జినవల్లభుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జినవల్లభుడు తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కట్టబెట్టిన తొలి కందపద్యాలు రాసిన కవి. వేములవాడ చాళుక్యులు సా.శ. 750 నుంచి సా.శ. 973 వరకు.. అంటే సుమారు రెండు శతాబ్దాల పాటు మొదట బోధన్‌ను, తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకొని ‘సపాదలక్ష’ రాజ్యాన్ని (నేటి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రాంతాన్ని) పరిపాలించారు. వీరు రాష్ట్రకూటుల సామంతులు. వీరిలో రాజనీతిజ్ఞుడు, విద్యావిశారదుడు, కవిపండిత పోషకుడిగా గుర్తింపు పొందిన రెండో అరికేసరి, సా.శ.930 నుంచి సా.శ.955 వరకు వేములవాడ రాజధానిగా పాలించాడు. ఈయన ఆస్థానంలోని పంప మహాకవి, కన్నడ కవిత్రయంలో ఒకడు. రెండో అరికేసరిని అర్జునుడితో పోలుస్తూ.. ఆయన రచించిన ‘విక్రమార్జున విజయం’.. ‘పంప మహాభారతం ’గా ప్రసిద్ధిగాంచింది. ఆ పంప మహాకవి తమ్ముడే జినవల్లభుడు . జైనమతాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన ఈ జినవల్లభుడే తెలంగాణ కవులను,ఆంధ్ర నన్నయకు అన్నయ్యలను చేశాడు.ఆదికవి నన్నయకు అన్నయ్యలాంటి కవి జినవల్లభుడే. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని వృషభగిరి అనే బొమ్మలమ్మ గుట్ట పై చెక్కబడి ఉన్నాయి.

తెలుగుకు ‘ప్రాచీన హోదా’ కట్టబెట్టిన కందాలు.. ఈ జైనచక్రేశ్వరి, దిగంబర విగ్రహాల కింది భాగాన జినవల్లభుడు చెక్కించిన త్రిభాషా (తెలుగు, కన్నడ, సంస్కృత) శాసనం వలన ఆదికవి నన్నయ (కీ.శ.1051) కు వందేళ్ల ముందే ఇక్కడ తెలుగులో సాహిత్యం వచ్చిందని ఆధారసహితంగా రుజువైంది. సా.శ.945లో వేయించిన ఈ శాసనం చివరన ఉన్నవి తొలి తెలుగు కంద పద్యాలని తేలింది. 1995లో కరీంనగర్ జిల్లాకు చెందిన సుప్రసిద్ధ కవి, డాక్టర్ మలయశ్రీ పరిశోధనతో ఇవి తెలుగుభాషలోనే మొట్టమొదటి కంద పద్యాలు అని ప్రపంచానికి తెలిసింది. అనంతర కాలంలో తమిళంలాగే తెలుగుకూ ప్రాచీనభాష హోదా కల్పించాలనే ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా బయలుదేరింది. ఈమేరకు రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరైన ఆధారాల్లేక కేంద్రప్రభుత్వం ససేమిరా అంది. ఆ సమయంలో బొమ్మలమ్మ గుట్టపై ఉన్న కందపద్యాలే కీలకమయ్యాయి. చివరికి వీటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం మన తెలుగుభాషకు ప్రాచీనహోదా కల్పించింది. బొమ్మలమ్మ గుట్టపై ఉన్న కంద పద్యాలు..

1. జిన భవనముపూత్తించుట
జిన పూజల్సేయుచున్కి జిన మునులకు న
త్తిన యన్న దానం బీవుట
జినవల్లభు బోలంగలరె జిన ధర్మపరుల్
2. దినకరుసరి వెల్గుదుమని
జినవల్లభు నొట్టనెత్తు జితకవినననున్
మనుజుల్గలరే ధాత్రిం
వినుతిచ్చెదు ననియవృత్త విబుధ కవీంవూదుల్
3. ఒక్కొక్క గుణంబ కల్గుదు
రొక్కొణ్డిగా కొక్కలక్క లేవెవ్వరికిం
లెక్కింప నొక్కొ లక్కకు
మిక్కిలి గుణపక్షపాతి గుణమణి గుణముల్
‘‘జినభవనాలు కట్టించడం, జినసాధువుల పూజలు చేయడం, జినమునులకు నచ్చిన భోజనాలు పెట్టడంలో ఇతర జైనులెవ్వరినీ జినవల్లభునితో సరిపోల్చలేం. సూర్యుడితో సమానంగా వెలుగువారు, జినవల్లభునితో సరితూగు మరే కవులూ లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క సుగుణంతో ఉంటారు. ఆలోచించి చూస్తే జినవల్లభుడే గుణమణి. పైగా ఆయన గుణపక్షపాతి’’ అని ఈ కందాల అర్థం.[1]

మూలాలు[మార్చు]