టంగుటూరి సూర్యకుమారి
వికీపీడియా నుండి
టంగుటూరి సూర్యకుమారి (Tanguturi Suryakumari) అలనాటి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925 లో రాజమండ్రిలో జన్మించినది. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు[1]. 1937 లో మద్రాసు వచ్చి సినీరంగ ప్రవేశము చేసినది. 1952 లో ఆమె తొలి మిస్ మద్రాసు అయినది.
తెలుగు, తమిళము, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయములో మా తెలుగు తల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించాడు. శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వీటితో పాటు'స్వప్నజగతిలో ఛాయావీణ' మొదలైన లలిత గీతాలు, అడివి బాపిరాజు గారి 'ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ', 'రావోయి చిన్నవాడా' మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండేది. హెచ్.ఎం.వి. తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. ప్రముఖ గాయనిగా పేరుతెచ్చుకుంది.
1960 దశకంలో ఈమె లండన్ వెళ్ళి అక్కడ 'ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్' సంస్థను స్థాపించింది. ఇందులో భారతీయ పాశ్చాత్య కళలను, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పరస్పర సదవగాహన పెంపొందించం ముఖ్య ఆశయం. 1968లో వీరి కృషిని బ్రిటిషు రాణి గుర్తించారు. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కెథెడ్రల్ లో గానం చేసిన ప్రధమ భారతీయ వనిత ఈమె. ఈమె నార్వే, స్వీడన్, హాలెండ్, స్పెయిన్, కెనడా, అమెరికామొదలైన పలు దేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి వందలాది కళాకారులను తయారుచేశారు. అమెరికాలో బ్రాడ్వే థియేటరులో విశ్వకవి రవీంద్రుని 'కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్' నాటకంలో రాణి పాత్ర ధరించి బ్రాడ్వే అవార్డు పొందిన మొదటి భారతీయ వ్యక్తి. ఈ నాటకాన్ని న్యూయార్కులో ఎనిమిది నెలలపాటు ప్రదర్శించి, అటు తరువాత ఆఫ్రికాలో నాలుగు నెలలు పర్యటించారు. కొలంబియా యూనివర్సిటీలోనూ, లండన్ యూనివర్సిటీ విద్యాసంస్థలలోను, బ్లాక్ థియేటరులోను భారతీయ నృత్యకళ సంగీతంపై వర్క్ షాపులు నిర్వహించారు. ప్రాచ్య, పాశ్చార్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధురగాయని ఈమె.
1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ వీరి సేవలను గుర్తించి సత్కరించింది. 1979లో రాజ్యలక్ష్మి అవార్డుతో వీరిని గౌరవించింది.
లండన్లోని ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్ తో వివాహమైంది. 1973లో లండన్ లో స్థిరపడిన ఈమె ఏప్రిల్ 25, 2005 న లండన్ లో మరణించినది.
[మార్చు] సినిమాల జాబితా
- విప్రనారాయణ (1937)
- అదృష్టం (1939)
- రైతుబిడ్డ (1939)
- జయప్రద (1939)
- దేవత (1941)
- అబ్ల (1941) - హిందీ
- చంద్రహాస (1941)
- దీనబంధు (1942)
- భక్త పోతన (1942)
- భాగ్యలక్ష్మి (1943)
- కృష్ణప్రేమ (1943)
- కటకం (1947) - తమిళ్
- గీతాంజలి (1948)
- సంసారనౌక (1948) - తమిళ్
- భారతి (1949) - కన్నడ
- అదృష్టదీపుడు (1950)
- మరదలు పెళ్లి (1952)
- వతన్ (1954) - హిందీ
- ఉడాన్ ఖటోలా (1955) - హిందీ
- బాంబే ఫ్లైట్ 417 (1956) - ఆంగ్లము
- భక్త రామదాసు (1964)
[మార్చు] మూలాలు
- ↑ నా జీవిత యాత్ర - టంగుటూరి ప్రకాశం పేజీ.888


