తెలుగు సాహిత్యం - శివకవి యుగము
వికీపీడియా నుండి
తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స |
|
|---|---|
| తెలుగు సాహిత్యం యుగ విభజన | |
| తెలుగు సాహిత్యం కాలరేఖ | |
| నన్నయకు ముందు | క్రీ.శ. 1000 వరకు |
| నన్నయ యుగము | 1000 - 1100 |
| శివకవి యుగము | 1100 - 1225 |
| తిక్కన యుగము | 1225 - 1320 |
| ఎఱ్ఱన యుగము | 1320 – 1400 |
| శ్రీనాధ యుగము | 1400 - 1500 |
| రాయల యుగము | 1500 - 1600 |
| దక్షిణాంధ్ర యుగము | 1600 - 1775 |
| క్షీణ యుగము | 1775 - 1875 |
| ఆధునిక యుగము | 1875 – 2000 |
| 21వ శతాబ్ది | 2000 తరువాత |
| తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు |
|
|
|
|
తెలుగు సాహిత్యంలో 1100 నుండి 1225 వరకు శివకవి యుగము అంటారు.
ఈ యుగం నన్నయకు, తిక్కనకు సంధికాలం. దక్షిణ భారతదేశంలో శైవం ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాధుడు, మల్లికార్జున పండితారాధ్యుడు ఈ యుగంలో శివకవిత్రయం. ఈ కాలంలో రచనా వస్తువు శివగాధామయం. భాషలో సంస్కృత ప్రాబల్యత తగ్గి తెలుగు వాడుక హెచ్చింది.
విషయ సూచిక |
[మార్చు] రాజకీయ, సామాజిక వేపధ్యం
ఈ సమయానికి చాళుక్యచోళరాజ్యం క్షీణదశకు చేరుకొంది. తెలంగాణ ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల, రాష్ట్రకూటుల బలం అధికంగా ఉంది. తీరాంధ్రంలో సరైన కేంద్ర పాలన కొరవడిందని, వేంగి రాజ్యంలో రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, చోళులు ఎడతెరిపి లేకుండా యుద్ధాలు జరిపారని తెలుస్తుంది. ఈ సమయంలో చాళుక్యులకు సామంతులుగా ఉండిన కాకతీయులు స్వతంత్రులై తెలంగాణ ప్రాంతంలో బలపడసాగారు.
సాంస్కృతికంగా అప్పటికి బౌద్ధం, జైనం బాగా బలహీనపడ్డాయి. శైవం, వీరశైవం విజతంభించాయి. శైవులు బౌద్ధ , జైనాలనే కాక వైదిక విధానాలను కూడా నిరసించారు. శివుడు తక్క వేరు దైవము లేదని, శివారాధన చేయనివానిని మన్నింపతగదని వాదించారు. వారికి వాఙ్మయం కూడా మతబోధనకు మార్గం తప్ప దానికి వేరు లక్ష్యం లేదు.
[మార్చు] ఈ యుగంలో భాష లక్షణాలు
[మార్చు] ఈ యుగంలో తెలుగు లిపి
[మార్చు] ముఖ్య కవులు, రచనలు
ఈ యుగానికి చెందిన నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాధుడు అనే కవులను శైవ కవిత్రయంగా పేర్కొంటారు. శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, యథావాక్కుల అన్నమయ్య కూడా శివకవులే. శివకవులలో శైవాభిమానం, దేశికవితాభిమానం, శైలీస్వేచ్ఛ ముఖ్య లక్షణాలు. క్రీ.శ. 1160 కాలానికి చెందిన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. నన్నయ కంటే నన్నెచోడుడు ముందువాడని మానవల్లి రామకృష్ణకవి వాదించాడు కాని ఆ వాదం నిలబడలేదు.[1]. పాల్కురికి సోమనాధుడు 1160-1230 కాలంవాడు కావచ్చును. ఇతడు తెలుగు, సంస్కృతం, కన్నడ భాషలలో గొప్ప పండితుడు. ఇతని రచనలలో అనుభవ సారము, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, చతుర్వేద సారం అనేవి మాత్రం లభించాయి. శతక వాఙ్మయంలో లమకు లభిస్తున్న మొట్ట మొదటి శతకంగా వృషాధిప శతకాన్ని పేర్కొంటారు. మల్లికార్జున పండితారాధ్యుడు చాలా గ్రంధాలు వ్రాసి ఉండాలికాని శివతత్వ సారము మాత్రం లభిస్తున్నది. మిగిలిన కొన్న గ్రంధాల కర్తృత్వం స్పష్టంగా తెలియరావడంలేదు.
1133-1198 మధ్యకాలంలో ఓరుగల్లును పాళించిన కాకతీయరాజు ప్రతాప రుద్రుడు "నీతి సారము" అనే గ్రంధాన్ని రచించాడని భావిస్తున్నారు. చక్రపాణి రంగన కూడా ఈ యుగంలోనివాడు కాని, తిక్కన యుగంలోనివాడు కాని కావచ్చును.
[మార్చు] ఇతరాలు
శైవ భక్తిపూర్వకం కాని ఇతివృత్తమేదీ శివకవుల రచనకు ఇతివృత్తం కాలేదు. వారు శ్లాఘించినది ఇతర శివకవులను మాత్రమే. వారి జీవితము, కవిత్వము కూడా శివార్పణమే. వీరు కవిత్వముచే మతమునకు ఊడిగము చేయించిరి (పింగళి లక్ష్మీకాంతం). భాషా ప్రయోగంలో వీరు చాలా స్వతంత్ర ధోరణి అవలంబించారు. ఛందో వ్యాకణాది నియమాలను ఉల్లంఘించడానికి, అన్యభాషాపదాలను వాడడానికి శివకవులు ఏమాత్రం వెనుకాడలేదు. వారి భక్తిపారవశ్యం ఇతర విషయాలపట్ల దృష్టిని పెట్టనీయలేదు. జాను కవిత , దేశి రచన అనే సంప్రదాయాభిమానం కలిగించింది శివకవులే. చాలా ముఖ్యమైన మత గ్రంధాలను వీరు తెలుగులో వ్రాయడం వలన ఇతర భాషలలో పండితులు కూడా తెలుగు కావ్యాలు చదివేలా చేశారు.[2]
[మార్చు] జాను తెనుగు
నన్నెచోడుడు మొట్టమొదటిసారిగా "జాను తెనుగు", వస్తు కవిత" అనే పదాలను వాడాడు. జాను తెనుగు అంటే ఏమిటనే విషయంపై పండితుల మధ్య చాలా చర్చలు జరిగాయి. కన్నడంలో "జాణ్ణుడి" (చమత్కారమైన నుడి) అనే పదం నుండి "జాను కవిత" అనే ప్రయోగం వచ్చిందని ఒక అభిప్రాయం. "జాను" అనగా ఇంపైన, అందమైన, స్పష్టమైన భావం కల తెలుగు అని కొందరన్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి జి.నాగయ్య చెప్పిన నిర్వచనం - "తెలుగు భాషలో స్వభావసిద్ధంగా వాడే సంస్కృత సమాసాలను జనసామాన్యంలో వాడబడే దేశిదాలతో అన్వయించి, అన్వయ క్లిష్టత లేకుండా మంజులమై, సరసమై, ప్రసన్నమైన తెలుగు జాను తెనుగు"[1]
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 తెలుగు సాహిత్య చరిత్ర - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
- ↑ పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
[మార్చు] వనరులు
- కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
[మార్చు] బయటి లింకులు
|
||||||||||||||