నీరో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీరో
రోమను చక్రవర్తి
రోములో నీరో విగ్రహం
Reign13 October, AD 54 – 9 June, AD 68
(Proconsul from 51)
Predecessorక్లాడియస్
Successorగల్బా
Burial
Mausoleum of the Domitii Ahenobarbi, Pincian Hill, Rome
Wives
  • క్లాడియా ఆక్టేవియా
  • పోప్పియా సబీనా
  • స్టాటీలియా మెస్సాలినా
Issueక్లడియ ఆగస్టా
Names
లూసియస్ డొమిటియస్ అహెనోబార్బస్
(పుట్టుక నుండి సా.శ 50 వరకు);
నీరో క్లాడియస్ సీజర్ డ్రూసస్ జెర్మానికస్ (సా.శ. 50 నుండి గద్దేనెక్కేవరకు);
నీరో క్లాడియస్ సీజర్ ఆగస్టస్ జెర్మానికస్ (చక్రవర్తిగా)
రాజవంశంJulio-Claudian
తండ్రిGnaeus Domitius Ahenobarbus
తల్లిఅగ్రిప్పినా ది యంగర్

నీరో (నీరో క్లాడియస్ సీజర్ ఆగస్టస్ జర్మానికస్) (15 డిసెంబరు 37 - 9 జూన్ 68 AD) సా.శ. 54 నుండి 68 వరకు రోమను చక్రవర్తి. జూలియో-క్లాడియన్ రాజవంశంలో అతడు చివరి పాలకుడు. [1] [2] పుట్టినపుడు అతడికి పెట్టిన పేరు లూసియస్ డోమీటియస్ అహెనోబార్బస్. అతడి మామ క్లాడియస్ అతణ్ణి దత్తత తీసుకున్నాడు. తద్వారా అతడికి వారసుడయ్యాడు. [1] క్లాడియస్ మాదిరిగానే, నీటో ప్రిటోరియన్ గార్డ్ సమ్మతితో చక్రవర్తి అయ్యాడు. నీరో తల్లి, అగ్రిప్పినా ది యంగర్, నీరో ప్రారంభ జీవితాన్నీ అతడి నిర్ణయాలనూ నిర్దేశించింది. చక్రవర్తి అయ్యాఅక్, అతడు ఆమెను వదిలించుకుని, ఐదేళ్ళ తరువాత చంపించేసాడు. [1] [lower-roman 1]

తన పాలన యొక్క ప్రారంభ సంవత్సరాల్లో, నీరో తన తల్లి, అతని గురువు లూసియస్ అన్నేయస్ సెనెకా, అతని ప్రిటోరియన్ ప్రిఫెక్ట్ సెక్స్టస్ అఫ్రానియస్ బురస్ లు అతడికి మార్గనిర్దేశం చేసారు. సమయం గడిచేకొద్దీ, అతను ప్రభుత్వ, విదేశాంగ విధానంలో మరింత చురుకైన, స్వతంత్ర పాత్ర పోషించడం ప్రారంభించాడు. అతని పాలనలో సేనాధిపతి జనరల్ కార్బులో విజయవంతమైన యుద్ధం చేసి, పార్థియన్ సామ్రాజ్యంతో శాంతి చర్చలు జరిపారు. అతని జనరల్ సుటోనియస్ పౌలినస్, బ్రిటన్లో ఐసెని రాణి బౌడికా లేవదీసిన ఒక పెద్ద తిరుగుబాటును అణచివేసాడు. బోస్పోరాన్ రాజ్యాన్ని కొద్దికాలం పాటు ఆక్రమించుకున్నాడు. అతడి కాలం లోనే మొదటి యూదు-రోమన్ యుద్ధం ప్రారంభమైంది. నీరో దౌత్యం, వాణిజ్యం పైన, సామ్రాజ్యం యొక్క సాంస్కృతిక జీవితంపైనా ఎక్కువ దృష్టి పెట్టాడు. థియేటర్లను నిర్మించి, అథ్లెటిక్ క్రీడలను ప్రోత్సహించాడు. అతను నటుడుగా, కవిగా, సంగీతకారుడుగా, రథసారథిగా ప్రజలకు కనిపించేవాడు. ఇది అతన్ని వ్యక్తిగా, హోదా పరంగా, అతడి పదవికి ఉన్న గౌరవం పరంగా బలహీనపరిచిందని సాంప్రదాయవాదుల భావించారు. సామ్రాజ్య వ్యాప్తంగా అతడు చేపట్టిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు పనులకు అవసరమైన భారీ నిధుల కోసం పన్నులు పెంచడం ద్వారా సమకూర్చాడు. ఇది ఉన్నత వర్గాల ప్రజలకు ఆగ్రహం కలిగించింది. దీనికి విరుద్ధంగా, అతడు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల వలన రోమ్ లోను, ప్రావిన్సులలోనూ నిమ్నవర్గాల ప్రజలు అతన్ని ఆమరణాంతం ఆరాధించారు. మరణం తరువాత కూడా అతణ్ణి ఆరాఅధించారు. అతన్ని అంతమొందించేందుకు చేసిన అనేక కుట్రలు బయటపడ్డాయి, ఈ కుట్రదారుల్లో ఎక్కువ మంది నీరో దర్బారు లోని వ్యక్తులే. వారందరినీ అతడు చంపించాడు.

సా.శ. 68 లో గాలియా లుగ్డునెన్సిస్ గవర్నరైన విండెక్స్, హిస్పానియా టర్రకొనెన్సిస్ గవర్నరైన గల్బా మద్దతుతో తిరుగుబాటు చేసాడు. విండెక్స్ తిరుగుబాటు దాని తక్షణ లక్ష్యంలో విఫలమైంది. అయితే నీరో పట్ల అసంతృప్తితో ఉన్న పౌర, సైనిక అధికారులు గల్బాను చక్రవర్తిగా ఎన్నుకోవడంతో నీరో రోమ్ విడిచి పారిపోయాడు. తనను గైర్హాజరులో విచారించి, ప్రజా శత్రువుగా పరిగణించి, మరణశిక్ష విధించారని తెలుసుకున్న నీరో, సా.శ 68 జూన్ 9 న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న మొదటి రోమన్ చక్రవర్తి అతడు. [3] అతని మరణంతో జూలియో-క్లాడియన్ రాజవంశం ముగిసింది. నలుగురు చక్రవర్తుల సంవత్సరంగా పిలిచే కొద్ది కాలపు అంతర్యుద్ధ కాలానికి దారితీసింది.

నీరో పాలన దౌర్జన్యాల తోటి, దుబారా తోటీ ముడిపడి ఉంటుంది. [lower-roman 2] [lower-roman 3] సుటోనియస్, కాసియస్ డియోతో సహా చాలా రోమన్ చారిత్రికులు అతని వ్యక్తిత్వం గురించి, పాలన గురించీ ప్రతికూలంగా రాసారు. అదేవిధంగా, టాసిటస్ కూడా, రోమన్ ప్రజలు అతన్ని అవినీతిపరుడని భావించారని పేర్కొన్నాడు.

రోము తగలబడింది[మార్చు]

సా.శ. 64, జూలై 18 నుండి 19 రాత్రి వరకు రోమ్ నగరంలో మంటలు చెలరేగాయి. సర్కస్ మాగ్జిమస్‌ను పక్కనే ఉండే అవెంటైన్ వాలుపై మంటలు మొదలయ్యాయి. [4] [5]

రోము తగలబడడం గురించిన సమాచారం ఇచ్చిన ప్రధాన పురాతన మూలం టాసిటస్ రాసిన కథనం. లెక్కలేనన్ని భవనాలు, నివాసాలు, దేవాలయాలు ధ్వంసమయ్యాయని అతడు రాశాడు. [6] టాసిటస్, కాసియస్ డియో ఇద్దరూ పాలటిన్‌కు విస్తృతమైన నష్టం జరిగిందని రాసారు. పురావస్తు త్రవ్వకాలలో కనుగొన్న ఆధారాలతో పై కథనానికి మద్దతు లభించింది. [7] మంటలు ఒక వారం పాటు రేగుతూనే ఉన్నాయని సమాచారం. [8] : 260  మొత్తం పద్నాలుగు రోమన్ జిల్లాలలో మూడింటిని మంటలు నాశనం చేసాయి. మరో ఏడు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. [8] : 260  [9]

కొన్ని పురాతన వృత్తాంతాలు మంటలు ప్రమాదవశాత్తు జరిగాయని అనగా, మరికొన్ని నీరోయే చేయించాడని అన్నాయని టాసిటస్ రాశాడు. ప్రస్తుతం లభ్యంగా ఉన్న కథనాలలో టాసిటస్ రాసినది ఒక్కటే -ఆ అగ్నికి కారణమని నీరోను నిందించదు. కారణమేంటో "ఖచ్చితంగా తెలియదు" అని అతడు రాసాడు. ప్లీనీ ది ఎల్డర్, సుటోనియస్, కాసియస్ డియో అందరూ అగ్నిప్రమాదానికి నీరోయే కారణమని రాశారు. రోము నగరపు పురాతన నిర్మాణం పట్ల అయిష్టత వల్ల నీరో ఈ పని చేయించాడని రాసారు. నీరో తన గోల్డెన్ హౌస్ నిర్మించడానికి స్థలం కావాలని కోరుకుంటున్నందున అగ్నిని ప్రారంభించాడని సుటోనియస్ రాశాడు. [10] ఈ గోల్డెన్ హౌస్ లేదా డోమస్ ఆరియాలో పచ్చని కృత్రిమ ప్రకృతి దృశ్యాలు, 30 మీటర్ల ఎత్తైన తన విగ్రహం (కొలోస్సస్ ఆఫ్ నీరో) ఉన్నాయి. ఈ సముదాయం యొక్క పరిమాణం చర్చనీయాంశమైంది (100 నుండి 300 వరకు   ఎకరాలు). [11] [12] [13] టాసిటస్ ప్రకారం - క్రైస్తవులే మంటలకు కారణమని నీరో వారిని బలిపశువులుగా చేసి, సజీవ దహనం చేయించాడు,.ప్రజా న్యాయం ద్వారా కాకుండా వ్యక్తిగత క్రూరత్వమే అతడి చేత ఈ పని చేయించినట్లు కనడుతోంది. [14]

కొంతమంది ఆధునిక చరిత్రకారులు మాత్రం, నీరో నిరంకుశ చర్యల గురించి రాసిన ప్రాచీన కథనాల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. [15] [16] కొన్ని కథనాలు నీరోను మంచిగానే చూపిస్తాయి. రోమన్ సామాన్యులలో, ముఖ్యంగా సామ్రాజ్యం యొక్క తూర్పు ప్రావిన్సులలో, నీరో మరణించలేదనీ అతడు తిరిగి వస్తాడనీ చెబుతూ ప్రసిద్ధ పురాణం పుట్టుకొచ్చింది. స్వల్పకాలిక, విఫలమైన తిరుగుబాట్లలో కనీసం ముగ్గురు నాయకులు ప్రజల మద్దతును పొందటానికి తమను " నీరో పునర్జన్మ"గా చెప్పుకున్నారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Jarus, Owen (8 October 2013). "Emperor Nero: Facts & Biography".
  2. "Nero – Ancient History".
  3. Barnes, T.D. (1977). "The Fragments of Tacitus' Histories". Classical Philology. 72 (3): 224–31 [228]. doi:10.1086/366355. JSTOR 268314.
  4. Champlin, p. 122
  5. Tacitus, Annals, XV.38
  6. Champlin, p. 122
  7. Champlin, p. 125
  8. 8.0 8.1 Scullard, H. H (2011). From the Gracchi to Nero: a history of Rome 133 B.C. to A.D. 68. London: Routledge. ISBN 978-0-415-58488-3.
  9. Tacitus, Annals, XV.40
  10. Champlin, p. 182
  11. Roth, Leland M. (1993). Understanding Architecture: Its Elements, History and Meaning. Boulder, CO: Westview Press, pp. 227–28. ISBN 0-06-430158-3.
  12. Ball, Larry F. (2003). The Domus Aurea and the Roman architectural revolution. Cambridge University Press. ISBN 0-521-82251-3.
  13. Warden reduces its size to under 100 acres (0.40 km2). Warden, P.G. (1981). "The Domus Aurea Reconsidered". Journal of the Society of Architectural Historians. 40 (4): 271–78. doi:10.2307/989644. JSTOR 989644.
  14. Tacitus, Annals. XV.44.
  15. On fire and Christian persecution, see: Clayton, F. W. "Tacitus and Christian Persecution." The Classical Quarterly:81–85; and Henderson, B. W. Life and Principate of the Emperor Nero. p. 437.
  16. Champlin, Edward. 2005. Nero. Harvard University Press. ISBN 978-0-674-01822-8. pp. 36–52.




ఉల్లేఖన లోపం: "lower-roman" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-roman"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=నీరో&oldid=4103772" నుండి వెలికితీశారు