జట్టిజాం పాటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానపద కళా రూపం - ప్రతీకాత్మక చిత్రం

జట్టిజాం పాటలనే కొన్నిప్రాంతాల్లో జక్కీక పాటలంటారు. వెన్నెలరాత్రుల్లో స్త్రీలు మండలాకారంలో నిలబడి ఉభయపార్శ్వాలలో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడివైపుకు, ఇంకొకసారి ఎడమవైపుకు తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తమ అరచేతులతో తట్టుతూ గుండ్రంగా అడుగులు వేసి తిరుగుతూ పాడుతూ ఆడే ఆటే "జట్టిజాము/జక్కీక". జానపద స్త్రీలు వెన్నెలరాత్రుల్లో ఆడే ఆట కాబట్టి జట్టిజాముగా మారిందని "జానపదబ్రహ్మ" మునెయ్య భావించాడు. (జట్టి అనే మాట యక్ష శబ్దభవమైన జక్కిణి రూపాంతరం కావచ్చు). ఈ క్రీడకు ఎలాంటి వాయిద్యాలుండవు. చేతి చరుపులు, కరకంకణ నిక్వాణాలే వారి పాటలకు వాయిద్యాలు. పెన్నుద్దికత్తె పాట పాడగా మిగతా ఉద్దులు ఆ పాట అందుకుని పాడతారు. యుగళగీతాలు ఉద్దులు ఉద్దులుగా పాడుకుంటారు. జట్టిజాంలో భక్తిరసప్రధానమైన గేయాలే కాక హాస్య, శృంగార, పురాణ వీరరస గేయాలు కూడా చోటు చేసుకున్నాయి.

"జట్టిజాం" అనే పదం గురించి ఆచార్య తూమాటి దోణప్ప ఇలా వివరించాడు: "సంస్కృతంలో చేతికోల అనే అర్థమిచ్చే యష్టి శబ్దం ప్రాకృతంలో జట్టిగా మారింది. అట్లే ప్రహారమనే అర్థం గల యమ శబ్దం ప్రాకృతంలో జామ అయింది. రెంటిని జోడింపగా జట్టిజామ, దాన్నుంచి తెలుగులో జట్టిజాం - మొదట కోలాటంలో వలె చేతికోలలతో ఆడే ఆట కాలక్రమంలో ఉత్తచేతులతో ఆడడం మిగిలిందేమో? వెన్నెలవెలుగులో మండలాకారంలో నిలబడి ఇరువైపులా ఉండే ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడివైపుకు, ఇంకొకసారి ఎడమవైపుకు పార్శ్వం నాలుగు భంగిమల్లో ఓరగా తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తన అరచేతులతో తట్టుతూ పాటలు పాడుట ఇది."

వైఎస్ఆర్ జిల్లా ప్రాంతాల్లో వలయాకారంగా అడుగులు వేసి తిరుగుతూ తరుణులు జట్టిజాము వేయడం కూడా వాడుకలో ఉంది.

రాయలసీమ కళారూపం జట్టి జాము[మార్చు]

ధనుర్మాసపు నెల రోజుల్లో సంక్రాంతి పండుగల్లో ప్రతి ఇంటి ముందూ రంగు రంగుల రంగవల్లులను అలంకరించి ఆ ముగ్గుల మధ్య పసుపూ కుంకుమా పూలతో అలంకరించి వాటిపై పేడ ముద్దలతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పండుగ సమయాల్లో పది మంది యువతులు చేరి, గొబ్బియ్యల్లో, గొబ్బియ్యలో అంటూ................. గుండ్రంగా తిరుగుతూ, పాట పాడుతూ చప్పట్లు చరుస్తూ ఒంగుతూ లేస్తూ నృత్యం చేస్తారు. ఇది సహజంగా సర్కారు ప్రాంతంలో వున్న పద్ధతి.

ఇలాంటిదే గుజరాత్ లోనూ, మహారాష్ట్ర లోనూ, గర్భా నృత్యం అనేది ఉంది. అదే గొబ్బి నృత్యం కావచ్చనీ లాలీగర్భా అనే ప్రభేదమే జట్టి జామును పోలే నృత్యమనీ, జట్టి జామును గురించి, ఆచార్య తూమాటి దోణప్ప గారు వారి జానపద కళా సంపద 190 పేజీలో వుదహరించారు.

జట్టి జాము అంటే?[మార్చు]

పై ఉదాహరణలకు సంబంధించే ఈ జట్టి జామంటే అది తాళ ప్రధాన కళ అనీ, గొబ్బిలో లాగా ఈ కళారూపంలో గుండ్రంగా చుట్టి రావటం వుండదనీ కోలాటంలో మాదిరి చేతిలో కోలలు గానీ, చెమ్మ చెక్కలో మాదిరి గెంతడం గాని వుండదనీ, కాలుకదప కుండానే వున్న వాళ్ళు వున్న చోటే వుండి జాట్టి జాము చేయ వచ్చంటారు దోణప్ప గారు. జట్టి జాములో చేతులు చరచటం, అంటే చప్పట్లు లాంటివి వుంటాయి. నిటారుగా నిలబడి ఉభయ పార్శ్వల్లో ఉద్ది కత్తెలతో ఒద్దికలు చెడకుండ ఒక సారి కుడి ప్రక్కకూ, ఆ వెంటనే ఎడమ ప్రక్కకు పార్శ్వముఖ భంగిమలో ఓరగా తిరిగి ఆయా వేపుల వుండేవారి అరచేతుల్ని తన చేతులతో తట్టుతూ పాడుతూ ప్రదర్శించేది జట్టి జాము.

స్త్రీల కళారూపం[మార్చు]

ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన ఆట. ప్రప్రథమంలో చేతి కోలన్ని ఉపయోగించి నట్లు ఊహించ వచ్చు. సంస్కృతంలో చేతి కోలలని అర్థమిచ్చే యష్టి ప్రాకృతంలో జామ అంటారనీ అందుకు ఉదాహరణగా, జట్టి జాము పాటల్లో వెన్నెలాయలో ................. వెన్నిదాయలో వెన్నిటీ అనే పాదాలుంటా యనీ ఆర్వియస్ సుందరంగారు జానపద విజ్ఞానంలో వివరించారు.

జట్టి జామును, చైత్ర వైశాఖ కార్తీక మార్గ శిరాలు ఈ పాటలకు ఋతువులు జట్టి జాములో నలుగురు గాని, అంతకు ఎక్కువైతే సరిసంఖ్యలలో గాని పాల్గొంటారు. వీరు రెండు జట్లుగా వుంటారు. ఒక జట్టు వారు పాటలో ఒక పదాన్ని పాడితే, రెండవ జట్టు వారు వంత పాడుతూ వుంటారు. తెమ్మెదా , నడియలో వెన్నిటీ, రామ రామా', కోదండ రామా వంటి పల్లవులు జట్టి జాములో కనిపిస్తాయి. జట్టి జామనే పేరుగల ఈ కళారూపం ఈ పేరున ఆంధ్ర దేశంలో మరెక్కడా కనిపించదు.

అద్దమ్మ రాతిరేళ నిద్రా పొద్దమ్మా||
పాపిష్టి సెందురుడు పట్టపగలయ్యె ||
        || శ్రీరామా రామ శరణయ్య||
దురుదేవి సిక్కలు గక్కన్న మునిగె||
దిగా బగ్గన్న లేచి దియ్య ముట్టించె||
అది దొంతి ఇది దొంతి నడి మీద దొంతి
నడి దొంతి రాజనమే సేటాకు బోసే
సేటాతో రాజనాల్ రోటికి బోసే
చేడెలిద్దరు గూడి చెరిగి దంచంగ
పణతు లిద్దరు గూడి పాడి దంచంగ
కాంతారో నీ కండ్ల కాటికెక్కడిదీ
సెక్కులకు గంధమ్ము ఎక్కడిదే చేడి
కొమ్మరో కొప్పూన పూలెక్కడివె
మాపటికి మీ మరిది వచ్చిండే నక్కా
రాతిరికి మీ మరిది వచ్చిండె నక్కా
సుళ్ళయితే నామాట సూసి రావమ్మ
పట్టె మంచం మీడ పండినాడమ్మ.

అని వివరించింది. అలాగే మరో ఉదాహరణ: అనంత పురం జిల్లాలో వెన్నా నదీ తీరంలో వున్న జారుట్ల సుప్రద్ధ శైవ క్షేత్రం. దీనికి దక్షిణ కాశీ అనే పూరు కూడ వుంది. జారుట్ల రామ లింగేశ్వరుడు క్రింది పాటలో నాయకుడు నాయిక ఎవరో అజ్ఞాత యువతి.

మారుట్ల పొలమూలోన
జారుట్ల రాముడూ, జారుట్ల రాముడూ
పట్టె మంచం పానుపు మింద పూజలు గొన్నాడే
మిట్ట మధ్యాన్న వేళ
నట్టింట నాది కొంగు, నట్టింట నాది కొంగు
పట్టవద్దుర నాది కొంగూ పాదెం బట్టేనూ
పడమట నాది ఇల్లు

నలుగురూ చేరి నవ్వుకుంటారు:

రాయలసీమ పల్లెల్లో ఈ జట్టి జాము వేయాలని నిర్ణయించు కున్న రోజున అమ్మ లక్కలు వెంట వెంటనే వంటలను ముగించుకుని, ఇంటిలో అందరికీ ఆన్నం పెట్టి, పిల్లల్ని నిద్ర పుచ్చి నలుగురూ ఒకే చోట చేరుతారు. అందరికీ అనుకూలంగా వుండే వారింటి ముందు ఇలా స్త్రీలందరు చేరితే అదొక అలంకారం. ఇంటి పనుల్లో సతమతమై పోయి, ఆ కాసేపూ వాటన్నిటినీ మరిచి పోయి, సంసారంలో వున్న చిక్కుల్నీ, చిరాకుల్నీ పార ద్రోలి అందరూ హాయిగా గడుపుతారు.

చైత్ర వైశాఖ మాసాల్లోనూ, కార్తీక మార్గ శిర మాసాల్లోనూ, ఈ పాటలు పాడు కోవటానికి అనువైన ఋతువులు, పొద్దు కూకిన తరువాత నాలుగైదు ఘడియలవేళ నుంచి, సరిపొద్దు మీరే దాకా జట్టి జాము లేస్తారు. చిన్నతనం నుంచీ అమ్మమ్మల ద్వారా, అమ్మల ద్వారా విన్న పాటలు అందరికీ కంఠోపాఠమై లయబద్ధంగా సాగి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ అటలో పాల్గొనేవారు నలుగురు గానీ, అంతకు మించి సరి సంఖ్యలో గాని వుంటారు. సరిసంఖ్యలో నున్న వారొక జట్టైతే, బేసి సఖ్యలో వున్నవారందరూ ఒక జట్టు. ఇరు జట్టుల వారూ కలిసి గుండ్రంగా నిలబడతారు. మిగిలిన వారంతాతా ప్రేక్షకులుగా నిలబడతారు. ఒక జట్టువారు ఒక పాదాన్ని పాడితే రెండవ జట్టువారు వంత పాడతారు. ప్రతి సారీ పూర్వ పాదాన్ని తిప్పి తిప్పి పాడుతారు. అన్నీ పాదాల్నీ అలాగే పాడి, పాదంతంలో చివర తుమ్మెదా, నడియలో, వెన్నిదాయలో, విన్నెలాయలో, రామా కోదండరామా, రామాంజనా స్వామీ శ్రీ రామా నారాయణా అని కంఠాలు కలుపుతారు.

ప్రేమ కలాపాలు[మార్చు]

ఈ పాటల్లో, కథలూ, గాథలూ, ప్రేయసీ ప్రియుల ప్రేమ కలాపాలు మొదలైన సాంఘిక గాథలూ, పురాణిక చారిత్రిక గాథలూ వుంటాయి. అందుకు అనుకూలంగా దోణప్పగారు ఎన్నో గాథల్ని పాటల రూపంలో చెప్పారు. ఉదాహరణకు ఈ చిన్న సన్నివేశం వినండి.

ఎక్కడికో దూర దేశానికి పోయిన తన భర్త తలవని తలంపుగా తిరిగి వచ్చిన సంగతి తెలుసుకుని ఆ మధురాను భూతిలో ప్రొద్దు తెలియలేదు. ఆమె తోడి కోడలు ఆమె కంటే ముందే మేలుకుని, రాజనాలు వండుతూ వుండి. తల ఎత్తి చూసే ససరికి తోడికోడలు వరుసకు చెల్లెలు కన్నులకు కాటుకా, కొప్పున పూలూ, చెక్కిళ్ళకు గంధమూ చూసిన అక్కకి ఆశ్చ్యర్యమేసింది.

భర్త ఊరిలో లేని సమయంలో ఇల్లాలు అలంకారాలు ఏమీ లేక, ఆర్థ పస్తులతో వెళ్ళబుచ్చ వససిన సతికీ ఈ సింగారింపేమిటి? ఆన్నట్లు చూసిన పెద్ద కోడలికి మఱది వచ్చిన వార్త ఈ విధంగా తెలిసింది.

పక్కన్న నీళ్ళు బారు, పక్కన్న నీళ్ళు బారు
కంచుదే బోర తల్పులు కదల వోరన్నా
నీ ఇంటి నా యింటి నడుమా
నిమ్మ కొమ్మనీడ నుండు
సరసమైన జాజీ తోటా సంపంగి వనమే
వచ్చేకి మనసుంటే
నిమ్మ కొమ్మ నీడ నుంటా
మాటు మణిగినంక రావో
జారుట్ల రామా

ఇలా సాగుతుంది జట్టి జాము పాట.,

మరో పిల్ల కథ[మార్చు]

ఈ పిల్ల యెవరో బట్ల భయకారి హంస వింశరి, శుక సప్తతి కథలో లోని జగ ఱాగలకు జాణతనము నేర్ప గలిగిన సీతాకోక చిలుక, తేలు కుంట్టిందని ఊరూ వాడ పిలిచింది. సరసుని దగ్గరు చేరుకోవటానికి అదొక సాకు. ఈ పాట నెక్కువగా యవ్వనంతో వున్న బాలికలు పాడే పాట.

రెడ్డోల్ల కుచ్చెండ్లే తుమ్మెడా తేలైన కుట్టింది తుమ్మెదా...
యా యేల్కి కుట్టింది తుమ్మెదా నడి మేల్కి కుట్టింది తుమ్మెదా..
మా యంకి చెప్పండి తుమ్మెదా మందైన బంపమని తుమ్మెదా
మాయమ్మ దెచ్చింది తుమ్మెదా మరి మంటలాయె తుమ్మెదా
మాయమ్మ దెచ్చిన మందు తుమ్మెదా.. మరి మంటలాయె తుమ్మెదా..
మామ దెచ్చిన మందు తుమ్మెదా మరి మంటలాయె తుమ్మెదా..
మావాళ్కి జెప్పండి తుమ్మెదా, మందైన బంపమని తుమ్మెదా
మగడు దెచ్చిన మందు తుమ్మెదా మరి మంటలాయె తుమ్మెదా
ఎదురింటి చిన్నోణ్ణి తుమ్మెదా ఇంటికి బిలవండి తుమ్మెదా
మందు మంత్ర మేసె తుమ్మెదా మది సల్లనాయె తుమ్మెదా.

ఈ విధంగా రాయల సీమలో అనేక రకాల జట్టి జాము పాటలున్నాయి. ముఖ్యంగా సంసార కుటుంబాల్లో స్త్రీలు పోషించే కళా రూప మిది.

దాంపత్య ప్రణయం మీద పాట[మార్చు]

దాంపత్యప్రణయం మీద సాగే ఒక జట్టిజాం పాట: (బృందగేయం), ఖరహరప్రియ స్వరాలు - ఆదితాళం


అతడు: తుమ్మేదలున్నాయేమిరా - దాని కురులు

కుంచెరగులపైన - సామంచాలాడేవేమిరా

ఆమె: ఏటికిపోరా - శాపల్ తేరా

బాయికి పోరా - నీల్లూ తేరా
బండకేసి తోమర మగడా
సట్టీ కేసి వండర మగడా
శాపల్ నాకూ - శారూ నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా... అహ
శాపల్ నాకూ - శారూ నీకూ రా

అతడు: అహ తుమ్మేద... ఆమె: కూలికిపోరా - కుంచెడు తేరా

నాలికి పోరా - నల్దుం** తేరా
వత్తా పోతా - కట్టెల్ తేరా
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
కట్టం నీకు కమ్మల్ నాకూ రా

అతడు: తుమ్మేద... ఆమె: రోలూ తేరా - రోకలి తేరా

రోటి కాడికి నన్నెత్తుకపోరా
కులికి కులికిదంచర మగడా
శాటలకేసి సెరగర మగడా
శాటలకేసి సెరగర మగడా
బియ్యం నాకు - తవుడు నీకూ రా...

ఆమె: రెడ్డీయేమో దున్నను పాయ

రెడ్డీసాని ఇత్తను పాయ
కుందేల్ పిల్లా
నగతా నగతా సంగటి తెచ్చె
సంగటి నాకు - సూపుల్ నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
సంగటి నాకు - సూపుల్ నీకూ రా

అతడు: తుమ్మేద...

మూలాలు[మార్చు]

బయటి వనరులు[మార్చు]

రాయలసీమ రాగాలు - కె.మునెయ్య (ప్రచురణ: తెలుగు అకాడమీ)