గుండ్లకమ్మ నది

వికీపీడియా నుండి
(గుండ్లకమ్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


గుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది, పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది. దీనిపై కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగు నీటి అవసరాలను తీరుస్తున్నారు.

పేరు వెనుక కథ[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధక్షేత్రాలైన చందవరం, దూపాడు, చేజెర్ల, కనుపర్తి, ఉప్పుగుండూరు, మోటుపల్లిలను అనుసంధానిస్తూ గుండ్లకమ్మ నది ప్రధాన జలరహదారిగా పనిచేసింది

మార్కండేయడు రచించిన గజారణ్య సంహిత ప్రకారం కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి, ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ఈ గజారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తుండేవారట. నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహయుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.

ఒక రోజు వేటకువెళ్ళిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి, రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా, ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనేచోట పైకెగిరి పగిలిపోయాయి. ఆ కుండల నుండి జాలువారిన జలమే నదిగా ప్రవహించిందని కథనం. ఆ "గుండికా నదే" వాడుకలో "గుండ్లకమ్మ"గా రూపాంతరం చెందింది. గుండికా నదీగా పిలవబడిన ఈ నదీ తీరంలోనే మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట.

నది తీరు[మార్చు]

ఇది కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో నల్లమల్ల కొండల లోని గుండ్ల బ్రహ్మేశ్వరము వద్ద 800 మీటర్ల (2900 అడుగులు) ఎత్తులో పుడుతుంది.

గుండ్లకమ్మ వేగం పుంజుకొని రాచర్ల మండలం, జె. పుల్లలచెరువు గ్రామం సమీపాన నెమలిగుండం జలపాతాన్ని ఏర్పరుస్తుంది.[1] ఆ తరువాత ఇది కంభం చెరువును, మార్కాపురం చెరువును నింపుతుంది.

ఆ తరువాత ఈశాన్యముగా ప్రవహించి పల్నాడు జిల్లాలో ప్రవేశిస్తుంది. గుంటూరు జిల్లాలో తిరిగి దిశమార్చుకొని ఆగ్నేయముగా ప్రవహించి ఒంగోలు మండలం, ఉలిచి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. చామవాగు, రాళ్లవాగు, పొగుల్లవాగు, దువ్వలేరు, జంపాలేరు, తీగలేరు, కోనేరు, చిలకలేరు గుండ్లకమ్మ యొక్క ఉపనదులు.[2] ఈనది మొత్తం పొడవు 220 కి.మీ.[3]

మూలాలు[మార్చు]

  1. "Nallamalais". Imperial gazetteer of India. Vol. 18. Oxford. 1908.
  2. "Markapur Taluk". Imperial gazetteer of India. Vol. 17. Oxford. 1908.
  3. "National water development authority report" (PDF). Archived from the original (PDF) on 2009-12-29. Retrieved 2006-12-01.

వెలుపలి లంకెలు[మార్చు]