చర్చ:ఇటలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ - శుద్ధి సూచనలు[మార్చు]

సుజాత గారూ! అత్యంత ముఖ్యమైన వ్యాసాలైన దేశాల గురించిన వ్యాసాలు విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. నేను చేసిన సూచనను అనుసరించి ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలో వ్యాసాలను సమర్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వ్యాసంలో నేను గుర్తించిన కొన్ని సమస్యలు ఇక్కడ వివరిస్తున్నాను. ఈ సమస్యలు ఒక్కొక్కటే చదివి, ఆ ప్రకారం వ్యాసమంతా మార్పులు చేసి, మళ్ళీ తర్వాతి పాయింటు చదివి వ్యాసాన్ని ఆ ప్రకారం సంస్కరించి, అలా ముందుకు వెళ్తే కొంత సులువుగా ఉంటుందని సూచిస్తున్నాను.

అనువాద సమస్యలు
  • మరియు అన్న పదం చాలామార్లు వస్తోంది. ఆంగ్లంలో అండ్ (and) అన్న పదానికి అనువాదంగా దీన్ని ప్రయోగిస్తున్నారని అర్థమవుతోంది. కాకపోతే ఈ పదం తెలుగులో ప్రయోగాన్ని కోల్పోతోంది. ఇప్పటికే ఆధునిక వచనంలోంచి తప్పుకుంటోంది. దీనికి బదులుగా "," (కామా) హాయిగా వాడుకోవచ్చు. అవసరమైతే రెండు పదాలకు చివర్లో "నీ" వంటి విభక్తులు చేర్చుకోవచ్చు. రెండు పదాలను కలిపేందుకు "మరియు" వాడడమే కాస్త అసహజంగా ఉంటుందంటే ఇక రెండు వాక్యాలను కలపడానికి అయితే మరీ కృత్రిమంగా ఉంటుంది. and అనే పదంతో కలిసే వాక్యాలను రెండు వాక్యాలుగా విడదీసుకోవడం బావుంటుంది.
    • ఉదాహరణకు ఇది అధిక కాలానుగుణ ఉష్ణోగ్రత మరియు మధ్యధరా వాతావరణం కలిగి ఉంది.>> ఇది అధిక కాలానుగుణ ఉష్ణోగ్రతనీ, మధ్యధరా వాతావరణాన్నీ కలిగి ఉంది. మరో ఉదాహరణ - కార్తిజియన్లు మరియు గ్రీకులు >> కార్తిజియన్లూ, గ్రీకులూ (రెండూ దీర్ఘాలతో ముగించేసి, కామా పెడితే మరియు తీసేయొచ్చు). ఇంకో ఉదాహరణ - సెల్ట్స్ ఇటలీ కేంద్రంలో నివసిస్తున్నారు మరియు ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు. >> సెల్ట్స్ ఇటలీ కేంద్రంలోనూ, ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు అని వాక్యాలు రెండూ కలపవచ్చు, లేదంటే సెల్ట్స్ ఇటలీ కేంద్రంలో నివసిస్తున్నారు. ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు. అని విడదీయనూవచ్చు.
  • సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు విడదీయడం మేలు. ఎంత చిన్న వాక్యాలైతే అంత తేటగా అర్థాన్ని ఇస్తాయి.
    • ఉదాహరణకు: ప్రధానంగా ఇటలీ ఉత్తర మరియు మధ్య ప్రాంతాలలో షిప్పింగ్, వాణిజ్యం మరియు బ్యాంకింగ్ జరగడం ద్వారా గొప్ప సంపదకు, ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి పునాది వేసింది. అని రాశారు కదా ఆ వాక్యాన్ని ప్రధానంగా ఇటలీ ఉత్తర మరియు మధ్య ప్రాంతాలలో షిప్పింగ్, వాణిజ్యం మరియు బ్యాంకింగ్ జరిగేది. ఇది ఇటలీలో గొప్ప సంపదకు, ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి పునాది వేసింది.
  • పొరపాటు అనువాదాలు ఒక సమస్యగా ఉంది. దీన్ని నివారించడానికి పదానికి అర్థం తెలియనప్పుడు, ఏదైనా సాంకేతికమైన పదం తగిలినపప్పుడు ఆంధ్రభారతి నిఘంటువు సాయంతో గట్టెక్కవచ్చు. ఇందులో సాంకేతిక పద నిఘంటువులు కూడా ఉన్నాయి కాబట్టి సహాయకారిగా ఉంటుంది. అలానే వారిచ్చే ప్రతిపదార్థాల్లో సందర్భానికి తగినది ఎంచుకుని వాడుకోవచ్చు.
    • ఉదాహరణకు Law and order అన్న పదాన్ని చట్టం మరియు ఆర్డర్ అని అనువదించారు. అయితే దీనికి సరైన పదం శాంతి భద్రతలు. ఆంధ్రభారతి నిఘంటుశోధనలో చూస్తే బూదరాజు రాధాకృష్ణ ఆధునిక వ్యవహారకోశంలోనూ ఈ అర్థం దొరుకుతోంది. అలా వెతుక్కుని వాడుకోవచ్చు.
భాషా దోషాలు
  • విభక్తులు లేకుండా పదాలు రాశారు, వీటిని అర్థవంతంగా విభక్తులు చేర్చి దిద్దాలి. "కి", "కు", "ని", "ను" ఇలాంటి విభక్తులు పదానికి, తద్వారా వాక్యానికి అర్థాన్ని నిర్దేశిస్తాయి, కాబట్టి ఇవే ప్రాణం అనుకోవచ్చు.
    • ఉదాహరణకు పురాతన ప్రపంచాన్ని జయించి పాశ్చాత్య నాగరికత ప్రముఖ సాంస్కృతిక రాజకీయ మరియు మత కేంద్రంగా మారింది. అన్న వాక్యం చూడండి పాశ్చాత్య నాగరికత పురాతన ప్రపంచాన్ని జయించిందనీ, సాంస్కృతిక, రాజకీయ, మత కేంద్రమైందనీ అనిపిస్తోంది కదూ. కానీ అసలు అర్థం అది కాదు. పాశ్చాత్య నాగరికత అన్నదాని పక్కన "కి" లేదా "కు" అన్న విభక్తి మిస్సయింది. చివరకు రోమన్ సామ్రాజ్యం మధ్యధరా బేసిన్‌లో ఆధిపత్య శక్తిగా ఉద్భవించింది. పురాతన ప్రపంచాన్ని జయించి పాశ్చాత్య నాగరికతకు ప్రముఖ సాంస్కృతిక రాజకీయ మరియు మత కేంద్రంగా మారింది. అన్న వాక్యాలు నేను "కు" అన్న విభక్తి చేర్చాక చదివితే రోమన్ సామ్రాజ్యం పాశ్చాత్య నాగరికతకు కేంద్రమైందన్న అర్థాన్ని ఇస్తాయి.
  • భూతకాలాన్ని వర్తమాన కాలంలో రాయడం ఒకటి బాగా కనిపిస్తోంది. దీన్ని సరిజేయాలి. చరిత్రను రాసేప్పుడు గుర్తుపెట్టుకుని మరీ భూతకాలంలోనే రాయాలి.
    • ఉదాహరణకు పునరుజ్జీవనం సమయంలో సరికొత్త ఇటలీ సంస్కృతి ప్రారంభానికి వాణిజ్యనగరాలలో కేంద్రీకృతమైన సంపద మరియు కళాపోషకులైన ఉన్నత కుటుంబాలు ఆధారంగా ఉన్నాయి. అని రాశారు కదా. ఐతే ఉన్నాయి అన్న క్రియ ప్రస్తుతం ఉన్నాయన్న అర్థాన్ని, వర్తమాన కాలాన్ని సూచిస్తూంది. మనం చెప్పే విషయం వందల ఏళ్ళ క్రితానిది కాబట్టి భూతకాల క్రియ వాడాలి. అంటే పునరుజ్జీవనం సమయంలో సరికొత్త ఇటలీ సంస్కృతి ప్రారంభానికి వాణిజ్యనగరాలలో కేంద్రీకృతమైన సంపద మరియు కళాపోషకులైన ఉన్నత కుటుంబాలు ఆధారంగా ఉండేవి అని రాయాలి.
అక్షరదోషాలు
  • అక్షరదోషాలు ఉన్నాయి. వీటి విషయమై ప్రత్యేక వివరణ అక్కరలేదు. ఒకమారు వ్యాసం భద్రపరిచాకా, బయటి పాఠకుల్లా పైనించి కింద దాకా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే పంటికింద రాళ్ళలాగా తగులుతాయి దిద్దేయడమే.

ఇవి నాకు ఇప్పటివరకూ తోచిన కొన్ని విషయాలు. ఐతే ఇవి మన తెవికీపీడియన్లు చేస్తున్న అనువాదాలు చాలావాటిలో సాధారణంగా దొర్లుతున్న సమస్యలే. కనుకనే ఇవి మీకు, మనందరికీ కూడా పనికివస్తాయని విశదంగా రాస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 15:14, 8 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఇటలీ&oldid=2355329" నుండి వెలికితీశారు