ద్రోణ పర్వము పంచమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పంచమాశ్వాసము[మార్చు]

పాండవ శిబిరంలో ఆనందోత్సాహాలు[మార్చు]

దస్త్రం:Ajuna and Srikrishna meets Yudhistira after the death of Jayadhradha.jpg
సైంధవుని మరణానంతరం ధర్మజుని కలసిన కృష్ణార్జునులు

సైంధవవధా సందర్భమున కృష్ణార్జునులు చూపిన ప్రతిభ ధృతరాష్ట్రుడిలో భయోత్పాతాలు కలిగించాయి. " సంజయా ! సైంధవ వధానంతరం నా కుమారులు ఏమి చేసారో వివరించుము " అన్నాడు. సంజయుడు " మహారాజా ! సైంధవవధ కలిగించిన ఉత్సాహంతో పాండవసేన కౌరవసేనతో తలపడింది. కృపాచార్యుడు, అశ్వత్థామ అర్జునుడి మీద శరవర్షం కురిపించారు. అర్జునుడు ఆ శరములన్నీ ఖండించి తిరిగి వారి మీద శరవర్షం కురిపించాడు. శరధాటికి కృపాచార్యుడు స్పృహతప్పాడు. అతడి సారధి కృపాచార్యుని పక్కకు తీసుకు వెళ్ళాడు. అశ్వథ్థామ కూడా అతడి వెంట వెళ్ళి పోయాడు. అది చూసి అర్జునుడు ఖిన్నుడైయ్యాడు. కృష్ణుడు అర్జునుడుని ఓదారుస్తూ " అర్జునా ! దేవేంద్రునికైనా గెలువ సాధ్యం కాని కురుసేనను ఒంటి చేత్తో గెలిచిన నీ పరాక్రమము ప్రశంశనీయము. సైంధవుని తల వృద్ధక్షతుడి ఒడిలో పడవేసి మహా తపోధనుడి శాపం నుండి తప్పించు కున్నావు. ఇంద్రుడిచ్చిన శక్తాయుధంతో విర్ర వీగుతున్న కర్ణుని జయించి ప్రశంశా పాత్రుడవు కమ్ము " అన్నాడు. అర్జునుడు కృష్ణా ! అలా అనకు నీ కృపతో నేను సైంధవుని వధించగలిగాను. నీ కటాక్షవీక్షణం పొందిన వాడికి కార్య సిద్ధి కలుగక మానదు " అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి " అర్జునా! మన కొరకు ధర్మరాజు ఎదురు చూస్తుంటాడు. మనం వెళ్ళాలి " అన్నాడు. అర్జునుడు, సాత్యకి, భీముడు, ఉత్తమౌజుడు ధర్మరాజు వద్దకు వెళుతుండగానే సూర్యాస్తమయం అయింది. ఇరు పక్షాలు యుద్ధం మాని తమ శిబిరాలకు వెళ్ళారు. ధర్మరాజు శిబిరం చూసి కృష్ణుడు పాంచజన్యం పూరించాడు. ఆ శంఖధ్వని విని ధర్మరాజు వెలుపలకు వచ్చి ఒకే సారి వారిద్దరిని కౌగలించుకొని ఆనందబాష్పాలు రాల్చి " అర్జునా! అర్జునా! నీ శపధము నెరవేర్చుకున్నావు. ఈ మహానుభావుని దయ వలన ఈ గండం గడిచి బయట పడ్డాము " అని శ్రీకృష్ణుని కృతజ్ఞతాభావంతో చూసాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా! కౌరవుల మీద మీకు ఉన్న కోపమే ఈ విజయానికి కారణం అయింది. మీ వంటి సత్పురుషుల కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరం ? ఒక్క అర్జునుడే కాదు, సైంధవుని వధించుటే కాదు, ఇలాంటి దుస్సాధ్యమైన కార్యాలు ఎన్నైనా ఎవరైనా అవలీలగా చేయగలరు. మీలాంటి సత్ప్రుషుల కోపానికి ఉన్న ప్రభావం అలాటింది " అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు " కృష్ణా! నీవే అలిగిన దేవాసురులు సహితం రూపు మాసిపోతారు. నీ దయ ఉంటే మాత్రమే జీవులు సుఖంగా జీవించగలరు. మా మీద నీ దయ ప్రసరించినంత కాలము మాకు కార్య సిద్ధి లభిస్తుంది " అన్నాడు వినయంగా. ఇంతలో భీముడు, సాత్యకి ధర్మరాజుకు నమస్కరించారు. ధర్మరాజు వారిని లేవనెత్తి కౌగలించుకున్నాడు. శత్రు సంహారంతో ధర్మరాజు ఆనందానికి అవధులు లేక పోయింది.

కౌరవశిబిరంలో విషాదచ్ఛాయలు[మార్చు]

కౌరవ శిబిరంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. సుయోధనుడు తనలో తాను ఇలా తర్కించుకున్నాడు. " అర్జునుడికి కోపం వచ్చిన దేవతలకే అలవి కాడు. ఇక ద్రోణుడు, కర్ణుడు ఎంత అని నేడు తేటతెల్లం అయింది. ద్రోణుడు, కర్ణుడు మమ్ము ఎంత ఆదుకొనవలెనని ప్రయత్నించినా అర్జునుడి ముందు శక్తిహీనులు అయ్యారు " అనుకుంటూ ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! ప్రతిరోజు యుద్ధంలో మనకు అపజయం పాండవులకు విజయం లభిస్తుంది. నా తమ్ములతో సహా అనేక యోధులు మరణించారు. ఆ శిఖండి కారణంగా మహాబలవంతుడైన భీష్ముడు పడిపోయాడు. మన సైన్యంలో ఏడు అక్షౌహినుల సైన్యం మరణించారు. సైంధవుడు మరణించాడు, మన కొరకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధము చేయవచ్చిన రాజులు అసువులు బాసారు. ఇక నేను పాండవులను వధించి విజయం సాధించడమో లేక వీరస్వర్గం అలంకరించడమో మాత్రమే మిగిలి ఉంది . మరేదైనా మార్గం ఉంటే శలవివ్వండి. మీకు అర్జునుడు ప్రియశిష్యుడు ఆ కారణంగా అతడు చేజిక్కినా చంపక వదిలివేయడమే కాక అతడికి సాయం చేస్తున్నారు. కర్ణుడు ఎంతటి వీరుడైనా యుద్ధనైపుణ్యంలో కాని కార్య సాధనలో కాని మీకు సాటి రాడు. ఉపాయము అనుభము ఉన్న మీరు మాకు సహకరించడం లేదు. కర్ణుడు ఎంత ప్రయత్నించినా సైంధవుని రక్షించ లేక పోయాడు. సామర్ధ్యం కలిగిన మీరు కాపాడ లేదు " అన్నాడు.

ద్రోణుని వ్యధ[మార్చు]

సుయోధనుడి ములుకుల వంటి మాటలకు నొచ్చుకున్నద్రోణుడు " సుయోధనా ! నా గుండెలు తూట్లు పొడిచే మాటలు ఎందుకు మాట్లాడతావు. కృష్ణుని సాయం ఉన్నంత వరకు అర్జునుడిని గెలవడం అసాధ్యమని నీకు ముందే చెప్పాను నీవు వినలేదు. దేవతలకే గెలువ శక్యము కాని భీష్ముని పడగొట్టిన అర్జునుడికి సాధ్యము కానిదేముంది. నేను నీ పక్షాన యుద్ధము చేస్తున్నది నా అభిమానం కాపాడు కోవడనికే కాని పాండవులను జయిస్తానని కాదు. సుయోధనా ! నాడు నిండు సభలో శకుని చేత పాచికలాడించి పాండవులను అనేక విధముల అవమానించి హింసించావు. నేడు ఆ పాచికలే అర్జునుడి బాణాలై నిన్ను బాధిస్తున్నాయి. వాటిని నిలువరించడం ఎవరి తరం చెప్పు. విదురుడు ఎంత చెప్పినా వినక నాడు పాండుసతిని కొలువు కూటముకు ఈడ్చి చేసిన అవమానం ఊరక పోతుందా ! ఆ వీరపత్నిని నిండు సభలో నీవు, దుశ్శాసనుడు, కర్ణుడు తూలనాడి అన్న మాటలు ఊరకే పోతాయా ! ప్రశస్త చరితులైన పాండుసుతులను అధికారమదంతో కళ్ళు నెత్తికెక్కి చేసిన అవమానం మీకు చెరుపు చేయదా ! సుయోధనా ! మీరు చేసిన అవమానములు సహించి అరణ్య అజ్ఞాత వాసం ముగించుకుని అంతా మరచి వారికి రావలసిన అర్ధభాగం అడిగితే నీవు కనికరం లేక నిర్ధాక్షిణ్యంగా నిరాకరించావు. ఇంత అధర్మవర్తనుడివైన నీ తరఫున యుద్ధం చేస్తున్న నేను ఒక బ్రాహ్మణుడినా ! నాది ఒక బ్రాహ్మణ జన్మా ! నేనంటే శకట వ్యూహం వద్ద ఉన్నాను సైంధవునికి సమీపంలో ఉన్న నువ్వు, కర్ణుడు మిగిలి యోధులు ఏమి చేసారు. నీవు వారందరిని మాటలతో ఎందుకు బాధించవు నన్ను మాత్రమే నిందుస్తున్నావెందుకు వారు నీకు కావలసిన వారు నేను కానా ! యుద్ధసమయంలో పాండవయోధులు వారి శరములతో బాధిస్తున్నారు అలసి వచ్చిన నా మనసును నీవు నీ మాటలతో బాధిస్తున్నావు ఇది నీకు న్యాయమా ! గతజల సేతుబంధన మేలనయ్యా ! రేపటి యుద్ధంలో మీరంతా వీరోచితంగా పోరాడండి. నా వంతుకు నేను పాంచాలురను వధిస్తాను. కావలసిన కార్యము మీద మనసుంచి సైన్యాలను యుద్ధోన్ముఖులను చెయ్యి. వారి మనసులో ఉత్సాహాన్ని నింపి నీవు కూడా నీ పరాక్రమము చూపు. రేపు నేను యుద్ధభూమికి వెళ్ళి జరగరానిది జరిగి తిరిగి రాకుంటే అశ్వత్థామ తట్టుకోలేడు. నా మాటగా అశ్వత్థామకు చెప్పు " నాయనా అశ్వత్థామా ! బ్రాహ్మణుల ఎడ, వృద్ధుల ఎడ భక్తి శ్రద్ధలు చూపుతూ ధర్మవర్తనుడవై మెలగుము. నేను చంపగా మిగిలిన పాంచాల వీరులను నీవు తుదముట్టించుము. ఇదే నా కడపటి సందేశం " అన్నాడు.

కర్ణుడు సుయోధనుడిని ఓదార్చుట[మార్చు]

ద్రోణశిబిరం నుండి కర్ణుని వద్దకు వెళ్ళి " కర్ణా ! నేడు జరిగిన యుద్ధం చూసావు కదా ! మన గురువు ద్రోణుడు శత్రుదుర్భేద్యమైన శకటవ్యూహము పన్ని అర్జునుడిని, సాత్యకిని లోనికి వదిలాడు. అర్జునుడు ఒక్కడే లోనికి ప్రవేశించి వీరవిహారం చేసి సైంధవునికి రక్షణగా ఉన్న రాజులను ససైన్యంగా తుద ముట్టించి సైంధవుడిని ఎలా చంపగలడు. అర్జునుడి శత్రుసంహారం ద్రోణుడు ఆపలేక పోయాడు అంటే మనం నమ్మాలా ! అసలు ద్రోణుడు సైంధవుడిని రక్షిస్తాను అనబట్టే మనం సైంధవుని యుద్ధానికి తీసుకు వచ్చాము. లేకున్న అతడు తన ఇష్టానికి ఎక్కడో ఉండే వాడు. మనం ఇంత సైన్యాన్ని నష్టపోవలసిన అవసరం ఉండేది కాదు. కేవలం సైంధవుడిని రక్షిచించడానికి మనం ఇంత సైన్యాలను నష్టపోవలసి వచ్చింది. ద్రోణుడికి మనం ఎంత కావలసిన వారము కాదో అర్జునుడు అంత కావలసిన వాడు అయ్యాడు. ఈ పరిస్థిలో మనం ద్రోణుని నమ్మి యుద్ధం చేయడం సమంజసమా ! " అన్నాడు. సుయోధనుడి మాటలు సావధానంగా విన్న కర్ణుడు " రారా రాజా! మనం ద్రోణుని నిందించడం ఎందుకు ? అతడు తన శక్తి కొలది యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడిని చంపలేక పోవడం నిజమే ద్రోణునికి కూడా అర్జునుడిని చంపడం సాధ్యము కాదేమో ! పాండవులను చంపడానికి మనం ఎంత ప్రయత్నించాము. విషం పెట్టాము, లక్క ఇంట్లో పెట్టి కాల్చాము, అడవులకు పంపాము అయినా వారు నాశనం కాలేదు. ఇది దైవఘటన కాక మరేమి. సైంధవుని చంపడం విధి విలాసమే ! అర్జునుడు నిమిత్తమాతృడు. కనుక నీవు ధైర్యం కోల్పోవద్దు. మన శక్తి వంచన లేక యుద్ధం చేస్తాము. ఫలితం దైవ నిర్ణయం. సైంధవుడిని రక్షించడానికి మనం చేయవలసినది చేసాము ఇక కలత చెందుట ఎందుకు " అన్నాడు.

ద్రోణసారధ్యంలో ఐదవనాటి యుద్ధం[మార్చు]

ఇరు పక్షములు యుద్ధ భూమిలో మొహరించాయి. సుయోధనుడు సైంధవుని మరణంతో కలిగిన వ్యధతో తెగించాడు. అంత సాహసం పనికిరాదు అని ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు ఎంత చెప్పినా వినక పాండవులతో ఘోరయుద్ధం చేస్తున్నాడు. భీముని పది బాణములతోను, నకులుడిని మూడు బాణములతో, శిఖండిని నూరు బాణములతో, ధృష్టధ్యుమ్నుని డెబ్బై బాణములతోను, ధర్మరాజును, సాత్యకిని ఐదేసి బాణములతోను కేకయరాజులను లెక్కకు మించిన బాణములతోను ఎదుర్కొని సింహనాదం చేసాడు. ఇది చూసి ధర్మరాజు కోపంతో ఊగిపోతూ సుయోధనుడి విల్లు విరిచి అతడిని మూర్చిల్లేలా కొట్టాడు. సుయోధనుడు రథము మీద కుప్పకూలగానే అతడు మరణించాడని వార్త గుప్పుమంది. పాండవ సైన్యంలో సంతోషం వెల్లి విరిసింది భేరి నాదాలు మోగాయి. ఇది చూసి ద్రోణుడు పాండవసేనలపై విరుచుకు పడ్డాడు. ఇంతలో సుయోధనుడు తేరుకుని ధర్మరాజును ఎదుర్కొన్నాడు. కౌరవ సేనలు పాండవులు సేనలను ఎదుర్కొన్నాయి. పాడవులు, సాత్యకి మొదలుగా యాదవవీరులు, విరాటరాజాది మత్స్యదేశపు వీరులు, ద్రుపదుడు మొదలైన పాంచాలవీరులు, ఉపపాడవులు ద్రోణుని మీద శరవర్షం కురిపించాడు. కర్ణుడు, ద్రోణుడు పాండవ సేనలపై విజృంభించారు. ఇరుపక్షముల మధ్య పోరు ఘోరమై రక్తం ఏరులై పారుతుంది. ద్రోణుడు పాండవపక్షంలో ఉన్న కేకయవీరులను, ధృష్టధ్యుమ్నుని కుమారులను హతమార్చాడు. అప్పుడు శిబి ద్రోణుని ఎదుర్కొని అతడి సారథిని చంపి శరీరం మీద ముప్పై బాణములు క్రూరంగా నాటాడు. ఆగ్రహించిన ద్రోణుడు ఆరు భల్లబాణాలతో శిబి హయములను, సారథిని నరికి మరొక బాణంతో శిబి తల నరికాడు.

భీమసేనుని పరాక్రమం[మార్చు]

భానుమంతుని కుమారుడు భీమసేనుని ఎదుర్కొని అతడి మీద శరవర్షం కురిపించాడు. భీమసేనుడు భానుమంతుని కుమారుని మీదకు రథమును పోనిచ్చి అతడి రథమును ఢీకొట్టి అతడి రథము మీదకు లంఘించి అతడిని కాలితో తన్ని ఎముకలు విరిచి చంపాడు. ఇది చూసిన పాంచాలసేనలు జయజయధ్వానాలు చేసాయి. అది సహించలేని కళింగ రాజకుమారుని సోదరులు ధ్రువుడు, జయరాధుడు భీముని మీద విరుచుకు పడ్డారు. భీముడు ధ్రువుడి రథము మీదకు ఎక్కి అతడిని పిడికిలితో కొట్టి చంపి జయరాధుని రథము ఎక్కి అతడిని సారథిని తుదముట్టించాడు. ఇది చూసిన కర్ణుడు తన శక్తి ఆయుధమును భీమునిపై విసిరాడు. భీముడు దాన్ని పట్టుకుని తిరిగి కర్ణుడి మీద వేసాడు. అది చూసి శకుని తన భల్ల బాణంతో దానిని ముక్కలు చేసాడు.

భీమసేనుడు కురురాజకుమారులను వధించుట[మార్చు]

ఇంతలో ధృతరాష్ట్రకుమారులు దుర్మదుడు, దుష్కర్ణుడు భీమసేనుని ఎదుర్కొన్నారు. భీమసేనుడు కోపించి దుర్మదుడి రథము మీదకు లంఘించి అతడి సారథిని చంపాడు. దుర్మదుడు, దుస్కర్ణుడి రథము మీదకు దూకి భీమసేనుడి మీద శరవర్షం కురిపించి భీముని రథము కూలత్రోసారు. భీముడు తన రథమును తన్ని తాను కూడా వారి రథము ఎక్కి వారిని కాళ్ళతో చేతులతో మర్ధించి ఇద్దరిని మాంసపు ముద్దలు చేసి చంపాడు. ఇది చూసి సుయోధనుడు ఏమి చేయలేక పోయాడు. భీముని పరాక్రమము చూసిన కౌరవ సేనలు పారిపోయాయి. అప్పుడు ద్రోణుడు, కర్ణుడు ఒకటై భీమసేనుడిపై బాణములు గుప్పించారు. భీమునికి సాయంగా ధర్మరాజు, నకులసహదేవులు, సాత్యకి, విరాటుడు యుద్ధం చేస్తున్నారు.

సాత్యకిని సోమదత్తుడు ఎదుర్కొనుట[మార్చు]

సోమదత్తుడు సాత్యకిని ఎదుర్కొని " ఓ సాత్యకీ ! నిలువుము ప్రాయోపవేశం చేస్తున్న భూరిశ్రవసుడిని కిరాతకంగా చంపడం వీరత్వమా ! అదే రాజ ధర్మమా ! ఈ రోజు నీవు నా చేతిలో మరణించావులే " అంటూ సాత్యకి మీద దూకాడు. ఆ మాటలకు సాత్యకి నవ్వి " సోమదత్తా ! భూరిశ్రవసుని చంపడం రాజధర్మమని నువ్వు అనుకుంటే ఇప్పుడు నిన్ను చంపి రాజధర్మం ఏమిటో నిరూపిస్తాను కాచుకో " అన్నాడు. అంటూ సోమదత్తునితో తలపడ్డాడు. అంతలో సుయోధనుడు తన సైన్యంతో సోమదత్తునికి సాయంగా వచ్చాడు. ఒంటరిగా పోరుతున్న సాత్యకికి ధృష్టద్యుమ్నుడు తన అపారసైన్యముతో సాయంగా వచ్చాడు. సోమదత్తుడు నిశిత తొమ్మిది బాణములతో సాత్యకిని కొట్టాడు. బదులుగా సాత్యకి తొమ్మిది బాణములతో కొట్టి సోమదత్తుడిని మూర్చిల్లజేసాడు. సోమదత్తుడి రథసారథి సోమదత్తుడిని దూరంగా తీసుకు వెళ్ళాడు. తరువాత అశ్వత్థామ సాత్యకిని ఎదుర్కొన్నాడు. మధ్యలో ఘటోత్కచుడు తన రాక్షస సైన్యంతో అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. ఇది చూసి భయపడిన దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారు అక్కడి నుండి పక్కకు తొలిగారు.

అంజనపర్వ అశ్వత్థామల పోరు[మార్చు]

అప్పుడు సంధ్యా సమయం అయింది. సంధ్యాసమయంలో రాక్షసులకు బలం పెరుగుతుంది కనుక కురు సైన్యంలోని మహాయోధులు కూడా ఘటోత్కచుని ముందు నిలువ లేక పోయారు. కాని అశ్వత్థామ మాత్రం నిలిచి ఘటోత్కచునితో పోరుసాగిస్తూ ఘటోత్కచుని గుండెలకు గురి పెట్టి పది బాణములు వేసాడు. ఘటోత్కచుడు తన చక్రాయుధాన్ని అశ్వత్థామ మీద వేసాడు. అశ్వత్థామ దానిని మధ్యలోనే నరికాడు. ఘటోత్కచుని కుమారుడు అంజనపర్వుడు అశ్వత్థామను ఎదుర్కొని అశ్వత్థామ మీద శరవర్షం కురిపించాడు. అశ్వత్థామ అంజనపర్వుని విల్లు విరిచి అతడి రథము విరిచాడు. అంజనపర్వుడు ఒక ఖడ్గం తీసుకుని అశ్వథ్థామ మీద లంఘించాడు. అశ్వత్థామ ఆ ఖడ్గమును విరిచాడు. ఆ రాక్షస వీరుడు ఆకాశంలోకి ఎగిరి అశ్వత్థామ మీద శరవర్షం కురిపించాడు. అశ్వత్థామ వాటిని తుత్తునియలు చేసి అంజనపర్వుని శరీరాన్ని శరములతో నింపాడు. ఆ బాధభరించ లేక అంజనపర్వుడు భూమి మీదికి దిగి రథము ఎక్కి అశ్వత్థామ మీద శరసంధానం చేసాడు. అశ్వత్థామ ఒక వాడి అయిన బాణంతో అంజనపర్వుని తల తెగనరికాడు.

ఘటోత్కచుడు అశ్వత్థామను ఎదుర్కొనుట[మార్చు]

తరువాత అశ్వత్థామ పాండవసైన్యమును సంహరిస్తున్నాడు. కుమారుని మరణం చూసి ఘటోత్కచుడు తీవ్రమైన కోపంతో అశ్వత్థామను చూసి " అశ్వత్థామా! నిలువుము నీవు ఈ రోజు నన్ను తప్పించుకుని పోలేవు అని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ " ఘటోత్కచా ! నీవు బాలుడవు నాతో యుద్ధం చేయ లేవు. నీవు నాకు పుత్రసమానుడవు నీ మీద నాకు కోపం కలగడం లేదు కనుక నీతో యుద్ధం చేయలేను వెళ్ళు " ఘటోత్కచుడు బదులుగా " అశ్వత్థామా ! కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న నాకు నువ్వు ఎక్కడి తండ్రివి నా తండ్రి భీమసేనుడు. నేను నిన్ను వధించక మానను " అని ఘటోత్కచుడు వెంటనే తన అసుర మాయలు అశ్వత్థామ మీద ప్రయోగించాడు. అశ్వత్థామ వాటిని తిప్పి కొట్టి కొండ వలె తన మీదకు వస్తున్న ఘటోత్కచుని తన వజ్రాస్త్రంతో కొట్టాడు. ఘటోత్కచుడు మేఘంలా మారాడు. అశ్వత్థామ వాయవ్యాస్త్రం ప్రయోగించి ఆ మేఘమును చెదరగొట్టాడు. వెంటనే ఘటోత్కచుడు ఉగ్రమైన ఆకారందాల్చాడు అతడి అనుచరులు భయంకరాకారాలతో కౌరవ సైన్యాలతో తలపడి సుయోధనుడు బలములు నిర్మూలిస్తున్నాడు. అది చూసి ఖిన్నుడైన సుయోధనుడు స్వయంగా తానే ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ రారాజా ! ఘటోత్కచుని ఎదుర్కొనుటకు నీవు కావాలా ! నేను చాలనా నువ్వు చూస్తుండు చాలు " అని ఘటోత్కచునితో తలపడ్డాడు. సుయోధనుడు శకునిని చూసి " మామా! ఇక మనకు భయం లేదు ఘటోత్కచుడితో సహా పాండవసైన్యం నిర్మూలించబడినట్లే మనం జయించామని ప్రకటించు నీవు, కృపాచార్యుడు, కర్ణుడు మొదలైన యోధులు అశ్వత్థామకు సాయం వెళ్ళండి అని తాను అశ్వద్దామకు సాయంగా వెళ్ళాడు. ఘటోత్కచుడు అశ్వత్థామ విల్లు విరిచాడు. అశ్వథ్థామ మరొక్ల విల్లు తీసుకుని ఘటోత్కచుని రాక్షస సైన్యమును నాశనం చేస్తున్నాడు. అది చూసి సుయోధనుడు అశ్వత్థామను ఎంతగానో కొనియాడాడు. పాండవ వీరులు అశ్వథ్థామ ధాటికి ఆగలేక దిక్కుతోచక చూస్తున్నారు. ఘటోత్కచుడు అశ్వత్థామ మీదకు పరిఘను విసిరాడు. అశ్వత్థామ దానిని పట్టుకుని తిరిగి ఘటోత్కచుని మీదకు విసిరాడు. ఘటోత్కచుడు ధుష్టద్యుమ్నుని రథము మీద ఎక్కి దాని నుండి తప్పించుకున్నాడు. అశ్వత్థామ విసిరిన పరిఘ ఘటోత్కచుని రథమును సారథిని ధ్వంసం చేసింది. ఘటోత్కచుడు దుష్టద్యుమ్నునితో చేరి యుద్ధం చేస్తుండగా భీమసేనుడు వారి వద్దకు వచ్చి యుద్ధం చేయసాగాడు. అశ్వత్థామ వారి ముగ్గురిని ఎదుర్కొని శరవర్షం కురిపించాడు.

అశ్వత్థామ పరాక్రమం[మార్చు]

ఆ రోజు విజృంభించి యుద్ధం చేస్తున్న అశ్వత్థామ రణరంగాన్ని పీనుగుల పెంట చేసాడు. విరిగిన రథములు, ఏనుగుల గుర్రముల కళేబరములు యుద్ధభూమిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలా ఒక్కరోజే అశ్వత్థామ ఒక అక్షౌహిని సైన్యాలను నిర్మూలించాడు. అది చూసి ద్రుపదుని కుమారులైన సురధుడు, శత్రుంజయుడు, బలానీకుడు, జయానీకుడు, పృషధృడు, జయానీకుడు, జయుడు, చంద్రసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని అశ్వత్థామ మీద శరవర్షం కురిపించారు. మరుక్షణంలో అశ్వత్థామ వారినందరిని యమసదనానికి పంపాడు. ఆ తరువాత కుంతిభోజుని కుమారులు అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని తృటికాలంలో సంహరించి కాలదండం లాగ ఉన్న బాణమును ఘటోత్కచుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణము ధాటికి ఘటోత్కచుడు రథము మీద పడి మూర్చిల్లాడు. వెంటనే దుష్టద్యుమ్నుడు ఘటోత్కచుడిని తీసుకు వెళ్ళాడు. అది చూసి అశ్వత్థామ సింహనాదం చేసాడు. ధర్మరాజు, సాత్యకి వచ్చి భీమునికి సాయంగా యుద్ధం చేయసాగారు. ఇంతలో ఘటోత్కచుడు మూర్చ నుండి తేరుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. పాండవ సైన్యాలు ఒక వ్యూహముగా ఏర్పడి అశ్వత్థామను చుట్టుముట్టాయి. అది చూసి కౌరవసేనలు సోమదత్తుని బాక్లికుని ముందుంచుకుని పాడవ సేనతో తలపడ్డాయి.

భీమసేనుడి విజృంభణ[మార్చు]

సాయంసమయం అయింది. సాత్యకి సోమదత్తుని ఒక నిశితశరముతో కొట్టాడు. ఘటోత్కచుడు సోమదత్తుడిని ముద్గర అనే ఆయుధముతో కొట్టాడు. ఆ దెబ్బలకు సోమదత్తుడు సోలిపోయాడు. తన కుమారుడు సోమదత్తుడు సోలిపోగానే బాహ్లికుడు సాత్యకితో యుద్ధముకు తలపడ్డాడు. భీముడు బాహ్లికునితో తలపడి బాణప్రయోగం చేసాడు. బాహ్లికుడు శక్తి ఆయుధంతో భీముని కొట్టాడు. ఆ శక్తిఆయుధ ఘాతానికి భీముడు మూర్చిల్లినా వెంటనే తేరుకుని బాహ్లికుని ముద్గర అను ఆయుధముతో కొట్టాడు. ముద్గర దెబ్బకు వయోధికుడైన బాహ్లికుడు తలపగిలి చనిపోయాడు. పాండవసేనలు జయజయధ్వానాలు చేసాయి.

భీమసేనుడి చేతిలో కురురాజకుమారులు మరణించుట[మార్చు]

బాహ్లికుని మరణం చూసి దుర్యోధనుడి తమ్ములు పది మంది భీముడితో తలపడ్డారు. తనను చుట్టుముట్టిన పది మంది రాకుమారులను భీముడు పది బాణములతో సంహరించాడు. అది చూసి కర్ణుని తమ్ముడు వృకరధుడు భీమునితో తలపడ్డాడు. తనను సమీపించిన వృకరధుని భీముడు ఒకే దెబ్బతో చంపాడు. తరువాత భీమునితో శకుని తమ్ములు పన్నెండు మంది తలపడ్డారు. భీముడు వారిని అవలీలగా సంహరించాడు. భీముని పరాక్రమానికి ఎదురు లేక పోయింది. భీముని ఎదుర్కొన్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టమైంది. ఆ తరువాత త్రిగర్త, బాహ్లిక, శూరసేన, మాళవ, వసాతి సేనలు ఒక్కుమ్మడిగా భీమసేనుని చుట్టుముట్టాయి. అది చూసి ధర్మరాజు తన సేనలతో భీమసేనుడిని చేరి కౌరవ సేనలను చీలి చెండాడటం మొదలు పెట్టారు. కౌరవ సేన క్రమంగా సన్నగిల్ల సాగింది.

ద్రోణుడు పాండవులను ఎదుర్కొనుట[మార్చు]

కురుసేన క్షీణించడం చూసి సుయోధనుడు ద్రోణునికి జరిగిన విషయం వివరించగానే ద్రోణుడు వెంటనే ధర్మరాజును ఎదుర్కొని అతడి మీద దివ్యాస్త్రప్రయోగం చేసాడు. ధర్మరాజు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు మీద ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు తిరిగి ఇంద్రాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ద్రోణుడు దర్మజునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగా ధర్మరాజు అదే అస్త్రాన్ని ప్రయోగంచి దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు అతడిని లక్ష్యపెట్టక పాంచాలసేనను సంహరిస్తూ వారిని తరిమి కొట్టాడు. అదే సమయంలో మత్స్య కేకయ సేనలు కురుసేనను చుట్టుముట్టాయి.

కృపాచార్యకర్ణుల వాదం[మార్చు]

సుయోధనుడు కర్ణుని వద్దకు వెళ్ళి తన పరాక్రమం చూపమని అర్ధించాడు. కర్ణుడు " అర్జునా! అర్జునుడు, భీముడు నాకు ఒక లెక్కా ! నేను ఒక్కడినే వారిరువురిని సంహరించి నీకు ఆహ్లాదం కలిగిస్తాను " అన్నాడు. కర్ణుని మాటలు విన్న కృపాచార్యుడు " కర్ణా ! చాలా బాగా పలికావు ఈ రోజుతో పాండవులను చంపి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నావు. ఈ పరాక్రమం ఘోషయాత్ర సమయాన, ఉత్తర గోగ్రహణ సమయాన ఏమైంది. ప్రగల్భములు వదిలి కార్యశూరత్వం చూపించు. అయినా నీవు ఇంత వరకు పాండవులను ఎదుర్కొన్నదే లేదు వారిని ఎలా గెలుస్తావు. మనమందరం అర్జునుడి చేత ఎన్ని సార్లు ఓడిపోయాము. ఇప్పుడు అతడికి ధర్మరాజు, భీముడు, ఘటోత్కచుడు ఉన్నారు. సాత్యకి విషయం సరేసరి. వీరినందరిని నీవు ఒక్కడివే గెవడం సాధ్యమేనా ! " అన్నాడు. ఆమాటలకు కర్ణుడు రోషపడి " కృపాచార్యా ! నేను ఆడిన మాట తప్పను పాండవులను జయించి అన్న మాట నెరవేర్చుకుంటాను. మీరంతా ఎప్పుడూ పాండవులను పొగిడి కౌరవసేనలో ఉత్సాహం తగ్గిస్తున్నారు. మన సైన్యంలో నేను, ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు మొదలైన అతిరధ మహారధులు లేరా నీ మాటలు వారిని కాని వారిని చేస్తున్నాయి. నీవు బ్రాహ్మణుడివి కనుక నీ అధిక ప్రసంగం సహించాను. ఇక ఒక్క మాట మాట్లాడినా నీ నాలుక కోస్తాను జాగర్త " అన్నాడు. తన మేనమామను దూషించడం చూసి అశ్వత్థామ క్రుద్ధుడై కత్తి తీసుకుని కర్ణుని మీదకు లంఘించాడు. సుయోధనుడు అశ్వత్థామను వారించగా కృపాచార్యుడు అశ్వత్థామను గట్టిగా పట్టుకుని " నాయనా అశ్వత్థామా ! అంతకోపం పనికి రాదు శాంతం వహించు " అని అనునయించాడు. సుయోధనుడు అశ్వత్థామను చూసి " గురుపుత్రా ! మీ అందరి లక్ష్యం పాండవులను జయించి నన్ను ఈ భూమండలానికి పట్టాభిషిక్తుడిని చేయడం. మనలో మనం కలహించుకుంటే విజయం ఎలా ప్రాప్తిస్తుంది. కర్ణుడి బదులుగా మీ అందరిని నేను క్షమాపణ అడుగుతున్నాను అతడిని క్షమించండి " అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు, అశ్వత్థామ శాంతించి తిరిగి యుద్ధసన్నద్ధమైయ్యారు.

కురు పాండవుల సమరం[మార్చు]

కర్ణుడు యుద్ధానికి రావడం చూసిన పాండవ యోధులు అందరూ " మన పాండవులు ఇంతటి దుర్ధశకు ఈ వినాశనానికి కారణమైన కర్ణుని వదలకండి వధించండి " అని అతడిని చుట్టుముట్టారు. కర్ణుడు అందుకు బెదరక ధైర్యంగా వారిని ఎదుర్కొని చీల్చిచెండాడసాగాడు. అది చూసి అర్జునుడు కర్ణుని ఎదుర్కొని ముప్పది బాణములతో అతడిని కొట్టాడు. కర్ణుని చేతిలో నుండి విల్లు జారిపోయింది. వేరొక విల్లు అందుకుని కర్ణుడు అర్జునుడు ఆశ్చర్యపడేలా శరములు గుప్పించాడు. అర్జునుడు ఆగ్రహించి ఒకే బాణంతో కర్ణుని విల్లు విరిచి, సారథి, హయములను చంపి కర్ణుని శరీరం నిండా శరములు గుచ్చాడు. వెంటనే కర్ణుడు కృపాచార్యుని దూషించానన్న సిగ్గు వదిలి పక్కనే ఉన్న అతడి రథము ఎక్కి తలదాచుకున్నాడు. కృపాచార్యుని రథము అక్కడి నుండి నిష్క్రమించింది. కర్ణుని పరాజయం చూసి కౌరవ సైన్యం పారిపోసాగింది. సుయోధనుడు " సైనికులారా ! పారిపోకండి నేను ఉన్నాను పాండవులను జయించగలము రండి " అని అర్జునుడిని ఎదుర్కోడానికి ముందుకు ఉరికాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వత్థాను చూసి " కుమారా! అశ్వత్థామా ! రారాజు తన బలం ఎంతో ఎరుగక అర్జునుడితో యుద్ధానుకి సన్నద్ధమౌతున్నాడు. అలా జరిగితే అతడు అర్జునుడికి పట్టుబడగలడు. నీవు ఇక్కడ ఉండగా అది జరుగరాదు. కనుక నీవు రారాజుకు సాయంగా వెళ్ళు " అన్నాడు. అశ్వత్థామ సుయోధనుడిని సమీపించి " సుయోధనా ! నేనుండగా నీ కెందుకు శ్రమ నేను అర్జునుడిని ఎదుర్కొంటాను నువ్వు వెళ్ళు " అన్నాడు. సుయోధనుడు " గురుపుత్రా ! నీకు నీ తండ్రికి అర్జునుడంటే వల్లమాలిన ప్రేమ మీరు అర్జునుడితో మనసారా యుద్ధం చేసి అతడిని చంపరు. ఇప్పటికే నా తమ్ములు చనిపోయారు సైన్యం క్షీణించింది. కనుక మీరు పాండవుల వద్దకు రావద్దు. మీరు పాండవులతో యుద్ధం చెయ్య వద్దు నేను వారితో యుద్ధం చేస్తాను. మీరు వారి సేనలను నశింపచేయండి " అన్నాడు. అశ్వత్థామ " రారాజా ! నాకు నా తండ్రికి అర్జునుడంటే అభిమానం ఉన్న మాట నిజమే అయినా యుద్ధరంగంలో శత్రుపక్షాన ఉన్న వారు మిత్రులైనా, బంధువులైనా, అభిమానాలకు తావుండదు. మేము మా ఒళ్ళు దాచక యుద్ధం చేయడం చూస్తూనే నువ్వు మమ్ము నమ్మడం లేదు నువ్వు ఎవరినీ నమ్మవు అసలు నిన్ను నువ్వే నమ్మవు. అదంతా ఎందుకు నేను శత్రు సైన్యంలో ప్రవేశించి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొని అతడి సైన్యమును పారతోలుతాను " అంటూ పాండసేనలో ప్రవేశించాడు.

అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని ఎదుర్కొనుట[మార్చు]

అది గమనించిన కేకయ, పాంచాల సేనలు అశ్వత్థామను చుట్టుముట్టాయి. అశ్వత్థామ వారి మీద శరవర్షం కురిపించి వారిని పారతోలాడు. అది చూసి ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొని " అశ్వత్థామా! నేను నీ తండ్రి ద్రోణుని చంపడానికి పుట్టిన వరప్రసాదిని. నీ తండ్రినే కాదు నిన్ను కూడా వధిస్తాను రా! " అన్నాడు. అశ్వత్థామ " ధృష్టద్యుమ్నా! నీ కోసమే ఎదురుచూస్తున్నాను రా! నా బాణములకు నిన్ను బలిచేస్తాను రా! " అంటూ ధృష్టద్యునుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు " నీ తండ్రి పని తరువాత చూడవచ్చు ముందు నీ పని పడతాను " అంటూ అశ్వత్థామ మీద శరములు గుప్పించాడు. అశ్వత్థామ కోపించి ధృష్టద్యుమ్నుని కేతనము ఖండించి, సారథిని, హయములను చంపి అతడి చక్రరక్షకులను నూరు మందిని చంపి సింహనాదం చేసాడు. పాంచాల సేనలు అశ్వత్థామ ధాటికి నిలువ లేక చెరిరి పోయాయు. అది చూసి ధర్మరాజు, భీముడు తమ సైన్యాలతో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చారు. సుయోధనుడు ద్రోణుని తీసుకుని అశ్వత్థామకు సాయం వచ్చాడు. అది చూసిన అర్జునుడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ఇరు పక్షాల నడుమ పోరు ఘోరమైంది. అర్జునుడు తన వాడి అయిన బాణములతో మగధ, మద్ర, వంగదేశముల నాశనం చేస్తున్నాడు. భీముడు అంబష్ట, శిబి, వంగదేశ సైన్యములను తుద ముట్టించాడు. అది చూసి ఆగ్రహించిన ద్రోణుడు వాయవ్యాస్త్రమును ప్రయోగించి పాండవసేనలను చెల్లాచెదురు చేసాడు. అర్జునుడు, భీముడు ద్రోణునికి రెండు వైపుల నిలిచి శరములు గుప్పించాడు. ద్రోణుడు బెదరక పాండవ సేనలను తనుమాడుతున్నాడు. సుయోధనుడు పాండవ సేనలను చెల్లాచెదురు చేస్తున్నాడు. అప్పుడు సోమదత్తుడు పాండవ సేనలను ఎదుర్కొన్నాడు. సాత్యకి సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. సోమదత్తుడు ఒకే బాణంతో సాత్యకి విల్లు విరిచి సాత్యకిని ముప్పై అయిదు బాణాలతో కొట్టాడు. సాత్యకి మరొక విల్లందుకుని సోమదత్తుని విల్లు విరిచాడు . సోమదత్తుడు మరొక విల్లు తీసుకున్నాడు. అది చూసి భీముడు సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు సోమదత్తుడి మీద పరిఘను విసిరాడు. సోమదత్తుడు దానిని రెండు ముక్కలు చేసాడు. సాత్యకి ఒక వాడి అయిన బాణములతో సోమదత్తుడి సారథిని, హయములను చంపి మరొక నారసముతో సోమదత్తుడి తల నరికాడు. సోమదత్తుడి మరణం చూసి కౌరవ సేనలు సాత్యకిని ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. అది చూసిన ధర్మరాజు సాత్యకిని అక్కడి నుండి తప్పించి తాను ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు విల్లు విరిచి, కేతనము పడగొట్టి ధర్మజుని శరీరం తూట్లు పడేలా కొట్టాడు. ధర్మరాజు ఉగ్రరూపందాల్చి మరొక విల్లందుకుని ద్రోణుని శరీరంలో గుచ్చుకునేలా బాణములు సంధించాడు. ద్రోణుడు తన రథము మీద మూర్చిల్లాడు. కొంచెం సేపటికి తేరుకున్న ద్రోణుడు తేరుకుని పాండవ సైన్యం మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు కూడా వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి దానిని నిర్వీర్యం చేసి ద్రోణుని మీద శరములు గుప్పించాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మజుని వద్దకు వెళ్ళి " ధర్మజా ! నిన్ను పట్టుకుని సుయోధనుడికి అప్పగిస్తానన్న ద్రోణుని ప్రతిజ్ఞ మరిచావా ! ద్రోణునితో యుద్ధము మంచిది కాదు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళి భీముడికి సాయపడు " అన్నాడు. కృష్ణుడి మాట మన్నించి ధర్మజుడు భీముని వద్దకు వెళ్ళాడు. ద్రోణుడు ధర్మజుడిని వదిలి పాంచాల సేనలను ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి కౌరవ సేనలను తనుమాడుతున్నారు. కృపాచార్యుడు, కర్ణుడు, ద్రోణుడు వారిని ఎదుర్కొన్నారు. యుద్ధం ఘోరరూపందాల్చింది. సేనల పదఘట్టనలకు రేగిన ధూళి ఆకాశాన్ని తాకి సూర్యుడిని మరుగున పరిచి చీకట్లు కమ్ముకున్నాయి. సైనికులకు కళ్ళు కనిపించడం కష్టమైంది. ద్రోణాచార్యుడు ఒక వైపు సుయోధనుడిని ఒక వైపు కురు సేనలను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేసి అప్పటికప్పుడు ఒక వ్యూహమును ఏర్పరిచాడు.

రాత్రి సమయంలో పోరు[మార్చు]

ద్రోణుడు పన్నిన వ్యూహానికి ముఖభాగంలో అతడే నిలబడ్డాడు. వ్యూహమునకు రెండు వైపులా అశ్వత్థామను శకుని నిలిపాడు. మధ్యలో శల్యుడు నిలబడ్డాడు. సుయోధనుడు వ్యూహం అంతా తిరుగుతున్నాడు. సుయోధనుడు తన సైనికులను దివిటీలను పట్టుకుని నిలబడమని చెప్పాడు. వెంటనే సైనికులకు దివిటీలు అందించబడ్డాయి. రథికునకు అయిదు దివిటీలు, గజముకు మూడు దివిటీలు, హయముకు ఒక దివిటీ చొప్పున ఇచ్చారు. వ్యూహముకు ముందు భాగమున సైనికులు దివిటీలు పట్టుకుని బారులు తీరారు. పాండవసైనికులు దివిటీలు పట్టుకున్నారు. రథముకు పది దివిటీలు, గజముకు ఏడు దివిటీలు, హయముకు రెండు దివిటీలు పట్టుకున్నారు. సుయోధనుడు తన సోదరులను పిలిచి " సోదరులారా ! మీరూ, శల్యుడు, కృతవర్మ మొదలైన యోధులు ధృష్టద్యుమ్నుడు ద్రోణునితో తలపడకుండా చూడండి ద్రోణుడు మిగిలిన వారితో యుద్ధము చేస్తున్నాడు. కర్ణుడు ధృష్టద్యుమ్నుని చంపి తరువాత అర్జునుడిని జయిస్తాడు. నేను భీమునితో యుద్ధము చేసి గెలుస్తాను " అని పలికి సైన్యమును కదలమని సైగ చేసాడు. ధర్మరాజు ద్రోణుని ఎదుర్కొను సమయంలో మధ్యలో కృతవర్మ ఎదుర్కొని యుద్ధం చేయసాగాడు. సాత్యకితో భూరి అను రాజు, సహదేవునితో కర్ణుడు, భీమునితో సుయోధనుడు, నకులునితో శకుని, శిఖండితో కృపాచార్యుడు, ప్రతివింద్యునితో దుశ్శాసనుడు, అశ్వత్థామతో ఘటోత్కచుడు, ద్రుపదునితో వృషసేనుడు, విరాటరాజుతో శల్యుడు, శతానీకునితో చిత్రసేనుడు, అర్జునుడితో అలంబసుడనే రాక్షసరాజు యుద్ధం చేస్తూ మరొక పక్క ద్రోణుని కాపాడుతున్నారు. పాండవపక్షంలోని అతిరధ మహారధులు ద్రోణునితో తలపడడానికి ప్రయత్నిస్తుంటే కౌరవ యోధులు శయశక్తులా అడ్డుకుంటున్నారు. ద్రోణుడు సోమకసైన్యంతో పోరి వారిని హతమార్చాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. వారిరువురు ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. కృతవర్మ ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకుని కృతవర్మ విల్లు విరిచి కృతవర్మ మీద శక్తి ఆయుధమును ప్రయోగించాడు అది కృతవర్మను చేతిని చీల్చింది. కృతవర్మ మరొక విల్లు తీసుకుని ధర్మరాజు రథసారథిని, హయములను చంపి ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు తోమరము అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. కృతవర్మ ఆ అయుధమును రెండు ముక్కలు చేసి ధర్మరాజు కవచము చీల్చే విధంగా బాణముతో కొట్టాడు. కృతవర్మతో యుద్ధం చేయ లేక ధర్మరాజు యుద్ధభూమి నుండి తొలగి పోయాడు. సాత్యకి కురు వంశీయుడైన భూరి అనేరాజుతో తలపడి అతడి విల్లు విరిచాడు. భూరి మరొక విల్లు తీసుకుని అతడి వింటిని ముక్కలు చేసాడు. సాత్యకి శక్తి ఆయుధాన్ని ప్రయోగించి భూరి తల తెగనరికాడు. ఇది చూసిన ఇది చూసి అశ్వత్థామ సాత్యకితో తలపడ్డాడు. ఇంతలో ఘటోత్కచుడు అశ్వత్థామతో తలపడి పది బాణములతో అశ్వత్థామ వక్షస్థలం మీద కొట్టాడు. ఆ బాణముల ధాటికి తాళ లేక అశ్వత్థామ రథము మీద సొమ్మసిల్లి పడి వెంటనే తేరుకుని ఘటోత్కచుడి గుండెలకు గురిపెట్టి తీవ్రమైన బాణములతో కొట్టాడు. ఆ బాణముల ధాటికి ఘటోత్కచుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఘటోత్కచుడి రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు.

భీమసుయోధనుల పోరు[మార్చు]

మరొక పక్క సుయోధనుడు భీముడు తలపడి ఘోర యుద్ధం సాగిస్తున్నారు. భీముడు సుయోధనుడి ధనస్సు ముక్కలు చేసి, అతడి కేతనమును విరిచి అతడి శరీరాన్ని తూట్లు పడేలా కొట్టాడు. సుయోధనుడు మరొక విల్లందుకుని భీముని విల్లు విరిచాడు. భీముడు మరొక విల్లందుకుని ఏడు బాణములతో సుయోధనుడిని తీవ్రంగా గాయపరిచి అతడి విల్లు విరిచాడు. సుయోధనుడు మరొక విల్లు తీసుకొనగానే దానిని కూడా విరిచాడు. భీముడు అలా సుయోధనుడి నాలుగు ధనస్సులు విరిచి రథాశ్వములను, సారథిని చంపాడు. సుయోధనుడికి భీముడంటే భయమేసింది. ఎవరూ చూడకుండా పక్కకు తప్పుకున్నాడు. అది గమనించని భీముడు సుయోధనుడు చనిపోయాడనుకుని సింహనాదం చేసాడు. సుయోధనుడు కనిపించక కౌరవ సేనలు కలవరపడ్డాయి. పాండవ సేనలో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ఇంతలో సుయోధనుడు వేరొక రథము మీద రావడంతో కల్లోలం సద్దు మణిగింది.

కర్ణ సహదేవుల పోరు[మార్చు]

కర్ణుడు సహదేవునితో తలపడ్డాడు. సహదేవుడు కర్ణుని తొమ్మిది బాణములతో కొట్టాడు. కర్ణుడు సహదేవుని నూరు బాణములతో మర్మస్థానములలో కొట్టి సహదేవుని ధనస్సును ముక్కలు చేసాడు. సహదేవుడు మరొక విల్లందుకున్నాడు. కర్ణుడు సహదేవుని సారథిని, రథాశ్వములను చంపాడు. సహదేవుడు కత్తి డాలు తీసుకున్నాడు. కర్ణుడు వాటిని ముక్కలు చేసాడు. సహదేవుడు కర్ణుని మీద గదాయుధాన్ని విసిరాడు. కర్ణుడు ఆ గదను మధ్యలోనే తుంచాడు. సహదేవుడు కర్ణుని మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసాడు. ఇక చేసేది లేక సహదేవుడు రథచక్రాన్ని కర్ణుని మీద వేసాడు. కర్ణుడు దానిని కూడా తన బాణ్ములతో ముక్కలు చేసాడు. కర్ణునితో యుద్ధం చేయలేక సహదేవుడు అక్కడ నుండి తప్పుకుంటున తరుణంలో కర్ణుడు అతడిని వెంబడించి పట్టుకుని చంపబోయి కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి చంపకుండా వదిలి హేళనగా " సహదేవా! నీ బలం ఎదుటి వాని బలం తెలుసుకుని యుద్ధం చెయ్యి. నీ కన్నా బలవంతులతో యుద్ధం చెయ్యడం అవివేకమని తెరులుసుకో పో " అని పంపాడు. సహదేవుడు అవమానభారంతో కుమిలి పోతూ అక్కడ నుండి వేరొక రథము ఎక్కి వెళ్ళాడు.

శల్యవిరాటుల యుద్ధం[మార్చు]

కృపాచార్య శిఖండిల పోరాటము

శల్యుడు విరాటునితో యుద్ధం చేస్తూ విరాటుని అశ్వములను చంపాడు. శల్యుని మీద విరాటుడు శరములు గుప్పించాడు. విరాటుని తమ్ముడు శతానీకుడు అన్నకు సాయంగా వచ్చి విరాటుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. శల్యుడు వాడి అయిన బాణమును ప్రయోగించి శతానీకుని సంహరించాడు. తమ్ముని మరణం విరాటునిలో భయం కలిగించినా పైకి ధైర్యంగా ఉండి శల్యుని ఎదుర్కొన్నాడు. శల్యుడు పదునైన బాణమును ప్రయోగించి విరాటుని మూర్చిల్లేలా కొట్టాడు. విరాటుని రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు. విరాటుని సేనలు శల్యుని ధాటికి ఆగ లేక పక్కకు తొలిగాయి. అది చూసి అర్జునుడు ఆ సైన్యములను ఆపి శల్యునితో తలపడ్డాడు. అలంబసుడిని ఎదుర్కొన్న అర్జునుడు అతడి విల్లు కేతనమును విరిచి, హయములను చంపాడు. అలంబసుడు ఒక కత్తి తీసుకుని అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు ఆ కత్తిని విరిచి నాలుగు భయంకరమైన బాణములతో ఆ రాక్షసుని కొట్టాడు. అర్జునుడి ధాటికి ఆగ లేక అలంబసుడు పారి పోయాడు. నకులుడి కుమారుడు శతానీకుడు సుయోధనుడి తమ్ముడైన చిత్రసేనుడిని ఎదుర్కొని చిత్రసేనుడి కవచమును చీల్చి, కేతనము విరిచి, విల్లు విరిచాడు. చిత్రసేనుడు వేరొక విల్లందుకుని శతానీకుని మీద బాణ ప్రయోగం చేసాడు. శతానీకుడు చిత్రసేనుడి రథాశ్వములను, సారథిని చంపాడు. చిత్రసేనుడు శతానీకుని ఇరవై అయిదు బాణములతో శరీరం తూట్లు పడేలా కొట్టాడు. శతానీకుడు ఒకే బాణంతో చిత్రసేనుడి విల్లు విరిచి రథమును విరిచాడు. చిత్రసేనుడు రథము నుండి దూకి పక్కనే ఉన్న హార్దిక్యుడి రథము ఎక్కి పారిపోయాడు. ద్రుపదుడు కర్ణుని కుమారుడైన వృషసేనుని ఎదుర్కొన్నాడు. ద్రుపదుని మీద వృషసేనుడు పైచేయిగా ఉన్నాడు. ద్రుపదుని నిస్సహాయత చూసి పాంచాల సేనలు వృషసేనుడితో తలపడ్డాయి. కాని వృషసేనుడితో తలపడ లేక పారి పోయారు. దుశ్శాసనుడు ధర్మజుని కుమారుడైన ప్రతి వింధ్యుని ఎదుర్కొని అతడి ధ్వజమును, విల్లును విరిచి, సారథిని, హయములను చంపాడు. ప్రతివింధ్యుని సోదరులు అతడికి సాయంగా వచ్చి పోరుతున్నారు. భీముని కుమారుడైన శ్రుతసేనుడు ప్రతి వింధ్యుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. ప్రతివింధ్యుడు మరొక విల్లందుకుని దుశ్శాసనుడితో తలపడ్డాడు. నకులుడు శకునితో యుద్ధం చేస్తున్నాడు. శకుని పదునైన బాణంతో నకులుని మూర్చపోయేలా కొట్టాడు. నకులుడు తేరుకుని శకుని విల్లు, కేతనమును విరిచి శకుని తొడలపై బాణములతో కొట్టి అతడిని కదలకుండా చేసాడు. నకులుని బాణధాటికి శకుని మూర్ఛపోయాడు. శకుని రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు. కృపాచార్యుడు శిఖండితో యుద్ధం చేస్తున్నాడు. శిఖండి కృపాచార్యుని విల్లు విరిచాడు. కృపాచార్యుడు వేరొక విల్లందుకుని శిఖండి మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. శిఖండి దానిని నిర్వీర్యం చేసాడు. కృపాచార్యుడు మరొక దృఢమైన బాణంతో శిఖండిని మూర్చిల్లచేసాడు. కృపాచార్యుడు శిఖండిని చంపడానికి వేరొక బాణం తీయగానే పాంచాలవీరులు అడ్డుకుని కృపాచార్యునితో యుద్ధానికి దిగారు. రథసారథి శిఖండి రథమును పక్కకు తప్పించాడు. కాగడాల వెలుతురులో ఆ నాటి యుద్ధం రసవత్తరంగా సాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని అయిదు బాణాలతో కొట్టాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని విల్లు విరిచాడు. ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లందుకుని అగ్ని బాణమును ప్రయోగించాడు. కర్ణుడు అది చూసి దానిని మధ్యలోనే తుంచాడు. సుయోధనుడు, శల్యుడు, దుశ్శాసనుడు అక్కడకు చేరి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నారు. ధృష్టద్యుమ్నుడు వారితో ఒంటరిగా పోరు సాగించాడు. కర్ణుడినితో తలపడిన ద్రుమసేనుడిని ఒకే బాణంతో కర్ణుడుసంహరించాడు. అది చూసిన ధృష్టద్యుమ్నుడు కోపించి కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు మరొక విల్లందుకుని ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ఇంతలో సాత్యకి నిర్వీర్యం చేసి కర్ణుని ఎదుర్కొన్నాడు. ఇంతలో వృషసేనుడు మధ్యలో వచ్చి సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి ఒకే బాణంతో వృషసేనుని మూర్ఛిల్లజేసాడు. కర్ణుడు తన కుమారుడు మృతిచెందాడనుకుని సాత్యకి మీద శరవర్షం కురిపించాడు. వృషసేనుడు తేరుకుని కర్ణుడితో చేరి సాత్యకిని ఎదుర్కొన్నాడు.

సుయోధనుడికి కర్ణుడి సలహా[మార్చు]

అర్జునుడు దేవదత్తము పూరించాడు. ఇది విని కర్ణుడు " రారాజా ! అర్జునుడు ఇటు వైపు వస్తున్నాడు. అతడిని సాత్యకిని చేరకుండా ఆపగలిగితే మనము సాత్యకిని వధించ వచ్చు. ఇలా చేస్తేనే సాత్యకిని అభిమన్యుని చంపినట్లు చంపగలము. మన విజయానికి అదే నాంది. సాత్యకి మరణం తెలిసిన అర్జునుడు ఇక్కడకు వస్తాడు కనుక అతడికి సాత్యకి మరణం తెలియకుండా మన మహాయోధులను పంపి అర్జునుడిని ఇక్కడకు రాకుండా నిలువరించు " అన్నాడు. సుయోధనుడికి కర్ణుడి ఆలోచన నచ్చింది పక్కనే ఉన్న శకుని చూసి " మామా ! నీవు పదివేల ఏనుగులను, పదివేల రధములను తీసుకుని అర్జునుడిని ఎదుర్కొని అతడు ఇక్కడకు రాకుండా ఆపు. నీకు తోడుగా నా తమ్ములు దుశ్శాసనుడు, సుబాహుడు, దుష్ప్రదర్షణుడు, దుర్విషహుడు తోడుగా వస్తారు. నీవు అర్జునుడు, భీముడు, ధర్మరాజులను ఎదుర్కొని విజయం సాధించు " అన్నాడు. సుయోధనుడి మాటను అనుసరించి శకుని మేనల్లుళ్ళను తీసుకుని అర్జునుడిని ఎదుర్కొనుటకు వెళ్ళాడు. కర్ణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు కాని సాత్యకి యుద్ధ కౌశలానికి కౌరవ సేన నిలువలేక పోయింది. సుయోధనుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి సుయోధనుడి సారథిని, రథాశ్వములను చంపి, విల్లు విరిచాడు. సుయోధనుడు కిందకు దూకి పక్కనే ఉన్న రథమును ఎక్కి తప్పించుకున్నాడు. సుయోధనుడి పరాజయం చూసి కౌరవసేన పారిపోయింది. శకుని తన కుమారుడైన ఉలూకునితో చేరి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ఉలూకుడు అర్జునుడి మీద శరములు గుప్పించాడు. అర్జునుడు శకుని సారథిని, రథాశ్వములను చంపి, అతడి వింటిని, రథమును విరిచాడు. శకుని కుమారుని రథము ఎక్కి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కాని వారు అర్జునుడి గాండీవం నుండి వెలువడుతున్న శరముల ధాటికి తాళలేక పోయారు. శకునికి సాయంగా వచ్చిన రథికులు యుద్ధం చేయలేక పారి పోయారు. శకుని అతడి కుమారుడు దిక్కు తోచకుండా నిలబడ్డారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొని అతడి వింటి నారిని విరిచాడు. ద్రోణుడు మరొక విల్లందుకుని శరప్రయోగం చేసాడు. అర్జునుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనలను తనుమాడుతున్నారు. విజయ సూచకంగా అర్జునుడు దేవదత్తమును శ్రీకృష్ణుడు పాంచజన్యము, ధృష్టద్యుమ్నాది యోధులు తమతమ శంఖములు పూరించారు.

కర్ణుని విజృంభణ[మార్చు]

కర్ణుడు పాడవుల విజయోత్సాహానికి క్రుద్ధుడై విజృంభించి పాండవసేనలను తరుముతూ దొరికిన వారిని దొరికినట్లు చంపసాగాడు. అది చూసిన ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! చూసావా మధ్యందిన మార్తాండునిలా ఉన్న కర్ణుని విజృంభణ చూస్తే మనం ఊరకున్న ఈ రోజే పాండవ సేనను నాశనం చేసేలా ఉన్నాడు. నీవు అతడిని ఆపే మార్గం ఆలోచించు " అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా ! అన్నయ్య ధర్మజుడు మన సేనలు పారి పోవడం చూసి భయపడుతున్నాడు. ఒక వైపు కర్ణుడు, మరొక వైపు ద్రోణుడు మన సైన్యాలను తరుముతున్నారు. ద్రోణుడిని తరువాత చూడవచ్చు ముందు కర్ణుని ఆపాలి మన రథం కర్ణుని ముందు నిలుపు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! రాత్రులందు రాక్షసులకు బలం ఎక్కువ కనుక నీవు ఇప్పుడు ఘటోత్కచుడిని పంపి కర్ణుడిని నిలువరించుట ఉత్తమం. మాయా విద్యా ప్రవీణ్యుడు దివ్యాస్త్ర సంపన్నుడైన ఘటోత్కచుడు కర్ణుడిని నిలువరించగల సమర్ధుడు. మనం ద్రోణుని ఎదుర్కొంటాము " అన్నాడు. కృష్ణుని మాట విన్న అర్జునుడు ఘటోత్కచుడిని పిలిచి " కుమారా ఘటోత్కచా ! కర్ణుడి పరాక్రమానికి పాండవ సేన చెదిరి పోతుంది. నీవు నీ పరాక్రమాన్ని చూపి అతడిని నిలువరింపుము. రాత్రి సమయంలో కర్ణుడు నీ అంత సమర్ధవంతంగా యుద్ధం చేయలేడు కనుక నీవు అతడిని కట్టడి చేయగలవు కనుక కర్ణుడిని ఎదుర్కొని నీ తండ్రుల పేరు నిలుపు " అన్నాడు. ఘటోత్కచుడు అర్జునుడికి నమస్కరించి కర్ణుడిని ఎదుర్కొనుటకు వెళ్ళాడు.

ఘతోత్కచాలంబసుల యుద్ధం[మార్చు]

ఆసమయంలో జటాసురుడి కుమారుడైన అలంబసుడు సుయోధనుడి వద్దకు వచ్చి " రారాజా ! నాకు ఎప్పటి నుండో పాండవుల మీద పగ ఉన్నది. మీరు అనుజ్ఞ ఇస్తే పాండవులను సంహరించగలను " అన్నాడు. సుయోధనుడు ఆనందపరవశుడై అందుకు అంగీకరించాడు. అలంబసుడు కర్ణుడిని దాటి ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురు మొదట విల్లంబులతో యుద్ధం మొదలు పెట్టారు. ఆ తరువాత రాక్షస మాయలు ప్రయోగించి యుద్ధం చేయసాగారు. ఒకరు సర్పంగా మారితే ఒకరు గరుడునిగా మారారు. ఒకడు ఏనుగుగా మారిన వేరొకరు సింహంగా మారారు. ఒకరికి ఒకరు తీసి పోకుండా యుద్ధం చేయసాగారు. చివరికి ముష్టి యుద్ధానికి దిగారు. చివరకు ఘటోత్కచుడు అలంబసుడిని కిందకు తోసి గొండెల మీద కాలు పెట్టి అలంబసుడి తల గుండ్రంగా తిప్పి అతడి తల తెంచాడు. ఆ తలను తీసి సుయోధనుడి రథము మీద విసిరాడు. అది చూసి ఆశ్చర్య పోతున్న సుయోధనుడితో " ఓ సుయోధనా! ఇది నీ స్నేహితుడి అలంబసుడి తల ఇంకొంచెం సేపటికి కర్ణుడి తల నీ రథం మీదకు వేస్తాను నీ వంతు వచ్చినప్పుడు నీ తల విసరగలను. నేను భీమసేనుడి కుమారుడినని తెలుసు కదా ! జాగర్త " అని గర్జించాడు.

ఘటోత్కచ కర్ణుల పోరు[మార్చు]

భయంకరాకారంతో తన వైపు వస్తున్న ఘటోత్కచుడిని చూసి కర్ణుడు అతడి మీద పదునైన బాణములు గుప్పించాడు. ఇరువురు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు ప్రయోగించిన దివ్యాస్త్రములను ఘటోత్కచుడు తిప్పికొట్టాడు. ఘటోత్కచుడు ప్రయోగించిన అస్త్రములు కర్ణుడు తిప్పి కొడుతున్నాడు. ఘటోత్కచుడు మాయా యుద్ధం ప్రకటించి మాయా సైన్యం సృష్టించాడు. ఆ మాయా సైన్యం కౌరవులు అది వరకు చూడని వివిధ ఆయుధములను కౌరవసేన మీద ప్రయోగించారు. ఆ ఆయుధ ధాటికి కౌరవ సేన పారిపోయింది. ఘటోత్కచుడు కర్ణుడి మీద చక్రాయుధమును ప్రయోగించాడు. కర్ణుడు దానిని ఖండించాడు. ఘటోత్కచుడు తన గదాయుదాన్ని కర్ణుడి పై విసిరాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసాడు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి రాళ్ళను చెట్లను వర్షంలా కురిపించాడు. కర్ణుడు వాట్ని నుగ్గు నుగ్గు చేస్తున్నాడు. ఘటోత్కచుడు కిందికి దిగి తన రథము అధిరోహించి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు వెంటనే ఘటోత్కచుడి సారథిని, హయములను చంపి రథమును ముక్కలు చేసి ఘటోత్కచుడి శరీరం నిండా నిశితమైన శరములు నాటాడు. ఘటోత్కచుడు నోరు గుహలా తెరిచి కర్ణుడు వేసే బాణములు అన్నీ మింగాడు. కర్ణుడు అతడి ముఖం నిండా బాణములతో నింపాడు. ఘటోత్కచుడు మరణించాడని అందరూ అనుకుంటున్న తరుణంలో ఘటోత్కచుడు తేరుకుని కర్ణుడి రథాశ్వములను చంపి అతడి విల్లు ముక్కుల చేసాడు.

ఘటోత్కచుడు అలాయుధునితో పోరుట[మార్చు]

కర్ణుడు మీద ఘటోత్కచుడు పైచేయిగా ఉన్న సమయంలో బకాసురుడి తమ్ముడు అలాయుధుడు సుయోధనుడి వద్దకు వచ్చి " సుయోధనా ! మా అన్న బకాసురుడిని చంపిన భీముని మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నాకు అనుమతి ఇవ్వు " అన్నాడు. సుయోధనుడు ఆలోచించాడు. ఘటోత్కచుడు కర్ణుని మీద పైచేయిగా ఉన్నాడు. కృపాచార్యుడు, అశ్వత్థామ ఆశ్చర్యంగా యుద్ధాన్ని తిలకిస్తున్నారు. అందరూ కర్ణుని మీద ఆశలు వదులుకున్న తరుణంలో అలాయుధునికి అనుజ్ఞ ఇవ్వడం మంచిదని అనుకుని " అలాయుధా ! నీవు వెంటనే నీ శత్రువైన భీముని కుమారుడైన ఘటోత్కచుడితో యుద్ధం చేసి ఓడించి తరువాత భీముని మీద అతడి అన్నదమ్ముల మీద ప్రతీకారం తీర్చుకో " అన్నాడు. ఆ మాటకు సంతోషించిన అలాయుధుడు తన రాక్షస సైన్యంతో ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు అలాయుధుల మధ్య యుద్ధం మొదలైంది. సమ ఉజ్జీలైన ఇరు రాక్షస వీరులు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు అక్కడ నుండి తప్పుకుని భీమునితో యుద్ధము చేయుటకు వెళ్ళాడు. భీముడు కర్ణుని దాటుకుని తన కుమారుడైన ఘటోత్కచుడి వద్దకు వెళ్ళాడు. అలాయుధుని అనుచరులైన రాక్షస వీరులు ఒక్కొక్కరుగా భీమసేనుడిని చుట్టుముట్టారు. భీమసేనుడు వారందరిని ఒక్కసారిగా చంపాడు. అలాయుధుడు ఒంటరిగా యుద్ధం చేస్తూ తన సేనలను పాంచాలసేనలతో యుద్ధానికి ప్రేరేపించాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా ! రాత్రి పూట రాక్షసులకు బలం ఎక్కువ కనుక సాత్యకి, నకులసహదేవులను వారితో యుద్ధం చేయడానికి పంపు. కర్ణుని మీదకు ధృష్టద్యుమ్న శిఖండులను పంపి నీవు ద్రోణునితో పోరాడు " అన్నాడు. భీముడు అలసి పోవడం గమనించిన కృష్ణుడు ఘటోత్కచుడిని పిలిచి " నాయనా ! ఘటోత్కచా! నీ తండ్రి భీమసేనుడు అలాయుధుడితో పోరాడి అలసి పోయాడు. ఇక నీవు వెళ్ళి అలాయుధుని ఎదుర్కో " అని పంపాడు. వెంటనే ఘటోత్కచుడు కర్ణుడిని వదిలి అలాయుధుని ఎదుర్కొన్నాడు. అతడితో నకులుడు మొదలైన పాండవయోధులు చేరి రాక్షస సేనను తరిమారు. కర్ణుడు పాంచాల సేనలతో పోరుతున్నాడు. అది చూసి భీముడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు.

ఘటోత్కచుడు అలాయుధుని చంపుట[మార్చు]

అలాయుధుడు ఘటోత్కచుడి మీద ఒక పరిఘను విసిరి అతడిని మూర్ఛిల్లజేసాడు. ఘటోత్కచుడు వెంటనే తేరుకుని తన గదను గిరిగిరా తిప్పి అలాయుధుని మీద విసిరాడు. ఆ గద అలాయుధుని సారథిని, అతడి రథాశ్వములను, ధ్వజమును, రథమును నుగ్గు చేసాయి. వెంటనే అలాయుధుడు ఒక మేఘంగా మారి ఆకాశం నుండి నెత్తురు కురిపించాడు. ఘటోత్కచుడు కూడా ఆకాశానికి ఎగిరి అలాయుధుని మాయను తిప్పి కొట్టాడు. తరువాత రాక్షస వీరులు భూమికి దిగి రాళ్ళతో చెట్లతో యుద్ధం చేయసాగారు. అలాయుధుడు కత్తి తీసుకుని ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు కూడా కత్తి తీసుకుని అలాయుధుని ఎదుర్కొన్నాడు. చివరికి ఘటోత్కచుడు అలాయుధుడిని కింద పడవేసి అతడి కంఠము తెగనరికి సింహనాదం చేసాడు. పాండవ సైన్యం ఆనందోత్సాహాలతో మిన్నంటేలా భేరీ నాదాలు చేసారు. ఘటోత్కచుడు అలాయుధుని తల తీసుకుని సుయోధనుడి రథము మీదకు విసిరాడు. అది చూసి సుయోధనుడు చింతాక్రాంతుడైయ్యాడు. తరువాత ఘటోత్కచుడు పాండవ సేనలను నాశనం చేస్తున్న కర్ణుడిని ఎదుర్కొన్నాడు.

ఘతోత్కచ మరణం[మార్చు]

ఇంద్ర శక్తితో ఘటోత్కచుని చంపుతున్న కర్ణుడు- రాజ్మానామా నుండి ఒక దృశ్యం

కర్ణుడు తనను ఎదుర్కొన్న ఘటోత్కచుని రథాశ్వములను చంపాడు. వెంటనే ఘటోత్కచుడు రథంతో సహా మాయం అయ్యాడు. ఘటోత్కచుడు ఎవరి ముందు ప్రత్యక్షమై ఎవరిని చంపుతాడో అని కౌరవ సేనలో భయాందోళనలు మొదలైయ్యాయి. ఘటోత్కచుడు మేఘంలాగా మారి ఆకాశంలో నుండి కౌరవ సేన మీద పెద్ద పెద్ద బండరాళ్ళు విసరి కౌరవ సేన రథములను నుగ్గు చేస్తున్నాడు. కురుసేన ఏవైపు నుండి బండరాళ్ళు పడతాయోనని బెదిరి పోతున్నారు. కాని కర్ణుడు మాత్రం ధైర్యంగా నిలబడి తన దివ్యాస్త్రములతో రాక్షస మాయను విచ్ఛిన్నం చేస్తున్నాడు. కర్ణుడు రాళ్ళ వాన కురిపిస్తున్న మేఘమును విచ్ఛిన్నం చేయడంతో కౌరవసేనలో ధైర్యం వచ్చింది. వారు కర్ణుడితో " కర్ణా ! నీవు మహా వీరుడవు లేకున్న రాక్షస మాయను విచ్చిన్నం చేయలేవు. కాని నిన్ను నీవు కాపాడుకోవాలంటే ఘటోత్కచుడిని సంహరించక తప్పదు. కనుక ఇంద్రుడు నీ కవచకుండలములు దానంగా పరిగ్రహించిన తరుణంలో ప్రసాదించిన అమోఘమైన శక్తిని అతడి మీద ప్రయోగించి అతడిని సంహరించు. దానిని ఎప్పుడో భీమార్జునులను చంపడానికి దాచి ఏమి ప్రయోజనం మనం అప్పటి వరకు ఘటోత్కచుడి ధాటీకి ప్రాణాలతో ఉంటే కదా! కనుక ఆ శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించు " అని కర్ణుడిని వత్తిడి చేసారు. ఆ సమయంలో ఘటోత్కచుడు గదతో కర్ణుని మీద కలబడి అతడి రథమును విరిచాడు. రథవీహీనుడై నిలబడిన కర్ణుడిని చంపడానికి గద ఎత్తి నిలబడిన ఘటోత్కచుడి చేతిలో చావు తప్పదనుకుని గత్యంతరం లేని పరిస్థిలో మీద ఇంద్రుడు ప్రసాదించిన శక్తి ఆయుధమును ఘటోత్కచుడి మీద ప్రయోగించదలిచాడు. ఇంద్రదత్తమైన ఆ ఆయుధము మహా భయంకరమైంది. దానిని ప్రయోగించన తరువాత ఒక్కరిని మాత్రమే సంహరించి తిరిగి ఇంద్రుని వద్దకు చేరుతుంది. అర్జునుడి మీద ప్రయోగించాలని భద్రంగా ఉంచిన ఆ ఆయుధాన్ని కర్ణుడు ఘటోత్కచుడిని లక్ష్యంగా చేసి ప్రయోగించాడు. తన మీదకు దూసుకు వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని చూసి ఘటోత్కచుడు భయపడ్డాడు. ఆ శక్తి ఆయుధం ఘటోత్కచుడి మాయశక్తులను హరించి అతడి గుండెను చీల్చుకుంటూ బయటకు వెళ్ళింది. ఆ దెబ్బకు ఒక మహావీరుని ప్రాణాలు అనంతవాయువులలో కలిసాయి. కౌరవసేన ఆనందోత్సాహాలతో సింహనాదాలు చేస్తూ హర్ష్యధ్వానాలు చేసారు. అందరూ కర్ణుడిని పలు విధముల శ్లాఘించారు. సుయోధనుడు పరుగు పరుగున వచ్చి కర్ణుని కౌగలించుకున్నాడు.

ఘటోత్కచుని మరణానికి పాండవసేనలో స్పందన[మార్చు]

ఘటోత్కచుడి మరణ వార్త వన్న పాండవులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భీమసేనుడి దుఃఖముకు అంతు లేదు. కాని కృష్ణుడు రథము మీద నిలబడి నాట్యమాడసాగాడు. కేరింతలు కొట్టి సింహనాదం చేసి ఆనందంతో పాంచజన్యం పూరించారు. కృష్ణుడి విపరీత ప్రవర్తన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ " కృష్ణా ! ఆపు ఏమిటిది మేమంతా ఘటోత్కచుడి మరణానికి విలపిస్తుంటే నీవు ఆనందంతో గంతులు వేస్తున్నావు. ఇక చాలు ఆపు ఎవరన్నా చూస్తే నవ్వుతారు " అన్నాడు ఈసడింపుగా. కాని కృష్ణుడు తన ఆనంద హేల ఆపక అలా పాడుతూ ఆనందంతో గెంతుతూ ఉన్నాడు. కాని అంతలో అర్జునుడు తెలివి తెచ్చుకుని కృష్ణునితో " కృష్ణా! నీవు అన్నీ తెలిసిన వాడివి. మహానుభావుడివి నీ వింత ప్రవర్తనకు ఏదో కారణం ఉంటుంది నాకు చెప్పవా " అన్నాడు. అని అనునయంగా అన్నాడు. కృష్ణుడు " అర్జునా! నీ తండ్రి నీ క్షేమము కోరి కర్ణుడి వద్ద నుండి కవచకుండలములు దానంగా పరిగ్రహించాడు. ఆ సమయంలో కర్ణుడికి ప్రతిగా ఒక మహత్తర శక్తిని కానుకగా ఇచ్చాడు. అది ఒక సారి ప్రయోగిస్తే ఒకరిని మాత్రమే చంపి తిరిగి ఇంద్రుని చేరగలదు. దానిని కర్ణుడు నిన్ను చంపడానికి మాత్రమే దాచాడు. కాని గత్యంతరం లేని పరిస్థితిలో దానిని కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. కనుక ఇక కర్ణుడు నిన్ను ఏమీ చేయ లేడు. అర్జునా! కర్ణుడు దైవాంశ సంభూతుడు సామాన్యుడు కాదు. అతడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఉన్నంత వరకు నా సుదర్శన చక్రము కాని నీ గాండీవం కాని ఏమి చేయలేదు. నీ తండ్రి కర్ణుడి కవచ కుండలములు పరగ్రహించకున్న అతడిని నీవే కాదు ముల్లోకాలలో ఎవరూ ఏమీ చేయ లేరు. అతడిప్పుడు సాధారణ మానవుడయ్యాడు కనుక అతడిని ఇక నీవు సులభంగా జయించ వచ్చు . ఇది నాకు సంతోషం కాదా! " అన్నాడు. నేను జరాసంధుని, శిశుపాలుని నీ కొరకు చంపించాను. వారు బ్రతికి ఉన్న సుయోధనుడితో చేరి నిన్ను ఎదుర్కొనేవారు. వారందరూ కర్ణుడితో కలిస్తే జయించుట అసాధ్యం. ఇక ఘటోత్కచుడు ఎంత భీముడి కుమారుడైనా రాక్షసవంశ సంజాతుడు. ధర్మద్వేషము, హరిద్వేషము అతడి నరనరాలలో జీర్ణించుకుని ఉంది. అతడు బ్రతికి ఉన్నా ఎప్పటికైనా నా మీద తిరగబడగలడు. అప్పుడు నేను చేయవలసిన పని ఇప్పుడు కర్ణుడు పూర్తి చేసాడు. నీవు నాకు అత్యంత ఆప్తుడవు నీ క్షేమమే నాకు ముఖ్యము. ఇక నీకు కర్ణుడు హాని చేయజాలడు. మన సైన్యములు అలసి ఉన్నాయి. వారికి కొంత విశ్రాంతినిచ్చి తిరిగి యుద్ధానికి ఉపక్రమించ వచ్చు " అన్నాడు.

ధృతరాష్ట్రుని సందేహం[మార్చు]

సంజయుడు ఘటోత్కచుడు మరణించిన వృత్తాంతం చెప్పగానే ధృతరాష్ట్రునికి ఒక అనుమానం వచ్చింది. " సంజయా ! మరి అంతప్రభావం కలిగిన శక్తిని తన వద్ద పెట్టుకున్న కర్ణుడు ఇంత కాలము అర్జునుడిని చంపకుండా ఎందుకు వదిలాడు. ఒక్కరిని మాత్రమే చంపగలిగిన శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీద వేసి చంపితే యుద్ధం ఎప్పుడో ముగింపుకు వచ్చేది కదా! పాండవులు ఎప్పుడో యుద్ధం నుండి విరమించే వారు. మనలనువిజయలక్ష్మి వరించేది. ఇంత జన నష్టం తప్పి పోయేది కదా! యుద్ధానికి పిలిస్తే అర్జునుడు కర్ణునితో యుద్ధం చేయకపోతాడా ! కర్ణుడు ఇంత బుద్ధిహీనుడుగా ఎందుకు ఉన్నాడు. నా కుమారుడు కర్ణునికి ఎరందుకు గుర్తు చేయ లేదు అన్నాడు. అక్కడే ఉన్న నీవు కూడా ఎందుకు గుర్తు చేయ లేదు. చేతిలో ఉన్న మామిడి పండు తినడం మరచినట్లు ఉంది కదా! దీనికి మరేదైనా కారణము ఉందా " అని ధృతరాష్ట్రుడు ఆత్రంగా సంజయుని అడిగాడు. సంజయుడు " మహారాజా ! మేము గుర్తు చేయకుండా ఎందుకు ఉంటాము. ప్రతి రోజు మేమంతా సుయోధనుడితో కలసి మరునాడు నీవు శక్తి ఆయుధమును ప్రయోగించి అర్జునుడిని చంపాలి అని చెప్తూనే ఉన్నాము. కర్ణుడు కూడా అలాగే చంపుతానని అంటుండే వాడు. కాని మరునాడు యుద్ధ భూమిలో ప్రవేశించగానే కర్ణుడితో సహా మేమంతా ఆవిషయం మరచి పోతుంటాము. తిరిగి రాత్రి సమయంలో శిబిరాలకు చేరిన తరువాతగాని మాకు గుర్తుకు వచ్చేది కాదు. అది దైవమాయ కాక మరేమిటి చెప్పు అంతే కాదు. సుయోధనుడు " కర్ణా ! అర్జునుడిని మాత్రమే చంపితే కృష్ణుడు మనలనందరిని చంపి పాండునందనుడికి పట్టం కడతాడు. ఆ శక్తితో కృష్ణుడిని చంపితే మనం ఈ ధరాతలాన్ని ఏకచ్ఛత్రంగా పాలించ వచ్చు " అనే వాడు. కర్ణుడు అలాగే చంపుతాను అనే వాడు. కాని మరునాడు అంతా మరిచిపోయే వాడు అదేమి చిత్రమో. మరొక విషయము వినండి. ఘటోత్కచుడి మరణసమయాన శ్రీకృష్ణుడు రథము మీద నాట్యం చేసాడు కదా ! పాండవ శిబిరానికి వెళ్ళి చాటుగా ఉండి వారి మాటలు విన్నాను. కృష్ణుడు ప్రవర్తనకు కారణమేమిటని అర్జునుడు అడిగిన విషయం పక్కనే ఉన్న సాత్యకి విని " అన్నయ్యా ! కర్ణుడు ఇంత కాలము మహా శక్తిని ప్రయోగించి అర్జునుడిని ఎందుకు చంప లేదు " అన్నాడు. కృష్ణుడు " సాత్యకి ! సుయోధనాదులు ప్రతి రోజు ఆ శక్తి ఆయుధంతో అర్జునుడిని చంపమని చెప్తుండే వారు. నేను కర్ణుడు యుద్ధరంగమున ప్రవేశించగానే నా మాయలో పడవేసి అతడికి ఆసక్తి ఆయుధం గుర్తుకు రాకుండా చేసేవాడిని. ఆ కారణంగా కర్ణుడుఅర్జునుడి మీద ఆ శక్తి ప్రయోగించ లేక పోయాడు. సాత్యకీ ! నీ కంటే, ధృష్టద్యుమ్నుడి కంటే మిగిలిన పాడుసుతుల కంటే నాకు అర్జునుడంటే వల్లమాలిన ప్రేమ. అర్జునుడు నా బహిర్ప్రాణం ఇంత కాలం కర్ణుడి వద్ద ఉన్న శక్తి కారణంగా అర్జునుడికి ప్రమాదం పొంచి ఉన్నదని భయపడుతునే ఉన్నాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక నేను సుఖంగా నిద్రిస్తాను " అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రునుకి చెప్పాడు. ధృతరాష్ట్రుడు " సంజయా ! దురదృష్టం సుయోధనుడిని వెన్నంటి ఉన్నప్పుడు మనమేమి చేయగలము " అన్నాడు.

ఘటోత్కచుని మరణానికి ధర్మజుడు విలపించుట[మార్చు]

ఘటోత్కచుడి మరణానికి దుఃఖంతో ధర్మరాజు రథము మీద కూలబడి రోదిస్తున్నాడు. కృష్ణుడు దగ్గరకు వెళ్ళి " ధర్మనందనా! ఏమిటీ వెర్రి. యుద్ధమున వీరులు మరణించరా ! అందుకు ఇంత చింతించ తగునా ! నీవిలా చింతించిన సైన్యమును నడుపగల వాడేవడు. నీ సోదరులను ఓదార్చగలవారెవరు లే వారిని ఓదార్చి యుద్ధసన్నద్ధులను చేయి " అన్నాడు. నీకు తెలియనిది ఏముంది ఘటోత్కచుడికి మేమంటే ఎంత ప్రేమాభిమానాలున్నాయో మమ్ము ఎంత గౌరవిస్తాడో. అరణ్యవాస సమయంలో మాకు ఎంత సహకరించాడు. నాకు ఘటోత్కచుని మీద సహదేవునికన్నా ప్రేమ ఎక్కువ. అటువంటి ఘటోత్కచుడు మరణుస్తే దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. అంతలోనే ఉగ్రుడై కృష్ణా ! దీనికంతటికి కారణం కర్ణుడు నాడు అభిమన్యుని విల్లు విరిచి అతడి మరణానికి కారణం అయ్యాడు. నేడు ఘటోత్కచుడిని స్వయంగా చంపాడు. కర్ణుడి మీద ప్రతీకారం చేయాలి. కర్ణుడికి సాయం చేసిన వాడు ద్రోణుడు నేను కర్ణుడిని చంపుతాను భీముడు ద్రోణుడిని చంపుతాడు " అంటూ తన రథమును వేగంగా ముందుకు నడిపాడు. కృష్ణుడు కలవరపడి అర్జునా ! అటు చూడు మీ అన్నయ్య కర్ణుడి మీద యుద్ధానికి పోతున్నాడు అతడిని అనుసరించు అన్నాడు. అలా వేగంగా పోతున్న ధర్మరాజు ఎదుటికి వ్యాసమహర్షి వచ్చాడు. ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించాడు. వ్యాసుడు " ధర్మనందనా ! కర్ణుడు శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడానికి ఉంచాడు. అది ఇప్పుడు ఘటోత్కచుడి మీద ఉపయోగించబడింది లేకున్న అర్జునుడిని చంపి ఉండే వాడు. అది జరిగి ఉంటే నీ దుఃఖం వర్ణించనలవి కాదు. ఇప్పుడు నీవు కొద్ది ధుఃఖంతో బయటపడటం మంచికే జరిగింది. కనుక అకారణంగా కోపం తెచ్చుకొనక వివేకంగా ఆలోచించి నీ వారినందరిని కలుపుకొని యుద్ధం కొనసాగించు. ఇకొంక విషయం చెప్తాను. నేటికి సరిగా అయిదవ నాటికి నిన్ను విజయలక్ష్మి వరిస్తుణంది. దీనిలో సందేహం లేదు " అన్నాడు.

ధర్మరాజు ద్రోణుని వధించమని సైన్యాలను పురికొల్పుట[మార్చు]

వ్యాసుడు వెళ్ళిన తరువాత ధర్మరాజు మనసును కుదుటపరచుకుని ధృష్టద్యుమ్నుడితో " భీముడు ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక మీదట నీవు ద్రోణుడితో యుద్ధము చెయ్యి. నీవు ద్రోణుడిని చంపడానికే పుట్టావు. శిఖండిని పాంచాల సైన్యాలను వెంట తీసుకుని ద్రోణుడిని ఎదిరించు " అని చెప్పి మిగిలిన వారిని చూసి చూసి " విరాటరాజా ! ద్రుపద మహారాజా! సాత్యకీ ! నకుల సహదేవులారా! ఉపపాండవులారా! మన ముందున్న ఏకైక లక్ష్యం ద్రోణ వధ. పార్ధుని నాయకత్వంలో మీరంతా ద్రోణుడిని ఎదుర్కొనండి " అన్నాడు. అప్పటికే ఇరుపక్షముల సేనలు ఒక పగలు ఒకరాత్రి యుద్ధం చేసి అలసి పోయాయి. నిద్రమత్తులో క్షణం ఒక యుగంగాఊవస్థ పడుతున్నారు. నిద్ర మత్తులో తూలుతున్నారు. ఇది గమనించిన అర్జునుడు ఇరుపక్షముల యోధులను ఉద్దేశించి " సైనికులారా! మీరంతా బాగా అలసి పోయి ఉన్నారు. నిద్రావస్థతో జోగుతున్నారు. కనుక మీరంతా కొంతసేపు నిద్రపొండి. మరొక ఝాములో చంద్రోదయం ఔతుంది. చంద్రుడు వచ్చిన తరువాత వెన్నెల వెలుగులో మన్ము తిరిగి యుద్ధము చేస్తాము " అన్నాడు. ఈ సూచనకు ఇరుపక్షముల సైనికులు సంతోషంగా అంగీకరించారు. కౌరవ సైనికులు సహితము అర్జునుడి దయాగుణానికి శ్లాఘించారు. సైనికులంతా ఎక్కడి వారక్కడే నిద్రకు ఉపక్రమించారు. అలా నిద్రిస్తుండగా చంద్రోదయం అయింది. పండు వెన్నెల కాయగానే పాండవ కౌరవ సేనలు నిద్ర మేల్కొని యుద్ధానికి సిద్ధం అయ్యాయి.

సుయోధనుడు ద్రోణుని నిందించుట[మార్చు]

సుయోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! నీవు చాలా గొప్పవాడవు, మహావీరుడవ నీముందు నిలువగలవారెవరు లేరు. కాని నీవు నీ శిష్యులైన పాండవులను చంపక వదిలి పెట్టడం నా దురదృష్టం కాక మరేమిటి ? " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు కోపించి " సుయోధనా ! నీ ఉద్దేశం నేను పాండవులను నా శిష్యులని వదిలి వేస్తున్నాననే కదా ! ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు అగ్నిదేవునికి సాయంగా ఉన్నప్పుడు. ఇంద్రుడు నా శిష్యుడనే అతడిని వదిలి వేసాడా ? నాడు ఘోషయాత్రా సమయాన చిత్రసేనుడు నిన్ను బంధీగా పట్టుకున్న సమయాన నీ కొరకు యుద్ధము చేసిన అర్జునుడిని చిత్రసేనుడు నా శిష్యుడనే వదిలాడా? కాలకేయులనే రాక్షసులు అర్జునుడు నా శిష్యుడనే అతడి చేతిలో మరణించారా ? అర్జునుడి పరాక్రమం తెలిసీ నన్ను నిందించడం తగదు " అన్నాడు. సుయోధనుడు " ఆచార్యా ! మీరు అవకాశం వచ్చినప్పుడల్లా అర్జునుడిని పొగుడుతూనే ఉన్నారు. మీరు అలాగే చేస్తూ పాండవులను అర్జునుడిని నాకు వదలండి. నేను కర్ణ, దుశ్శాసన, శకుని సాయంతో పాండవులను అంత మొందిస్తాను. మీరు మీకిష్టమైన వారితో యుద్ధము చేయండి " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు నవ్వి " సుయోధనా ! అలాగే మీరు అర్జునిడి ని ఎదుర్కొనండి మీరే గెలుస్తారేమో ! నాకు మాత్రం అర్జునుడి చేతిలో మరణించే భయం పోగొట్టావు అంతే చాలు " అన్నాడు.

ద్రోణుడు పాంచాల సేనను ఎదుర్కొనుట[మార్చు]

తరువాత ద్రోణుడు పాంచాల సైన్యాంతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాడు. అప్పటికే తెల్లవారు ఝాము అయింది. సుయోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఒక్కసారిగా అర్జునుడిని ఎదుర్కొని అతడి మీద శరవర్షం కురిపించారు. మహా వీరుడైన ద్రోణుడు అతిరధ మహారధులతో యుద్ధం చేయక తమలాంటి సామాన్య సైనికులుతో యుద్ధం చెయ్యడమేమిటని పాంచాల సైనికులు ఆశ్చర్య పోతున్నారు. అంతటి మహావీరునితో యుద్ధము చేసి చచ్చినా పరవాలేదని కొందరు అతడిని ఎదుర్కొంటున్నారు. ఇంతలో విరాటరాజు, ద్రుపదుడు, అతడి మనుమలు, కేకయ రాజులు తమ సైన్యాలతో ద్రోణుడిని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తన వాడి అయిన బాణాలతో పాంచాల మత్స్య సేనలను హతమార్చడమే కాక ద్రుపదుని మనుమలను ముగ్గురిని హతమార్చాడు. కేకయ రాజుల తలలను పండ్లు రాల్చినట్లు నేమీద పడ వేసాడు. అది చూసి విరాటుడు, ద్రుపదుడు వీరావేశంతో ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు వారిద్దరినీ అమిత పరాక్రమంతో ఎదుర్కొని వారిద్దరినీ చెరి ఒక బాణంతో నేల కూల్చాడు. తన తండ్రి మరణం కళ్ళారా చూసిన ధృష్టద్యుమ్నుడు " నేను కనుక ద్రోణుడిని చంపకపోతే నా కులాచారాన్ని ధర్మాలను తప్పిన వాడిని ఔతాను. అని ఘోర ప్రత్నిజ్ఞ చేసి పాంచాల సేనను తీసుకుని ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. అది చూసి సుయోధనుడు కర్ణుడితో వచ్చి ధృష్టద్యుమ్నుడిని అడ్డుకున్నాడు. అంతలో భీమసేనుడు వచ్చి ధృష్టద్యుమ్నుడికి తోడుగా ద్రోణుడిని ఎదుర్కొన్నాడు.

కురు పాండవ యోధుల సమరం[మార్చు]

అప్పటికి సూర్యోదయం అయింది. ఇరు పక్షముల వారు కొంతసేపు యుద్ధము ఆపి కాలకృత్యములు తీర్చుకుని కొంత విశ్రాంతి తీసుకుని మరలా యుద్ధము చేయుటకు ఉపక్రమించారు. సుయోధనుడు నకులుడిని, దుశ్శాసనుడు సహదేవుడిని, ద్రోణుడు అర్జునుడిని, భీముడు కర్ణుడిని ఎదుర్కొని పోరాడుతున్నారు. సహదేవుడి సారథిని దుశ్శాసనుడు చంపాడు. సహదేవుడు తానే రథము తోలుకుంటూ దుశ్శాసనుడి హయములను గాయపరిచాడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడి హయములు దుశ్శాసనుడిని రథముతో సహా ఎటో లాక్కెళ్ళాయి. భీముడు కర్ణుడు పదునైన బాణములతో ఒకరిని ఒకరు ఎదుర్కొన్నారు. తరువాత గదాయుద్ధము చేసారు. తిరిగి కర్ణుడు తన విల్లు తీసుకుని భయంకరమైన బాణములతో భీముని రథమును విరిచాడు. భీముడు సహదేవుడి రథము మీదకు దూకాడు. ద్రోణుడు అర్జునుడు ఒకరి మీద ఒకరు బాణ ప్రయోగం చేసుకుంటున్నారు. ఒకరు ప్రయోగించిన అస్త్రముకు వేరొకరు ప్రత్యస్త్రము ప్రయోగించుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ అస్త్రము ప్రయోగించారో తెలియక చూసే వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా గురుశిష్యులు ఘోరయుద్ధము సాగిస్తున్నారు. ఆకాశం నుండి వీరి యుద్ధం చూస్తున్న దేవతలకు పరమేశ్వరుడు రెండు రూపాలుగా విడి పోయి ఒకరితో ఒకరు తలపడి వినోదిస్తున్నాడా ! అన్నట్లు ఉంది. ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి నియమ నిష్టలతో మంత్రజపం చేసాడు. దేవతలు భయంతో వణికి పోయారు. దిక్కులు కంపించాయి. సముద్రాలు పొంగాయి. అది ఏమీ లక్ష్యపెట్టని ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు బెదరక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దానిని ఉపసంహరించాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానిని ఒకటి ఢీకొని నిర్వీర్యం అయిపోయాయి. ఒకరితో ఒకరు యుద్ధము సేసి ప్రయోజనము కవిపించక అర్జునుడు కౌరవ సేనల వైపు ద్రోణుడు పాంచాల సేనల వైపు వెళ్ళి పోయారు. అప్పుడు దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని అతడి అస్త్రధాటికి తట్టుకొన లేక పారి పోయాడు. నకుల సహదేవులు వెంట రాగా ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి వైపు వెళ్ళాడు. సుయోధనుడు సాత్యకి ఎదురుపడ్డారు. వారిరువురు చిన్ననాటి స్నేహితులు. కొంతసేపు విరోధము మరచి రథములు పక్కపక్కన నిలిపి చిన్న నాటి చిలిపి పనులు ఆనాటి కబుర్లు బాల్యం గుర్తు తెచ్చుకుని పొంగిపోయారు. ఒకరితో ఒకరు యుద్ధం చేయవలసిన పరిస్థితి తీసుకు వచ్చిన క్షత్రియ ధర్మం గురించి తలచుకుని బాధపడి తప్పదు కనుక కొంతసేపు యుద్ధము చేద్దాము అనుకుని యుద్ధము చేయసాగారు. మిత్రత్వము మరచి శత్రువుల వలె యుద్ధము చేయసాగారు. సాత్యకి సుయోధనుడి విల్లు విరిచి అతడి శరీరాన్ని తూట్లు పొడిచాడు. సుయోధనుడు అలసి పోయి యుద్ధరంగం నుండి తొలగి పోయి కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చి సాత్యకిని ఎదుర్కొన్నాడు. సుయోధనుడికి సాయంగా కర్ణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. అది చూసి భీముడు కర్ణుడితో పోరు సాగించాడు. కర్ణుడు భీముని సారథిని మూర్ఛిల్లజేసి భీముని విల్లు విరిచాడు. భీముడు తన గద గిరగిరా తిప్పి కర్ణుడి రథము మీద విసిరాడు. ఆ గద పోయి కర్ణుడి సారథి తల పగుల గొట్టి కర్ణుడి రథాన్ని ముక్కలు చేసింది. కర్ణుడు మరొక రథము ఎక్కి యుద్ధము చేయసాగాడు.

ద్రోణుడి మరణం[మార్చు]

ధర్మరాజు మత్స్య పాంచాలసేనలు వెంటరాగ ద్రోణుడి మీదకు యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. అప్పటికి రెండు ఝాముల పొద్దు ఎక్కింది. నకుల సహదేవులు భీముడు అర్జునుడిని చూసి " అర్జునా ! ఇక్కడ ద్రోణుడు మన సేనలను అంతమొందిస్తున్నాడు. నీవు అతడికి సాయంగా ఉన్న కౌరవ సేనలను తరుముతుండు. అప్పుడు ద్రోణుడు ఒంటరిగా చిక్కుతాడు. పాంచాల సేన అతడిని అంతమొందిస్తుంది " అని అరుస్తూ ద్రోణుడిని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తనకు అడ్డం వచ్చిన సైనికులను హతమారుస్తూ వేలాది సైనికులను చంపుతున్నాడు. ధర్మరాజు భీముడు నకుల సహదేవులు నిస్సహాయంగా చూస్తూ " ద్రోణుడు ఈ రోజు చెలరేగి పోతున్నాడు. ఇలా వదిలేస్తే ఈ రోజు పాండవసేనలను అంతమొందించి మనలను కూడా అంతమొందించి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నాడు. ఇతడిని నిలువరించడం మన తరం కాదు. నిలువరించ తగిన అర్జునుడు గురువును చంపుట పాపమని ఉపేక్షిస్తున్నాడు " అనుకున్నారు.

ద్రోణుడు అస్త్రసన్యాసం చేయుటకు శ్రీకృష్ణుడు మార్గం చెప్పుట[మార్చు]

వారు పడుతున్న మధన గమనించిన కృష్ణుడు రథమును వారి వైపు మళ్ళించి ధర్మరాజాదులు వినేలా " అర్జునా ! ద్రోణుడు తన చేత ధనస్సు ఉన్నంత వరకు అతడిని మానవ మాతృలే కాదు దేవదానవులు కూడా ఎదుర్కొన లేరు. ద్రోణుడు అస్త్రసన్యాసం చేయాలంటే ఒకటే మార్గం " అశ్వత్థామ చని పోయాడు " అని చెపితే ద్రోణుడు అస్త్రసన్యాసం చేస్తాడు. అప్పుడు ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు మీరు అతడిని సులభంగా చంపవచ్చు. కనుక అశ్వత్థామ చపోయాడని ఎవరైనా అతడికి చెప్పాలి " అన్నాడు. అది విని భీముడు వెంటనే పోయి మాళవరాజు ఏనుగైన అశ్వత్థామను చంపి వెనక్కు వచ్చి " ఆచార్యా ! అశ్వత్థామ చనిపోయాడు " అని చెప్పాడు. ద్రోణుడి మనస్సు ఒక్కసారి ఝల్లు మంది. అయినా తన కుమారుడి బలపరాక్రమాలు తలచుకుని భీముడి మాట నిర్లక్ష్యం చేసాడు. అయినా మనస్సులో అనుమానం వేదిస్తూనే ఉన్నా ధృష్టద్యుమ్నుడి మీద శరవర్షం కురిపించసాగాడు. అయినా భరించరాని వ్యధతో పది వేల మంది పాంచాల సైన్యాలను వధించాడు. మత్స్యదేశ సైన్యంలో అయిదు వందల రథములను విరిచి పదివేల గజములను, పదివేల హయములను విరిచాడు. ద్రోణుడు మధ్యందిన మార్తాండునిలా వెలుగ సాగాడు.

మహామునులు ద్రోణునికి శాంతించమని చెప్పుట[మార్చు]

ఇంతలో విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు, వశిష్ఠుడు ఇంకా ఇతర మునులు తమ దివ్య రూపాలతో వచ్చి " ఓ భరధ్వాజా! నీవు బ్రాహ్మణ వంశ సంజాతకుడవు. వేదవేదాంగ విదుడవు ఇలా క్షాత్ర ధర్మం వహించి యుద్ధము చేయుట తగునా ! ఇప్పటి వరకు చేసిన సంహారం చాలు నీకు కాలం పూర్ణంగా తీరిపోయింది. మా మాట మన్నించి యుద్ధము చేయుట ఆపి శాంతి వహించు " అన్నారు. ద్రోణుడికి ఒక్క సారిగా భీముడు అశ్వత్థామ మరణించాడని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అవకాశం కొరకు ఎదురు చూస్తున్న ధృష్టద్యుమ్నుడిని చూసాడు. మనసు వికలమైంది. దుఃఖం ముంచుకు వచ్చింది. అయినా సంశయం తీర్చుకోవడానికి అశ్వత్థామ మరణం నిజమేనా అని ధర్మజుని అడిగాడు. ధర్మజుడు అసత్యం పలుకడని ద్రోణుడి నమ్మకం. కృష్ణుడు ధర్మజునితో " మనం ద్రోణుడిని ఇలా వదిలితే సాయంత్రానికి మన సైన్యాలను ద్రోణుడు అంతమొందించడం ఖాయం. మమ్ము ద్రోణుని అస్త్రధాటి నుండి రక్షించడానికి నీవు అసత్యం ఆడక తప్పదు. ప్రాణరక్షణకు సత్యమాడటం అధర్మము కాదని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి " అన్నాడు. భీముడు " అన్నయ్యా ! నీవు అసత్యం పలుక పని లేదు. కృష్ణుని మాట వినగానే నేను మాళవరాజు ఏనుగైన అశ్వత్థామను చంపి ఆ మాట ద్రోణుడికి చెప్పాను. కాని ద్రోణుడు నా మాట నమ్మ లేదు. నీవు కూడా అదే చెప్పు నీవు చెప్పిన ద్రోణుడు అస్త్రసన్యాసం చేయగలడు. మన హితవు కోరి కృష్ణుడు చెప్పిన మాట మన్నించు " అన్నాడు. కృష్ణుడు, భీముడు చెప్పిన మాటలు ధర్మజుని మీద ప్రభావం చూపాయి. వెంటనే ద్రోణుడి వద్దకు వెళ్ళి " ఆచార్యా! అశ్వత్థామ మరణించాడు " అని పెద్దగా చెప్పి అది ఒక ఏనుగు అని మెల్లగా చెప్పాడు. ధర్మరాజు నోట అశ్వత్థామ మరణించాడు అన్న మాట విన్న తరువాత ద్రోణుడికి మరొక మాట వినిపించ లేదు.

ద్రోణుడిలో పరివర్తన[మార్చు]

ద్రోణుడు అలాగే రథము మీద వాలి పోయాడు. ద్రోణునిలో పరివర్తన మొదలైంది. తాను పాండవుల చేసిన పాపం తలచుకుని కుమిలి పోయాడు. ఋషులు మాటలు చెవుల్లో మారు మోగుతున్నాయి. తాను ఎంతో మంది అమాయకులైన సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. తన పాపానికి నిష్కృతి లేదు. ఇలా అనుకుని పైకి చూడగానే ఎదురుగా ధృష్టద్యుమ్నుడు అవకాశం కొరకు ఎదురు చూస్తుండటం చూసి అతడితో యుద్ధము చేయాలను ఉన్నా చేతులు రాలేదు. ధనుర్భాణాలు చేతి నుండి జారాయి. అతడిలో ఉన్న యుద్ధనిష్ఠ, శౌర్యము, గర్వము నశించాయి. తన కుమారుడు మరణించాడు అన్న దుఃఖం అతడిని కుంగదీసింది. అతడి అవయవములు ముడుచుకు పోయి అలాగే రథము మీద కూర్చుండి పోయాడు. ద్రోణవధ కొరకు అగ్ని నుండి జన్మించిన ధృష్టద్యుమ్నునికి ద్రోణుడిని వధించాలి అన్న కోరిక బలీయంగా కలిగి అతడి మీద శరవర్షం కురిపించాడు. ద్రోణుడికి యుద్ధం చేయాలని ఉన్నా దివ్యాస్త్రములు స్పురణకు రాక మామూలు బాణాలతో ధృష్టద్యుమ్నుడి బాణాలు ఖండిస్తూ ధృష్టద్యుమ్నుడి రథమును, ధ్వజమును ఖండించి, సారథిని చంపాడు. ధృష్టద్యుమ్నుడు రథము నుండి దిగి గదను తీసుకున్నాడు. ద్రోణుడు ఆ గదను తన బాణములతో ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు కత్తి డాలు తీసుకుని ద్రోణుని మీదకు ఉరికి అతడి హయములను, సారథిని చంపాడు ద్రోణుడు తన బాణములతో ధృష్టద్యుమ్నుడి కత్తిని ఖండించాడు. ఆ సమయంలో సాత్యకికర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మలతో యుద్ధము చేస్తున్నాడు. దూరం నుండి ఇది గమనించి పది బాణము ద్రోణుడి మీద వేసాడు. భీముడు తన రథము మీద వచ్చి ధృష్టద్యుమ్నుడిని తన రథము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. ద్రోణుడు అతడిని పోనేలే అని వెంబడించక వదిలాడు.

ద్రోణుడు ప్రశాంతిని పొందుట[మార్చు]

దస్త్రం:Death of Drona.jpg
ధ్యాననిమగ్నుడై ఉన్న ద్రోణుడి దేహం నుండి వచ్చిన ఆత్మ దివ్యలోకములకు ప్రయాణించుట

ఇప్పుడు ద్రోణుడి మనస్సు ప్రశాంతమైంది. తన రథము మీద కూర్చుని యోగ నిమగ్నుడయ్యాడు. మనసులో శాంతి పొంది చుట్టూ చూసాడు. " ఓ కర్ణా! ఓ కృతవర్మా ! ఓ సుయోధనా ! మీరు నన్ను యుద్ధం చేయడం లేదని ఎత్తి పొడుస్తూనే ఉన్నారు. అయినా నేను నా చేతనైనంత యుద్ధం చేసాను. ఇంక నిశ్చింతగా పైలోకాలు చేరుకుంటాను. నేను నా ధనుర్భాణాలు విడిచి అస్త్రసన్యాసం చేస్తున్నాను. మీరంతా ఇకనైనా తెలివిగా ప్రవర్తించండి " అని ఎలుగెత్తి అరిచాడు. ద్రోణుడు తన ధనుర్భాణాలు రథము మీద వదిలి తేజోమయమైన ఆత్మతో వెలుగొందు తున్నాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు కత్తి తీసుకుని ద్రోణుడి వైపు నడిచాడు. అది చూసి ఉభయసైన్యాలు హాహాకారాలు చేసాయి. కాని అప్పటికే ద్రోణుడి ప్రాణాలు అనంతవాయువులలో కలిసి పోయాయి. అతడి ఆత్మ జ్యోతి రూపంలో పైకెగసి పరమాత్మను చేరుకుంది. అతడి ఆత్మ తేజో రూపంతో పకి వెళ్ళడం నేను, కృపాచార్యుడు, కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు మాత్రమే చూసాము. మిగిలిన వారికి అది గోచరించ లేదు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు కత్తి తీసుకుని ద్రోణుని రథము ఎక్కి అతడి జుట్టు పట్టుకుని మెడ నరకడానికి కత్తి పైకి ఎత్తాడు. వద్దు, వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, అది ధర్మవిరుద్ధమని ధర్మజుడు ఎంత అరచినా వినక అతడి తలను నరికి మొండెమును నుండి తలను వేరుచేసి నేల మీదికి వేసాడు.

అశ్వత్థామకు తండ్రి మరణం ఎరిగించుట[మార్చు]

కౌరవ సైన్యము సైన్యాధ్యక్షుడి మరణంతో కలత చెంది ఉన్న తరుణంలో పాండవసేన విజృంభించి కౌరవసేనలను ఎదుర్కొని తరిమింది. పాండవ సేనల ధాటికి ఆగలేని కౌరవ సేనలు పారిపోసాగాయి. నీ కుమారులు వారిని వెంబడించారు. కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శకుని మొదలైన వారంతా వెనుతిరిగి చూస్తూ పోతూ పోతూ వారు " ఎంత ఘోరం జరిగింది. ఏమి చేయాలో తోచక ఉంది. ఈ నరమేధం ఇక ఆగదా " అనుకున్నారు. వేరొక చోట యుద్ధము చేస్తున్న అశ్వత్థామ కౌరవ యోధులు వెనుదిరుగుతూ తిరోగమించడం చూసి సుయోధనుడిని సమీపించి " సుయోధనా ! మన సైన్యాలకు ఏమైంది ఇలా వెనుకకు చూసుకుంటూ పరుగెడుతున్నారు? కృపాచార్యుడు, కర్ణుడు ఎందుకింత మ్లానవదనులై ఉన్నారు " అని అడిగాడు. సుయోధనుడు బదులు పలుక లేక పోయాడు. దుఃఖంతో మాట రాక అశ్వత్థామకు తండ్రి మరణం గురించి ఎలా చెప్పాలి అనుకుంటున్నాడు.

కృపాచార్యుడు అశ్వత్థామకు తండ్రి మరణ వార్త ఎరిగించుట[మార్చు]

కృపాచార్యుడు అశ్వత్థామకు తండ్రి మరణ వార్తను ఇలా చెప్పాడు. " కుమారా ! నీ తండ్రి పాంచాలసేనలో చాలా పెద్ద మొత్తాన్ని చంపుతున్నాడు. పాండవులు ఎలాగైనా నీ తండ్రిని చంపాలనుకున్నారు. భీముడు నీ తండ్రి వద్దకు పోయి అశ్వత్థామ మరణించాడు అని అబద్ధం చెప్పాడు. నీ తండ్రి అతడి మాట నమ్మక యుద్ధం చేస్తూనే ఉన్నా సందేహం తీర్చుకోవడానికి ధర్మజుడు అబద్ధం చెప్పడని నమ్మకంతో అతడిని నిజం చెప్పమని అడిగాడు. అంతకు ముందే భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపడం వలన ధర్మరాజు కూడా అశ్వత్థామ చనిపోయునట్లు చెప్పాడు. ఆ మాట వినగానే నీ తండ్రి అస్త్రసన్యాసం చేసి యోగసమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు నీ తండ్రి రధము మీదకు దూకి నీ తండ్రి తల తెగనరికాడు. అర్జునుడు ధర్మరాజు వద్దని అది ధర్మము కాదని ఎంత అరచినా వినలేదు. నీ తండ్రి మరణించగానే మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. మనసైన్యాలు భయపడి పారిపోతున్నాయి. కాని నాకు ఇదంతా కృష్ణుడు ఆడించిన నాటకం అనిపిస్తుంది. లేకున్న భీముడికి ఇన్ని తెలివితేటలు లేవు. ధర్మరాజు ఇంతటి అధర్మానికి ఒడిగట్టడు " అన్నాడు.

తండ్రి మరణానికి అశ్వత్థామ ప్రతి స్పందన[మార్చు]

కృపాచార్యుడు చెప్పినది ప్రశాంత చిత్తతంతో విన్న అశ్వత్థామ " మామా ! కృపాచార్యా ! జాతస్య మరణం ధృవం. పుట్టిన వానికి మరణం తప్పదు. పైగా యుద్ధం చేస్తుంటే మరణం వెన్నంటి ఉంటుంది. కాని లోకారాధ్యుడైన నా తండ్రిని నీరాయుధుడై యోగసమాధిలో ఉన్న సమయాన జుట్టు పట్టుకుని మెడ నరకడమే బాధాకరంగా అవమానకరంగా ఉంది. సుయోధనా నాకు నా తండ్రి ప్రసాదించిన దివ్యాస్త్రాలు, నా అస్త్ర విద్య నాతండ్రిని కాపాడు కోవడానికి పనికి రాలేదు. నా గురువు, నా దైవం , నా పితృదేవుడు అలా దిక్కు మాలిన చావు చస్తుంటే ఆపలేక పోయాను. సుయోధనా ! దీనికి కారణం ధర్మరాజు పేరుకు ధర్మరాజు చెప్పినది అసత్యం. అతడిని అంతమొందించిన కాని నా మనస్సు శాంతించదు. సుయోధనా నా తండ్రి కుమారుని కన్నది అవసానదశలో ఇలా అవమానం పొందడానికా ! ఇదిగో ఇదే నా ప్రతిజ్బ. దేవతలు అడ్డుపడినా సరే ఆ కృష్ణుడే అడ్డుపడినా నేను పాండవులను సంహరిస్తాను " అన్నాడు. సుయోధనా ! నా పరాక్రమం నేను చెప్పుకో కూడదు. నా తండ్రికి జరిగిన అవమానం తట్టుకోలేక ఇలా అన్నాను. ఇప్పుడు కాకున్న ఎప్పుడైనా ఎలాగైనా నేను పాండవులను వధించి తీరతాను " అన్నాడు. తిరిగి అశ్వత్థామ " సుయోధనా ! నా తండ్రి శ్రీమన్నారాయణుడిని ఆరాధించి నారాయణాస్త్రం పొందాడు. దానిని నా తండ్రి నాకు ప్రసాదించాడు. ఆ అస్త్రం వారు వీరు అన్న తేడా లేకుండా అందరిని హతమార్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. నేను ఇప్పుడు నారాయణాస్త్రం ప్రయోగించి శత్రువులను గెలుస్తాను " అన్నాడు. అది విన్న సుయోధనుడు ఆనంద పడి తన వారినందరిని సమాయత్త పరచి శంఖం పూరించాడు. అది చూసి ధర్మరాజాదులు యుద్ధానికి సమాయత్తమయ్యారు.

పాండవ సేనలో కలకలం[మార్చు]

ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! ద్రోణుడు మరణించగానే చెదిరి పోయిన కౌరవసేన తిరిగి యుద్ధానికి సమాయత్తం కావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందుకు కారణం ఏమిటి. కౌరవసేనలో ఆనందం మిక్కుటంగా ఉంది. మనము ద్రోణుడిని చంపామని ఆగ్రహించి నీ తండ్రి ఇంద్రుడు దేవసైన్యంతో మనమీదకు యుద్ధానికి వచ్చాడా ! " అన్నాడు.

అర్జునుడు ధర్మరాజాదులకు అశ్వత్థామ గొప్పదనాన్ని తెలుపుట[మార్చు]

అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! అస్త్రసన్యాసం చేసిన ఆచార్యుని అధర్మంగా వధించిన వారిని అశ్వత్థామ వదిలుతాడా ! అతడి వద్ద దివ్యాస్త్ర సంపద ఉంది. అతడు సహజంగా మహాద్భుత శౌర్య సంపన్నుడు. ఈ సమయంలో అతడిని ఎదుర్కొనుట చాలా కష్టం. అన్నయ్యా ! అశ్వత్థామ పుట్టగానే ఉచ్చైశ్రవము మాదిరి సకిలించాడట. అప్పుడు ఆశరీరవాణి అందరూ వింటుండగా ఆ బాలుడు అశ్వత్థామ అనే పేరొతో వర్ధిల్లగలడు అని పలికిందట. ఇప్పుడు కౌరవ సేన విజృంభణకు అశ్వత్థామయే కారణం. ఎప్పుడూ పాపం చేసి ఎరగని ఓ ధర్మరాజా ! నిన్ను తన శిష్యుడని, సత్యం పలుకుతావని, ధర్మం తప్పని వాడివని అత్యంత ఆదరంతో ద్రోణుడు తన కుమారుడి మరణం గురించి అడిగాడు. కాని నీవు ధర్మహానికి తలపడి అశ్వత్థామ మరణించాడని అసత్యం పలికావు. అది నమ్మి ద్రోణుడు అస్త్రసన్యాసం చేసాడు. ఇంత అధర్మానికి పాల్పడి రాజ్యం సంపాదించడం అవసరమా ! లోకం దూషించదా ! ఇందు వలన పొందిన సంపద మనకు ఆనందాన్ని ఇస్తుందా ! అది అధర్మము, వద్దు అని మనం అరుస్తున్నా వినక ఆ ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి జుట్టు పట్టుకుని తల నరకవచ్చా ! అది అధర్మం కాదా ! మనం ఇలా ధర్మ విరుద్ధమైన పనులు చేసిన అతడి కుమారుడు అశ్వత్థామ మనపై ఆగ్రహించి యుద్ధం చేయక మానుతాడా ! మన సేనలను సర్వనాశనం చేయడానికి అశ్వత్థామ ఉగ్రుడై వస్తున్నాడు సిద్ధం ఉండండి. అయినా అతడి బారి నుండి ధృష్టద్యుమ్నుడిని కాపాడటం నీకూ నాకే కాదు మరెవరి తరం కాదు " అన్నాడు.

పాండవ యోధుల మధ్య వాద ప్రతివాదాలు[మార్చు]

అర్జునుడి మాటలను విని భీముడు కోపంతో ఊగిపోతూ " అర్జునా ! నీవు వీరుడివా ! లేక ఋషిపుంగవుడివా! ఏమిటీ పిరికి మాటలు. గురువును చంపడం మహాపాపమని మన సైన్యాలను ధ్వంసం చేస్తున్న ద్రోణుడిని నీవు వదలడం న్యాయమా ! యుద్ధరంగమున ప్రవేశించిన పిదప గురుశిష్య సంబంధాలు, బంధు మిత్ర అభిమానాలు వదిలి నిష్పక్షపాతంగా యుద్ధము చేయాలని రాజనీతి ఘోషిస్తున్నా నీవు రాజధర్మాన్ని తప్పి ద్రోణుడిని వదలడం ధర్మమా ! కౌరవులు అధర్మవర్తనులు కారా! నిండు కొలువులో శీలవతి అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చి అవమానించిన నీతి బాహ్యులకు వారికి సహకరించి యుద్ధము చేస్తున్న వారికి ఇలాంటి ఎన్ని అధర్మములు చేసినా మనకు పాపం అంటదు. అర్జునా ! మనలను ఎదుర్కోడానికి వస్తున్న శత్రువులను జయించడం ఎలా అని మేము ఆలోచిస్తుంటే నీవిలా పిరికి మాటలు మాట్లాడటం ధర్మమా ! అర్జునా ! నేనేమిటో నా పరాక్రమము ఏమిటో సుయోధనుడికి తెలుసు. మన మీదకు వస్తున్న వారిని సర్వ నాశనం చేయక వదలను " అని భీముడు రోషంతో పలికాడు.

ధృష్టద్యుమ్నుడి వాదం[మార్చు]

అప్పుడు ధృష్టద్యుమ్నుడు అర్జునుడితో " అర్జునా ! నీ గురువు ద్రోణుడు మాత్రం అధర్మం చేయలేదా ! కేవలం చేత ఉన్న ఆయుధములు తప్ప ఇతర ఆయుధ ప్రయోగం తెలియని, యుద్ధ ప్రక్రియలు తెలియని వారు, అస్త్రశస్త్రములు ఎరుగగని వారు, బలహీనులు అయిన సాధారణ పాంచాల సైనికుల మీద దివ్యాస్త్ర ప్రయోగం చేసి వేలకొలది సైనికులను క్షణకాలంలో హతమార్చుట ధర్మమా !. అది క్రూరత్వము కాదా ! నిర్ధయ కాదా ! అర్జునా ! నేను ద్రోణుడిని చంపుటకు అగ్ని నుండి ఉద్భవించాను. చంపాను ఇందు పాప పుణ్యముల ప్రసక్తి లేదు అంతే. అర్జునా ! నీవు చేసినదేమిటి ? నీ తండ్రికి మిత్రుడైన భగదత్తుని చంపలేదా ! శిఖండిని అడ్డుపెట్టుకుని తాతను పడగొట్ట లేదా ! నీ మీద యుద్ధము చేయని వారిని చంపుట ధర్మమా ! నా తండ్రిని చంపి నా పాంచాల సేనలను చంపి నన్ను ఎదుర్కొన్న ద్రోణుడిని చంపుట అధర్మమా ! ఇదెక్కడి ధర్మమయ్యా ! ధర్మరాజు చేసినది అధర్మం కాదు. అతడు చేసినది పాపం కాదు. అతడి పలికినది అసత్యము కాదు. అశ్వత్థామ అనే ఏనుగును భీముడు చంపాడు. ఆ విషయం చెప్పి తన సైన్యమును రక్షించుకున్నాడు. నేను తన శిష్యులను వంచించిన ద్రోణుడిని చంపి నా సైన్యాలను రక్షించుకున్నాను. ద్రోణుని వధతో నీ మార్గం నిష్కంటకం అయింది. శత్రువులను జయించి విజయలక్ష్మిని వరించు " అని నిర్ధ్వందంగా పలికాడు. ధృష్టద్యుమ్నుని మాటలకు ద్రోణుని వధ కలిగించిన దుఃఖంతో పెల్లుబుకుతున్న అశ్రువులతో అర్జునుడు " ధృష్టద్యుమ్నా! చాలు ఇక ఇలాంటి అసహ్యకరమైన మాటలు కట్టి పెట్టు. చేసింది చాలక ఇంకా దానిని సమర్ధించుకుంటున్నావా ! " అన్నాడు.

సాత్యకి ధృష్టద్యుమ్నుల రోషావేశాలు[మార్చు]

ధృష్టద్యుమ్నుని మాటలకు సాత్యకి కోపించి " ఔను ధృష్టద్యుమ్నా! నీవు చేసింది ముమ్మాటికీ అధర్మమే ! నీవు ఇన్ని మాటలు అన్నా నీ నాలుక చీలక నీ తల పగలక ఉంది అంటే అది ధర్మరాజు నీ పక్కన ఉండుటయే ! ఇక ఒక్క మాట అన్నా నేను అన్నది జరుగుతుంది. భీష్ముడిని చంపటానికి శిఖండి జన్మించాడు. చంపాడు అతడికి అర్జునుడు తోడున్నాడు అంతే ! భీష్ముడు తనను పడగొట్టమని అది అర్జునుడే చేయాలని ధర్మరాజుకు చెప్పాడు. అదే విధంగా ధర్మరాజు అర్జునుడిని, శిఖండిని ఆదేశించాడు. ఆది భీష్ముని ఇష్టానుసారం జరిగింది. ఓ ధృష్టద్యుమ్నా! నీవు, శిఖండి పాంచాల వంశాన పుట్టి ఆ వంశానికి కళంకం తెచ్చారు " అన్నాడు. ఆ మాటలకు ధృష్టద్యుమ్నుడు నవ్వి " ఓ సాత్యకీ ! నీవా నాకు నీతులు చెప్పేది. అర్జునుడు భూరిశ్రవసుడి చేతిని నరికిన తరువాత నీవు ప్రయోపవేశం చేసిన అతడిని చంప లేదా ! మహావీరుడవైన నీకిది ధర్మమా ! వివేక హీనుడా ! భూరిశ్రవసుడు నీ మీద నిలిచి చంపడానికి కత్తి దూసినప్పుడు నీ వీరత్వము ఏమైంది. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడి తల నరకడం అధర్మము కాదా ! నీ తప్పు తెలుసుకుని ఎదుటి వారి తప్పులు ఎంచు. ద్రోణుడు ఎన్ని సార్లు మనలను ఎదుర్కొన్నాడు. అప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు ? ఏమి చేస్తున్నావు? ఎందుకు ఎదిరించ లేదు ? నీవు భూరిశ్రవసుడిని చంపిన పరిస్థిలో నేను ద్రోణుడిని చంపాను. నీకు అంటని పాపాపం నాకు అంటదు. అంతటి పరాక్రమశాలి ద్రోణుడిని చంపినందుకు అభినందించవలసినది పోయి తప్పు పట్టడం న్యాయమా! ఓ సాత్యకీ ! నీవు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుని నాకు కోపం తెప్పిస్తున్నావు. ఇంకొక్క మాట మాట్లాడితే నీ తల పగుల కొడతాను. మనం పాండవుల తరఫున యుద్ధం చేయ వచ్చాము. మన ధర్మం మాత్రం నిర్వర్తిస్తాము రా " అన్నాడు. ఆ మాటలకు సాత్యకి రోషావేశ భరితుడై రధము మీద ఉన్న గధను చేతబట్టాడు. ఇది అంతా వినోదంగా చూస్తున్న కృష్ణుడు సాత్యకిని ఆపడానికి భీముని పంపాడు. వెంటనే భీముడు రధము దిగి వెళ్ళి సాత్యకిని కదల కుండా పట్టుకున్నాడు. ఇంతలో సహదేవుడు అక్కడకు వచ్చి " యాదవులు పాంచాలురు మాకు బంధువులు. మాకు కావలసిన వారే. మీలో మీరు ఇలా తగవులాడితే శత్రువులు మనలను చూసి హేళన చేస్తారు. తగవులు మానండి " అన్నాడు. ధృష్టద్యుమ్నుడు " బీమా ! సాత్యకిని ఆపపద్దు రానివ్వు ఏమి చేస్తాడో చూస్తాను. అతడి పొగరు అణుస్తాను నేనేమి చెయ్యి తెగిన భూశ్రవసుడిని కాదు అతడి చేతిలో చావడానికి " అన్నాడు. ఇక కొనసాగించడం మంచిది కాదని భావించిన కృష్ణుడు, ధర్మరాజు పోయి వారికి సర్ది చెప్పారు. ఇంతలో ఇరుపక్షముల యుద్ధభేరీలు మ్రోగాయి. ఇరు పక్షాలు యుద్ధసన్నద్ధమైయ్యాయి. ద్రోణుడిని జయించిన ధైర్యంతో పాండవ సేనలు, అశ్వత్థామ ఇచ్చిన ధైర్యంతో కౌరవసేన తలపడ్డాయి.

అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట[మార్చు]

దస్త్రం:Ashwatthama uses Narayanastra.jpg
నారాయణాస్త్రం ప్రయోగించుచున్న అశ్వత్థామ

అశ్వత్థామ నారయణాస్త్రాన్ని ధ్యానించి విల్లు సంధించాడు. నారయాణాస్త్రాన్ని పాండవసేనల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రధాటికి భూమి దద్దరిల్లింది. దిక్కులు పిక్కటిల్లాయి. సముద్రములు పొంగాయి. ఆ దివ్యాస్త్రం నుండి అనేక ఆయుధములు పుట్టి పాండవ సేన మీదకు వస్తున్నాయి. పాండవ సేన దానిని శాయశక్తులా ఎదుర్కొంటున్నారు. కాని దాని ధాటికి తాళ లేక పోతున్నారు. నారయణాస్త్రం పాండవ సేనను నాశనం చేస్తుంది. అది చూసి ధర్మరాజు అర్జునుడి వంక చూసాడు. అర్జునుడు మాటాడ లేదు. ధర్మరాజు అర్జునుడు, కృష్ణుడు వినేలా ధృష్టద్యుమ్నుడు సాత్యకులతో ఇలా అన్నాడు. " ఆ ద్రోణుడు ఎంత క్రూరుడంటే నాడు నిండు కొలువులో ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ ఉఉరుకున్నాడు కాని ఒక్క మాట అన లేదు. బాలుడైన అభిమన్యుని మరణానికి కారణమయ్యాడు. సూర్యాస్తమయం అయితే అర్జునుడు అగ్ని ప్రవేశం చేయాలని తెలిసీ మనలను అర్జునుడికి సాయంగా వెళ్ళ నీయక అడ్డుకున్నాడు. మరి అలాంటి ధర్మపరునితో మనం సరి తూగగలమా ! ఈ నారాయణాస్త్ర సాక్షిగా చెప్తున్నాను. మీరంతా పారి పోయి మీ ప్రాణాలను దక్కించుకొండి. అప్పుడు అర్జునుడు కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణుడేమి చేస్తాడో ఆయన ఇష్టం " అని నిష్టూరంగా అన్నాడు. ఇక కృష్ణుడు ఊరక ఉండలేక రధము మీద నిలబడి " ఓ సైనికులారా ! పాండవ వీరులారా ! భయపడకండి. మీరంతా మీ మీ రథములు వాహనములు గజములు హయములు దిగి ఆయుధములు కింద పడవేయండి. నారాయణాస్త్రానికి ఇదే విరుగుడు. వేరు ఉపసంహారం లేదు " అన్నాడు.

నారాయణాస్త్రాన్ని భీముడు ఎదుర్కొనుట[మార్చు]

శ్రీకృష్ణుడి మాటలకు సైనికులు తమ తమ వాహనములు దిగుతుండగా భీముడు " మహా వీరులారా ఆగండి వాహనములు దిగకండి వీరోచితంగా పోరాడండి. నేను ఉన్నాను, మహాస్త్రాలను ప్రయోగిస్తాను, నా గదతో అందరిని గెలుస్తాను " అని ఎలుగెత్తి అరచి తన గధ తీసుకుని అశ్వత్థామ మీదకు ఉరికాడు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని భీముని మీదకు మళ్ళించాడు. భీముని మాట వినక అందరూ తమతమ వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టారు. ఆ నారాయణాస్త్రము వారిని విడిచి ఆయుధధారి అయిన భీముని వెంటబడింది. అది చూసి భీముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వారుణాస్త్ర ప్రభావానికి నారాయణాస్త్రం శక్తి కొంత తగ్గింది. వెంటనే అశ్వత్థామ దాని శక్తిని పెంచాడు. ఆ నారాయణాస్త్రం భీముడిని భీకర అగ్నిజ్వాలలను విరజిమ్ముతూ చుట్టుముట్టింది. అది గమనించిన కృష్ణార్జునులు తమ ఆయుధములను రధము మీద ఉంచి రధము దిగి భీముని రధము వద్దకు పరుగెత్తి అతడిని రధము మీద నుండి కిందకు దించుటకు ప్రయత్నించారు. భీముడు రధము దిగక మూర్ఖంగా అలాగే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు " భీమసేనా ! మహా వీరా! ఈ అస్త్రమును ఉపసంహంరించే శక్తి అశ్వత్థామకు కూడా లేదు. దీనికి ఆయుధములు కింద పెట్టడమే విరుగుడు. నా మాట విని ఆయుధములు విడిచి రథము దిగవయ్యా " అంటూ కృష్ణుడు బతిమాలుతూ భీముని చేతి నుండి ఆయుధములు లాగాడు. అర్జునుడు, కృష్ణుడు కలసి ఒక్క తోపుతో రధము నుండి కిందకు తోసారు. ఇక పాండవ సైన్యంలో ఎవరి చేతా ఆయుధములు లేక పోయే సరికి ఆ ఆయుధము శాంతించి వెను తిరిగింది. వెంటనే అందరిని ఆయుధములు ధరించి యుద్ధముకు సిద్ధం కమ్మని కృష్ణుడు ఆదేశించడంతో పాండవసైన్యం తిరిగి కౌరవ సైన్యంపై విజృంభించింది.

సుయోధనుడు నారాయణాస్త్రాన్ని తిరిగి ప్రయోగించమని అశ్వత్థామకు చెప్పుట[మార్చు]

అప్పుడు సుయోధనుడు " గురు పుత్రా ! నారాయణాస్త్రమును తిరిగి ప్రయోగింపుము " అన్నాడు. అశ్వత్థామ సుయోధనా ! రారాజా ! ఈ నారాయణాస్త్రం ఒక్క సారే ప్రయోగించాలి రెండవ సారి ప్రయోగిస్తే ప్రయోగించిన వారిని సంహరిస్తుంది. నారాయణుడు నా తండ్రికి ఈ అస్త్రమును ఇచ్చినప్పుడు అలాగే ఆదేశించాడు. యుద్ధములో వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టడం మరణించుటతో సమమే కదా! అందుకని వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టిన వారిని ఆ అస్త్రం ఏమీ చేయదు. శ్రీకృష్ణుడికి ఆ విషయం తెలుసు కనుక తన వారిని రక్షించుకున్నాడు. ఇక మనమేమి చేయగలము చెప్పు " అన్నాడు. సుయోధనుడు " అశ్వత్థామా ! పోనీలే. నారాయణాస్త్రం నిరుపయోగమైనంత మాత్రాన నిరుత్సాహపడవలసిన పని లేదు. మన వద్ద ఇంకా దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా! వాటిని ఉపయోగించి పాండవులను గెలుస్తాము " అన్నాడు. అశ్వత్థామ అవును సుయోధనా ! అలాగే చేద్దాము.

అశ్వత్థామ పాండవులను ఎదుర్కొనుట[మార్చు]

దస్త్రం:Ashwatthama uses Agneyastra.jpg
అర్జునునిపై ఆగ్నేయాస్త్రమును ప్రయోగించిన అశ్వత్థామ

అని పాండవుల మీదకు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధభూమిలో అశ్వత్థామకు ధృష్టద్యుమ్నుడు కనపడగానే కోపంతో ఊగిపోయాడు. తన నిశిత బాణాలతో ధృష్టద్యుమ్నుడి రథమును కూల్చి, అశ్వాలను చంపాడు. అతడి విల్లు తుంచి, కేతనమును విరిచాడు. ఇంతలో సాత్యకి ధృష్టద్యుమ్నుడికి సాయం వచ్చాడు. అశ్వథ్థామ ఒకే బాణంతో సాత్యకిని మూర్ఛపోయేలా కొట్టాడు. తరువాత ధృష్టద్యుమ్నుడిని మూర్ఛిల్లజేసి విజయోత్సాహంతో సింహనాదం చేసాడు. అది చూసి భీమార్జునులు అశ్వత్థామను ఎదుర్కొన్నారు. వారికి తోడుగా చేది దేశపురాజు సుదర్శనుడు, వృద్ధక్షత్రుడు వారికి సాయంగా వచ్చారు. అశ్వత్థామ తన పదునైన బాణాలతో వృద్ధక్షత్రుడిని, సుదర్శనుడిని తలలు నరికివేసాడు. అశ్వథ్థామ ఎక్కడ చూసినా తానే అయి యుద్ధము చేస్తున్నాడు. అశ్వత్థామ పరాక్రమానికి పాండవ సేనలు పారిపోతున్నాయి. భీమార్జునులు తమ శాయశక్తులా పాండవ సేనలకు ధైర్యం చెప్తున్నారు. అర్జునుడు అశ్వత్థామ మీద నిశిత శరములు ప్రయోగించాడు. అశ్వత్థామ కోపించి ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రం అగ్ని జ్వాలలను విరజిమ్ముతూ అర్జునుడి మీదకు వచ్చి త్రుటికాలంలో పాండవుల సైన్యం ఒక అక్షౌహినిని నాశనం చేసింది. కౌరవ ప్రముఖులంతా కృష్ణార్జునులతో సహా ఆగ్నేయాస్త్రానికి బలి కాగలరు అనుకుని జయజయధ్వానాలు చేసారు. కాని అర్జునుడు తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేసాడు. కృష్ణార్జునులు శంఖనాదం చేసారు. పాండవ సేనలు జయజయధ్వానాలు చేసారు. అప్పటి వరకు జయధ్వానాలు చేసిన కౌరవసేనలు ఇది చూసి పారిపోయాయి. అశ్వత్థామ పరాభవంతో తలదించుకున్నాడు. తన చేతిలోని దివ్యాస్త్రాలను కింద వేసి. నాకు దివ్యాస్త్ర బలం లేదని తెలిసి పోయింది. సిగ్గు మాలి ఇంకా ఎందుకు యుద్ధం చేయడము. వెంటనే యుద్ధం మాని వేస్తాను " అని మనసులో అనుకుని రధము దిగి పాదచారి అయి యుద్ధభూమిని విడిచి పోతున్నాడు.

వ్యాసుడు అశ్వత్థామకు నరనారాయణుల గురించి వివరించుట[మార్చు]

దస్త్రం:Ashwatthama with Vyasa.jpg
అశ్వత్థామను సాంత్వన పరుస్తున్న వ్యాసుడు

అశ్వథ్థామ కొంత దూరం పోగానే వ్యాసుడు ఎదురు వచ్చాడు. అశ్వత్థామ వ్యాసమహామునికి వినయంగా నమస్కరించి " మునీంద్రా ! నాదొక సందేహం నేను సంధించిన ఆగ్నేయాస్త్రం మహిమాన్వితమైంది. దేవదానవులు, గంధర్వులు కూడా దాని ముందు నిలువలేరు. కాని సామాన్యమానవులైన కృష్ణార్జునులను అది ఏమీ చేయ లేక పోయింది ఎందుకని " అని అడిగాడు. అందుకు వ్యాసుడు " ఓ అశ్వత్థామా ! పూర్వం నారాయణుడు లోకములు రక్షించుటకు నారాయణ మునిగా అవతరించాడు. నారాయణ ముని తపస్సు చేయుటకు మైనాక పర్వతానికి వెళ్ళాడు. అక్కడ శిఉవుని గురించి ఘోర తపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చి మహాశివుడు నారాయణునికి ప్రత్యక్షం అయ్యాడు. నారాయణుడు మహాశివుని అనేక విధముల స్తోత్రం చేసి " మహేశ్వరా ! నిన్ను ఎల్లప్పుడూ భక్తితో భజించు నాకు అనన్య సులభమైన ప్రభావము నొసగుము " అని అడిగాడు. అందుకు శివుడు సంతసించి నీవు, నర, సుర, గంధర్వ, గరుడ, కిన్నర, ఉరగ మొదలైన భూతకోటిని అవలీలగా గెలువగలవు. పరమ తేజోవిరాజమానుడవై ఉండగలవు. నీకు ఏ అస్త్రముతోగాని, శస్త్రముతోగాని, అగ్నితోగాని, జలముతోగాని, తడి వస్తువుతోగాని, పొడి వస్తువుతోగాని, స్థావరజంగములతోగాని, వజ్రాయుధముతోగాని బాధగాని చావుగాని ఉండవు. ఒక వేళ నేనే నీ మీదకు యుద్ధానికి వచ్చినా నన్ను కూడా జయింపగలవు " అని వరము ఇచ్చాడు. కనుక నారాయణుడు అజేయుడు. అశ్వత్థామా ! నారాయణుడు తపస్సు చేసుకుంటున్న సమయమున అతడి తేజస్సు నుండి పుట్టిన వాడు నరుడు. వారు నరనారాయణులుగా ప్రసిద్ధి చెందారు. వారిద్దరూ విష్వంశ సంభూతులు. వారిరువురు మహాఋషులు. నారాయణుడు తన లీలతో జగన్మోహనుడై విహరిస్తూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తుంటాడు. ఈ మహాత్ములు ఇద్దరూ దానవులను వధించుటకు ధర్మసంస్థాపనకు అవసరమనిపించినప్పుడల్లా అవతరిస్తుంటారు. నారాయణుడే కృష్ణుడు, నరుడే అర్జునుడు.

అశ్వత్థామకు నరనారాయణులకు కల తారతమ్యము[మార్చు]

ఓ అశ్వత్థామా! నీవు కూడా తపస్సు , తేజస్సు, విద్య, విభవము కలిగిన దేవతా మూర్తివే. నీకు నారాయణునికి కల అంతరమును చెప్తాను విను. నీవు మృత్తికతో ఒక మూర్తిని చేసి పరమాత్మను ఆవహింపజేసి అత్యంత భక్తితో నిష్టతో పూజించావు. కాని నారాయణుడు ఆ గౌరీపతిని లింగాకృతిలో పూజించారు. ఏవిధంగా పూజించినా సర్వకామ్య సాధకమే అయినా లింగాకృతిలో పూజించుట ప్రతిమా కృతిలో పూజించుట కంటే అనేక రెట్లు ఎక్కువ. కనుక పరమాత్ముని లింగాకృతిలో పూజించిన నరనారాయణులను ప్రతిమాకృతిలో పూజించిన నీవు గెలువ లేవు. మీరు గతజన్మలో సేసిన అర్చనలో కల తారతమ్యము వలన మీ మధ్య ఈ తేడా సంభవించింది కనుక అనుభవించక తప్పదు " అన్నాడు. అశ్వత్థామ పులకాంకితుడై మనసులో పరమేశ్వరుడిని భక్తితో ధ్యానించాడు. వ్యాసుడికి నమస్కరించి తిరిగి తన రథము వద్దకు వచ్చి రథము ఎక్కాడు. కాని అప్పటికే సాయం సమయం అయింది కనుక ఆ రోజుకు యుద్ధము చాలించమని సుయోధనుడికి చెప్పాడు. పాండవ సేనలు మంగళతూర్యములతో కౌరవసేనలు విషణ్ణవదనాలతో తమతమ శిబిరాలకు వెళ్ళారు.

అర్జునుడు వ్యానుని తన సందేహం తీర్చని కోరుట[మార్చు]

అశ్వత్థామను వదిలి వ్యాసుడు అర్జునుడి శిబిరానికి వెళ్ళాడు. సాక్షాత్తు ధర్మమూర్తి అయిన వ్యాసునికి అర్గ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన అర్జునుడు భక్తితో నమస్కరించి తన మనస్సులో మెదులుతున్న సందేహం వ్యాసుని ముందు బయట పెట్టాడు. " వ్యాస మునీంద్రా ! నేను రణరంగమున యుద్ధం చేస్తున్నప్పుడు నా ముందు ఒక ఆకారం పాదములు నేలకంటకుండా అగ్నిదేవునిలా వెలుగుతూ తన చేతిలో ఉన్న శూలముతో నేను చంపబోయే వారిని ముందుగా తానే చంపుతున్నాడు. ఆశూలము నుండి అనేకనేక శూలములు ఉద్భవించి శత్రుసంహారం చేస్తున్నాయి. ఆ తేజోమూర్తి చంపుతున్న వారిని నేను నామ మాత్రంగా నా బాణములతో చంపుతున్నాను. నేను చంపుతున్నట్లే ఉన్నా నిజానికి నేను ఎవరిని చంప లేదు. కాని వారిని చంపిన కీర్తి విజయం మాత్రమే నాకు దక్కాయి. ఆ మహానుభావుడు ఎవరు ? అలా ఎందుకు చంపుతున్నాడు "అని అడిగాడు.

వ్యాసుడు అర్జునుడి సందేహం నివృత్తి చేయుట[మార్చు]

అర్జునుడి మాట విన్న వ్యాసుడు " అర్జునా ! అతడు ఆదిమధ్యాంత రహితుడు, సృష్టికి మూలకర్త, ఈ లోకములకు అన్నింటికి ప్రభువు, అవ్యయుడు, వేదమూర్తి, భక్త పరాధీనుడు, త్రినేత్రుడు, పార్వతీ పతి అతడే. యోగీశ్వర హృదయ విహారి, ప్రకృతీ అతడే, పురుషుడూ అతడే, భక్త సులభుడు, నిరాకారుడు, నీలఖంటుడు, నిత్యుడు, సత్యస్వరూపుడు, ప్రళయాగ్నిని తన చల్లని కిరణములతో చల్లార్చగల బాల చంద్రుని శితోభూషణముగా కలవాడు. నిర్మలుడు, సర్వాంతర్యామి, శాంతి ప్రియుడు అయ్న రుద్రుడే నీ ముందు నిలిచి నీకు బదులుగా ముందుగా సంహార క్రియ గావిస్తున్నాడు " అని ఇంకా తనివి తీరక ఆ పరమేశ్వరుని లీలలు విపులంగా వర్ణించాడు. " ఓ అర్జునా ! ఆ పరమ శివుడు నీ సన్నిధిలో ఉండి నిన్ను కరుణించాడు. పేదకు పెన్నిధి దొరికినట్లు నీకు ఈశ్వరకటాక్షం లభించింది. నీవు ధన్యుడివి. ఆ పరమేశ్వర అనుగ్రహంతో నీవు విజయుడివి ఔతావు. సాక్షాత్తు ఆ పరమశివుడే నీకు ముందుగా శత్రుసంహారం చేస్తుంటే విజయం నీకు కాక వేరెవరికి లభిస్తుంది. నీ తపస్సుకు మెచ్చి పాశుపతము ప్రసాదించిన పశుపతి తనివి తీరక తన భక్త పరాధీనతను నిరూపించుకున్నాడు. నీవు పుణ్యాత్ముడవు. ఆ పరమేశ్వరుని ఆత్మలోనిలిపి ధ్యానించిన నీకు సకల సౌభాగ్యములు ఆయురారోగ్యములు కలిగి సకల అభీష్టములు నెరవేరగలవు " అన్నాడు. అర్జునుడు పరమేశ్వరునికి భక్తితో నమస్కరించి తరువాత వ్యాసునికి ప్రమాణం చేసి భక్తితో అతడి ఆశీర్వచనములు పొందాడు. ఆ తరువాత వ్యాసుడు అక్కడి నుండి వెల్లాడు.

బయతి లింకులు[మార్చు]