చలసాని ప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చలసాని ప్రసాదరావు
చలసాని ప్రసాదరావు
జననంచలసాని ప్రసాదరావు
అక్టోబరు 27, 1939
కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు
మరణంజూన్ 12, 2002
వరంగల్లు జిల్లా
ఇతర పేర్లుచలసాని ప్రసాదరావు
ప్రసిద్ధిప్రముఖ రచయిత,చిత్రకారుడు

చలసాని ప్రసాదరావు[1] (అక్టోబరు 27, 1939 - జూన్ 12, 2002 ) ప్రముఖ రచయిత,చిత్రకారుడు.కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలోఅక్టోబరు 27 1939 న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు.[2] 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నాడు. చిన్నతనంలో ఇతన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయాడు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించాడు. ఆయన ప్రోత్సాహంతో చలసాని ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరాడు. 1951-56 సంవత్సరాల మధ్య సాగిన ఆ ఉద్యోగ జీవితం తర్వాత ఇతడు 1956 నాటికి వరంగల్లు చేరుకున్నాడు. కాకతీయ పత్రిక అనే వారపత్రికలో అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫైనార్ట్స్‌ కళాశాలలో కమర్షియల్‌ ఆర్ట్‌లో అయిదుసంవత్సరాల డిప్లొమా కోర్సు, పెయింటింగ్‌లో ఒక సంవత్సరం సాగే కోర్సు పూర్తిచేశాడు. ఎన్నో ఏళ్లుగా తనలో నిబిడీకృతంగా ఉన్న చిత్రకళా సాహిత్యం మీద తన సర్వశక్తులూ కేంద్రీకరించి తెలుగులో చిత్రకళాసాహిత్యం లేని లోటు తీర్చాడు. 1961లో ఇతడి సంపాదకత్వలో ‘కళ’ తొలి సంపుటి వెలుగు చూసింది. నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి రెండేళ్లకు ఒక ‘కళ’ సంపుటి వంతున 1973నాటికి ఆరు సంపుటాలు ప్రచురించి కళాప్రియులకు తరగని సంపదనందించాడు. ఈ ఆరు సంపుటాలు ఆణిముత్యాలని విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం. ‘కళ’ తొలి సంపుటం వచ్చేనాటికి ఇతడు విద్యార్థి మాత్రమే! యునెస్కోసంస్థ 1964లో ‘బుక్‌ ఇలస్ట్రేషన్ల’ మీద ఢిల్లీలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచారపౌర సంబంధశాఖలో స్టాఫ్‌ ఆర్టిస్టుగా చేరాడు. అప్పట్నించీ ఆయన ఎన్నో కోర్సులు పూర్తిచేశాడు. లండన్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటోటెక్నాలజీ సంస్థ డిప్లొమా పూర్తిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో బి.ఎ. పట్టాపొందాడు. 1971లో వసుధ అనే పత్రికకి సంపాదకుడయ్యాడు. 1974లో ఈనాడులో తొలుత ‘ఆదివారం అనుబంధం’ పార్ట్‌ టైమ్‌ సంపాదకుడిగా చేరి 1975నాటికి పూర్తిస్థాయి సంపాదకుడయ్యాడు. దాని తర్వాత విపుల, చతుర మాస పత్రికలతో పాటు అడపా తడపా వచ్చే ప్రత్యేక సంచికలకు ఆయనే సంపాదకత్వం వహించాడు.

జూన్ 12 2002న చలసాని ప్రసాదరావు మరణించాడు.

రచనలు[3][మార్చు]

  • రవి కథ (రవీంద్రనాథ్ టాగూర్ ఆత్మకథ)
  • కాకతీయ శిల్పకళా వైభవం
  • ఆధునిక చిత్రకళ
  • రష్యన్ చిత్రకళ
  • కథలూ కాకరకాయలు
  • మాస్టర్ పీచు
  • రసన
  • మార్పు (చైనా కథల అనువాదం)
  • నిజాలు (మార్క్సిస్టు సిద్ధాంతవేత్తల గురించి)
  • రాజులబూజు (అనువాద కథల సంపుటి)
  • ఆరడుగులనేల (అనువాద కథల సంపుటి)
  • రక్తాక్షరాలు (జూలియస్ పుజిక్ రచన అనువాదం)
  • ఇలా మిగిలాం
  • శత్రువు (కథల సంపుటి)
  • జాగ్తేరహో (ఎంపిక చేసిన 'కబుర్లు')

కబుర్లు[మార్చు]

ఈనాడు పత్రికలో చలసాని ప్రసాదరావు కబుర్లు అనే శీర్షికని వెయ్యివారాలకు పైగా నిర్వహించాడు. ఆ శీర్షిక జిగి, బిగి తగ్గకుండా చూశాడు. ఈ శీర్షిక గురించి ఆయన మాటల్లోనే ”కబుర్లు రచయితగా నా లక్ష్యం పాఠకుల్ని కాసేపు నవ్వించే హస్యగాడుగా ఉండిపోవడం కాదు. ఒక అంశం గురించి నేను ఫీలయినదాన్ని నా పాఠకులు కూడా ఫీలయ్యేలా నా రచన కొనసాగాలనేది నా లక్ష్యం. అందుకే కబుర్లలో హాస్యం పాలుకంటేవ్యంగ్యం పాలు ఎక్కువ.” నిజానికి కబుర్లు శీర్షికని వసుధ అనే మాసపత్రికలో 1971లో ప్రారంభించాడు. ఆ తర్వాత జ్యోతి అనే మరో మాసపత్రికలో కొనసాగింది. చివరికి 1982 అక్టోబరు 22న ఈనాడు దినపత్రికలో వాటికి శాశ్వత చిరునామా కల్పించాడు. నిరాఘాటంగా తన జీవితాంతం ఈనాడులోనే కబుర్లాడాడు.

పురస్కారాలు[మార్చు]

  • 2000: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[4]

మూలాలు[మార్చు]

  1. చీకోలు, సుందరయ్య (2003-06-12). "ఓ ఏడాది తర్వాత చలసాని ప్రసాదరావు "కబుర్లు"". ఈనాడు. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 30 January 2015.
  2. చలసాని ప్రసాదరావు
  3. కథానిలయంలో ప్రసాదరావు
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.

ఇతర లింకులు[మార్చు]