దుర్యోధనుడు
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రధముడు, కౌరవాగ్రజుడు.
విషయ సూచిక |
[మార్చు] జననం
గాంధారీ దృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారీ గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరవాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురతవలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది. ఈ విషయంవిన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరవాతనూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనడు జన్మించాడు. తరవాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక పేరు దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.
[మార్చు] దుశ్శకునములు,పెద్దల సూచన
దుర్యోధనుని జనకాలములో రాక్షసులు మిక్కుటముగా అరచారు, నక్కలు ఊళలు పెట్టాయి, గాడిదలు ఓండ్ర పెట్టాయి, భూమి కంపించింది, మేఘములు రక్త వర్షాన్ని కురిపించాయి.ఇవి కాక అనేక దుశ్శకునములు సంభవించినట్లు భారతంలో వర్ణించ బడింది.ఇవి గమనించిన భీష్ముడు,విదురుడు "రాజా! దుర్యోధనుడు వంశనాశకుడు కాగలడని శకునములు సూచిస్తున్నాయి. ఇతనివలన కులనాశనం కాగలదు ఈ పాపాత్ముని విడిచి కులమును రక్షింపుము " అని సూచించారు. దృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో వాటిని పెడచెవిన పెట్టినట్లు భారత వర్ణన.
[మార్చు] భారతంలో దుర్యోధనుని పాత్ర
దుర్యోధనుడు అసూయకు మారుపేరు. అతడు పాండవులపై అకారణ శతృత్వాన్ని పెంచుకున్నాడు. ముందుగా భీముని బలము అతనికి భయాన్ని కలిగించింది. భీముని ఒకసారి లతలతో కట్టి నదిలో పారవేయించాడు, ఒకసారి సారధిచే విష్నాగులతో కాటు వేయించాడు, మరి ఒకసారి యుయుత్సునిచే పంపించి విషాన్నాన్ని తినిపించాడు. యుయుత్సుడు ధర్మ పరుడు కనుక ఈ విషయాన్ని ముందుగా భీమునికి తెలిపాడు. భీముడు వీటన్నిటిని అధిగమించి అధిక బలాన్ని సంపాదించాడు. యుద్ధ విద్యా ప్రదర్శన సమయంలో ప్రవేశించిన కర్ణుని అర్జునినికి ప్రతిగా తనకు బలం చేకుర్చుకొనే విధంగా కర్ణునికి అర్ధరాజ్యం ఇచ్చి మితృత్వాన్ని సంపాదించుకున్నాడు. ధర్మరాజుకి పెరుగుతున్నా ప్రజాదరణ చూసి సహించలేక తండ్రిని ఒప్పించి వారణావతానికి వారిని పంపించి శకునితో కుట్ర జరిపి పాండవులను వారణావతములోనే లక్క ఇంట్లో ఉంచి వారిని దహించివేయాలని పధకం వేశాడు. కానీ విదురుని సహాయంతో వారు దానిని తప్పించుకున్నారు. ద్రౌపది స్వయంవర సమయంలో హాజరైన రాజులలో దుర్యోధనుడు ఒకడు. ద్రౌపది అర్జునుని వరించినందుకు కోపించి దృపదునితో యుద్ధానికి దిగటానికి ఉపక్రమించి పెద్దలు నివారించడంతో ఉపసంహరించుకున్నాడు. దృపదుని ఆశ్రయంలో ఉన్న పాండవుల మద్య పొరపొచ్చాలు సృష్టించి పాండవులను తుదముట్టించాలని ప్రయత్నించి కర్ణుని సలహాతో వారిని తిరిగి తండ్రి సహాయంతో హస్థినకు రప్పించాడు. భీష్ముని సలహా కృష్ణుని ప్రోద్బలంతో రాజ్యవిభజన జరిగి ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకుని కృష్ణిని సహాయ సాలహాలతో రాజ్యవిస్తరణచేసుకొన్న పాండవుల వైభావాన్ని చూసి ఓర్వలేక వారిని తండ్రి సహాయంతో మేనమామ శకుని కుతంత్రంతో మాయాజూదంలో ఓడించి పాండవులను, ద్రౌపదిని అవమానాలకు గురిచేసి వారిశాశ్వత పగను సంపాదించుకున్నాడు. దృతరాష్ట్రుని వద్ద వరంగా పొందిన పాండవుల రాజ్యాన్ని తిరిగి మాయాజూదంలో అపహరించి వారిని అరణ్యవాసానికి తరువాత అజ్ఞాతవాసానికి పంపి వారిని ఇడుములకు గురిచేసాడు. మైత్రేయుని హితవచనాలను అలక్ష్యం చేసినందుకు భీముని చేతిలో తోడపగుల కలదని మైత్రేయుని శాపమునకు గురై భీముని చేతిలో మరణం అన్న విషయం మరింత బలపడింది. సంజయుని ద్వారా కిమ్మీరుని వధ వృత్తాంతం విని భీముని పరాక్రమానికి వెరచి అరణ్యవాస మయంలో పాండవుల మీదకు దండయాత్రకు వెళ్ళాలన్న ప్రయత్నాన్ని కొంతకాలం విరమించుకున్నాడు. పాండవులను పరిహసించి అవమాన పరచాలన్న దురుద్దేశంతో వచ్చి గంధర్వరాజు చిత్రసేనుని చేతిలో సకుంటుంబంగా బంధీ అయి ధర్మరాజు సౌజన్యంతో విడుదల పొందాడు. ధర్మరాజు సౌజన్యాన్నికూడా అవమానంగా ఎంచి ఆత్మహత్యకు పాల్పడి రాక్షసుల సలహాననుసరించి ఆత్మ హత్యను విరమించుకున్నాడు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టి వారిని తిరిగి అరణ్యవాసానికి పంపాలన్న దురుద్దేశంతో విరాటరాజ్యం పై దండెత్తి అర్జునిని ఒక్కని చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూశాడు. యుద్దకాలంలో సంధికి వ్యతిరేకంగా వ్యవహరించి యుద్ధానికి కాలుదువ్వాడు. దురహంకారంతో కృష్ణుని సహాయాన్ని వదులుకుని దైవబలాన్ని జారవిడుచుకున్నాడు. మాయోపాయంతో శల్యుని తనవైపు యుద్ధం చేసేలా చేశాడు. తద్వారా కర్ణుని పరాజయానికి పరోక్షంగా కారణమైనాడు. పద్మ వ్యూహంలో ఒంటరిగా చిక్కిన అభిమన్యుని అధర్మ మరణానికి కారకుల్లో ఒకడైనాడు. యుద్ధాంతంలో మరణభయంతో సరస్సులో జలస్థంభన చేసిన దుర్యోధనుడు శ్రీకృష్ణుని సలహా పొందిన భీముని చేతిలో నిస్సహాయంగా మరణించాడు. ఈ విధంగా కౌరవకుల నాశనానికి దృర్యోధనుడు కారణమైయ్యాడు.