పవన్ కళ్యాణ్
| పవన్ కళ్యాణ్ | |
|---|---|
పవన్ కళ్యాణ్ ముఖచిత్రం |
|
| జననం | కొణిదెల కళ్యాణ్ (సెప్టెంబరు 02, 1973) మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్. |
| తల్లి_పేరు | అంజనా దేవి |
| తండ్రి_పేరు | కొణిదల వెంకట రావు |
| బిరుదు(లు) | పవర్ స్టార్ |
| వేరేపేరు(లు) | కల్యాణ్ బాబు |
| వృత్తి | సినిమా |
| నివాసం | హైదరాబాదు |
| భార్య / భర్త(లు) | రేణు దేశాయ్ |
పవన్ కళ్యాణ్గా ప్రసిద్ధుడైన కొణిదెల కల్యాణ్ బాబు తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి సోదరుడు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిల మూడవ కుమారుడు కొణిదల కళ్యాణ్ బాబు. పవన్, సెప్టెంబరు 2, 1973న జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలోని మెగాస్టార్ చిరంజీవి (శివ శంకర వర ప్రసాద్), పవన్‌కు పెద్దన్నయ్య . నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య .
పవన్, పరిశ్రమలోని తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి ని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా "కళ్యాణ బాబు"గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. నటిగా మారిన మోడల్ రేణుదేశాయ్‌ని 28 జనవరి 2009 న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురుసోవా పై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు.
[మార్చు] ప్రత్యేకతలు
తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని రూపొందించారు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించారు. బద్రి చిత్రం లో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ మరియు ఆంగ్లముల కలయిక తో త్రిభాషా గీతంగా, ఖుషి లో యే మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించారు. ఖుషి చిత్రంలో ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే, జాని చిత్రంలో ఈ రేయి తీయనిది పాటలని రీ-మిక్స్ చేయించారు. ఖుషి లోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట కావటంతో ఇతని చిత్రాలలో చాలా స్టంట్ లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్ లను ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపించటం జరుగుతుంది.