మించిన కోట కలదు. గద్వాల సమీపంలో ఆత్మకూరు వెళ్ళు రహదారిలో "ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు" ఉంది. 7వ నెంబరు జాతీయ రహదారి నుండి 18 కిలోమీటర్లు లోపలికి ఉన్న గద్వాల పట్టణానికి రైలు మార్గం ఉంది. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానం చరిత్ర పట్టణానికి ఉంది. గద్వాల సమీపంలోని పలు గ్రామాలు కూడా చారిత్రక ప్రాశస్త్యం కలవి. గద్వాల మండలములోని పూడూరును రాజధానిగా చేసుకొని పాలించిన చరిత్ర ఉంది. అయిజా, రాజోలి, వేణిసోంపూర్, ఆలంపూర్ తదితర గ్రామాలు కూడా చారిత్రకంగా, పర్యాటకంగా ప్రఖ్యాతిగాంచినవి. ఇది గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా ఉంది. కళలకు నిలయంగా బాలభవన్ విరాజిల్లుతోంది. దీనిని 1982లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడైన పాగ పుల్లారెడ్డి ఏర్పాటుచేశాడు. వందేమాతరం రామచంద్రారావు, వీరభద్రారావు, పాగపుల్లారెడ్డి, లడ్డుభీమన్న లాంటి ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు పట్టణానికి చెందినవారే. రాజకీయంగా కూడా గద్వాల ప్రముఖస్థానం పొందింది. గతంలో రాష్ట్ర మంత్రిపదవి నిర్వహించిన సమరసింహారెడ్డి, ప్రస్తుతం రాష్ట్రమంత్రివర్గంలో ఉన్న డి.కె.అరుణ గద్వాల పట్టణమునకు చెందినవారు.
[మార్చు] పట్టణ స్వరూపం, జనాభా
రెవెన్యూ డివిజన్ కేంద్రమైన గద్వాల పట్టణం డివిజన్ లోనే అతిపెద్దది మరియు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రముఖ పట్టణాలలో ఒకటి. ఇది 16°14′ ఉత్తర అక్షాంశం, 77°48′ తూర్పు రేఖాంశంపై ఉన్నది. .పట్టణ జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారము 53,601. ఇందులో పురుషులు 51% మరియు మహిళలు 49%. ఇక్కడి సగటు అక్షరాస్యత 57% (పురుషులలోలో 67%, మహిళలలో 48%). జనాభాలో 13% వయస్సు 6 సంవత్సరాలలోపు ఉంటుంది.
[మార్చు] రవాణా
- రైలు సౌకర్యం
గద్వాల రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో హైదరాబాదు - కర్నూలు మద్య హైదరాబాదు నుంచి దక్షిణముగా 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో మరియు కర్నూలు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ వైపు వెళ్ళడానికి రోడ్డు మార్గములో దూరం అధికంగా ఉన్నందున రైలు ప్రయాణం చాలా అనువుగా ఉన్నది. ఇక్కడి నుంచి కర్ణాటక లోని రాయచూరుకు నూతనంగా రైలుమార్గపు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన తరువాత వ్యాపారపరంగా గద్వాల పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
- రోడ్డు రవాణా
గద్వాల పట్టణం 7వ నెంబరు జాతీయ రహదారికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాదు - కర్నూలు మార్గంలో జాతీయ రహదారిపై కృష్ణా నది వంతెన దాటిన కొద్దిదూరంలో ఉన్న ఎర్రవల్లి కూడలి నుంచి కుడివైపున వెళ్ళవలసి ఉంటుంది. కృష్ణానదిపై మరో వంతెన లేనందున వంతెన దాటి గద్వాల వెళ్ళడం హైదరాబాదు, మహబూబ్ నగర్ నుంచి వచ్చు వాహనాలకు దూరం అధికం అవుతుంది. గద్వాల నుంచి కర్నూలు, అయిజా, ఆత్మకూరు మరియు కర్ణాటకలోని రాయచూరు పట్టణాలకు బస్సు సౌకర్యాలు బాగుగా ఉన్నాయి. గద్వాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డీపో కూడా కలదు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని 8 డీపోలలో ఒకటి. పరిసర ప్రాంతాలలోని బస్సుస్టేషన్ల నిర్వహణ ఈ డీపో ద్వారానే జరుగుతుంది.
[మార్చు] చరిత్ర
1663 సంవత్సరం నుండి 1712 మధ్యకాలంలో పెదసోమభూపాలుడు (ఇతనినే నలసోమనాద్రి అనేవారు) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రావడముతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించారని కథ ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చినాడు. గద్వాల సంస్థానాధీశులకు చెన్నకేశవ స్వామి కులదైవం.
1709 నుండి 1712 వరకు కర్నూలు దుర్గం రాజా పెదభూపాలుని ఆధీనంలో ఉండేది. బహద్దూర్ షా అనుయాయులు గద్వాల రాజు ఆధీనంలో ఉన్న కర్నూలు దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి నిజాం తన సేనాని దిలీప్ ఖాన్ ను పంపించాడు. దిలీప్ ఖాన్ కు పెద సోమభూపాలునికి మధ్య కర్నూలు సమీపంలోని నిడదూరు గ్రామం దగ్గర జరిగిన యుద్దంలో రాజా పెదసోమభూపాలుడు జ్యేష్ట శుక్ల అష్టమి రోజు మరణించాడు. నిజాం గద్వాల సంస్థానాన్ని వశం చేసుకోకుండా పెద్దసోమభూపాలుని భార్య లింగమ్మతో సంధిచేసుకొనడంతో నిజాం రాజ్యంలో గద్వాల స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అప్పటి నుంచి 1948లో నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేవరకు గద్వాల సంస్థానం కొనసాగినది.
పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్దంలో పెదసోమభూపాలుడు గదను, వాలమును ప్రయోగించడము వలన ఈ కోటకు "గదవాల(గద్వాల)" అన పేరు వచ్చినదని చెబుతారు.[1] ఈ విధంగా 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింపబడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను కోటలోపల ఏర్పాటు చేసారు. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్)డిగ్రీ కళాశాలగా పెట్టబడింది.
[మార్చు] విద్య
- పట్టణంలోని కళాశాలలు
- మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
- నిషిత డిగ్రీ కళాశాల
- ప్రభుత్వ జూనియర్ కళాశాల
- జ్ఞానప్రభ జూనియర్ కళాశాల
- ఎస్.వి.యం.జూనియర్ కళాశాల
- సోమనాద్రి జూనియర్ కళాశాల
- కృష్ణవేణి జూనియర్ కళాశాల
- సెయింట్ థామస్ బి.ఇ.డి.కళాశాల
[మార్చు] జనాభా
2001 లెక్కల ప్రకారం గద్వాల మండల జనాభా 96375. ఇందులో పురుషులు 49187 మరియు స్త్రీలు 47188. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 355. అక్షరాస్యుల సంఖ్య 40806. ఎస్సీలు 11467, ఎస్టీలు 842. [2]
[మార్చు] చేనేత పరిశ్రమ
చేనేత పరిశ్రమలో ముఖ్యంగా చీరల తయారీలో గద్వాల పట్టణం జిల్లా లోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రముఖ పేరు సంపాదించింది. ఇక్కడి నుంచి ప్రముఖ పట్టణాలకు వస్త్రాలు ఎగుమతి అవుతుంటాయి. చేనేత వస్త్రాలకు డిమాండు తగ్గిననూ అతినాణ్యత కల జరీ చీరలు నేసే కళాకారులు గద్వాలలో ఇప్పటికీ ఉన్నారు. బ్రిటీష్ కాలంలో చేనేత కళాకారులకు ఎలాంతి ప్రోత్సాహం లభించకున్ననూ సంస్థానాధీశులు మాత్రం వీరిని ప్రోత్సహించారు. గద్వాల సంస్థానాధీశుల కాలంలో అప్పటి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గద్వాల నుంచి ఇద్దరు చేనేత కళాకారులను ఉత్తర ప్రదేశ్ లోని వారణాసికి పంపించి బనారస్ జరీ చీరలను నేసేందుకు శిక్షణ ఇప్పించింది. [3]
[మార్చు] తిరుమలేశునికి గద్వాల పంచెలు
సుమారు నాలుగు శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి పంచెలను సమర్పించే సంప్రదాయం ఉంది. నాటి రాజు సీతారాం భూపాల్ గద్వాల సంస్థానాధీశుల ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామివారికి పంచెలను సమర్పించే పద్దతిని ప్రవేశపెట్టాడు.[4] అతని వారసులు నేటికికూడా ఈ పద్దతిని కొనసాగిస్తున్నారు.
[మార్చు] పరిపాలన
- ప్రధాన వ్యాసం: పురపాలక సంఘము, గద్వాల
గద్వాల పట్టణం పరిపాలన పురపాలక సంఘము ద్వారా నిర్వహింపబడుతుంది. 1952లో ఏర్పాటు చేయబడిన పురపాలక సంఘము అప్పటి నుండి మూడవగ్రేడు పురపాలక సంఘముగా ఉండగా, ఫిబ్రవరి 2009లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా రెండవ గ్రేడు పురపాలక సంఘముగా అప్‌గ్రేడ్ చేయబడినది. ప్రస్తుతం ఏటా కోటి రూపాయల ఆదాయం ఆస్తిపన్ను, నీటిపన్నుల ద్వారా పురపాలక సంఘానికి లభిస్తుంది. ప్రభుతం నుంచి లభిస్తున్న నిధులతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
[మార్చు] చారిత్రక కోట
గద్వాల పట్టణం నడొబొడ్డున ఉన్న చారిత్రకమైన పూర్తిగా మట్టితో కట్టబడిన కోటను పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు.[5] ఇతనికే నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నడుస్తున్నవి.
[మార్చు] సాహిత్యం
గద్వాల సంస్థానాధీశులు సాహితీప్రియులు కావడంతో వీరి కాలంలో సాహిత్యం బాగా అభివృద్ధి చెందినది. తిరుపతి వేంకట కవులు కూడా గద్వాల సంస్థానాన్ని సందర్శించారు. కోటలో తరుచుగా సాహిత్య సభలు జరిగేవి. కవులకు సంస్థానాధీశులు బహుమతులను కూడా అందజేసేవారు. చినసోమభూపాలుని హయంలో అష్టదిగ్గజాలనే 8మంది కవులుండేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
[మార్చు] బాలభవన్
కళలకు నిలయంగా గద్వాల పట్టణము నడిబొడ్డున ఉన్న బాలభవన్ విరాజిల్లుతోంది. దీనిని 1982లో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, మాజీ శాసనసభ్యుడైన పాగ పుల్లారెడ్డి ఏర్పాటుచేశాడు.[6] 1985లో ఆంధ్రనాటక ప్రముఖుడైన నటరాజ రామకృష్ణ పాఠశాలలోని కళాశాకారుల ప్రతిభను గుర్తించాడు. 1990లో హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బాలల రంగస్థల ఉత్సవాలలో పాల్గొని గద్వాల విద్యార్థులు ప్రథమ బహుమతిని పొందినారు. రాష్ట్రంలో ఏ బాలభవన్‌కు లేని ప్రత్యేకతలు గద్వాల బాలభవన్‌కు ఉన్నాయి. ఏకకాలంలో 600 ప్రేక్షకులు తిలకించడానికి అవకాశం ఇక్కడ ఉంది. 2000లో మినీ థియేటర్‌ను, 2004లో అర్ట్‌గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏటా 700 మంది సంగీతం, వాయిద్యం, నృత్యం, చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు వంటి విభాగాలలో శిక్షణ పొందుతున్నారు.
[మార్చు] గద్వాల మార్కెటింగ్ కమిటి
పరిసర ప్రాంతాల రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా 1974లో గద్వాల పట్టణంలో అయిజా వెళ్ళు మార్గములో మార్కెంటింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. ప్రారంభంలో ఏటా 24 లక్షల ఆదాయం ఉండేది. కాలక్రమేణా ఆదాయం పెరిగి 2006-07లో కోటి రూపాయల ఆదాయం దాటింది. 2008-09 నాటికి వార్షిక ఆదాయము కోటి 60 లక్షలకు చేరింది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని 18 మార్కెటింగ్ కమిటీలలో ఒకటి మరియు గద్వాల డివిజన్‌లో పెద్దది. 2009లో పత్తి మార్కెట్ కూడా ప్రారంభించబడింది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
|
[మార్చు] ప్రముఖ వ్యక్తులు
- వందేమాతరం రామచంద్రారావు
- ఇతని అసలుపేరు రామచంద్రయ్య. తరువాత రామచంద్రారావుగా మార్చుకున్నాడు. మొదట గద్వాల రాజు సీతారాం భూపాల్ చెల్లెలు వద్ద గుమాస్తా పనిచేసి, పుల్లారెడ్డితో కలిసి హైదరాబాదులో విద్యనభ్యసించి గద్వాల సంస్థానంలో సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా నియమితులయ్యాడు.ఆ పిమ్మట ఉద్యోగాన్ని వదిలి హిందూమహాసభలో చేరినాడు. పోలీసు చర్య ముందు రజాకారుల రహస్యాలను చేరవేసే గూఢచారిగా పనిచేశాడు. వందేమాతరం ఉద్యమంలో పనిచేస్తూ నిజాం పోలీసులకు పట్టుపడి జైలుశిక్ష అనుభవించాడు. విచారణ సమయములో పేరు, ఊరు విషయాలన్నింటికీ వందేమాతరం అని సమాధానం ఇచ్చాడు. జైలు నుంచి విడుదలైన పిమ్మట అందరూ ఇతన్ని వందేమాతరం రామచంద్రారావుగా పిలవడం మొదలుపెట్టారు. స్వాతంత్ర్యం తరువాత శాసనసభ్యుడిగా పనిచేశాడు. ఇతని సోదరుడు వీరభద్రారావు కూడా స్వాతంత్ర్యసమరయోధుడు.
- పాగ పుల్లారెడ్డి
- స్వాతంత్ర్య సమరయోధుల జిల్లా అద్యక్షుడిగా పనిచేసిన[7] పాగ పుల్లారెడ్డి మహాత్మాగాంధీ స్పూర్తితో జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై అనేక ఉద్యమాలలో పాలుపంచుకున్నాడు. స్వాతంత్ర్యానంతరం రాజకీయాలలొ అనేక పదవులు పొంది గద్వాల పట్టణానికి సేవలందించాడు. 1972లో గద్వాలలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఘనత కూడా ఇతనిదే. 1972 శాసనసభ ఎన్నికలలో డి.కె.సత్యారెడ్డిపై విజయం సాధించి ఆరేళ్ళపాటు శాసనసభ్యుడిగా కొనసాగినాడు. పురపాలక సంఘం చైర్మెన్‌గా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. అక్టోబరు 20, 2010న మరణించాడు.[8]
- లడ్డు భీమన్న
- ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన లడ్డు భీమన్న గద్వాల వాసి. స్వాతంత్ర్య ఉద్యమసమయంలోనూ, విమోచన ఉద్యమంలోనూ గద్వాల ప్రాంతంలో ప్రముఖ పాత్ర వహించాడు. 2008, ఫిబ్రవరి 28న మరణించాడు.
- సమర సింహారెడ్డి
- నాలుగు సంవత్సరాలకు పైగా రాష్ట్ర మంత్రిగా, 14 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేసిన సమర సింహారెడ్డి గద్వాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1979 నుంచి 1994 వరకు గద్వాల అసెంబ్లీ నియోజక వర్గం తరఫున శాసనసభ్యుడిగా వ్యవహరించాడు. 1994లో స్వంత తమ్ముడు భరత సింహారెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత అధికార పదవులకు దూరమైనాడు. గద్వాల నియోజకవర్గపు ప్రస్తుత శాసనసభ్యురాలు డి.కె.అరుణ ఇతని మరదలు.
- భరత సింహారెడ్డి
- సమరసింహారెడ్డి సోదరుడైన భరత సింహారెడ్డి గద్వాల పట్టణపు ప్రముఖ రాజకీయనేతలలో ఒకడు. 1994 శాసనసభ ఎన్నికలలో భరత సింహారెడ్డిపై 32 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు. ప్రస్తుతం గద్వాల నియోజకవర్గం శాసనసభ్యురాలైన డి.కె.అరుణ ఇతని భార్య.
- డి.కె.అరుణ
- ప్రధాన వ్యాసం: డి.కె.అరుణ
- ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, రాజకీయవేత్త, 2005, ఆగష్టు 15న నారాయణ పేటలో నక్సలైట్ల తూటాలకు బలైన నర్సిరెడ్డి కూతురైన డి.కె.అరుణ ప్రస్తుతం గద్వాల నియోజకవర్గపు శాసనసభ్యురాలు. 2004లో తొలిసారి విజయం సాధించగా, 2009లో మళ్ళీ శాసనసభ్యురాలిగా ఎన్నికై రాష్ట్రమంత్రివర్గంలో స్థానం పొందినది.[9]
[మార్చు] సమీపంలోని పర్యాటక ప్రదేశాలు
- గద్వాల కోట : ఈ కోట గద్వాల పట్టణము నడొబొడ్డున కలదు. పూర్తిగా మట్టితో కట్టబడిన ఈ కోట ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్ననూ పర్యాటక ప్రదేశంగానూ గుర్తింపు పొందింది. ఇక్కడ సినిమా షూటింగులు కూడా నిర్వహించారు
- ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు: గద్వాల నుంచి ఆత్మకూరు వెళ్ళు మార్గంలో మహబూబ్ నగర్ జిల్లాలోనే పెద్దదైన ఈ ప్రాజెక్టు కృష్ణానదిపై ఉంది.
- కృష్ణా అగ్రహారం: కృష్ణా పుష్కరాల సమయంలో అనేక వేల భక్తులు వచ్చి పవిత్ర స్నానమాచరించే కృష్ణాఅగ్రహారం గద్వాల పట్టణం సమీపంలోనే ఉంది. రైలు మార్గం ద్వారా కృష్ణానది వంతెన దాటునప్పుడు పుష్కర స్థలం కనిపిస్తుంది.
- జమ్ములమ్మ దేవాలయం: గద్వాల పట్టణం నుంచి 7వ నెంబరు జాతీయ రహదారికి వెళ్ళు మార్గంలో గద్వాల నియోజకవర్గంలోనే ప్రముఖమైన జమ్ములమ్మ దేవాలయం ఉన్నది. దేవాలయం ప్రక్కనే పెద్ద చెరువు కూడా ఉంది. చల్లని గాలులు, సుందర ప్రకృతి దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
[మార్చు] గద్వాల - కొన్ని విషయాలు
- మండలంలోని గ్రామపంచాయతీలు: 25
- శాసనసభ నియోజకవర్గం; గద్వాల్ శాసనసభ నియోజకవర్గం.
- లోకసభ నియోజకవర్గం; నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం.
- మండల అధ్యక్షురాలు (ఎంపిపి): జయమ్మ
- జడ్పీటీసి: కృష్ణమోహన్ రెడ్డి
- ఎస్టీడి కోడ్: 08546
- గద్వాల పోస్టల్ పిన్ కోడ్: 509125
- మండల సెన్సెస్ కోడ్: 0055
- ముఖ్యమైన పంట: వరి
[మార్చు] ఇటీవలి సంఘటనలు
- అక్టోబరు 20, 2010: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం తొలి శాసనసభ్యుడు, పురపాలక సంఘం చైర్మెన్‌గా, మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేసిన పాగపుల్లారెడ్డి మరణం.[10]
- జూన్ 14, 2010: మహారాజ కూరగాయల మార్కెట్‌లో పాత దుకాణాలు కూలి 10 మంది మరణించారు.[11]
- ఫిబ్రవరి 2009: గద్వాల పురపాలక సంఘం మూడవ గ్రేడు నుంచి రెండవ గ్రేడుకు మార్చబడింది.
- ఫిబ్రవరి 2006: రాష్ట్రస్థాయి బాలల రంగస్థల ఉత్సవాలు నిర్వహించబడ్డాయి.
- 1952: పురపాలక సంఘము ఏర్పాటుచేయబడింది.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
- ఆర్టీసీ వెబ్సైట్లో గద్వాల నుంచి బయలుదేరు బస్సుల వివరాలు, సమయాలు
- ఆప్కో వెబ్సైట్లో గద్వాల చీరెల వివరములు
[మార్చు] మూలాలు
- ↑ సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము-2, 1962 ప్రచురణ, పేజీ 304
- ↑ Handbook of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO, Page No.4-13
- ↑ ఆంధ్రప్రభ దినపత్రిక, మహబూబ్ నగర్ ప్రత్యేక అనుబంధం (2006), పేజీ 36,
- ↑ సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 8, తేది 05.09.2008
- ↑ ఆంధ్రప్రభ తృతీయ వార్షికోత్సవ మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అనుబంధం (2006), పేజీ 12
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేదిమ్29-04-2010
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 21.10.2010
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 21.10.2010
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 15-06-2010
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్
|
|
|
|---|---|
| రేకులపల్లి · కొత్తపల్లి · ఎంకంపేట · ముల్కలపల్లి · గద్వాల (గ్రామీణ) · ఆత్మకూరు · గోన్‌పాడ్ · సంగాల · జిల్లాడబండ · కాకులవరం · పరమాల · మేళ్ళచెరువు · జమ్మిచేడ్ · పూదూరు · అనంతపూర్ · బీరోలు · బసాపూర్ · గుర్రంగడ్డ · గద్వాల · కొండపల్లి · చెనుగోనిపల్లి · శెట్టిఆగ్రహాం |
|
|||||
|
|||||||||||||||||||||||||||||||
|
|
|
|---|---|
| తిమ్మాపూర్ · కొత్తూర్ · బూర్గుల · షాద్‌నగర్ · బాలానగర్ · రంగారెడ్డిగూడ · రాజాపూర్ · గొల్లపల్లి · జడ్చర్ల · ఏనుగొండ · మహబూబ్ నగర్ · మన్యంకొండ · కోటకద్ర · దేవరకద్ర · కౌకుంట్ల · కురుమూర్తి · కొన్నూర్ · వనపర్తిరోడ్ · అజ్జకోల్ · శ్రీరాంనగర్ · ఆరేపల్లి · గద్వాల · పూడూర్ · పెద్దదిన్నె · ఇటిక్యాల్ · మనోపాడ్ · జోగులాంబ హాల్ట్ · ఆలంపూర్ రోడ్ · కృష్ణ |