జయదేవుడు
జయదేవుడు సంస్కృత కవి, పండితుడు. అతడు వ్రాసిన రాధాకృష్ణుల ప్రణయకావ్యం, గీత గోవిందం హిందూమత భక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది.
విషయ సూచిక |
జీవితం [మార్చు]
జయదేవుడు ఒరిస్సా రాష్ట్రం, ఖుర్దా జిల్లాలోని ప్రాచి లోయలో ఉన్న కెందుళి లో ఒక ఉత్కళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కెందుళి సాసన్ ( ఇప్పుడిలా పిలువబడుతోది ) గ్రామం, పూరీకి సమీపంలో ఉంటుంది. జయదేవుడి తలిదండ్రులు, భోజదేవ మరియు వామదేవీ లు. జయదేవుడు జన్మించినప్పుడు ఒరిస్సా చోడగంగ దేవ ఏలుబడిలో ఉండేది. జయదేవుడు కుర్మపాటక లో తన సంస్కృత విద్యాభ్యాసం గావించాడు. తరువాత దేవదాసీ అయిన పద్మావతిని వివాహమాడాడు. ఆ కాలంలో ఆ ప్రాంతమంతా వైష్ణవ బ్రాహ్మణుల ప్రాబల్యంలో ఉండేది.
సాహిత్యం [మార్చు]
జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, దశకృతికృతే. కృష్ణుడు మూడు ముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, త్రిభంగి అతని వల్లే ప్రాశస్త్యము నొందింది. జయదేవుని రెండు అష్టపదులు సిక్కుల మతగ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ లో కనబడతాయి. దీనిని బట్టి, జయదేవుని రచనలు గురునానక్ మీద, అతడు పూరిని సందర్శించినప్పుడు, ఎంత ప్రభావం చూపాయో అర్థమౌతుంది.
గీత గోవిందం [మార్చు]
గీత గోవిందం జయదేవుని గొప్ప కావ్యం. అది 12 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయం 24 ప్రబంధాలుగా విభజింపబడింది. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిది ద్విపద లుంటాయి. వీటినే అష్టపదులు అంటారు. ఇది రాధాకృష్ణుల ప్రణయతత్వమే పరమార్థంగా భావించే, నింబార్కుడి వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి యున్నకావ్యం. సర్ విలియమ్ జోన్స్ 1792 లో, తొలిసారిగా గీత గోవిందాన్నీఆంగ్లంలోకి అనువదించాడు. తరువాత ఇది ఎన్నో ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయబడింది. గీత గోవిందం సంస్కృత కావ్యాలలోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది.
పీయూష లహరి [మార్చు]
పీయూష లహరి జయదేవుడు రచించిన ప్రముఖ సంస్కృత గోష్ఠీ రూపకము. దీనికి కథావస్తువు గీత గోవిందంలోని కథా వస్తువైన రాధ ప్రధాన నాయికగా శ్రీకృష్ణుడు రాసలీల నడపడము కథాంశము. అందువలన పీయూష లహరిని గీత గోవిందానికి భూమికగా శ్రీకార్ మహాశయుడు అభిప్రాయపడ్డాడు.
గోష్ఠిలో 9 లేక 10 మంది ప్రాకృత పురుషులు మరియు 5 లేక 6 గురు స్త్రీలు ఉంటారు. అంకం ఒకటే. గర్భ విమర్శ సంధులు ఉండవు. ఉదాత్త వచనం ఉండదు. వృత్తి కైశికి, కామ శృంగార ప్రధానం.
పీయూష లహరి పై మొదటగా భారతి పత్రికలో వావిలాల సోమయాజులు ఒక సుదీర్ఘ వ్యాసం రచించారు. తరువాత తెలుగు అనువాదాన్ని మరియు సంస్కృత మూలంతో సహా తెలుగు విశ్వవిద్యాలయం 1990 సంవత్సరంలో ముద్రించింది.
ఇవి కూడా [మార్చు]
వనరులు [మార్చు]
- 1. [3]బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియాలో జయదేవుడు
- 2. [4]గురునానక్ పూరి సందర్శన
- 3. పీయూష లహరి, శ్రీ జయదేవ కవి విరచిత సంస్కృత గోష్ఠీ రూపకానికి శ్రీ వావిలాల సోమయాజుల తెలుగు అనువాదం, మూల సహితంగా ముద్రితం, సంపాదకుడు: డా. వి.వి.యల్.నరసింహారావు, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1990.
బయటి లింకులు [మార్చు]
[5]ఒరిస్సా సంస్కృత పండితులు