నాగార్జునసాగర్
ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా, నల్గొండ జిల్లాల సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది.
విషయ సూచిక |
[మార్చు] ప్రాజెక్టు-పట్టణం
కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar project) అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. ఆంధ్ర ప్రదేశ్ లో నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.
నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్ గా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ పట్టణము మూడు భాగములుగా విభజించబడినది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నవి.
నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం కూడా. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్హున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిధిలాలను జలాశయం మధ్యలో "నాగార్జున కొండ" అని ఇప్పుడు పిలువబడే మ్యూజియంలో భద్ర పరచారు. ఆ మ్యూజియంను నాగార్జునకొండ మ్యూజియం అంటారు.
[మార్చు] నాగార్జునసాగర్ ప్రాజెక్టు
[మార్చు] చరిత్ర
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు "కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్" ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే డా. కె. ఎల్. రావు ద్వారా పూర్వం హైదరాబాదు నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. 'నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై మాచెర్ల దగ్గర నదీలోయను దర్శించాడు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు.
మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో నందికొండ ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. 1952లో ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. విజయవాడ నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు.
ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నములు మొదలైనవి. రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్ధ్యం 281 టి.ఎం.సి. గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది. త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబర్ 10న (మన్మధ నామ సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు) అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. నార్ల వెంకటేశ్వర రావు మాటలలో "ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో". రాజా గారిని ప్రజలు "ప్రాజెక్టుల ప్రసాద్" అని పిలుచుకునేవారు.
బౌద్ధ అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన నందికొండ, ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.
[మార్చు] విశేషాలు
సాగునీటి సరఫరా కోసమే కాక, విద్యుదుత్పత్తి కొరకు కూడా ఉద్దేశించబడిన నాగార్జునసాగర్ ఒక బృహత్తర బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రధాన ఆనకట్ట రాతి కట్టడము. దీనికి రెండువైపులా మట్టితో కట్టిన కట్టలు ఉన్నాయి. డ్యాముకు ఇరువైపుల నుండి రెండు సాగునీటి కాలువలు బయలుదేరుతాయి. కుడి కాలువని జవహర్ కాలువ గాను, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ గాను పేరు పెట్టారు. అయితే వ్యవహారంలో వీటిని కుడి కాలువ, ఎడమకాలువ గానే పిలుస్తారు. కుడికాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాక, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించేందుకు కూడా నాగార్జునసాగర్ ఉపయోగపడుతుంది.
[మార్చు] ప్రాజెక్టు గణాంకాలు
డ్యాము పొడవు: 15,956 అ. (4863.388 మీ.)
- ప్రధాన రాతి ఆనకట్ట పొడవు: 4756 అ. (1449.628 మీ.)
- మొత్తం మట్టికట్టల పొడవు: 11,200 అ. (3413.76 మీ.)
- ఎడమ మట్టికట్ట పొడవు: 8400 అ. (2560.32 మీ.)
- కుడి మట్టికట్ట పొడవు: 2800 అ. (853.44 మీ.)
- మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26
- కుడి కాలువ పొడవు: 203 కి.మీ.
- ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.
[మార్చు] జలాశయ సామర్ధ్యం
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టి.ఎం.సి. (శతకోటి ఘనపుటడుగులు-థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)
- కనీస స్థాయి నిల్వ: 213 టి.ఎం.సి.
[మార్చు] విద్యుదుత్పత్తి సామర్ధ్యం
విద్యుదుత్పత్తికై నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మూడు కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్ధ్యం 960 మె.వా. (మెగా వాట్లు)
- నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో: 810 మె.వా.,
- కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట: 90మె.వా.,
- ఎడమకాలువకు నీరు విడుదలయ్యే చోట: 60 మె.వా.
ఉత్పత్తి సామర్ధ్యం గల కేంద్రాలు ఉన్నాయి.
[మార్చు] ఆయకట్టు వివరాలు
ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో తయారైన ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
| కుడి కాలువ | ||
| జిల్లా | ఆయకట్టు, ఎకరాల్లో | |
|---|---|---|
| గుంటూరు జిల్లా | 6,68,230 | |
| ప్రకాశం జిల్లా | 4,43,180 | |
| మొత్తం | 11,11,410 | |
| ఎడమ కాలువ | ||
| జిల్లా | ఆయకట్టు, ఎకరాల్లో | |
|---|---|---|
| నల్గొండ జిల్లా | 3,72,970 | |
| ఖమ్మం జిల్లా | 3,46,769 | |
| కృష్ణా జిల్లా | 4,04,760 | |
| మొత్తం | 11,24,500 | |
పెద్ద మొత్తం 22,35,910
[మార్చు] ఇటీవలి విశేషాలు
- ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2005 డిసెంబర్ 10 న స్వర్ణోత్సవాలను జరుపుకుంది. రూ.3 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ఆయకట్టు అంతటికీ నీరు అందిస్తాం అని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పాడు. సాగర్ నిర్మాణ సమయంలో అసువులు బాసిన వారి స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని వై.ఎస్. ఆవిష్కరించాడు. గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడి విగ్రహాలతో బాటు సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇంజినీరింగ్ నిపుణులు కె.ఎల్.రావు, సాగర్ మొదటి చీఫ్ ఇంజినీర్ జాఫర్ అలీల విగ్రహాలను వై.ఎస్. ఆవిష్కరించాడు.
|
[మార్చు] నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ
ప్రధాన వ్యాసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ చూడగలరు.
పై ప్రకటనకు లోబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఋణంతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృధ్ది పేరుతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను చేపట్టింది. 2010, ఆగష్ట్ 14వ తేదిన ప్రపంచ బ్యాంక్ తో దీనిపై ఒప్పందం కుదిరింది. 10.9.2010 నుండి ఈ పథకం అమలు లోకి వచ్చింది. ఈ పధక కాల పరిమితి ఆరు సంవత్సరాలు. ఈ పథకం 31.7.2016 తో ముగుస్తుంది. ఒప్పందం జరిగేలోగా, చర్చలు కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆధునీకరణపనులను ప్రారంభించింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.4444.41 కోట్లు. ఇందులో 48 శాతం ప్రపంచ బ్యాంక్ ఋణం. రాష్ట్రప్రభుత్వ్తం వాటా 52 శాతం. ఒప్పందానికి సంవత్సరం ముందునుండి నిబంధనలకు లోబడి జరిగిన వ్యయంలో ప్రపంచ బ్యాంకు ఋుణం వాటా రిట్రోఏక్టివ్ ఫడింగ్ ద్వారా చెల్లిస్తుంది.
ఆధునీకరణ లక్ష్యాలు
1. నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరించి నీటి సరఫరా సామర్ధ్యాన్ని వృధ్ది చేస్తూ వ్యవసాయాభివృధ్ధి చేయుట,వ్యవసాయ ఉత్పాదకత పెంచుట
2. నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించుట
ఈ పకంలో పలు అంశాలు ఉపాంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ పథకం గరిష్ట లక్ష్యాలతో కూడుకొన్నది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. కాగా అంశం బిలో ఉపాంశాలను వ్యవసాయ శాఖ. ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు. సి అంశంలో రెండు ఉాపాంశాలను భుగర్భ జలశాఖ అమలు చేస్తుంది.
[మార్చు] నాగార్జున కొండ
నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ మ్యూజియం లో భధ్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోనే అరుదైనది. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
[మార్చు] ఇతర దర్శనీయ స్థలాలు
పర్యాటకులకు ప్రధానమైన ఆకర్షణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ముఖ్యంగా వర్షాలు బాగా పడి గేట్లు తెరిచినప్పుడు పెద్దయెత్తున సందర్శకులు వస్తారు. వాగార్జున కొండ మ్యూజియం కూడా తప్పక చూడదగినది.
- సాగరమాత దేవాలయం -
నాగార్జున సాగర్ దక్షిణభాగమైన విజయపురి సౌత్ లో ఉన్న సాగరమాత ఆలయం హిందూ ఆలయ శైలిలో నిర్మించిన కాథలిక్ చర్చి. ఈ ఆలయం నాగార్జునసాగర్ జలాశయానికి దక్షిణపు ఒడ్డున ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ ప్రధానద్వారానికి ఎదురుగా ఉన్నది. ఈ ఆలయము నిర్మాణ శైలిలోనే కాక కొన్ని పూజా పద్ధతులలో కూడా హిందూమత పద్ధతులను అవలంబించడం విశేషము. ఉదాహరణకు ఈ గుడిలో మేరీమాతకు భక్తులు టెంకాయలు కొట్టి అగరువత్తులు సమర్పిస్తుంటారు. ప్రతియేటా మూడురోజుల పాటు జరిగే సాగరమాత ఆలయ తిరునాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాలనుండి అనేకమంది భక్తులు విచ్చేస్తారు.
- దగ్గరి మరికొన్ని స్థలాలు
[మార్చు] గగన విహారం
బౌద్ధులు సాగర్‌ను పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారు.విదేశీయులు రహదారి మార్గాన వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ట్రాఫిక్ సమస్యలతోపాటు, సమయం ప్రధాన సమస్యగా మారింది.నాగార్జనకొండ, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, ఎత్తిపోతల జలపాతం, అనుపు పురావస్తు సంపద,జలాశయ అందాలు ప్రత్యేక ఆకర్షణ.అందువలన పర్యాటకశాఖ సాగర్ పరిధిలో 500 ఎకరాల్లో మెగా టూరిజం ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌తోపాటు బెంగుళూరు, ఢిల్లీ, బొంబాయి, పూణె వంటి నగరాల నుంచి నేరుగా హెలికాప్టర్ లో సాగర్‌కు పర్యాటకులను తరలించాలని ప్రతిపాదించింది.ప్రస్తుతం విమాన శిక్షణ కోసం నాగార్జున సాగర్‌లో చిన్నపాటి విమానశ్రయం ఉంది.
[మార్చు] ఇవి కూడా చూడండి
|
||||||||
|
|||||||||||