జగదేకవీరుని కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగదేకవీరుని కథ
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి. రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
బి. సరోజాదేవి,
రాజనాల,
రేలంగి,[1]
గిరిజ,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్.
భాష తెలుగు

తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నములో, ఒక యువరాజు చేసిన సాహసకార్యముల గాధే జగదేకవీరుని కథ (Jagadeka Veeruni Katha). ఈ చిత్రము లోని పాటలు ఎంతో ప్రాచుర్యము పొందాయి.

కథాగమనం[మార్చు]

ఒక రాజ్యాన్ని పాలించే రాజుకు గల ఇరువురు కుమారులలో పెద్దవాడైన ఎన్.టి.రామారావు ఒక రాజును బాధింఛు రాచకురుపు నివారణార్ధం కావలసిన ఔషదము తీసుకొని వచ్చు ప్రయత్నమున ఒక నాగకన్యకను, మరొక యక్షకన్యకను, వేరొక రాజకన్యకను పరిణయమాడి వారి సహాయముతో దివ్యఔషదమును తెచ్చి తనరాజ్యము అన్యాక్రాంతమయినదని తెలుసుకొని తిరిగి దానిని సాధించి రాజుగా పరిపాలనము కొనసాగిస్తాడు. ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రతాప్. చిన్నవాడు జగజ్జిత్తు. ప్రతాప్‌కున్న ఒకే కల. చలువరాతి మేడలో తూగుటుయ్యాలపై దేవకన్యలు ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నితనయ తన చుట్టు చేరి సేవలు చేస్తుండగా జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కోరిక. అది తెలుసుకున్న తండ్రి కోపంతో దేశబహిష్కారం చేస్తాడు. అలా బయటకు వెళ్లిన ప్రతాప్ దేవకన్యలకోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెడుతుండగా కలిసిన దయ్యాల సాయంతో దేవకన్యలు జలకాలాడే చోటుకి వెళ్లి పొరపాటున శిలగా మారతాడు. కాని అతని తల్లి ప్రార్ధనలతో సంతోషించిన పార్వతీదేవి అతనికి మానవ రూపం రప్పిస్తుంది. ఇంద్రపుత్రిక జయంతి ఒకరోజు ఏమరుపాటుగా చేసిన తప్పుకు కోపించిన ముని శాపం ఇస్తాడు. దాని ప్రకారం ఆమె వస్త్రాలను దోచుకు పోయినవాడితో ఆమె పెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది కాలానికి , తన వలువలు దోచిన ప్రతాప్‌ని జయంతి వరిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కామకూట రాజ్యానికి వెడతారు. కామాంధుడైన ఆ దేశపు రాజు జయంతి అందాన్ని చూసి వివశుడై వారిద్దరిని విడదీయాలని ప్రయత్నించి తనే పతనమవుతాడు. ఆ రాజు చేసిన కుతంత్రంలో భాగంగా ముల్లోకాలకు వెళ్లిన ప్రతాప్ ఇంద్రకుమారి జయంతి స్నేహితురాళ్లని కూడా పెళ్ళి చేసిని భూలోకానికి తిరిగొస్తాడు. అందరితో కలిసి సంతోషంగా ఉండగా. ఒకరోజు ప్రతాప్ లేని సమయంలో జయంతి అత్తగారిని మభ్యపెట్టి ప్రతాప్ దాచిన తన చీరెను తీసుకుంటుంది. అది లభించడంతో ఆమె శాపవిమోచనమవుతుంది. తన స్నేహితురాళ్లతో కలిసి స్వర్గానికి వెళ్లిపోతుంది. కాని ఆ దేవకన్యలందరూ తమ భర్తపై ప్రేమని చంపుకోలేకపోతారు. చివరగా దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గి ప్రతాప్ తన భార్యలను తీసుకుని భూలోకానికి వచ్చేసి సుఖంగా రాజ్యపాలన చేస్తాడు.

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఆశా, ఏకాశా, నీనీడను మేడలు కట్టేశా చింతలూ, రెండు చింతలూ నా చెంతకాదు నీ తంతులు పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, స్వర్ణలత
ఐనదేమో ఐనది, ప్రియగానమేదే ప్రేయసీ ప్రేమగానము సాగగానే, భూమి స్వర్గమె ఐనది పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
రారా కనరారా కరుణ మాలినారా ప్రియతమ లారా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔను చెలీ అయితే వినవే మామాట పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, బృందం
శివశంకరీ... శివానందలహరీ చంద్రకళాధరి ఈశ్వరీ పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
ఓ సఖీ ఒహో చెలి ఒహో మదీయ మోహినీ ఘంటసాల
జయజయజయ జగదేక ప్రతాపా జగదానందకళా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, బృందం
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా సేవాలంది మాకు వరము లీయవమ్మా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, పి.లీల
కొప్పునిండా పూవులేమే కోడలా కోడలా నీకెవరు ముడిచినారే ? ? మాధవపెద్ది,స్వర్ణలత
జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలా ? ? పి.లీల, పి.సుశీల బృందం
నను దయగనవా నా మొర వినవా మది నమ్మితి నిన్నే మాతా ? ? పి.లీల
ప్రాణసమానలై వరలు భార్యలు నల్గురే నాకు (పద్యం) ? ? ఘంటసాల
మనోహరముగా మధురమధురముగా మనసులు కలిసెనులే ? ? ఘంటసాల,పి.సుశీల
సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు తనయ (పద్యం) ? ? ఘంటసాల

పాట వెనుక కథ[మార్చు]

శివశంకరీ...శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. పాట రచయత పింగళి నాగేంద్రరావు, స్వరకర్త పెండ్యాల, గాత్రం అందించిన ఘంటసాల, దర్శకుడు కె.వి.రెడ్డిల సమష్టి కృషి ఫలితమే శివశంకరీ పాట. ఇందరు ప్రతిభావంతులు ఈ పాటకు చిత్రిక పడితే నటరత్న నందమూరి తారకరామారావు వెండితెరపై తన నటనతో జీవంపోశాడు. దర్శకుడు కె.వి.రెడ్డి అప్పటికే సినిమాలో అన్ని పాటల రికార్డింగ్‌, చిత్రీకరణ‌ పూర్తి చేశాడు. కథకు కీలకమైన సన్నివేశానికి సంబధించిన పాట మాత్రమే మిగిలి ఉంది. కథానాయకుడు తన గానంతో గండశిలను కరిగించే సన్నివేశంలో వచ్చే పాట అది. సన్నివేశాన్ని సంగీత దర్శకుడు పెండ్యాలకు కె.వి.రెడ్డి వివరిస్తూ ‘మనం ఇప్పుడు చేయాల్సిన పాట సినిమాకు గుండెకాయ లాంటిది. సంగీతంలో తాన్‌సేన్‌, ఓంకారనాథ్‌ ఠాగూర్‌ వంటి ఎందరో ప్రయోగాలు చేశారు. అంతెందుకు. నారద, తుంబురుల మధ్య వివాదం వచ్చినప్పుడు హనుమంతుడు పాడితే శిలలు కరిగాయట. అంతటి ఎఫెక్ట్‌ మన పాటకు తీసుకురావాలి. "జగదల ప్రతాప్‌" సినిమా మన కథకు ప్రేరణ. ఒకసారి ఆ సినిమా చూసి రండి’ అన్నారు. పెండ్యాల చిన్నగా నవ్వి ‘ట్యూన్‌ మనం సొంతంగానే చేద్దాం’ అన్నారు. పింగళి వారు వెంటనే కలం పట్టి ‘శివశంకరీ శివానందలహరి’ అని రాసిచ్చారు. దానికి పెండ్యాల కూర్చిన దర్బార్‌ రాగం చివరకు ఓకే అయింది. మరుసటి రోజు పెండ్యాల పూర్తి పాట రాసిచ్చాడు. పెండ్యాల వారు పాడి వినిపించారు. పాట పూర్తయ్యే సరికి సరిగ్గా 13 నిమిషాలు పట్టింది. ఆరున్నర నిమిషాలకు పాట కుదించమని దర్శకుడు సూచించడంతో పెండ్యాల ఆ పాటను ఆరున్నర నిమిషాలకు కుదించి ఘంటసాల వెంకటేశ్వరరావుకు వినిపించాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ పాట నేను తప్పనిసరిగా పాడతాను. ఎన్ని రిహార్సల్స్‌ అయినా సరే అంటూ 15 రోజుల పాటు ఘంటసాల రిహార్సల్స్‌కు హాజరయ్యారు. అనంతరం పాట రికార్డింగ్‌ కూడా పూర్తయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాటకు అనుగుణంగా ఎన్టీఆర్‌ చక్కటి హావభావాలు ప్రదర్శించవలసి ఉండడంతో ఆయన కూడా నాలుగు రోజుల పాటు రిహార్సల్స్‌ చేసాడు. పాట చిత్రీకరణ సెట్స్‌ మీదకు వచ్చింది. ఎన్టీఆర్‌ పాటకు అనుగుణంగా చక్కని పెదాల కదలికతో యూనిట్‌ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. వెండితెరపై ఆ పాటకు, ఎన్టీఆర్‌ అభినయ కౌశలానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 1961లో విడుదలైంది. ఈ పాట తెలుగు ప్రేక్షకులమీద చూపిన ప్రభావానికి ఒక ఉదాహరణ. డెబ్భయ్యవ దశకంలో రేపు (సి.నరసింహారావు) అనే పేరుతో ఒక మనోవైజ్ఞానిక పత్రిక వచ్చేది. అందులో ఒక పాఠకుడు శివశంకరీ పాట వింటుంటే కలిగే అనుభూతులు వివరించాడు. అతనికి నిజంగానే దేవకన్యలు ఉన్నట్టు,సినీమా,సంగీతంతో సహా జరుగుతున్నట్టు, తను ఎన్నికష్టాలు పడైనా వారిని కలవాలని అనుభూతి చెందేవాడట.

వనరులు[మార్చు]

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.