తాజ్ మహల్
వికీపీడియా నుండి
ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో ఉన్న తాజ్ మహల్ 17 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన సమాధి మరియు అపురూపమైన కట్టడం. తాజ్ అని సంక్షిప్తంగా పిలవబడే తాజ్ మహల్ యమునా నది తీరమున శోభాయమానంగా వెలుగొందుతూ అనేక దేశ, విదేశీ పర్యాటకులను అబ్బురపరుస్తోంది. 1983 లో యునెస్కో వారసత్వ జాబితా లో చోటుచేసుకున్న ఈ చారిత్రక కట్టడం మొఘలుల కాలం నాటి కళా నిర్మాణాలలోనే గొప్పది.
విషయ సూచిక |
[మార్చు] నిర్మాణం ఆలోచన
1631లో తను అమితంగా ప్రేమించే మూడవ భార్య ముంతాజ్ మహల్ 14వ సంతానమైన గౌహరా బేగంకు జన్మనిస్తూ మరణించడంతో దు:ఖ సాగరంలో మునిగిన షాజహాన్ ఆమెకు గుర్తుగా ఒక అపురూపమైన కట్టడాన్ని నిర్మించాలనే ఆలోచనతో ప్రణాళికను సిద్ధం చేశాడు.
[మార్చు] నిర్మాణం
ముంతాజ్ మరణం తర్వాత ఆమె జ్ఞాపకార్థం ఒక కట్టడాన్ని నదీతీరాన నిర్మించాలన్న తలంపుతో షాజహాన్ అందుకు అనువయిన ప్రదేశాన్ని ఆగ్రా దగ్గర గుర్తించి ఆ స్థలానికి అధిపతి అయిన మహరాజా జయసింగుకు ఆ స్థలం బదులు ఆగ్రాలో ఒక ప్యాలెస్ ఇచ్చాడు. ఈ కట్టడ నిర్మాణం ఉస్తాద్ ఇసా శిల్పి పర్యవేక్షణలో ప్రారంభమైంది. పర్షియన్ మరియు మొఘల్ కళా నిర్మాణాల కలయిక కల్గిన ఈ కట్టడానికి పొడవు మరియు వెడల్పు సమానంగా ఉండటం ప్రత్యేకత.
చలువరాతిని, ఇతర సామగ్రిని నిర్మాణ స్థలానికి చేర్చడానికి 15 కిలోమీటర్ల పొడవయిన రహదారిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. 1,000 పైగా ఏనుగులు సామగ్రిని రవాణా చేసాయి. పాలరాతి చలువరాయి రాజస్థాన్ నుండి, సూర్యకాంతి లేదా పచ్చ రాయి పంజాబ్ నుండి, పచ్చల రాయి మరియు స్ఫటికం చైనా నుండి, ఫిరోజారాయి టిబెట్ నుండి, నీలము శ్రీలంక నుండి తెప్పించబడ్డాయి.
దాదాపు ఇరవయి వేల మంది శ్రామికులు దాదాపు 18 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ అద్భుత కట్టడం 1643 నాటికి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చుతో పూర్తి అయినది.
[మార్చు] చరిత్ర
తాజ్ మహల్ నిర్మాణం కాగానే నిర్మాణ కర్త అయిన షాజహాన్ అతని కుమారుడైన ఔరంగజేబు చే గృహనిర్బంధానికి గురైనాడు. ఆగ్రా కోట వద్ద తాజ్ మహల్ ను చూస్తూ తన శేష జీవితాన్ని గడిపినాడు. షాజహాన్ మరణానంతరం అతని సమాధి కూడ ముంతాజ్ మహల్ సమాధి ప్రక్కనే కట్టించినాడు.
[మార్చు] పర్యాటక స్థలం
భారతదేశములోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటైన తాజ్ మహల్ సందర్శనకై ప్రతి ఏటా సుమారు 20-30 లక్షల సంఖ్యలో (అందులో పదో వంతు విదేశీయులు) పర్యటిస్తారని గణాంకాలు తెల్పుతున్నాయి. విదేశీ సందర్శకులు చలి కాలంలో ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ మాసాలలో అధికంగా పర్యటిస్తారు. ఉత్తర భారతదేశ పర్యటనకై వెళ్ళి తాజ్‌ను చూడని వారు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు.
[మార్చు] ఇవి కూడా చూడండి
- ఆగ్రా కోట
- ఫతేపూర్ సిక్రీ
- మొఘల్ పరిపాలన
- హుమాయూన్ సమాధి
- ప్రపంచ వింతలు
- నవీన ప్రపంచ వింతలు
- ప్రపంచ వారసత్వ ప్రదేశం