నంది తిమ్మన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంది తిమ్మన

జననం పదహారో శతాబ్దం
ఇతర పేర్లు ముక్కు తిమ్మన
రచనలు పారిజాతాపహరణం,
వాణీ విలాసం
సమకాలీనులు అల్లసాని పెద్దన,
ధూర్జటి,
అయ్యలరాజు రామభధ్రుడు,
మాదయ్యగారి మల్లన
గురువు అఘోర శివాచార్యులు
ఆశ్రయమిచ్చిన రాజులు శ్రీ కృష్ణదేవ రాయలు
తండ్రి సింగన్న
తల్లి తిమ్మాంబ

నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల!

ఇతను శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. ఇతను రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి. నంది తిమ్మన, ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబంలో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. ఈయన కౌశిక గోత్ర, అపస్తంభ సూత్రానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది.

తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడైనా, వైష్ణవ రాజాస్థానంలో ఉన్నందువలన, అప్పటి రాజకీయ-సామాజిక పరిస్థితుల వల్ల కొన్ని వైష్ణవ రచనలు కూడా చేశాడు. ఈయన తాత నంది మల్లయ్య, మేనమామ ఘంట సింగన్న (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు.

1521లో ముక్కు తిమ్మన రాయల తరఫున గయను సందర్శించి అక్కడ నావాడ నాయకులపై కృష్ణదేవరాయల విజయానికి ప్రతీకగా ఒక విజయశాసనం ప్రతిష్ఠించాడని చరిత్రకారులు భావిస్తున్నారు.[1] ఈ ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల గయ శాసనం క్రింద రాజప్రశస్తిని కీర్తిస్తూ చెక్కబడిన కంద పద్యం ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణంలోనిది కావటం, కృష్ణదేవరాయలు గయను సందర్శించిన ఆధారం లేకపోవటం ఈ సంభావ్యతకు మద్దతునిస్తున్నాయి.[2]

రచనా శైలి[మార్చు]

తిమ్మన రచన పారిజాతాపహరణం ప్రసిద్ధి చెందింది. ఇతను "వాణీ విలాసము" అనే మరొక కావ్యాన్ని రచించినట్లు తెలుస్తున్నా అది లభ్యం కావడం లేదు.


తన సమకాలికుడైన అల్లసాని పెద్దన వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్ధతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు. పారిజాతాపహరణంలో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.


ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పలుకు

ఈ నానుడి తిమ్మన పద్యరచనారీతిని బట్టి, శైలీశయ్యాది సౌభాగ్యాన్ని బట్టి ఏర్పడి ఉంటుంది.పాత్రనుబట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైన వాటివల్ల ఇవి "ముద్దు పలుకులు" అనిపిస్తాయి.[3]

కృష్ణుని చేష్టలకు సత్యభామ ఇలా తూలనాడింది

ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా?
ఆ మాటల్చెవియొగ్గి తా వినియెనా ఆ గోపికా వల్లభుం
డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచెదే?
నీ మోమాటలు మాని నీరజముఖీ, నిక్కంబెరింగింపవే


సత్యభామ రోదించిన విధము

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే
గాసిలి యేడ్చె ప్రానవిభు కట్టెదుటన్ లతాంగి పంకజ
శ్రీసఖమైన మోముపయి చేలచెఱంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్

పారిజాతాపహరణం[మార్చు]

ఇది ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు. నారదుడు పారిజాతం కృష్ణునకివ్వడం, ఆ సమయములో అతను రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని కృష్ణుడు రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం పారిజాత వృక్షం సత్య తీసుకోని రావడం, తులాభారంతో కథ సుఖాంతం అవుతుంది.


ఫారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అనే అని అంటారు కాని నిజానికి దీనికిని, సంస్కృత హరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చాలా చిన్నదైన ఈ కథకు నంది తిమ్మన సంతరించిన అలంకార సౌకర్యములు, ప్రబంధోచిత పాత్రచిత్రణము, ఆయా పాత్ర జీవన వర్ణనము దీనిని సుందరమైన ప్రబంధకావ్యంగా తీర్చిదిద్దాయి.[4]

విశేషాలు[మార్చు]

తిమ్మనగారి ముక్కు పెద్దది కావడం వలన ఆయనకి "ముక్కు తిమ్మన" అనే పేరు వచ్చి ఉండవచ్చును. ఆయన ముక్కు మీద చక్కని పద్యం వ్రాశారట. క్రింది ఆ పద్యాన్ని రామరాజ భూషణుడు కొనుక్కొని తన వసుచరిత్రములో చేర్చుకొన్నారట.[3]

నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం తపంబంది యో
షా నాసాకృతి బూని సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్

మూలాలు[మార్చు]

  1. Epigraphia Andhrica, Volume 1
  2. Epigraphia Indica, Volume 2
  3. 3.0 3.1 తెలుగు సాహిత్య చరిత్ర - డా. ద్వా.నా.శాస్త్రి
  4. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు