ధీరుభాయ్ అంబానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధీరుభాయ్ అంబానీ
2002 లో అంబానీ పేరు మీద భారత తపాలా సంస్థ విడుదల చేసిన తపాలా బిళ్ళ
జననం
ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీ

(1932-12-28)1932 డిసెంబరు 28
చోర్వాడ్, జునాగఢ్ రాష్ట్రం, కథియావార్ ఏజెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్)
మరణం2002 జూలై 6(2002-07-06) (వయసు 69)
ముంబై, మహారాష్ట్ర
జాతీయతభారతీయుడు
వృత్తిరిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ ఫ్రా, రిలయన్స్ పవర్ వ్యవస్థాపకుడు
జీవిత భాగస్వామికోకిలా ధీరుభాయ్ అంబానీ
పిల్లలునీనా అంబానీ, ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, దీప్తి అంబానీ
పురస్కారాలుపద్మవిభూషణ్ (మరణానంతరం 2016)

ధీరుభాయ్ అంబానీ గా పేరుపొందిన ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ (1932 డిసెంబరు 28 – 2002 జులై 6) భారతదేశ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. 1977లో ఈ సంస్థ పబ్లిక్ కి వెళ్ళింది. 2016లో భారత ప్రభుత్వం ఆయన వ్యాపార, వాణిజ్యాల్లో ఆయన చేసిన కృషికి గాను మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది. ఆయన మరణం తర్వాత కుమారులు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరూ వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు.

బాల్యం[మార్చు]

ధీరుభాయ్ అంబానీ 1932 డిసెంబరు 28న హీరాచంద్ గోర్ధంభాయ్ అంబానీ, జనమ్ బెన్ అంబానీ దంపతులకు బ్రిటిష్ ఇండియాలోని బాంబే ప్రెసిడెన్సీ, కథియావార్ ఏజెన్సీ, జునాగఢ్ రాష్ట్రం, చోర్వాడ్ లో జన్మించాడు. ఈ ప్రాంతం ప్రస్తుతం గుజరాత్ లో ఉంది.[1] తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు. బహదూర్ కంజి పాఠశాలలో చదువుకున్నాడు. ఈయనకు 17 ఏళ్ళు రాకముందే స్థానికంగా చిన్న వ్యాపారాల్లో పూర్తి పట్టు సంపాదించారు.

యువకుడిగా ఉన్నప్పుడు భారతదేశ స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాన్ని పాకిస్థాన్ లో విలీనం చేసే ప్రయత్నానికి అడ్డుకునేందుకు జునాగఢ్ నవాబుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించాడు.

వ్యాపారం[మార్చు]

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంధనం మీద ఎక్కువగా ఆధారపడి ఉందని గ్రహించిన ఈయన చిన్న వయసులోనే గమనించాడు. ఒక దశలో అప్పటిదాకా తాను వ్యాపారంలో సంపాదించిన ధనాన్ని తండ్రికి ఇచ్చి భారతదేశాన్ని వదిలి బ్రిటిష్ కాలనీగా ఉన్న ఆడెన్ చేరుకుని అక్కడ బ్రిటిష్ షెల్ అనే ఇంధన కంపెనీలో 300 రూపాయాల జీతానికి ఉద్యోగంలో చేరాడు. ఇది ఆయనకు చమురు పరిశ్రమకు సంబంధించిన అనుభవాన్ని సమకూర్చింది. కొన్నాళ్ళ తర్వాత పదోన్నతితో షెల్ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఎబీస్ కంపెనీలో చేరాడు. అరబిక్ భాష నేర్చుకుని స్థానిక వ్యాపారులతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఈ రెండు సంస్థల్లో పని చేసిన అనుభవం తన కాళ్ళమీద నిలబడే ఆత్మవిశ్వాసాన్నిచ్చింది.

1958లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి తన స్వంత రాష్ట్రమైన సౌరాష్ట్ర తన వ్యాపారానికి అంత అనుకూలంగా ఉండదని భావించి తన మకాం ముంబైకి మార్చాడు. అక్కడ నైలాన్, రేయాన్, జీడిపప్పు, మిరియాల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆడెన్ లో పనిచేసిన అనుభవం, అక్కడి వ్యాపారులతో సంబంధనాలు ఈ వ్యాపారానికి కలిసి వచ్చాయి. రెండు మూడేళ్ళలో ఆయా రంగాల్లో అంతకు మునుపే ఉన్న వ్యాపారులను దాటి ముందుకు వెళ్ళాడు. 1960 ప్రాంతంలో భారతదేశంలో రేయాన్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే నైలాన్ ని మాత్రం దిగుమతి చేసుకోవలసి వచ్చేది. అప్పటి ప్రభుత్వం రేయాన్ ఎగుమతి చేసే సంస్థలకు నైలాన్ దిగుమతుల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ నిర్ణయం అంబానీ జీవితాన్ని, వ్యాపారాన్ని మలుపు తిప్పింది.

తన పరిశ్రమనుంచి రేయాన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసి దానికి తగినంత నైలాన్ దిగుమతి చేసుకుని ఎక్కువధరకు అమ్మి లాభం సంపాదించాడు. తర్వాత ఆయన సింథటిక్ ఉత్పత్తి మీద దృష్టి సారించాడు. పదేళ్ళ కాలంలో సింథటిక్, పాలిస్టర్ ఉత్పత్తిలో రిలయన్స్ దేశంలో అగ్రశ్రేణి సంస్థల సరసన చేరింది. సంవత్సరానికి 10వేల టన్నుల పాలిస్టర్ నూలు ఉత్పత్తి లక్ష్యంగా ముంబైకి సమీపంలోని పాతాళగంగ వద్ద 1980లో ఆధునిక పరిశ్రమను స్థాపించాడు. ఇది క్రమంగా 35వేల టన్నుల, 50 వేల టన్నుల సామర్థ్యానికి పెంచుకుంటూ పోయాడు. తర్వాత పక్షవాతంతో ఆరోగ్యం క్షీణించడంతో వ్యాపారాన్ని కుమారులకు అప్పగించాడు.

మరణం[మార్చు]

2002 జూన్ 24 న ఆయన గుండెపోటుతో ముంబై లో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాడు. అలా రావడం ఆయనకు రెండో సారి. అంతకు మునుపు 1986 ఫిబ్రవరిలో మొదటిసారి గుండెపోటు వచ్చి కుడిచేయి పక్షవాతానికి గురైంది. రెండోసారి ఆయన ఆసుపత్రిలో ఒక వారం రోజులపాటు కోమాలో ఉన్నాడు. చాలామంది వైద్యులు తమవంతు ప్రయత్నాలు చేశారు. చివరకి 2002 జులై 6 న మరణించాడు.[2]

మరణానంతర పరిణామాలు[మార్చు]

1986లో ఆయన మొదటిసారి జబ్బుపడ్డప్పుడే వ్యాపార వ్యవహారాలను తన ఇద్దరు కుమారులు ముకేష్, అనిల్ అంబానీలకు అప్పగించాడు. 2004 నవంబరులో ముకేష్ అంబానీ ఇచ్చిన ఒక ముఖాముఖిలో వ్యాపారం వారసత్వం విషయంలో తమ అన్నదమ్ములిద్దరి మధ్య విబేధాలున్నట్లు చెప్పాడు.[3] అయితే అవి తమ వ్యక్తిగతమైన విషయాలని చెప్పాడు.[4]

ధీరుభాయ్ మరణం తర్వాత ఆయన వ్యాపారం ముకేష్ సారథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అనిల్ సారథ్యంలో రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ పేర్లతో రెండుగా విడిపోయింది.

మూలాలు[మార్చు]

  1. Lodha, CA Hemant C. (2014). A to Z of Entrepreneurship: A to Z of Entrepreneurship (in ఇంగ్లీష్). Panchasil Prakashan. p. 12. ISBN 9788192373058.
  2. Reliance chairman Dhirubhai Ambani dead The Times of India (7 July 2002). Retrieved 28 July 2013.
  3. Badkar, Mamta (26 May 2011). "The Full Story Of The Massive Feud Between The Billionaire Ambani Brothers". Business Insider. Retrieved 2019-05-20.
  4. "Mukesh Ambani admits to differences with Anil". Rediff.com. 18 November 2004. Retrieved 31 December 2010.

ఆధార గ్రంథాలు[మార్చు]

  • రామారావు, ఆర్. వి.; అరుణ, డి; పార్వతీశం, జి; శాంతారాం, పి; శంకర్, పి. (2007). డిస్కవరి ఐకాన్స్. హైదరాబాద్: సైన్స్ ఫర్ యు నాలెడ్జి సొసైటీ. pp. 14–16.