దేవరకొండ బాలగంగాధర తిలక్

వికీపీడియా నుండి
(దేవరకొండ బాలగంగాధర తిలక్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవరకొండ బాలగంగాధర తిలక్
అమృతం కురిసిన రాత్రిలో దేవరకొండ బాలగంగాధర తిలక్ చిత్రం
జననందేవరకొండ బాలగంగాధర తిలక్
1921 ఆగష్టు 1
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాక
మరణం1966 జూలై 1
ప్రసిద్ధిఆధునిక తెలుగు కవి.

దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921 ఆగష్టు 1 - 1966 జూలై 1) తెలుగు కవి, రచయిత. భావుకత, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు.

జీవితం[మార్చు]

బాల్యం, చదువు[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1న తిలక్ అత్యంత సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు సత్యనారాయణమూర్తి, రామసోదెమ్మ. తిలక్ పన్నెండుమంది సంతానంలో ఆరవవాడు, ఆ సంతానంలో మగవారిలో రెండవవాడు. తండ్రి సత్యనారాయణ తిలక్ బాల్యంలోనే మండపాక నుంచి తణుకు మకాం మార్చాడు.[1]

తిలక్ పాఠశాల విద్య అంతా తణుకులోనే సాగింది. స్కూల్ ఫైనల్ తణుకు హైస్కూల్లో పూర్తైంది. అతని విద్యాభ్యాసం పాఠశాల స్థాయి తర్వాత సజావుగా సాగలేదు. మద్రాసు లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సు కోసం చేరి, కొంతకాలం చదివిన తిలక్ తనకు మద్రాసు జీవితం సరిపడకపోవడంతో అంతటితో చదువు విడిచిపెట్టి తణుకు వచ్చేశాడు. ఆ తర్వాత మరెక్కడా చదువుకోలేదు.[2]

రచనా వ్యాసంగం, వివాహం[మార్చు]

తిలక్ తన జీవితం అంతా దాదాపుగా తణుకులోనే గడిపాడు. అప్పుడప్పుడు కాకినాడ, ఏలూరు, హైదరాబాద్‌లలో తన తోబుట్టువుల ఇళ్ళకు మినహాయించి పెద్దగా ప్రయాణాలు కూడా చేసేవాడు కాదు.[2] అతను తన జీవితంలో ఎప్పుడూ ఏ ఉద్యోగమూ చెయ్యలేదు. తణుకులో తండ్రి కట్టిన ఇంట్లో ఉంటూ, ఎప్పుడూ ఏదోక పుస్తకం చదువుకుంటూ, మిత్రులతో ముచ్చటిస్తూ, రాయాలనిపించినప్పుడు రాస్తూ గడుపుతూ ఉండేవాడు.[3] అతనికి ఐదారు వేల పుస్తకాలతో ఒక స్వంత గ్రంథాలయం ఉండేది.[2] తిలక్ భార్య పేరు ఇందిరాదేవి. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకుల పేర్లు సత్యనారాయణమూర్తి, సుబ్రహ్మణం, కూతురు పేరు చంద్రలేఖ.[3]

మానసిక సమస్యలు[మార్చు]

తిలక్ చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆకర్షితుడయ్యాడు. తన పదకొండవ ఏట కథా రచన, పద్నాలుగు, పదిహేనేళ్ళ వయసులో పద్యరచన ప్రారంభించాడు. 1942లో తన 21 ఏడు వచ్చేసరికల్లా విస్తృతంగా రాయడం ప్రారంభించిన తిలక్ రచనలు 1945 ప్రాంతంలో హఠాత్తుగా ఆగిపోయాయి. 1944 జూన్‌లో గోదావరి పుష్కరాల్లో స్నానం చేయడానికి కానూరు అగ్రహారం వెళ్ళిన తిలక్ తండ్రి సత్యనారాయణమూర్తి అక్కడ హఠాత్తుగా గోదావరి తీరంలోనే గుండెపోటుతో మరణించాడు. తండ్రితో ఎంతో అనుబంధం ఉన్నవాడూ, అత్యంత సున్నితమైన మనస్సు కలవాడూ అయిన తిలక్ మీద ఈ సంఘటన తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆ సంఘటన తర్వాత పదేళ్ళ పాటు తిలక్ ఏమీ రాయకుండా, ఇంటి నుంచి బయటకు రాకుండా, భయంతోనూ, ఆందోళనతోనూ గడిపాడు.[4]

ప్రాణానికి ఏదో ప్రమాదం కలిగిందని అకారణంగా భావించడం, లేని అనారోగ్యాన్ని ఉన్నదని నమ్మడం వంటి లక్షణాలతో తిలక్ బాధపడ్డాడు. హఠాత్తుగా ఏ మధ్యాహ్నం పూటో తిలక్‌కి రోగలక్షణాలు కనిపించేవి. అతనికి భయంతో నరాలు బిగిసిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి మధ్యాహ్నం ప్రారంభమై అర్థరాత్రి వరకూ కొనసాగేవి. ఈ లక్షణాలు తగ్గగానే విపరీతమైన ఆకలి వేయడం, బాగా తిన్నాకా, ఏ తెల్లవారుజామో నిద్రపట్టడం - ఇలా రోజులు గడిచిపోయేవి. తనకు ఏదో పెద్ద జబ్బు ఉందని తిలక్ నమ్మేవాడు. కానీ, వైద్యులు పరిశీలించి శారీరకంగా అతనికి ఏ వ్యాధీ లేదని తేల్చేవారు. వైద్యం కోసం విపరీతంగా డబ్బు ఖర్చయ్యేది. పరిస్థితి మాత్రం అలానే ఉండేది. ఇలా దాదాపు 1945 నుంచి 1955 వరకూ పదేళ్ళ కాలం తీవ్ర ఆరోగ్య సమస్యలతోనే గడిపాడు తిలక్.[4]

పునరుత్తేజం[మార్చు]

1956 ప్రాంతంలో తిలక్ ఆరోగ్యం మెరుగుపడింది. దాదాపు పదేళ్ళ పాటు ఏ రచనలూ చెయ్యకుండా ఉండిపోయిన తిలక్ తన పరిస్థితిని చిక్కబట్టుకుని 1956 నుంచి తిరిగి రాసి పత్రికలకు పంపడం ప్రారంభించాడు.[2] అప్పటి నుంచి మరో పదేళ్ళ వరకూ తిలక్ సాహిత్యంలో అత్యుత్తమ దశగా విమర్శకులు అభిప్రాయపడతారు. తిలక్ జీవితంపై మోనోగ్రాఫ్ రాసిన విమర్శకుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ "ఈ కాలంలోనే (1956-66) తిలక్ పరిపూర్ణ కవితా, కథానికా, భావ వికాసాలు, ప్రతిభా శిఖరారోహణ మనకు దర్శనమిస్తాయి" అని రాశాడు.[4] మరో విమర్శకుడు, కవి ఆవంత్స సోమసుందర్ "తిలక్ జీవితంలో చివరి దశాబ్దం (1956-66) మహోజ్వలమైంది" అని రాశాడు.[5]

ఆరోగ్యంలో మునుపటికన్నా మెరుగుదల, సాహిత్య రచనలో ఉత్తమ స్థాయి అందుకున్నా ఆ దశలోనూ తిలక్‌కి తన జీవితం విసుగుగా, విరక్తిగా తోచేది. తణుకులాంటి పట్టణంలోనే జీవిత పర్యంతమూ ఉండిపోయినా ఆ ఉండడం కూడా అతనికి నచ్చేది కాదు. తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందనీ, లేకుంటే మరేదైనా మెరుగైన చోటికి సకుటుంబంగా వెళ్ళిపోయి స్థిరపడేవాడినని అసంతృప్తితో ఉండేవాడు.[6] తణుకు పట్టణంలో "సాహిత్య సరోవరం" అన్న చిన్న సాహితీ సంస్థను నడిపేవాడు.[7] తిలక్ కొన్ని వ్యాపారాల్లో కూడా చేయివేసి చూశాడు. కానీ, అవేమీ కలసిరాలేదు. స్వతహాగా చాలా ఆస్తిగల కుటుంబానికి చెందినవాడైనా తన అనారోగ్యం వల్ల, కలసిరాని వ్యాపారాల వల్ల చాలా డబ్బు నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. అయితే, ఈ సమస్యలు ఏవీ సాహిత్య రచన విషయంలో అతని కృషిని దెబ్బతీయలేదు. చదవడమూ, రాయడమూ నిరంతరంగా సాగించాడు.[3]

మరణం, ప్రాచుర్యం[మార్చు]

తిలక్, సృజనశక్తి వివిధ ప్రక్రియల్లో విజృంభిస్తున్న సమయంలో నలబై అయిదేళ్ల వయసులో కూతురు పెళ్ళిచేసిన కొద్దివారాలకే 1966 జూలై 1న అనారోగ్యంతో మరణించాడు. తన కవిత్వాన్ని పుస్తకంగా ప్రచురించి చూసుకోవాలనీ, ఒక సాహిత్య పత్రిక స్థాపించాలని ఆశించిన తిలక్ అవేమీ తీరకుండానే చనిపోయాడుద.[7] అతని కొడుకులు సత్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం ఇంగ్లండ్, అమెరికాల్లో వైద్యులుగా స్థిరపడ్డారు. కూతురు చంద్రలేఖ ఆస్ట్రేలియాలో నివసిస్తుంది.[3]

విస్తారంగా సాహిత్య సృజన చేస్తున్న తిలక్ నడివయసు దాటకుండానే మరణించడం తెలుగు సాహిత్య లోకంలో విస్మయాన్ని కలిగించింది. తిలక్ మరణించిన ఏడాదిలోపు 1967 ఏప్రిల్లో అతను రాసిన కథలతో "తిలక్ కథలు", రెండేళ్ళకు 1968 జులైలో అతని కవితలతో "అమృతం కురిసిన రాత్రి" అన్న కవితా సంపుటిని విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించింది.[8] ఇది తెలుగు సాహిత్యంలో మంచి ఆదరణ పొందింది. 1971లో ఈ పుస్తక రచనకు గాను మరణానంతరం తిలక్‌కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.[9]

కవిత్వం[మార్చు]

1940ల్లో తిలక్ కవిత్వ రచన ప్రారంభించేనాటికి భావకవిత్వం వెనుకబడి అభ్యుదయ కవిత్వం ప్రాచుర్యంలోకి వస్తోంది. పద్య కవిత్వానికి బదులు వచన కవిత్వం రాయడం వైపుకు కవులు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా తిలక్ మొదట భావ కవిత్వ ప్రభావంతో రాయడం మొదలుపెట్టి విస్తారంగా ఛందస్సులో కవిత్వం రాశాడు.

తిలక్ భావకవుల ప్రభావంతో ఛందస్సులోని పద్యాల్లో ఖండకావ్యాలు రాశాడు. గోరువంకలు, స్వయంవరం, ఆవాహన, వర్షా, మధువిరహం, శర్వరీప్రియ, ఆటవెలది, శ్రీ వివేకానందస్వామి, సీత-1, సీత-2, అద్వైతమాన్మధం, అమృతభావము వంటి ఖండకావ్యాలు రచించాడు. వీటిని తిలక్ మరణించిన పాతికేళ్ళకు 1991లో అతని పెద్ద కొడుకు డాక్టర్ సత్యనారాయణమూర్తి సేకరించి "గోరువంకలు" అన్న సంపుటిగా ప్రచురించాడు. ఈ గోరువంకలు సంపుటిలోని చాలావరకూ ఖండ కావ్యాలను పలువురు విమర్శకులు తిలక్ ఎదుగుదలలో భాగంగానే ఎంచారు తప్ప గొప్ప రచనలుగా భావించలేదు. కవి, విమర్శకుడు బేతవోలు రామబ్రహ్మం వీటిని గురించి రాస్తూ "అప్పట్లో ఆ (భావకవిత్వ) ప్రభావంతో రాసిన వీరి పద్యకవితలు వీరి పరిణతి క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఏ ప్రమాదపుటంచుల నుంచి బయటపడ్డారో తెలుసుకోవడానికీ ఉపకరిస్తాయి." అని అంచనా వేశాడు. అయితే ఈ ఖండకావ్యాల్లో కూడా "సీతారాములకు చెందిన నాలుగు ఖండికలూ, శ్రీవివేకానందస్వామి ఒకటీ నిత్యనూతనంగా నిలిచే కవితలు" అని రామబ్రహ్మం పేర్కొన్నాడు.[5]


తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం ఉంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.

మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.

మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ, తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ, కవిత్వం వ్రాసినా, వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేత.

ప్రశంసలు[మార్చు]

రా.రా.: తిలక్ కవిత్వంలోని కొన్ని అనభ్యుదయకర ధోరణులను ఎత్తిచూపి విమర్శించినా, భావుకత్వం ముఖ్యమైన లక్షణంగా ఉండేది. తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం - కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. ఈ భావుకత్వానికి తోడు, తన హృదయంలోని అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తీ, అలంకారపుష్టీ, కలసి రావడంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగినాడు అంటూ ప్రముఖ మార్క్సిస్టు విమర్శకుడు రా.రా ప్రశంసించాడు.

దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రులనుండి, పతివ్రతలనుండి
పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి
నీతుల రెండునాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హేతుక కృపా సర్పాలనుండి
లక్షలాది దేవుళ్లనుండి వారి పూజారులనుండి
వారి వారి ప్రతినిధుల నుండి
సిద్ధాంత కేసరులనుండి
శ్రీమన్మద్గురు పరంపరనుండి...

చీకోలు సుందరయ్య : వీళ్లందరినుంచీ ఈ సమాజాన్ని కాపాడమని వేడుకొన్న కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన అమ్మాయిలు అని పేర్కొన్న ఈ కవి కవిత్వంలోనే కాదు, కథా రచనలోను బలమైన ముద్రవేశాడు. తన కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించుకొన్నాడు. ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు - [10]

యువ కవి లోక ప్రతి నిధి
నవభావామృత రసధుని
కవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్చ స్ఫటికా ఫలకం

అంటూ తన ఎలిజీలో (జవాబు రాని ప్రశ్న) శ్రీశ్రీ అభివర్ణించాడు.

గిరిజా మనోహర్ బాబు : కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు.[11]

వేలూరి వేంకటేశ్వరరావు : .. తిలక్‌ మనకి ఆరోజులనాటి (60 ల్లో) వీర అభ్యుదయవాది (ultra progressive) గా ముందుకొస్తాడు. .. తిలక్‌, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండుమెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి. కాకుంటే “రహస్యసృష్టి సానువులనుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు, మమ్మల్ని కనికరించు,” అని రాయలేడు. “మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం,” అని ఇంకే కవి రాయగలడు? . ..తను ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దేవుడు ఎవరైతేనేం, తన కోరికలు తీర్చలేడని తిలక్‌కి తెలుసు. నాకు చందమామలో జింక కావాలంటే, ఏ దేవుడు ఇవ్వగలడు? తిలక్‌ ప్రగతి శీలుడైన మానవతావాది. అంటే, ఎప్పటికైనా తన కోరికలు ఏదోరకంగా నెరవేరుతాయని నమ్మిన కవి. మనిషిలో మంచిని నమ్మిన కవి.[12]

కొట్టెకోల విజయ్‌కుమార్‌ : కవిత్వం మనస్సుకీ ఉద్రేకాలకీ సంబంధించింది. ఈ మనస్సునీ ఉద్రేకాల్ని కొలిచే సరైన మానం ఇదివరకు లేదు. ఇకముందు రాదు అని చెప్పవచ్చును. అంతవరకు కవిత్వానికి సరైన నిర్వచనం రాదు. మన లోపల్లోపల జరిగే ఒకానొక అనుభూతి విశిష్టత కవిత్వానికి ఆధారం అని తిలక్‌ ప్రకటించాడు, కవితాజ్ఞాని అయినాడు. తిలక్‌ కవిత్వానికి అసలు రూపం అమృతం కురిసిన రాత్రి దీనిలోని ప్రతి కవిత కొత్త శిల్పంతో కొత్త భావంతో రక్తి కడుతుంది. హృదయాన్ని కదిలిస్తుంది. మెదడుకి పదును పెడుతుంది. భావ తీవ్రతతో పాఠకులలో ఒకవిధమైన మానసికావస్థను కలిగించాడు. వచన కవితా నిర్మాణ శిల్పరహస్యవేది అయిన తిలక్‌ చిన్నవయస్సులోని జూలై 2న 45 సంవత్సరములకే మరణించాడు. 'తిలక్‌ మంచి అందగాడు, మానసికంగా మెత్తనివాడు, స్నేహశీలి కవి, రసజ్ఞుడు' అని కుందుర్తి అమృతం కురిసిన రాత్రి పీఠికలో అన్నాడు.[13]

శ్రీశ్రీ :

గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
వయస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి

తిలక్ రచనలు[మార్చు]

కవితా సంపుటాలు
కథానికా సంపుటాలు
  • తిలక్ కథలు (1967)
  • సుందరీ-సుబ్బారావు (1961)
  • ఊరి చివరి యిల్లు (1961)
నాటకాలు
  • సుశీల పెళ్ళి (1961)
  • సాలె పురుగు
నాటికలు
  • సుచిత్ర ప్రణయం (1961)
  • ఇరుగు-పొరుగు (1960)
  • సుప్తశిల (1967)
  • పొగ
  • భరతుడు
లేఖా సాహిత్యం

పురస్కారం[మార్చు]

తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

పుస్తక మూలాలు[మార్చు]

  • ఇంద్రగంటి, శ్రీకాంతశర్మ (2012). దేవరకొండ బాలగంగాధర తిలక్. భారతీయ సాహిత్య నిర్మాతలు. బెంగళూరు: సాహిత్య అకాడెమీ. ISBN 81-260-3330-4.

వనరులు, మూలాలు[మార్చు]

  1. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 2012, p. 16.
  2. 2.0 2.1 2.2 2.3 ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 2012, p. 17.
  3. 3.0 3.1 3.2 3.3 ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 2012, p. 21.
  4. 4.0 4.1 4.2 ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 2012, p. 18.
  5. 5.0 5.1 బేతవోలు, రామబ్రహ్మం (2016). "గోరువంకలు - వినిపించని కువకువలు". In కె., శరచ్చంద్ర జ్యోతిశ్రీ; పెనుగొండ, లక్ష్మీనారాయణ (eds.). తిలక్ సాహితీ సందర్శనం. విజయవాడ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
  6. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 2012, p. 19.
  7. 7.0 7.1 ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 2012, p. 22.
  8. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 2012, p. 32.
  9. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 2012, p. 33.
  10. ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం[permanent dead link]
  11. శత వసంత సాహితీ మంజీరాలు - వంద పుస్తకాలపై విశ్లేషణ - రేడియో ఉపన్యాసాల సంకలనం - ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, విజయవాడ వారి ప్రచురణ - ఇందులో "అమృతం కురిసిన రాత్రి" పుస్తకంపై ఉపన్యాసం ఇచ్చినవారు జి. గిరిజా మనోహర్ బాబు, హన్మకొండ
  12. "వేలూరి వేంకటేశ్వరరావు - "ఈమాట" అంతర్జాల పత్రికలో". Archived from the original on 2008-10-05. Retrieved 2008-09-24.
  13. "కొట్టెకోల విజయ్‌కుమార్‌ - ఆంధ్రప్రభలో వ్యాసం". Archived from the original on 2008-03-29. Retrieved 2008-09-24.
  14. బాల గంగాధర్ తిలక్, దేవరకొండ. అమృతం కురిసిన రాత్రి.