జనాభా

వికీపీడియా నుండి

వివిధ దేశాల జనాభాను సూచించే చిత్రపటం
భారత దేశ జనాభా 1960లో 44.3కోట్లు ఉండగా 2000నాటికి 100కోట్లు దాటింది.
భూమి మీద ఒక మతోత్సవానికి జమకూడిన అతిపెద్ద జన సమూహం. [2][3] [4] 2001 లో ప్రయాగలో జరిగిన కుంభమేళాకు షుమారు 7కోట్ల మంది జనులు వచ్చారు.


సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభా (population) అన్న పదాన్ని ఒక జాతికి (species) చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్ధంలో జనాభా అన్న పదం వాడబడింది.


నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా. ఈ జనాభాను గురించి చేసే అధ్యయనాన్ని వైయక్తిక ఆవరణ శాస్త్రం (Atecology) లేదా జనాభా జీవావరణ శాస్త్రం (Population Biology) అంటారు. జనాభా నిరంతరం పరిమాణంలో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. దీనిని గురించి తెలిపేది జీవ గతిజ శీలం (Population Dynamics)


జనాభాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు, వలసలు, కుటుంబ జీవనవిధానాలు, వివాహాలు, విడాకులు, సామాజిక వైద్య సదుపాయాలు, పని అవకాశాలు, కుటుంబనియంత్రణ, యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాలో ప్రజల నడవడికను వివిధ దృక్కోణాలనుండి సామాజిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటివి అధ్యయనం చేస్తాయి.


విషయ సూచిక

[మార్చు] జనాభా గురించి కొన్ని సాంకేతిక విషయాలు

జనాభాకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవి జనన, మరణ రేట్లు, వ్యాప్తి, సాంద్రత, వయోవ్యాప్తి, జనాభా నియంత్రణ[1]

  • జనన, మరణ రేటు - ఒక నిర్ణీత కాల వ్యవధిలో జనాభాలో వచ్చే జననాల సంఖ్యను జనన రేటు అంటారు. ఇందులో సమగ్ర జనన రేటు, విశిష్ట జనన రేటు, శక్త్యర్ధ జనన రేటు, జీవావరణ జనన రేటు అనే వివిధ లెక్కింపు విధానాలున్నాయి. అలాగే మరణాల రేటులో సమగ్ర, విశిష్ట, శక్త్యర్ధ, జీవావరణ మరణ రేట్లు ఉంటాయి. మరణాల రేటుకంటే జననాల రేటు ఎక్కువ ఉన్నపుడే ఆ జనాభా పరిమాణం పెరుగుతుంది.
  • వలసలు - జనాభాలోని జీన్ పూల్‌ను ప్రభావితం చేసే విషయాలలో వలసలు (రావడం, పోవడం) అనేవి ముఖ్యమైన అంశాలు. వీటి ఫలితంగా జనాభా పరిమాణంలో వృద్ధి లేదా క్షీణత సంభవిస్తాయి.
  • జన సాంద్రత - ఒక ఆవాసంలో నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘన సాంద్రతలో నివశించే జీవుల సంఖ్యను జన సాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని, నీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొంటారు.
  • జీవ సామర్ధ్యం (బయోటిక్ పొటెన్షియల్) - అనుకూలమైన పరిస్థితులలో నివశించే జనాభా జీవ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం - ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవీ చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవ సామర్ధ్యం అంటారు.
  • వయో వ్యాప్తి - జనాభా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాలో మూడు గ్రూపులు ఉంటాయనవచ్చును (1) ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం (పిల్లలు) (2) ప్రత్యుత్పత్తి వయో సమూహం (పెద్దలు) (3) ప్రత్యుత్పత్తి పర వయో సమూహం (వృద్ధులు) - ఈ మూడు సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
  • భార శక్తి - ఒక ఆవాసం భరించగల గరిష్ట స్థాయి జనాభాను ఆ ప్రదేశం యొక్క భార శక్తి అంటాఱు.

[మార్చు] ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభా ఒకో బిలియన్ (100కోట్లు) మంది పెరగడానికి పట్టిన సమయం చూపే గ్రాఫ్.

ఫిబ్రవరి 25 2006నాటికి [2] ప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు (6,500,000,000 లేదా 650 కోట్లు) చేరుకుంది. 2012నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా.[ఆధారం కోరబడినది]. ఐక్యరాజ సమితి జనాభా నిధి వారు అక్టోబరు 12 1999 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు (600 కోట్లు) అయ్యిందని ప్రకటించారు. 1987లో 5 బిలియన్లు అయిన జనాభా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు అయ్యింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులు ఉన్నాయి.


2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లు (900 కోట్లు) అవుతుందని ఐ.రా.స. జనాభా విభాగం వారి అంచనా[3]. గడచిన 50 సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తి పెరిగినందువలనా ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది[4] [5].

[మార్చు] జనాభా తరుగుదల

ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్దయెత్తున జరిగే వలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలన జనాభా తరగవచ్చును. పాతకాలంలో (ప్లేగు, కలరా వంటి) వ్యాధులవలన ఒకో ప్రాంతంలో జనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలసల వెళ్ళడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది. అయితే 'అధిక జనాభా' లేదా 'అల్ప జనాభా' అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు ఎందరు జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక క్రొత్త జీవనోపాధి కలిగించడం జనాభా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం.

[మార్చు] జనాభా నియంత్రణ

భారత దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం.

జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటారు. పురాతన గ్రీస్ దేశంలో తమ అధిక జనాభా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో భారత దేశంలో కుటుంబ నియంత్రణ విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని అధికారికంగా అమలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించే కారకాళను రెండు విధాలుగా విభజింపవచ్చును - (1) సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదా హరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభా, జీవుల ప్రవర్తన వంటివి (2) సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి. ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉన్నది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన ఆన్స్‌లీ కోలే విశ్లేషణ ప్రకారం జనాభా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'చాన్స్' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం.(3) నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన.[6]. కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్ధిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.[7]

వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది.[8] [9] ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.

[మార్చు] ముదురు పెళ్లే ముద్దు జనాభా నియంత్రణకు అదే మార్గం

జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయమని అంతర్జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా గులాంనబీ అజాద్ అభిప్రాయపడ్డారు.30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.అధిక జనాభాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయని.. అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయని చెప్పారు. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొందని భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయని నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ అని మంత్రి ఆజాద్‌పేర్కొన్నారు.ఈనాడు 12.7.2009.

[మార్చు] భారత దేశం జనాభా

భారతదేశంలో వివిధ జిల్లాలలో జనాభాను సూచించే చిత్రపటం.

భారత దేశము, చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై (వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్కతా (వెనుకటి కలకత్తా), మరియు చెన్నై (వెనుకటి మద్రాసు ).


భారత దేశం యొక్క ఆక్షరాస్యత 64.8%, ఇందులో మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు. దేశంలోని 80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభా ఇక్కడ ఉన్నారు. (13.4%). ఇతర మతాలు: క్రైస్తవులు (2.33%), సిక్కులు (1.84%), బౌద్ధులు (0.76%), జైనులు (0.40%), యూదులు, పార్సీలు, అహ్మదీయులు, మరియు బహాయీలు. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు.


జనాభా ప్రకారం భారత దేశములో 10 పెద్ద నగరాలు

ముంబాయి, ఢిల్లీ, కోల్కతా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, అహమ్మదాబాదు, పూణే, కాన్పూర్, సూరత్

[మార్చు] ఆంధ్ర ప్రదేశ్ జనాభా

భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం (దేశం విస్తీర్ణంలో 8.37 శాతం). జనాభా పరంగా ఐదవ స్థానంలో ఉంది. మార్చి 1, 2009 నాటికి రాష్ట్ర జనాభా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా 21.53% పెరిగింది. అంటే ధేశం జనాభా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19% మరియు షెడ్యూల్డ్ జాతులవారు 6.59%. భారత దేశం అక్షరాస్యత 64.84% తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది.[10]



[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. ఈనాడు ప్రతిభ ప్లస్ శీర్షిక - 20 ఫిబ్రవరి 2009 - ఎం.బి.తిలక్ వ్యాసం
  2. papers published by the United States Census Bureau
  3. మూస:Cite press release
  4. BBC NEWS | The end of India's green revolution?
  5. Food First/Institute for Food and Development Policy
  6. Ansley J. Coale, "The Demographic Transition," Proceedings of the International Population Conference, Liège, 1973, Volume 1, pp. 53-72.
  7. For illustrations of the distinction between fertility control and fertility levels, see Barbara A. Anderson and Brian D. Silver, "A Simple Measure of Fertility Control," Demography 29, No. 3 (1992): 343-356, and B. A. Anderson and B. D. Silver, "Ethnic Differences in Fertility and Sex Ratios at Birth: Evidence from Xinjiang," Population Studies 49 (1995): 211-226. The fundamental work on models of fertility control was that by Coale and his colleagues. See, e.g., Ansley J. Coale and James T. Trussell, “Model Fertility Schedules: Variations in the Age Structure of Childbearing in Human Populations.” Population Index 40 (1974): 185 – 258.
  8. For a discussion of the range of "population policy" options available to governments, see Paul Demeny, "Population Policy: A Concise Summary," Population Council, Policy Research Division, Working Paper No. 173 (2003)[1].
  9. Charlotte Höhn, "Population policies in advanced societies: Pronatalist and migration strategies," European Journal of Population/Revue européenne de Démographie 3, Nos. 3-4 (July, 1988): 459-481.
  10. ఈనాడు ప్రతిభ ప్లస్ - 20 ఫిబ్రవరి 2009లో డాక్టర్ కె. నాగేశ్వరరావు వ్యాసం

[మార్చు] ఇతర వనరులు

  • ఈనాడు ప్రతిభ ప్లస్ శీర్షిక - 20 ఫిబ్రవరి 2009 - ఎం.బి.తిలక్ వ్యాసం


[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BE" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు