తెలంగాణా సాయుధ పోరాటం

వికీపీడియా నుండి

తెలంగాణా సాయుధ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు,దేశ్ ముఖ్ లు,జమీందారులు,దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.రజాకార్‌ సైన్యాన్ని ప్రజాసైన్యంగా అభివర్ణించిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు.[1]

విషయ సూచిక

పుట్టు పూర్వోత్తరాలు [మార్చు]

మొదట నల్లగొండ జిల్లాలో పుట్టిన సాయుధ విప్లవం త్వర త్వరగా వరంగల్, బీదర్ జిల్లాలకు వ్యాపించింది. రైతులు, రైతు కూలీలు నిజాం నవాబుకు, ప్రాంతీయ ఫ్యూడల్ జమీందారులకు వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం చేసారు. వారి పోరాటం వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా మొదలైంది. అయితే వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయడానికి ఆనాటి రాజులు, జమీందారులు సిద్ధంగా లేరు.

మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన,
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె,
కాలంబు రాగానే కాటేసి తీరాలె” -- కాళోజీ

పోరాట ఉధృతి [మార్చు]

అదే సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. భారత ప్రభుత్వం సెప్టెంబరు 1948 లో నిజాం పైకి తన సైన్యాన్ని పంపింది. అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో గెరిల్లా యుద్ధ తంత్రంతో 3000 లకు పైగా గ్రామాలను విముక్తం కాబడ్డాయి. ఈ ప్రాంతంలోని జమీందారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి వేసారు. చావగా మిగిలిన వారు పారి పోయారు. విముక్తి చేయ బడిన గ్రామాల్లో సోవియట్ యూనియన్ తరహా కమ్యూన్లు ఏర్పరచారు. ఈ కమ్యూన్లు కేంద్ర నాయకత్వం క్రింద పని చేసేవి. ఈ పోరాటానికి 'ఆంధ్ర మహాసభ' పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహిచిన వారిలో మగ్దూం మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు హసన్ నాసిర్ లు ముఖ్యులు.

వరవరరావు వాదన [మార్చు]

రజాకారు సేన ను తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీ. ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ రాజాకార్లకు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారు.ఈ దొరలు, పెత్తం దార్లు 17 సెప్టెంబర్ 1948 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామా లు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీల తో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబర్ దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు. 1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, ముక్తేదార్‌లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు.[2]

పోరాట ఫలితం [మార్చు]

కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారత దేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.

ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]

  1. సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ హిస్టరీ సొసైటీ సాక్షి దినపత్రిక,తేది 3-10-2010
  2. http://discover-telangana.org/wp/?p=235&cp=1[అచేతన లింకు]

బయటి లింకులు [మార్చు]