దాశరథి రంగాచార్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దాశరధి రంగాచార్యులు
Dasarathi rangacharya.jpg
దాశరథి రంగాచార్య
జననం దాశరథి రంగాచార్యులు
ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరు
ఇతర పేర్లు దాశరథి రంగాచార్య
ప్రసిద్ధి తెలుగు కవులు, తెలుగు రచయితలు

దాశరథి రంగాచార్యులు ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.

జీవిత విశేషాలు[మార్చు]

దాశరథి రంగాచార్యులు ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరు లో జన్మించారు. ఆయన అన్న ప్రముఖ కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.

ఉద్యమ రంగం[మార్చు]

నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.
తండ్రి కుటుంబకలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి ఆయన కాంగ్రెస్ దళంలో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.[1]

సాహిత్య రంగం[మార్చు]

తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు "జనపదం"లో అక్షరీకరించారు.
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో నవలలు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. ఆ నవలా పరంపరలో తొలి నవలగా 1942వరకూ ఉన్న స్థితిగతులు "చిల్లర దేవుళ్లు"లో కనిపిస్తాయి.
నాణానికి మరోవైపు చూస్తే తెలంగాణ పోరాటం ముగిసిన దశాబ్దికి కొందరు నిజాం రాజును మహనీయునిగా, ఆ నిజాం రాజ్యస్థితిగతులను ఆదర్శరాజ్యానికి నమూనాగా పలు రాజకీయ కారణాల నేపథ్యంలో కీర్తించారనీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని, ప్రాణాన్ని లెక్కచేయక నిజాంను ఎదిరించిన తమకు ఆనాటి దుర్భర స్థితిగతుల్ని ఇలా అభివర్ణిస్తూంటే ఆవేశం వచ్చేదని రంగాచార్య ఒక సందర్భంలో పేర్కొన్నారు. నిజాం రాజ్యంలో బానిసల్లా జీవించిన ప్రజల స్థితిగతులను, మానప్రాణాలను దొరలు కబళించిన తీరును ఆ నేపథ్యంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సాగిన తెలంగాణా సాయుధపోరాటం, పోరాటానంతర స్థితిగతులు వంటివి భావితరాలకై అక్షరరూపంగా భద్రపరచదలిచిన ఆళ్వారుస్వామి ప్రణాళికను స్వీకరించినట్టు రచయిత తెలిపారు.
తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. ఈ నేపథ్యంలో రంగాచార్యులు శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు. పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్ ప్రోద్బలంతో ఆత్మకథ "జీవన యానం" రచించారు. అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు. వేదాలకు ప్రవేశికగా వేదాలు మానవజాతి అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపాయో, నేటి యాంత్రిక నాగరికతకు వేదసాహిత్యంలో ఎటువంటి సమాధానలు ఉన్నాయో వివరిస్తూ "వేదం-జీవన నాదం" రచించారు.
ఇవే కాక ఇతర నవలలు, వ్యాసాలు, పుస్తకాలు కలిపి ఎన్నో పుటల సాహిత్యాన్ని సృష్టించారు.[2]

విశిష్టత, ప్రాచుర్యం[మార్చు]

దాశరథి రంగాచార్యులు రాసిన "చిల్లర దేవుళ్లు" నవల సినిమాగా తీశారు. టి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఘనవిజయం సాధించింది. పలు భాషలలోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళప్రాచుర్యం పొందింది.
దాశరథి రంగాచార్యులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ పోరాట క్రమానికి నవలల రూపం కల్పించడం, తెలంగాణ ప్రాంత చారిత్రిక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ "జీవనయానం" వంటివి సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.

పురస్కారాలు, సత్కారాలు[మార్చు]

దాశరథి రంగాచార్యుల "చిల్లర దేవుళ్లు" నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందు వల్ల రంగాచార్యులను అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు. 21-1-1994న ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్యులు దంపతులకు సత్కరించారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాశరథి రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు జరిగాయి.

రచనలు[మార్చు]

రంగాచార్యులు నవలలు, ఆత్మకథ, వ్యాసాలు, జీవిత చరిత్రలు, సంప్రదాయ సాహిత్యం తదితర సాహితీప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు.

నవలలు[మార్చు]

ఆత్మకథ[మార్చు]

 • జీవనయానం

అనువాదాలు[మార్చు]

 • నాలుగు వేదాల అనువాదం
 • ఉమ్రావ్ జాన్

జీవిత చరిత్ర రచనలు[మార్చు]

 • శ్రీమద్రామానుజాచార్యులు
 • బుద్ధుని కథ

ఇతరాలు[మార్చు]

 • శ్రీమద్రామాయణం
 • శ్రీ మహాభారతం
 • వేదం-జీవన నాదం
 • శతాబ్ది

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. డా.దాశరథి రంగాచార్యులు రచించిన వేదం-జీవన నాదం
 2. డా.దాశరథి రంగాచార్యులు ఆత్మకథ "జీవన యానం"