పాకిస్తాన్‌లో పర్యాటకం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Site#171: పంజాబ్ లోని లాహోర్ కోట వద్ద గల అలమ్గిరి గేటు.
ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ మాన్యుమెంట్

పాకిస్తాన్‌లో పర్యాటకం పర్యాటక పరిశ్రమ యొక్క ఒక నూతన అధ్యాయంగా చెప్పవచ్చు.[1] తన వైవిధ్యభరిత సంస్కృతి, ప్రజలు మరియు ప్రకృతి అందాలతో పాకిస్తాన్ 0.7 మిలియన్ పర్యాటకులను ఆకర్షించింది. ఇది ఒక దశాబ్దం క్రితం పర్యాటకుల సంఖ్యకు దాదాపు రెట్టింపు.[2]

శిధిల నాగరికతలైన మొహెంజదారో, హరప్పా మరియు తక్షశిలలతో పాటు, శీతాకాలం క్రీడలపై ఆసక్తి ఉన్నవారిని హిమాలయ పర్వత ప్రాంతాలు ఇక్కడకు ఆకర్షిస్తున్నాయి. పాకిస్తాన్‌లోని 7000 మీటర్ల కంటే ఎత్తున ఉండే అనేక పర్వత శ్రేణులు, ముఖ్యంగా కె2 ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సాహసికులను, పర్వతారోహకులను ఆకర్షిస్తుంది.[3] పాకిస్తాన్ యొక్క ఉత్తర ప్రాంతం అనేక పురాతన ఆయుధాగారాలను, కట్టడాలను కలిగి ఉండడమే కాక హంజ మరియు చిత్రల్ లోయలు ఇస్లాంకు ముందు కాలంనాటి అలగ్జాండర్ ది గ్రేట్ యొక్క వారసులుగా చెప్పుకునే ఆత్మలను బలంగా నమ్మే కలశ జాతి ప్రజలకు ఆవాసంగా ఉన్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వ సంస్థానం యొక్క సాహస గాధలను ఈనాటికీ కథలుగా చెప్పుకుంటారు. పంజాబ్ రాష్ట్రంలో జీలం నది వద్ద అలగ్జాండర్ యుద్ధం చేసిన ప్రాంతంతో పాటు, షాలిమార్ తోటలు, బద్షహి మసీద్,జహంగీర్ సమాధి మరియు లాహోర్ కోట వంటి మొఘల్ కట్టడాలతో విరాజిల్లే చారిత్రాత్మక పట్టణమైన లాహోర్ కుడా ఉంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ముందు పాకిస్తాన్ ఏటా 5 లక్షల మంది వరకు పర్యాటకులను ఆకర్షించడం జరిగింది.[4]

2005లో కాశ్మీర్ భూకంపం సంభావించాక అక్టోబర్ 2006లో దేశంలోని పర్యాటక పరిశ్రమకు ఊతం ఇచ్చేందుకు గాను ది గార్డియన్ పత్రిక "పాకిస్తాన్‌లోని ఐదు అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల" గురించి ప్రకటించింది.[5] తక్షశిల,లాహోర్, ది కారకోరం హైవే, కరిమాబాద్ మరియు సైఫుల్ ములుక్ సరస్సు ఈ ఐదు ముఖ్య పర్యాటక ప్రాంతాలు. పాకిస్తాన్ యొక్క ప్రత్యేక, వైవిధ్య భరిత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు‌గాను 2007‌లో అప్పటి ప్రధాన మంత్రి "విజిట్ పాకిస్తాన్" పేరుతో ప్రచార పర్వాన్ని ప్రారంభించారు.[6] ఈ ప్రచారంలో భాగంగా ఏడాది పొడవునా ఉత్సవాలు, జాతరలు, మత సంబంధమైన పండుగలు, ప్రాంతీయ క్రీడా కార్యక్రమాలు, రకరకాల కళా మరియు చేతి వృత్తుల ప్రదర్శనలు, జానపద వేడుకలు మరియు అనేక చారిత్రాత్మక పురావస్తు ప్రదర్శనశాలల ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉంటాయి.[7]

2009లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటీటివ్ నెస్ నివేదికలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో 25% పర్యాటక ప్రాంతాలు పాకిస్తాన్‌లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దక్షిణాన మడ అడవుల నుండి 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన మొహెంజదారో మరియు హరప్పాలతో కూడిన సింధు లోయ నాగరికత వరకు ఇందులో భాగంగా ఉన్నాయి.[8]

జూలై 2010లో సంభవించిన వరదల వల్ల పాకిస్తాన్‌లోని దాదాపు 22 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులు కావడమేకాక దేశంలోని శాంతి భద్రతల పరిస్థితి వల్ల ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న పర్యాటక రంగం మరింతగా దెబ్బతింది. తీవ్రవాదం వల్ల దాదాపు రెండేళ్ళ పాటు సంక్షోభంలో పడి ఇప్పుడిప్పుడే దేశీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందుతున్న స్వాత్ లోయ అతివృస్టి మరియు వరదల వల్ల మళ్ళీ పూర్తి సంక్షోభంలో పడిపోయింది. ప్రకృతి న్యాయానికి మరియు దేశంలోని చట్టాలకు విరుద్ధంగా స్వాత్ నది ఒడ్డునే నిర్మించబడిన దాదాపు 101 హోటళ్ళు ఈ వరదలకు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆరుగురు స్వదేశీ పర్యాటకులతో సహా మొత్తం దాదాపు 277 మంది పర్యాటకులు స్వాత్ లోయలో ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. వర్షం మరియు దాని ఫలితంగా పెరిగిన వరదల కారణంగా వేలకొద్దీ పర్యాటకులు కలాం మరియు బహ్రెయిన్ ప్రాంతాలలో చిక్కుకుపోవడం జరిగింది. దాదాపు 14 రోజుల పాటు మొత్తం జిల్లాలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడ చిక్కుకుపోయిన పర్యాటకులను పాకిస్తాన్ సైన్యం అందించిన హెలికాఫ్టర్‌ల సహాయంతో ఇస్లామాబాద్‌కు తరలించడం జరిగింది. స్వాత్‌లోని అన్ని వ్యాపారాలు, కర్మాగారాలు మూతపడ్డాయి.

ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ స్వాత్‌లోని వరద పరిస్థితిని సమీక్షించి వరద బాధితులకు తగినంత ఆహారాన్ని సరఫరా చేయాలనీ, సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలనీ అధికారులను ఆదేశించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలనుండి స్వాత్ లోయకు సంబంధాలు నెలకొల్పవలసిందిగా ఒత్తిడి తెచ్చిన ప్రధాని సహాయ వస్తువులు అందించడానికి వీలుగా అన్ని రహదారులు మరియు వంతెనలను వీలైనంత త్వరగా పునరుద్ధరించవలసిందిగా సమాచార శాఖా మంత్రిని ఆదేశించారు.

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వ‌‌లోని కలాం ప్రాంతం సహజమైన ప్రకృతి అందాలతో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. అత్యంత దారుణమైన వరదలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలన్నింటిని దెబ్బతీయడమే కాక స్థానికులు వారి భవిష్యత్తు వెతుక్కునేలా చేసాయి. కలాంకు కేవలం రెండే ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయం కాగా రెండవది పర్యాటకం. ఈ రెండూ దారుణంగా దెబ్బతిన్నాయని స్థానికుడు ఒకరు చెప్పారు. వరదలకు ముందు కలాంలో దాదాపు నాలుగు వందల హోటళ్ళు మరియు ఫలహారశాలలు ఉన్నాయి. వీటిలో డజన్ల కొద్ది హోటళ్ళు నీటి ఒరవడిలో కొట్టుకుపోయాయి. అనేక ముఖ్యమైన హోటళ్ళు స్వాత్ నది ఒడ్డున లేదా ఆ నది అంచు వెంట ఉన్నాయి. వరద నీటి ఉధృతికి ఆనకట్టలు కొట్టుకుపోవడంతో పాటు సారవంతమైన భూమి మునిగిపోవడం మరియు వంతెనలు కొట్టుకుపోవడం వల్ల లోయ మొత్తం రెండు భాగాలుగా విడిపోయింది.

ఖైబర్ పఖ్తున్ఖ్వ మరియు గిల్గిట్ బాల్టిస్తాన్‌తో సహా దేశం అంతా పర్యాటకం మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే ఈవరదలు సంభవించడం ఎంతో నష్టానికి దారితీసింది. పర్యాటకానికి సంబంధించి దెబ్బతిన్న మౌలిక సదుపాయాల విలువ బిలియన్లలో ఉంటుందని అంచనా వేయబడింది. అనేక మంది ప్రాణాలను బలికొనడమే కాక ఈ వరదలు భారీ సంఖ్యలో హోటళ్ళను, మోటెల్లను, వంతెనలను, రహదారులను, ఇళ్ళను దెబ్బతీసాయి. పర్యాటకానికి అనుబంధ వృత్తులలో ఉన్న వేలకొద్ది ప్రజలకు ఉపాధి లేకుండా చేసాయి. గిల్గిట్ బాల్టిస్తాన్ మరియు కఘన్ లోయలలో కూడా వరదలు మరియు వర్షాల వలన అనేక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అలియాబాద్‌లో కొండ చరియలు విరిగిపడడం వలన అప్పటికే మూసుకుపోయి ఉన్న కారకోరం ప్రధాన రహదారిపై ఈ వర్షాల వలన రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. బాలకోట్ నుండి కఘన్ వెళ్ళే మార్గం కూడా మూసుకుపోయింది. పాకిస్తాన్ ఎకో టూరిజం సొసైటీ అంచనా ప్రకారం ప్రైవేటు రంగంలో దాదాపు 550 మిలియన్ల నష్టం జరిగింది. దీనిలో ఆస్తులు, రవాణా సౌకర్యాలకు కలిగిన నష్టమే కాక అప్పటికే ఖరారైన పర్యటనల రద్దు వలన జరిగిన నష్టం కూడా అంచనా వేయడం జరిగింది. ఈ ఎకో టూరిజం సొసైటీ ఇటువంటి విపత్తులను పర్యాటక రంగం ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై సూచనలను ప్రపంచ మీడియాకు అందచేసింది. 2005లో భూకంపం సంభవించినప్పుడు పాకిస్తాన్‌కు సహాయం చేసిన అమెరికన్ సినిమా తార ఎంజలీన జోలీ ఈసారి కూడా పాకిస్తాన్‌కు సహాయం చేయడానికి ముందుకొచ్చి 2010 సెప్టెంబర్ 7న వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించడం జరిగింది. అత్యంత దారుణమైన ఈ ప్రకృతి విపత్తు నుండి దేశం కోలుకునేందుకుగాను అన్ని దేశాల ప్రజలు ఆర్ధిక సహాయం అందించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. దాదాపు 22 మిలియన్ల ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆగస్ట్ 11న ఐక్యరాజ్యసమితి 460 డాలర్ల అత్యవసర ఆర్ధిక సహాయాన్ని ప్రకటించగా అందులో కేవలం 294 మిలియన్లు అంటే 64 శాతం మాత్రమే ఇప్పటివరకు విడుదల చేయడం జరిగింది, ఇక ఇటీవలి కాలంలో విరాళాలు అనేవి దాదాపుగా తగ్గిపోయాయి.

ప్రధాన ఆకర్షణలు[మార్చు]

దేశం ఇప్పుడున్నట్లుగా ఏర్పడకముందే ఏర్పడిన ఆవాసాలు, భిన్న మతాలతో కూడిన పాకిస్తాన్ ఒక వైవిధ్యభరితమైన ప్రాంతం. సింధ్, పంజాబ్,ఖైబర్ పఖ్తున్ఖ్వ,బలూచిస్తాన్ అనే నాలుగు పెద్ద సంస్థానాలు మరియు ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం, కేంద్రంచే పరిపాలించబడే గిరిజన ప్రాంతాలు, ఆజాద్ జమ్మూ మరియు కాశ్మీర్ మరియు గిల్గిట్-బాల్టిస్తాన్ అనే నాలుగు ప్రాంతాలు కలిసి ఈనాటి పాకిస్తాన్‌గా ఏర్పడింది. ఇక్కడి భౌతిక మరియు సాంస్కృతిక వైవిధ్యం వలన ఎంతో మంది విదేశీ పర్యాటకులు మరియు సాహసికులు ఇక్కడికి ఆకర్షింపబడుతుంటారు.

Site#138: మొహెంజో-దారో యొక్క శిధిలాలు
Site#140: తఖ్త్ భై వద్ద గల బౌద్ధ శిధిలాలు
Site#139: తక్షశిల వద్ద గల గాంధార శిధిలాలు
చుఖంది సమాధులు
Site#171: లాహోర్ కోట & షాలిమార్ తోటలు
మొహట్ట పాలస్
బద్శాహి మసీద్
షా రుక్న్-ఎ-ఆలం యొక్క స్మృతి చిహ్నం

UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా వర్గీకరించిన పాకిస్తాన్‌లోని ఆరు ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రాలు ఇలా ఉన్నాయి:

 • మొహెంజదారో వద్ద నున్న సింధు నాగరికత నాటి పురావస్తు శిధిలాలు.
 • తఖ్త్-యి-బహి వద్ద 1వ శతాబ్దం నాటి బౌద్ధ మతానికి శిధిలాలు మరియు సహర్-ఐ-బహ్లోల్ వద్ద ఉన్న పొరుగు నగర శిధిలాలు.
 • గాంధార నాగరికత కు చెందిన తక్షశిల శిధిలాలు.
 • లాహోర్‌లోని లాహోర్ కోట మరియు షాలిమార్ తోటలు.
 • పురాతన నగరమైన తట్ట కు చెందిన చారిత్రక ఆనవాళ్ళు.
 • పురాతన రోహ్తాస్ కోట.

1993-2004 మధ్య కాలంలో ఇంకా అనేక ప్రాంతాలకు వరల్డ్ హెరిటేజ్ సైట్ పొందే అర్హత ఉన్నప్పటికీ పాకిస్తాన్ వాటి జాబితాను UNESCOకు సరి అయిన సమయంలో అందించలేకపోయింది. 2004లో, తన పరిశోధనను కొనసాగించేందుకు గాను పర్యాటక మంత్రిత్వ శాఖకు నిధులు ఇవ్వడంతో పాటు యునెస్కో యొక్క తాత్కాలిక జాబితాలో మరో పది కేంద్రాలను చేర్చడం జరిగింది. 2010 జూన్ నాటికి మొత్తం పద్దెనిమిది కేంద్రాలు వారసత్వ సంపదగా గుర్తింపబడేందుకు ఎదురు చూస్తున్నాయి.అవి:[9]

 • 17వ శతాబ్దంలో మొగలులు నిర్మించిన బద్షహి మసీద్.
 • 17వ శతాబ్దంలో మొగలులు నిర్మించిన వజీర్ ఖాన్ మసీద్.
 • 17వ శతాబ్దానికి చెందిన జహంగీర్, ఆసిఫ్ ఖాన్ మరియు అక్బరి సరైల సమాధులు.
 • శేకుపురా నగరంలో తన ప్రియమైన జింక స్మృతికి చిహ్నంగా మొగల్ చక్రవర్తి జహంగీర్ నిర్మించిన హిరాన్ మినార్ మరియు చెరువు.
 • 14వ శతాబ్దానికి చెందిన హజ్రత్ రుక్-ఏ-ఆలం సమాధి.
 • ప్రపంచంలో కెల్లా అతి పెద్ద కోటలలో ఒకటైన రాణి కోట్ కోట.
 • పురాతన తట్ట నగరంలో 17వ శతాబ్దంలో నిర్మించిన షాజహాన్ మసీద్.
 • 15 మరియు 18వ శతాబ్దంలో సింధి మరియు బెలోచి తెగలకు చెందిన చౌకండి సమాధులు.
 • కొత్త రాతి యుగానికి చెందిన పురాతన కేంద్రం మెహర్‌గర్.
 • రెహ్మాన్ ధేరి పురాతత్వకేంద్రం.
 • హరప్పా పురాతత్వకేంద్రం.
 • రానిగాట్ పురావస్తు కేంద్రం.
 • షాబార్‌గరి రాతి శాసనాలు.
 • మన్సేహ్రా రాతి శాసనాలు.
 • హంజ లోయలో పురాతన టిబెటన్ శైలిలో నిర్మించిన బాల్తిట్ కోట.
 • ఉచ్ షరీఫ్‌లోని బిబి జవింది, బహల్-హలీం మరియు ఉస్తేద్ సమాధి మరియు జల్లాలుద్దిన్ బుఖారి మసీద్.
 • బాన్బోర్ కోట

వీటితో పాటు ఇంకా అనేక నిర్మాణాలు మరియు ప్రాంతాలు UNESCO యొక్క తాత్కాలిక జాబితాలోకి చేరవలసినవి ఉన్నాయి. 1947లో పాకిస్తాన్ ఏర్పడక ముందు,భారత దేశ విభజనకు ముందు ఇక్కడ అనేక సంస్కృతులు మతాలు ఉండేవి. పాకిస్తాన్ తన భూముల మీద ఆధిపత్యం కోసం వివిధ సామ్రాజ్యాలు మరియు తెగల మధ్య అనేక యుద్ధాలను చూసింది. ఈ యుద్ధాలు జరిగిన కొన్ని ప్రాంతాలు జాతీయ స్థాయి గుర్తింపు పొందినా ఇంకా ఎన్నో ప్రాంతాలు ఎటువంటి గుర్తింపుకు నోచుకోకుండా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇలా ఉన్నాయి:

 • ఫైసలాబాద్ గడియార స్థంభం మరియు ఎనిమిది బజార్లు
 • హంజా లోయలో ఉన్న అల్తిట్ కోట
 • 17 మరియు 18 వ శతాబ్దం నాటి తాల్పూర్ మిర్స్ యొక్క సమాధులు
 • రంజిత్ సింగ్ యొక్క సమాధి
 • మొగలులు నిర్మించిన అసఫ్ ఖాన్ సమాధి
 • బ్రిటిష్ పరిపాలనా కాలంలో నిర్మించిన ఎమ్‌ప్రెస్ మార్కెట్
 • బానిస సామ్ర్యాజ్య స్థాపకుడు మరియు ఢిల్లీకి మొదటి సుల్తాన్ అయిన కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సమాధి.
 • సిఖ్‌లచే నిర్మించబడిన మొహట్ట పాలెస్
 • 18వ శతాబ్దం నాటి ఒమర్ హయత్ మహల్
 • 19వ శతాబ్దం నాటి ఇటాలియన్ పాలెస్ నమూనాలో ఉన్న నూర్ పాలెస్.
 • దేరవర్ కోట
 • మొగలులు నిర్మించిన హిరణ్ మినార్
 • ఆసియాలో కెల్లా పురాతన ఉప్పు గనులు అయిన ఖేవ్ర ఉప్పు గనులు
 • 3000 బిసి లో నిర్మించిన కోట్ డిజి కోట మరియు ఖైర్పూర్‌లోని ఫైజ్ మహల్
 • 16వ శతాబ్దం నాటి శార్దూ కోట

పాకిస్తాన్‌కు స్వతంత్రం వచ్చిన తరువాత ఆదేశం తన సంస్కృతి వారసత్వాలను నిలుపుకునేందుకు గాను తన స్వాతంత్రానికి చిహ్నంగాను ఎన్నో పర్యాటక ప్రాశస్త్యం ఉన్న కేంద్రాలను పునరుద్ధరించింది. వీటిలో కొన్నిఇలా ఉన్నాయి:

 • లాహోర్‌లో ఉన్న మినార్-ఎ-పాకిస్తాన్.
 • ఇస్లామాబాద్‌లోని ఫైసల్ మసీద్.
 • పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా స్మృతి చిహ్నం.
 • దేశ విభజన బాధితుల స్మృతి చిహ్నం అయిన బాబ్-యి-పాకిస్తాన్.
 • ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ మాన్యుమెంట్.
 • అల్లామా మొహమ్మద్ ఇక్బాల్ యొక్క స్మృతి చిహ్నం.

మౌలిక సదుపాయాలు మరియు ఆర్ధిక రంగం[మార్చు]

పాకిస్తాన్ లో పర్యాటకం అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగం. విస్తృతంగా విదేశీ పెట్టుబడులు మరియు నిధులు లభించడంతో పాకిస్తాన్ వస్తు మరియు ప్రజా రవాణా కోసం తన రహదారులు మరియు విమాన నెట్‌వర్క్‌లను ఎంతగానో అభివృద్ధి చేసింది. ఉత్తర ప్రాంతాల నుండి దిగువన ఉన్న కరాచి నౌకాశ్రయం వరకు కూడా అనేక మంది కన్సల్టంట్‌లచే అనేక రహదారులు నిర్మించబడ్డాయి. అయితే, ఈ రోజు వరకు కూడా, పాకిస్తాన్ ప్రభుత్వం పర్యాటక విపణిని పెద్దగా పరిగణనలోనికి తీసుకోలేక పోయింది. పాకిస్తాన్ పర్యాటక విపణికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అక్కడి విభిన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తగినంత నిధులు కేటాయించడం జరగక అనేక ప్రాంతాలకు రక్షణ కూడా కరువైంది.

గత దశాబ్దంలోని గణాంకాలను చూసుకుంటే పర్యాటకం అనేది "సరఫరా ఆధారితంగా కాక మార్కెట్‌చే నడుపబడడంతో పాకిస్తాన్‌లో పర్యాటకం బాగాతగ్గింది. దీని వలన కొన్ని టూర్ ఏజన్సీలు ఏర్పాటు చేయబడి చారిత్రాత్మక ప్రాంతాలను వారే అభివృద్ధి చేయడం జరిగింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు పర్యాటక విపణి నుండి క్రమంగా తక్కువ ఆదాయాన్ని పొందడం ఆ పరిశ్రమలో పెట్టుబడి మరియు నవీకరణ తగ్గడానికి కారణమైందని అంచనా వేయబడింది. ఇది కాలం గడిచే కొద్దీ అనేక స్థలాలు శిధిలమవడానికి దారితీసింది మరియు కనీస అంతర్జాతీయ ప్రమాణాలు లేకపోవడం అనేక స్థలాలను హీనస్థితిలో వదలివేసింది. ఇటీవలి బడ్జెట్, పరిశోధన మరియు విక్రయాలపై తక్కువ వ్యయం మరియు రక్షణ మరియు స్థిర ఆస్తులపై ఎక్కువ వ్యయం జరుగుతున్నట్లు చూపింది.

2008 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్ (TTCR) సందర్శించదగిన 124 దేశాలలో పాకిస్తాన్‌కు 103వ స్థానాన్ని ఇచ్చింది. బలహీనమైన ప్రయాణ మరియు పర్యాటక అవస్థాపనా సౌకర్యాలు, తక్కువ స్థాయిలో పేరు మరియు విక్రయ సఫలత మరియు ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమకు ప్రభుత్వం ఇచ్చిన తక్కువ ప్రాముఖ్యత ఈ స్వల్ప సంఖ్యకు కారణం. విజిట్ పాకిస్తాన్ 2007 వంటి అనేక పథకాలు ఉన్నప్పటికీ పర్యాటకుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గిపోయింది. గత సంవత్సర సంఖ్యలతో పోల్చినపుడు ఈ సంవత్సరం అది 6% పడిపోయింది.[10] పాకిస్తాన్, సౌకర్యాల లేమి కారణంగా అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలతో పోటీ పడలేదు. బలహీనమైన పర్యాటక అవస్థాపనతో ప్రామాణికమైన మరియు పోటీపడదగిన హోటల్ గదులను అందించడం, జాతీయ మరియు సాంస్కృతిక వనరులు క్షీణించడం, వ్యాప్తిలో ఉన్న భద్రతా పరిస్థితి మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం పాకిస్తాన్‌లో పర్యాటకరంగ క్షీణతకు ప్రధాన కారణాలు.

పర్యాటక విపణిలో నూతన వ్యాపారాల నిర్వహణను ప్రారంభించి పాకిస్తాన్‌కు తిరిగి పర్యాటకులను ఆకర్షించడానికి అనేక నగరాలు ప్రభుత్వానికి ప్రోత్సాహాన్ని అందించాయి. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకొనే రహదారులు మరియు వాయు వ్యవస్థలను నిర్మించడం మరియు నిర్వహించడం. మానవ మరియు సహజ వనరుల పరిపక్వత ఈ బలహీనమైన పరిశ్రమ యొక్క అభివృద్ధికి సహాయపడగలదు. ఈ దేశంలోని ఉన్నత ప్రాంతాల అన్వేషణకు సెలవు దిన పాకేజీలను రూపొందించి పర్యాటకులను ఆకర్షించే ప్రచార ప్రకటనలు అవసరం.

PTDC Motel at Malam Jabba Ski Resort
మాలం జబ్బ స్కి రిసార్ట్ వద్ద గల PTDC మోటెల్.

పర్యాటక మంత్రిత్వ శాఖ[మార్చు]

సెప్టెంబర్ 2004లో మైనారిటీలు, సంస్కృతి, క్రీడలు, పర్యాటక మరియు యువజన వ్యవహారాల విభజనతో, పర్యాటక రంగానికి పర్యాటక మంత్రిత్వ శాఖగా ప్రత్యేక హోదా ఇవ్వబడింది. విదేశీ మరియు దేశీయ పర్యాటక విధాన రూపకల్పన, అభివృద్ధి, విక్రయం మరియు ప్రోత్సాహాలకు పర్యాటక మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది దానితో పాటే పర్యాటక రంగానికి సంబంధించి మరియు దానిలో ఇమిడి ఉండే సమాఖ్య మరియు రాష్ట్ర ప్రభుత్వాల మరియు ప్రైవేట్ రంగ కార్యకలాపాలను సమన్వయపరచి, క్రమబద్ధం చేస్తుంది. మొత్తం నిర్మాణంలో మంత్రిత్వ శాఖ యొక్క పర్యాటక విభాగం దాని క్షేత్ర సంస్థలతో కలిపి పర్యాటక పరిశ్రమ యొక్క అభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తుంది .[11]

ఉపవిభాగాల వారీగా పర్యాటకరంగం[మార్చు]

పాకిస్తాన్ నాలుగు రాష్ట్రాలు, ఒక సమాఖ్య రాజధాని ప్రదేశం, సమాఖ్య-పరిపాలనలో ఉండే తెగల సమూహంగా ఉపవిభజన చేయబడింది.[12] పాకిస్తాన్‌లోని అత్యధిక భాగాన్ని కలిగి ఉన్న ఈ నాలుగు పెద్ద రాష్ట్రాలలో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వ, పంజాబ్ మరియు సింధ్ ఉన్నాయి. ఇస్లామాబాద్ కాపిటల్ టెరిటరీ పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్‌కి స్థావరంగా ఉంది. చివరకు, పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న చిన్న ప్రదేశాలైన సమాఖ్య పరిపాలిత తెగల ప్రాంతాలైన, అజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు గిల్గిత్-బాల్టిస్తాన్ ఉన్నాయి.

ఇస్లామాబాద్ కాపిటల్ టెరిటరీ[మార్చు]

బలూచిస్తాన్[మార్చు]

బలోచిస్తాన్ లో అత్యంత ప్రముఖ బీచ్ అయిన కుండ్ మలిర్.

బలూచిస్తాన్, పాకిస్తాన్ యొక్క అతి పెద్ద రాష్ట్రం మరియు భౌగోళిక ప్రాంతం, ఇది పాకిస్తాన్‌లోని మొత్తం ప్రాంతంలో 43% కలిగిఉంది. బలూచిస్తాన్ అత్యంత పురాతన నూతన రాతియుగ (క్రీ.పూ.7000 నుండి క్రీ. 2500 క్రీ.శ.) పురాతత్వ స్థావరాలకు కేంద్రంగా ఉంది. మెహర్‌గర్ మరియు నౌషారో, సింధు లోయ నాగరికతకు చెందిన ఒక పురాతన నగరం. 800 సంవత్సారాల క్రితానికి చెందిన మరొక పురాతన స్థావరాలు కిలా లాడ్గాష్ట్ వద్ద గల నౌషేర్వాని సమాధులు. హెలెనిస్టిక్ నాగరికత కాలంలో నౌకాశ్రయంగా ఉపయోగపడినట్లు ఆధారాలు ఉన్న పురాతన నౌకాశ్రయమైన ఒరయే కూడా ఉంది.[13]

దస్త్రం:Pasni1.jpg
పస్ని బీచ్ లోని రమణీయ ప్రకృతి

క్వెట్టా, బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని. ఇక్కడ రక్షిత హజార్ గంజి-చిల్తాన్ నేషనల్ పార్క్, హన్నా లేక్, క్వెట్టా జియోలాజికల్ మ్యూజియం, బలూచిస్తాన్ ఆర్ట్స్ కౌన్సిల్ లైబ్రరీ, క్వెట్టా ఆర్కియాలజికల్ మ్యూజియం మరియు వాటితో పాటే కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ మ్యూజియం వంటి అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. జియారత్ నగరంలో ఉన్న క్వైద్-ఎ-ఆజాం రెసిడెన్సీ, బలూచిస్తాన్ లోని మరొక ప్రధాన ప్రదేశం. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన మరియు పెద్దవైన చౌకుమాను(జునిపెర్) అడవులకు కూడా జియారత్ ప్రసిద్ధి చెందింది. సిబి, బలూచిస్తాన్ లోని ఒక ముఖ్యమైన చారిత్రక నగరం. జిగ్రా హాల్, మెహర్‌గర్, నస్శేరో మరియు పిరాక్ వంటి పురాతత్వ ప్రదేశాలలో కనుగొన్న సంగ్రహాల సేకరణను కలిగి ఉంది. సాంవత్సరిక సిబి ఉత్సవం గుర్రాల మరియు పశువుల ప్రదర్శనకు ప్రసిద్ధి చెందింది.[14]

బలూచిస్తాన్‌‌లో అనేక పర్వత మార్గాలు ఉన్నాయి. బోలాన్ పాస్ రాష్ర నగరమైన క్వెట్టాకు ప్రధాన ప్రవేశంగా ఉంది. లాక్ పాస్, ఖోజాక్ పాస్ మరియు హర్నై పాస్‌లతో పాటు అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. బలూచిస్తాన్ తీరరేఖ సింధ్ రాష్ట్రం నుండి ఇరానియన్ సరిహద్దు వరకు విస్తరించి మొత్తం 750 కి.మీ.పొడవును కలిగి ఉంది. గ్వదార్ నగరం, పురాతన ప్రాంతమైన మక్రాన్ సమీపంలో రాష్ట్రంలో అతి పెద్ద నౌకాశ్రయాన్ని కలిగి ఉంది. పస్ని చేపల వేటకు ప్రఖ్యాతి గాంచిన మరొక అందమైన మధ్య-స్థాయి పట్టణం. మక్రాన్ కోస్టల్ హైవే వెంట రాతితో ఏర్పడిన అనేక రూపాలు మరియు కుంద్ మలిర్ ఇంకా హింగోల్ నేషనల్ పార్క్ ఉన్నాయి.

ఖైబర్ పఖ్తున్ఖ్వ[మార్చు]

ప్రముఖ ఖైబర్ స్టీం ట్రైన్ సఫారి

ఖైబర్ పఖ్తున్ఖ్వ, పాకిస్తాన్ యొక్క వాయవ్య ప్రాంతంలో ఉంది. ఇది సాహసాలు మరియు అన్వేషణల కొరకు పర్యాటకుల ఆకర్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం ఎగుడుదిగుడుగా ఉండే పర్వతాలు, లోయలు, కొండలు మరియు సాంద్ర వ్యవసాయ క్షేత్రాలతో విభిన్నమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంది. ఈ ప్రాంతం తన వారసత్వ మూలాలకు ప్రసిద్ధి చెందింది. గాంధార నాగరికతకు చెందిన తఖ్త్ భాయి మరియు పుష్కలవతి వంటి అనేక బౌద్ధ పురాతత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి. బాల హిసార్ కోట, బుత్కర స్థూప, కనిష్క స్థూప, చక్దరా, పంజ్కోర లోయ మరియు సెహ్రి బహ్లోల్ వంటి అనేక బౌద్ధ మరియు హిందూ పురాతత్వ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

ఘబ్రల్ స్వాత్ లోయ
ఉషో స్వాత్ లోయ

పెషావర్, ఖైబర్ పఖ్తున్ఖ్వ రాష్ట్రం యొక్క రాజధాని. ఈ నగరం బాల హిసార్ కోట, పెషావర్ వస్తుసంగ్రహాలయం, పురాతత్వ ప్రదేశమైన గోర్ ఖుట్ట్రీ, మోహబ్బత్ ఖాన్ మసీదు, పురాతన నగరమైన సేతి మొహల్లా, జమ్రుద్ కోట, స్ఫోల స్థూపా మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన క్విస్సా ఖవాని విపణులకు నిలయంగా ఉంది. డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరం పంజాబ్ మరియు బలూచిస్తాన్ రాష్ట్రాలకు ప్రవేశంగా పేరు పొందింది. ఈ నగరం కాఫిర్ కోట్ వద్ద గల హిందూ శిధిలాలకు ప్రసిద్ధి చెందింది. మరదాన్ నగరంలోని షాబాజ్ గర్హి వద్ద గల బౌద్ధ మత శిధిలాలు కూడా ప్రసిద్ధిచెందాయి. ఉత్తరం వైపు వెళితే, డిర్, స్వాత్, హరిపూర్, అబ్బోత్తాబాద్ మరియు చిత్రాల్ అన్నీ వెలికితీయబడిన అనేక పురాతత్వ స్థలాలను, గ్రామీణ ప్రకృతి దృశ్యాలను మరియు ప్రసిద్ధ ఉత్సవాలను కలిగి ఉన్నాయి. గిల్గిత్ మరియు చిత్రాల్ తెగల మధ్య షన్డుర్ టాప్ వద్ద శతాబ్దాల పురాతనమైన ప్రసిద్ధ పోలో ఉత్సవం జరుగుతుంది. పెషావర్ నుండి లాండి కొటల్‌కు వెళ్ళే ఖైబర్ ట్రైన్ సఫారి కూడా ఉంది.

నరాన్ లోయలోని లులుసర్ లో ఉద్భవించే కుంహర్ నది

రాష్ట్రంలోని అత్యంత ప్రధానమైన నగరాలలో మన్సేహ్ర ఒకటి. ఈ నగరం ఉత్తర ప్రాంతాలు మరియు ఆజాద్ కాశ్మీర్ల పర్యటన ఏర్పాట్లకు ప్రధాన మజిలీగా ఉంది. ఈ నగరం చైనాలో అంతమయ్యే ప్రసిద్ధ కారకోరం ప్రధాన రహదారితో కలుపబడి ఉంది. ఈ రహదారి వెంట కఘన్ లోయ, బాలకోట్, నరన్, షోగ్రాన్, లేక్ సైఫుల్ ములూక్ మరియు బాబుసర్ టాప్ వంటి అనేక నిలుపుదల స్థలాలు ఉన్నాయి. ఇంకా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే అయుబియా, బత్ఖేల, చక్దరా, సైదు షరీఫ్, కలాం లోయ మరియు చిత్రాల్‌లోని హిందూ కుష్ పర్వత శ్రేణి వంటి అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి.[15]

ఈ రాష్ట్రం నుండి అనేక పర్వతీయ మార్గాలు కూడా వెళతాయి. వీటిలో ఆఫ్గనిస్తాన్ మరియు పాకిస్తాన్‌లను కలిపే అత్యంత ప్రసిద్ధ ఖైబర్ పాస్ కూడా ఉంది. ఈ వర్తక మార్గం నుండి ఈ ప్రాంతంలోకి మరియు ఇక్కడినుండి దిగుమతి మరియు ఎగుమతిని చేసే అనేక ట్రక్కులు మరియు లారీలు వెళతాయి. కారకోరం ప్రధాన రహదారిపై థక్ నాలను చిలాస్‌తో కలిపే బాబుసర్ పాస్ మరొక పర్వతీయ మార్గం. లోవరి సొరంగం ద్వారా చిత్రాల్‌ను దిర్‌తో కలిపే లోవరి పాస్ మరొక పర్వతీయ మార్గం. చిత్రాల్‌ను గిల్గిత్‌తో కలిపే పాకిస్తాన్‌లోని అత్యున్నత పర్వతీయ మార్గమైన షన్డుర్ పాస్ ప్రపంచ పైకప్పు గా పిలువబడుతుంది. ఈ మార్గం మూడు పర్వత శ్రేణులైన- హిందూకుష్, పామిర్ మరియు కారకోరంలకు అధికేంద్రంగా ఉంది.

పంజాబ్[మార్చు]

పంజాబ్ రాజధాని అయిన లాహోర్ లో ఉన్న మినార్ ఇ పాకిస్తాన్
చక్వాల్ లోని కటశ్రాజ్ గుడి
ఇటాలియన్ పాలస్ తరహాలో 1872 లో బహవల్పూర్ లో నిర్మించిన నూర్ మహల్ (డైమండ్ పాలస్)

పంజాబ్, పాకిస్తాన్‌లోని రెండవ పెద్ద రాష్ట్రం. ఇది దాని పురాతన సాంస్కృతిక వారసత్వానికి మరియు మత వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. పంజాబ్ యొక్క భూభాగాలు అనేక మతాలు మరియు నాగరికతలకు నిలయంగా ఉన్నాయి. సింధు లోయ నాగరికత ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది మరియు పురాతన నగరమైన హరప్పాలో గుర్తించదగిన పురాతత్వ శిధిలాలు వెలికితీయబడ్డాయి. పంజాబ్ యొక్క ఉత్తర ప్రాంతంలోని తక్షశిలలో గాంధార నాగరికత కూడా చాలా ప్రబలంగా ఉండేది. పంజాబ్‌ను పరిపాలించిన గ్రీకులు, మధ్య ఆసియన్లు, మరియు పర్షియన్‌లు వంటి అనేక నాగరికతలు విడిచి వెళ్ళిన ప్రదేశాలు నేటికీ ఉన్నాయి. సుమారు ఉమయ్యద్ కాలిఫేట్ పాలన సమయంలో ఇస్లాం ప్రవేశించింది, తరువాత ఘజ్నవిడ్స్ అనుసరించారు. మొగలులు ఈ ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకొని అనేక శతాబ్దాల పాటు పరిపాలించారు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో నిలిచి ఉన్న కోటలు, సమాధులు మరియు కట్టడాలతో పంజాబ్‌లో మొగల్ వారసత్వం చాలా బలంగా ఉంది. మొుగల్ సామ్రాజ్యం పతనమైన తరువాత స్వల్పకాలం పాటు దురాని సామ్రాజ్యం పంజాబ్‌ను పరిపాలించింది, తరువాత సిఖ్ సామ్రాజ్యం వచ్చింది. బలమైన సిక్కుల నియంత్రణ కూడా పంజాబ్ అంతా ఈ నాటికీ చెక్కు చెదరకుండా ఉన్న అనేక స్థావరాలకు దారితీసింది. పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందేవరకు బ్రిటిష్ రాజ్ ఈ ప్రాంతం యొక్క నియంత్రణను చేపట్టింది.

పంజాబ్‌లో పర్యాటకరంగం టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ అఫ్ పంజాబ్‌చే క్రమబద్ధీకరించబడుతుంది.[16] పంజాబ్‌లో అనేక పెద్ద విశ్వజనీన నగరాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని అయిన లాహోర్, పాకిస్తాన్ యొక్క రెండవ పెద్ద నగరం, ఇది పాకిస్తాన్ యొక్క సాంస్కృతిక హృదయం గా పేరు పొందింది. మొగల్ సామ్రాజ్యం వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌గా గుర్తింపు పొందిన లాహోర్ ఫోర్ట్ మరియు షాలిమార్ గార్డెన్స్‌ను విడిచి వెళ్ళింది. లాహోర్ యొక్క కుడ్య నగరం, బాద్షాహీ మసీదు, వజీర్ ఖాన్ మసీదు, జహంగీర్ మరియు నూర్ జహాన్‌ల సమాధి, అసఫ్ ఖాన్ సమాధి మరియు చౌబుర్జి ప్రతి సంవత్సరం పర్యాటకులు సందర్శించే ప్రధాన స్థలాలు. ఢిల్లీ సల్తనత్ కు చెందిన కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ సమాధి లాహోర్‌లోని చారిత్రాత్మక విపణి అయిన అనార్కలి బజార్‌లో ఉంది. రంజిత్ సింగ్ సమాధి మరియు హజురి బాగ్ బారాదరి సిఖ్ సామ్రాజ్య పాలనా కాలంలోని సిఖ్ నిర్మాణకళకు ప్రాధమిక ఉదాహరణ. లాహోర్ నగరంలో ఉన్న అనేక ఇతర ప్రదేశాలైన మినార్-ఎ-పాకిస్తాన్, లాహోర్ వస్తుసంగ్రహాలయం, దాత దర్బార్ కాంప్లెక్స్, ముహమ్మద్ ఇక్బాల్ సమాధి, బాగ్-ఎ-జిన్నా, లాహోర్ జూ, షా జమాల్ సమాధి, సుఖ్ చయన్ గార్డెన్స్, గడ్డాఫీ స్టేడియంలను కూడా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో సందర్శకులు దర్శిస్తున్నారు.

ముర్రీ, పట్రియత, ఉత్తర ప్రాంతాలు, ఆజాద్ కాశ్మీర్ మరియు గిల్గిత్-బాల్టిస్తాన్ కు వెళ్ళే ముందు పర్యాటకులకు రావల్పిండి ఒక ప్రసిద్ధ పర్వతీయ విడిది కేంద్రంగా ఉంది.[17] ఈ నగర శివార్లలోని ఫర్వాల కోట పురాతన హిందూ నాగరికతచే నిర్మించబడిన ప్రధాన కోట. షేఖుపుర నగరంలో హిరణ్ మినార్ మరియు షేఖుపుర కోటగా పిలువబడే ముగల్ సామ్రాజ్యానికి చెందిన అనేక స్థావరాలు ఉన్నాయి. జీలం సమీపంలో షేర్ షా సూరిచే నిర్మించబడిన రోహ్తాస్ కోట ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. చక్వాల్ నగరంలో ఉన్న కటశ్రాజ్ దేవాలయం హిందూ భక్తులకు ప్రధాన గమ్యస్థానంగా ఉంది. దక్షిణ ఆసియాలోని అత్యంత పురాతన గనులుగా ఖేవ్ర ఉప్పు గనులు మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. నాన్కనా సాహిబ్ నగరం సిక్కు మత వ్యవస్థాపకుడి జన్మస్థలం. గురు నానక్ దేవ్ జన్మదిన సందర్భంలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యాత్రికులు ఇక్కడి గురుద్వారాను సందర్శిస్తారు. పంజాబ్‌లోని మరొక ప్రసిద్ధ గురుద్వారా అయిన పంజా సాహిబ్, హసన్ అబ్దాల్ నగరంలో ఉంది. ఫైసలాబాద్ నగరంలోని గడియార స్థంభం మరియు ఎనిమిది బజార్లు యూనియన్ జాక్ జండాను సూచిస్తూ రూపకల్పన జరగడం వలన వాటి బజార్లకు ప్రసిద్ధి చెందాయి.[18]

దక్షిణం వైపు ప్రయాణిస్తే, ఈ ప్రాంతం మరింత ఎడారిగా మారడం ప్రారంభమౌతుంది. ముల్తాన్ పంజాబ్ లోని మరొక ప్రధాన పర్యాటక కేంద్రం. అది సన్యాసుల మరియు సూఫీ పీర్ల సమాధి భవనాలకు ప్రసిద్ధిచెందింది. రుక్న్-ఎ-ఆలం మరియు బహ-ఉద్-దిన్ జకరియ వీటిలో అత్యంత ప్రసిద్ధిచెందాయి. ముల్తాన్ వస్తుసంగ్రహాలయం మరియు నువగజా సమాధులు నగరంలో గుర్తింపు పొందిన పర్యాటక ఆకర్షణలు. ఖోలిస్తాన్ ఎడారి మరియు థార్ ఎడారిలకు సమీపంలో ఉండటం వలన బహవల్పూర్ నగరం ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. ఖోలిస్తాన్ ఎడారిలో నిర్మించబడిన పెద్ద కోట అయిన దేరావర్ కోట ప్రతి సంవత్సరం జరిగే ఖోలిస్తాన్ జీప్ రాలీకి స్థావరంగా కూడా ఉంది. ఒకప్పుడు ఢిల్లీ సుల్తనత్ యొక్క బలమైనపట్టుగా ఉన్న పురాతన ప్రాంతం ఉచ్ షరీఫ్‌కు కూడా ఈ నగరం సమీపంలో ఉంది. నూర్ మహల్, సాదిక్ ఘర్ పాలస్, దర్బార్ మాల్ నవాబుల పాలనా కాలంలో నిర్మించిన పెద్ద రాజభవనాలు. నగర శివార్లలో ఉన్న లాల్ సుహాన్ర నేషనల్ పార్క్ ఒక పెద్ద జంతు ప్రదర్శన ఉద్యానవనం.

సింధ్[మార్చు]

కరాచి పోర్ట్ ట్రస్ట్ రాజధాని
తల్పూర్ మిర్స్ సామ్రాజ్యంలో నిర్మించిన ఫైజ్ మహల్ (ఫైజ్ పాలస్)

సింధ్, పాకిస్తాన్ యొక్క ఆగ్నేయ ప్రాంతంలో ఉంది. ఈ రాష్ట్రం తన మతపరమైన వారసత్వానికి మరియు వేగవంతమైన పట్టణీకరణకు ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం పురాతన సింధు లోయా నాగరికతకు కేంద్రం. లర్కాన నగరానికి సమీపంలో ఉన్న మొహెంజో-దారో దక్షిణ ఆసియాలోని అతిపెద్ద నగర-స్థావరాలలో ఒకటి మరియు ఇది UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్. లండి నగర సమీపంలో ఉన్న చౌఖండి సమాధులు పురాతన సింధీ మరియు బలూచి వారసత్వానికి మరొక ఉదాహరణ. సుక్కుర్ నగర సమీపంలో ఉన్న మరొక పురాతన నగరమైన ఆరోర్ కూడా దాని శిధిలాల వలన పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఒక బౌద్ధ స్థూపం వెలికి తీయబడిన మిర్పుర్ఖాస్ సమీపంలోని కహు-జో-దారో ఒక ప్రసిద్ధ బౌద్ధ పురాతత్వ ప్రదేశం.

భారత ఉపఖండంలో ఇస్లాం ప్రవేశం సింధ్‌లో జరిగింది. పురాతత్వశాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని సూచించడానికి దారితీసిన అనేక స్థలాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మక్లి హిల్ ప్రపంచంలోని అతి పెద్ద సమాధి నగరాలలో ఒకటి. ఈ స్థలం ఇస్లామిక్ వంశాలకు చెందిన సమాధులు మరియు సమాధి రాళ్ళకు స్థావరంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన తాల్పూర్ మీర్స్ కూడా అనేక స్థావరాలను నిర్మించారు, వీటిలో తాల్పూర్ మీర్ల సమాధులు, ఖైర్పూర్‌లోని ఫైజ్ మహల్, కాసిం కోట, పక్కో క్విల్లో మరియు కోట్ డిజిలోని కోట్ డిజి కోట ఉన్నాయి. ఇస్లాం ఆక్రమణల కాలంలో నిర్మించబడిన మరొక ప్రసిద్ధ కోట రాణికోట్ కోట. ఇతర రాష్ట్రాలవలె, సింధ్ కూడా పెద్ద సంఖ్యలో సాంస్కృతిక దేవాలయాలను మరియు సమాధి భవనాలను కలిగి ఉంది, వీటిలో తట్టా, షా అబ్దుల్ లతీఫ్ భిట్టై, లాల్ షాబాజ్ కలందర్, షాజహాన్ మసీదు, మజార్-ఎ-క్వైద్, మినార్-ఎ-మీర్ మాసుం షా, భంబోర్ మరియు గర్హి ఖుదా బఖ్ష్ ఉన్నాయి.


కరాచి ఈ రాష్ట్రం యొక్క రాజధాని మరియు పాకిస్తాన్ యొక్క అతి పెద్ద నగరం. ఇది దేశ స్థాపకుడు అయిన మొహమ్మద్ అలీ జిన్నా స్వంత పట్టణం. అతని సమాధి అయిన మజార్-ఎ-క్వైద్, పాకిస్తాన్ లో అత్యంత గుర్తింపు పొందిన సమాధి భవనం. ఈ నగరం దేశంలోనే అతి పెద్ద నౌకాశ్రయమైన కరాచి నౌకాశ్రయంను కలిగి ఉంది, రెండవ అతిపెద్ద నౌకాశ్రయం కాసిం నౌకాశ్రయం. కరాచీని పరిపాలించిన అనేక తెగలు ఈ నగరానికి పెద్ద సంఖ్యలో సాంస్కృతిక కట్టడాలను అందించాయి, వీటిలో మొహత్త పాలస్, నేషనల్ మ్యూజియం అఫ్ పాకిస్తాన్, ఎం‌ప్రెస్ మార్కెట్, ఫ్రేరే హాల్, జహంగిర్ కొఠారి పరేడ్, కరాచీ మునిసిపల్ కార్పోరేషన్ భవనం మరియు హిందూ జింఖానా ఉన్నాయి. ఈ నగరంలో క్లిఫ్టన్ బీచ్, ఫ్రెంచ్ బీచ్, సాండ్ స్పిట్ బీచ్ మరియు మనోర ఐలాండ్ వంటి కొన్ని అత్యంత ప్రసిద్ధ సముద్రతీరాలు కూడా ఉన్నాయి.

ఈ రాష్ట్రం సింధు నది హరివాణంగా కూడా ఏర్పడింది. ఇది ఈ రాష్ట్రంలో పెద్దసంఖ్యలో సరస్సులు ఏర్పడటానికి దారితీసింది. కొన్ని అత్యంత ప్రసిద్ధి చెందిన సరస్సులలో: కీన్ఝార్ సరస్సు, మంచార్ సరస్సు మరియు ఖైర్పూర్ లోని బక్రి వారో సరస్సు ఉన్నాయి . ఈ ప్రాంతంలో ఉన్న అనేక వన్యమృగాలకు కిర్థార్ నేషనల్ పార్క్ అభయారణ్యంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న థార్ ఎడారి దీనిని పంజాబ్ మరియు భారతదేశంతో కలుపుతుంది. గ్రేట్ రాన్ అఫ్ కచ్ ఈ రాష్ట్రంలో ఉన్న రక్షిత తడిభూమి. ఈ రాష్ట్రంలో రెండు వన్యమృగ కేంద్రాలు ఉన్నాయి: రాన్ అఫ్ కచ్ వైల్డ్ లైఫ్ సాన్క్చువరీ మరియు నారా డెజర్ట్ వైల్డ్ లైఫ్ సాన్క్చువరీ. వర్షాభావం వలన ఏర్పడిన కరువుల తీవ్రతను తగ్గించడానికి నిర్మించిన సుక్కుర్ బారేజ్ ఈ రాష్ట్రంలోని మరొక ప్రసిద్ధ గుర్తింపు చిహ్నం.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఆజాద్ కాశ్మీర్: రావలకోట్, ముజఫరాబాద్, జీలం లోయ, బాగ్, పూంచ్
 • బలూచిస్తాన్: జియారత్, బోలాన్ పాస్, మూలా పాస్, చోతోక్ జలపాతం

, మెహర్ గర్, ఖోజక్ పాస్

 • ఖైబర్-పఖ్తున్ఖ్వ : పెషావర్, ఖైబర్ పాస్, కోహాట్, బన్ను, మరదాన్, స్వాత్, మింగోరా, సైదు షరీఫ్, షాన్గ్లా జిల్లా, కలాం లోయ, చిత్రాల్, కలాష్, బ్రోఘిల్ పాస్, హరిపూర్, తర్బేల డాం, హవేలియా, అబ్బోత్తాబాద్, తండియని, మన్సేహ్ర, ఖాన్పుర్, నాతియగలి, దుంగాగలి, అయుబియా, కఘన్ లోయ, నరాన్ లోయ, బతగ్రాం
 • పంజాబ్: ముర్రీ, ఖోలిస్తాన్ ఎడారి, ఉచ్ షరీఫ్, ముల్తాన్, హరప్పా, పాక్ పట్టన్, లాహోర్, ఫోర్ట్ మన్రో, పంజ్ నాడ్, సాల్ట్ రేంజ్, రోహతాస్ కోట, తక్సిల, లాల్ సుహాన్ర నేషనల్ పార్క్
 • గిల్గిత్-బాల్టిస్తాన్ : చక్దర, దిగువ దిర్, ఎగువ దిర్, లోవరీ పాస్, ద్రోష్, చిత్రాల్, గరం చష్మా, కోహిస్తాన్ జిల్లా, బేషం, దాసు, చిలాస్, అస్తోర్ లోయ, నంగ పర్బత్, గిల్గిత్, పర్రి బంగ్లా, నల్తార్ లోయ, బాగ్రోట్-హరమోష్ లోయ, జుగ్లోట్, గషూ పహూట్, రామ ఇష్కోమన్, యాసిన్ లోయ, ఘిజార్, బాల్టిస్తాన్, స్కర్దు, దెయోసాయి నేషనల్ పార్క్, షిగర్, ఖపాలు బియఫో హిమానీనదం, సద్పార్ లాక్, షాన్గ్రిల్లా, K2 బేస్ కాంప్, K7, బ్రాడ్ పీక్, బ్రాక్వ్తోక్ ఖప్లు, గొండోగొరో-లా, మషేర్బ్రం, హుంజా, నగర్, గోజల్, చలత్, అలియాబాద్, కరిమాబాద్, అల్టిట్ ఫోర్ట్, గుల్మిట్, పస్సు, సోస్ట్, ఖున్జేరాబ్ పాస్
 • ఇస్లామాబాద్ : ఫైసల్ మాస్క్, మార్గల్లా హిల్స్, సిమ్లీ డాం, రావల్ సరస్సు
 • సింధ్: కరాచి, మొహెంజో-దారో, హైదరాబాద్, సెహ్వాన్ షరీఫ్, గోరఖ్ హిల్, మంచ్చార్ సరస్సు, కోట్ డిజి, కల్రి సరస్సు, భంబోర్, తట్టా

, చౌకుండి సమాధులు, మక్లి హిల్, కేతి బందర్, షాబందర్, జానీ బందర్, భాన్భోర్, గిడు బందర్.

చిత్రకళా ప్రదర్శన[మార్చు]

సూచనలు[మార్చు]

 1. Austin Bush. "Pakistan Travel Information and Travel Guide". Lonely Planet. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 2. "Tourism in Pakistan". 20 October 2005. సంగ్రహించిన తేదీ 5 April 2008. 
 3. పర్వతారోహణ పై PTDC పేజి[dead link]
 4. [www.pakistan.gov.pk/.../tourism.../Toruism(wup)(Folder-II).pdf]
 5. Windsor, Antonia (17 October 2006). "Out of the rubble". The Guardian (London). సంగ్రహించిన తేదీ 25 May 2010. 
 6. 2007 లో పాకిస్తాన్ లో జరగనున్న సంఘటనలు,పాకిస్తాన్ లో పర్యాటకం చే పత్రికలకు విడుదల చేయబడిన ప్రకటన[dead link]
 7. "Tourism Events in Pakistan in 2010". Tourism.gov.pk. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 8. "The road between China and Pakistan". Financial Times. 4 July 2009. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 9. పాకిస్తాన్ - యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్
 10. "Factors affecting tourism in Pakistan". Chowrangi.com. 15 August 2008. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 11. "Analysis Tourism Management In Pakistan" (PDF). సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 12. "Part I". Constitution of Pakistan. Ministry of Foreign Affairs, Government of Pakistan. Archived from the original on 11 August 2006. సంగ్రహించిన తేదీ 30 March 2010. 
 13. "Government of Balochistan: Tourist Attractions". Balochistan.gov.pk. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 14. "Tourist Guide For Baluchistan Pakistan". Rehmananwar.blogspot.com. 1 July 1977. Archived from the original on 8 July 2011. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 15. "Tourism Potential Investment Opportunities in Khyber Pakhtunkhwa". Khyberpakhtunkhwa.gov.pk. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 16. "Tourism Development Corporation of Punjab Official Website". Tdcp.gop.pk. 9 April 2010. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 17. "Ministry of Tourism: Punjab Attractions". Tourism.gov.pk. సంగ్రహించిన తేదీ 27 September 2010. 
 18. khalid. "Tourism in Punjab, Pakistan". Vista-tourism.com. సంగ్రహించిన తేదీ 27 September 2010. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Economy of Pakistan topics మూస:Pakistan topics మూస:Tourism in Asia