పెదవేగి
| ?పెదవేగి మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పెదవేగి |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
| గ్రామాలు | 27 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
81,355 (2001) • 41714 • 39641 • 68.64 • 73.17 • 63.87 |
పెదవేగి(Pedavegi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, అదే పేరున్న గ్రామము. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మండలాల్లో ఇది ఒకటి. పెదవేగి గ్రామము పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రము అయిన ఏలూరుకు 12 కి.మీ. దూరములో ఉన్నది.
విషయ సూచిక |
గ్రామం స్వరూపం, జనాభా [మార్చు]
జిల్లా కేంద్రం ఏలూరు నుండి గోపన్నపాలెం మీదుగా పెదవేగి చేరుకోవచ్చును. పెదవేగి గ్రామంలో 2,622 నివాసాలు ఉన్నాయి. జనాభా మొత్తం 11,608 (పురుషులు 6092, స్త్రీలు 5516). పెదవేగి మండలంలో నివాసాలు 19,347 జనాభా 81,355. ఇది మెరక ప్రాంతం. (కాలువల వంటి సదుపాయాలు లేవు). ప్రధానమైన వూరుతో బాటు గార్ల మడుగు, దిబ్బగూడెం లక్ష్మీపురం, దిబ్బగూడెం సెంటర్ వంటి శివారు గ్రామాలు జనావాస కేంద్రాలు. చాలా ఇండ్లు వూరిలో కేంద్రీకృతం కాకుండా తోటలలో విస్తరించి ఉంటాయి.
మండల వ్యవస్థ రావడానికి ముందు పెదపాడు బ్లాక్ (పంచాయితీ సమితి)లో ఒక వూరిగా, ఏలూరు తాలూకాలో పెదవేగి ఉండేది. తరువాత ఇది పెదవేగి మండల కేంద్రమైంది.
వ్యవసాయం, నీటి వనరులు [మార్చు]
పెదవేగి ప్రాంతంలో నేల అధికంగా ఎర్రచెక్కు నేల. పైన ఒకటి అడుగు వరకు ఇసుక ఉండి దాని క్రింద ఎర్రమట్టి, రాతినేల (గ్రావెల్) ఉంటాయి. ఇక్కడ ప్రధానముగా మెరక పంటలు - కొబ్బరి, నిమ్మ, బత్తాయి,కూరగాయలు, పామాయిల్, పుగాకు వంటి వ్యవసాయము ఎక్కువగా జరుగుతున్నది. ఒక పెద్ద చెరువు, మరి రెండు చిన్న చెరువులు (మిరపకుంట, ఏనుగు గుండం) ఉన్నాయిగాని, భూగర్భజలాలే ప్రధాన నీటివనరు. 1970 వరకు ఎక్కువగా బీళ్ళు, చిట్టడవులుగా ఉన్న ఈ ప్రాంతంలో కరెంటు సదుపాయము వల్ల వ్యవసాయం చాలా వేగముగా అభివృద్ధి చెందింది. అడవులతో పోటీపడే దట్టమైన తోటలు చుట్టుప్రక్కల కనువిందు చేస్తాయి.
1990ల వరకు పుగాకు, నిమ్మ, మామిడి, అరటి, కొబ్బరి, మొక్కజొన్న, కూరగాయలు కొద్దిపాటి వరి పంటలు మాత్రమే ఈ ప్రాంతంలో కనిపించేయి. తరువాతి కాలంలో రైతులు చొరవగా క్రొత్త పంటల ప్రయోగాలు మొదలు పెట్టారు. మల్బరీ తోటలతో పట్టు పురుగుల పెంపకం, పామాయిల్ తోటలు క్రొత్త మార్పులకు నాంది పలికాయి. ముందునుండి వేసే పంటలకు తోడుగా ఇప్పుడు పూల తోటలు, ఔషధి మొక్కలు, టేకు, జామాయిల్, పామాయిల్, కంది, మొక్క జొన్న, వేరుశనగ, కోకో, మిరియం, తమలపాకు, ప్రొద్దు తిరుగుడు వంటి రకరకాలైన తోటలు చూడవచ్చును. పెరుగుతున్న విద్య, వ్యాపార, రవాణా సౌకర్యాలు ఈ మార్పులకు సహకారం అందించాయి.
1960 నాటికి వూరిలో చెదురుమదురుగా వున్న మోటబావులు, చెరువులు మాత్రమే నీటివనరులు. తరువాత బోరులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. మొదటిలో 200 అడుగుల లోతులో పడే నీటికోసం ఇప్పుడు 1000 అడుగుల కంటే అధికంగా బోరు వేయవలసివస్తున్నది. దాదాపు అన్నీ 'సబ్మెర్సిబుల్' పంపులే. కనుక రైతులకిచ్చే ఉచిత విద్యుత్తు సౌకర్యం ఈ ప్రాంతం ఆర్ధిక వ్యవస్థపై బలమైన ప్రభావం కలిగి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా గోదావరి-కృష్ణా నదులను కలిపే కాలువ ఈ వూరి సమీపంనుండి వెళుతుంది. ప్రస్తుతం (2008లో) నిర్మాణంలో ఉన్న ఈ కాలువ ద్వారా నీటి సదుపాయం కలిగితే ఈ ప్రాంత వ్యవసాయంలో గణనీయమైన మార్పులు రావచ్చునని రైతులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో చాలా ప్రాంతాలలాగానే రైతులు అరకొర ఆదాయంతోను, వర్షాభావ పరిస్థితులతోను, అకాలవర్షాలతోను సతమతమవుతున్నారు. వ్యవసాయంపైన వచ్చే ఆదాయం నిలకడగా ఉండకపోవడం, పెట్టుబడులు, ఖర్చులు బాగా పెరిగిపోవడం వలన వ్యవసాయం గిట్టుబాటుగా ఉండడంలేదు. ఇందుకు తోడు కొద్దిమంది పెద్దరైతులను మినహాయిస్తే చాలా వరకు చిన్న చిన్న కమతాలు. ఈ పరిస్థితులలో చోటు చేసుకొన్న మరొక పరిణామం- స్థానికేతరుల పెట్టుబడులు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద తోటలను ఇతర పట్టణాలకు చెందిన సంపన్నులైన వ్యాపారులు, ఉద్యోగులు కొనుగోలు చేయడం జరిగింది. కనుక స్థానికుల స్వంతమైన భూమి విస్తీర్ణం క్రమంగా తరుగుతున్నది. - దీని వలన వూరిలోకి గణనీయమైన పెట్టుబడి వస్తున్నది. కార్పొరేట్ వ్యవసాయం పోకడలు కనిపిస్తున్నాయి. కాని రైతులకు భూమితో ఉన్న అనుబంధం పలుచబడుతున్నది.
సదుపాయాలు [మార్చు]
రవాణా [మార్చు]
జిల్లా కేంద్రానికి దగ్రరలోనే ఉన్నందున పెదవేగి గ్రామానికి ఏలూరు పట్టణానికి మధ్య ప్రయాణ సదుపాయాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం మండలంలో దాదాపు అన్ని గ్రామాలూ మంచి తారు రోడ్లతో కలుపబడి ఉన్నాయి. గట్టి నేల కావడంతో రోడ్లు బాగానే ఉంటాయి. (త్వరగా పాడవ్వవు).
1970కి ముందు తారు రోడ్లు లేవు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపన్నపాలెం అతి దగ్గరి బస్ స్టాప్‌గా ఉండేది. అక్కడికి వెళ్ళి ఏలూరుకు బస్సు ఎక్కవలసి వచ్చేది. (తడికలపూడి, జంగారెడ్డిగూడెంలనుండి ఏలూరుకు వెళ్ళే బస్సులు). అప్పటిలో సైకిళ్ళు, ఎడ్లబండ్లు మాత్రమే ముఖ్యమైన ప్రయాణ సాధనాలు. గోపన్నపాలెంనుండి ఏలూరుకు జట్కా బళ్ళు కూడా నడిచేవి. రోజువారీ పట్టణంలో పాలు అమ్ముకొనేవారు సైకిల్‌పై వెళ్ళేవారు. చుట్టుప్రక్కల అడవులలో కట్టెలు కొట్టుకొని అమ్ముకొనేవారు ఏలూరువరకు నడచివెళ్ళి అమ్ముకొనేవారు. మగవారు కావిళ్లలాగా మోపులు కట్టుకొని, ఆడువారైతే నెత్తిమీద మోపు పెట్టుకొని వెళ్ళేవారు. కూరగాయలు, మామిడికాయలు వంటి పంటలు అమ్ముకోవడానికి ఎడ్లబళ్ళే ముఖ్య రవాణా సాధనాలు. వైద్యం వంటి అవసరాలకు నడచి, లేదా కలిగినవారు ఎడ్లబళ్ళు కట్టుకొని పట్టణానికి వెళ్ళేవారు. ఏలూరులో చదువుకొనే కుర్రాళ్ళు సైకిల్‌పై వెళ్ళేవారు. ఆ రూటులో ఒకటి రెండు మోటర్ సైకిళ్ళు మాత్రం వెళుతూ ఉండేవి.
షుమారు 1973 ప్రాంతలో మొట్టమొదటి ప్రైవేటు బస్సు ఈ రూటులో నడవడం మొదలయ్యింది. ఏలూరు నుండి గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా రంగాపురం వరకు బస్సు వెళ్ళేది. తరువాత మరో బస్సు జీలకర్రగూడెం వరకు ఉండేది. క్రమంగా ఆరు బస్సులయ్యాయి. ఈ బస్సులు క్రిక్కిరిసి ఉండేవి. బస్సులోపలా, టాపు పైనా, వెనుక నిచ్చెన మీద నుంచుని కూడా ప్రయాణాలు చేసేవారు. ఆ బస్సులను 1742 (రిజిస్ట్రేషన్ నంబరును బట్టి), 6565 (రిజిస్ట్రేషన్ నంబరును బట్టి), కూచింపూడి (వూరునుబట్టి), లేలాండ్ (తయారీ బట్టి) - ఇలాంటి పేర్లతో పిలిచేవారు. షుమారు 1995 సమయంలో గవర్నమెంట్ (ఆర్.టి.సి.) బస్సులు ప్రారంభమయ్యాయి. వీటికీ ప్రైవేటు బస్సులకూ గట్టి పోటీ ఉండేది. క్రమంగా ప్రైవేటు బస్సుల సర్వీసులు నిలిపివేశారు. 1742 బస్సును కూరగాయలు రవాణా చేసే ట్రాన్స్‌పోర్ట్ సర్వీసుగా మార్చారు.
ప్రస్తుతం (2008లో) ఏలూరు నుండి పెదవేగి (దిబ్బగూడెం వరకు మాత్రమే) సిటీ బస్సు సదుపాయం కూడా ఉంది. ఆర్.టి.సి. బస్సులు నడుస్తున్నాయి. కాని రాష్ట్రమంతటిలో లాగానే బస్సుల వినియోగం బాగా తగ్గింది. సైకిళ్ళు కూడా చాలా అరుదుగా వాడుతున్నారు. స్తోమతు కలిగినవారు బళ్ళు (మోటర్ సైకిళ్ళు) వాడుతున్నారు. అత్యధికులు షేరింగ్ (సర్వీస్) ఆటోల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఆటోల ద్వారా ప్రయాణం ఏలూరు పట్టణానికి, చుట్టుప్రక్కల గ్రామాలకు మాత్రమే పరిమితం కాదు. రోజువారీ పొలంలో కూలి పనులకు వెళ్ళే శ్రామికులకు ఇది ముఖ్యమైన ప్రయాణ విధానం. ఏలూరు వెళ్ళే సర్వీస్ ఆటోలో షుమారుగా 8 మంది ప్రయాణం చేస్తారు. కాని పొలాలకు వెళ్ళే ఆటోలలో 10 నుండి 20 మంది వరకు ఎక్కడం సాధారణం. దాదాపు ప్రతి ఆటో డ్రైవరూ కస్టమర్లతోనూ, సహ ఆటో డ్రైవర్లతోనూ సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడుతూ తన సర్వీసులను ప్లాన్ చేసుకొంటాడు.
విద్య [మార్చు]
మండల కేంద్రమైనా పెదవేగి ప్రాంతంలో విద్యావకాశాలు అంతగా అభివృద్ధి కాలేదనే చెప్పాలి. వూరిలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూలు ఇటీవలికాలంలో హైస్కూలుగా మఅర్చారు. క్రొత్త భవనం నిర్మాణం కూడా 2007లో దాదాపు పూర్తి అయ్యింది. శివారు గ్రామాలైన గార్లమడుగు, కూచింపూడి(1984)ముక్కు బులలో పది సంవత్సరాల ముందునుండీ హైస్కూళ్ళు ఉన్నాయి. దిబ్బగూడెంలో ఒక ప్రాధమిక పాఠశాల ఉంది. ప్రైవేటు రంగంలో ఇటీవలి కాలంలో ఒక కాన్వెంటు (అక్కల నాగరాజు స్కూలు), ఒక మిషనరీ విద్యాలయం వచ్చాయి. సోమవరప్పాడులోని జె.ఎమ్.జె.కాన్వెంటులో కొందరు చదువుకొంటున్నారు. ఉన్నత విద్యకు, కాస్త నాణ్యమైన ప్రాధమిక విద్యకు తమ పిల్లలను ఏలూరులోనే చదివించడానికి ఎక్కువమంది ఇష్టపడుతారు. అవకాశం ఉన్నవారు తమ పిల్లలను ఏలూరులో అద్దెఇళ్ళలోను, లేదా హాస్టళ్ళలోను ఉంచి చదివించడం జరుగుతుంది. స్తోమత లేని చాలా మంది తమ పిల్ల చదువులను ప్రాధమిక విద్యతోనే ఆపివేయడం జరుగుతున్నది.
వైద్యం [మార్చు]
చాలా కాలంగా వూళ్ళలోని ఒకరిద్దరు ఆర్.ఎమ్.పి. వైద్యులు చుట్టుప్రక్కల గ్రామాలలో అత్యవసర వైద్య సదుపాయం అందించేవారు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉంది. కాని ముఖ్యమైన చికిత్సావసరాల కోసం ఏలూరు వెళ్ళక తప్పదు. ఇటీవల పెరిగిన ప్రయాణ సదుపాయాల వలన అది అంత కష్టం కావడంలేదు.
వ్యాపారం [మార్చు]
వూరిలో వ్యాపారం నిత్యావసర సరుకులను అందించేంతవరకు లభిస్తున్నది. కాని అధికంగా కొనుగోళ్ళు ఏలూరు పట్టణంలో చేస్తారు. చాలా గ్రామాలలాగానే పచారి సరుకులు, కాఫీ హోటళ్ళు, కిళ్ళీకొట్లు, మందుల షాపులు, మంగలి షాపులు, సైకిల్ షాపులు కనిపిస్తాయి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే ఈ వూరిలో ఉత్పాదన అయ్యే సరుకుల వ్యాపారం ఇక్కడ ఏమీ కనిపించదు. అలాగే ఇక్కడి వ్యవసాయానికి అవసరమయ్యే సరుకుల అమ్మకం కూడా ఇక్కడ కనిపించదు. వారం వారం ఒక సంత జరుగుతున్నది.
ఇతరాలు [మార్చు]
మండల కేంద్రమైనందున పెదవేగి గ్రామంలో మండల ఆఫీసులు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు బ్రాంచి ఉంది. పెదవేగిలో ఒక పోస్టాఫీసు బాగా ముందుకాలంనుండి (1970కి ముందే) ఉంది. పిన్ కోడ్ 534450 (గోపన్నపాలెం). దూరవాణి కేంద్రం ద్వారా ఇప్పుడు టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు లభిస్తున్నాయి. దేశమంతటి లాగానే సెల్ ఫోనుల వినియోగం బాగా పెరిగింది.
దిబ్బగూడెం సెంటరులో ఒక సినిమాహాలు ఉన్నది (షుమారు 1995 సంవత్సరంలో కట్టారు. 2008లో మూసివేశారు). వినోదానికి కేబుల్ టెలివిజన్ ద్వారా లభించే ప్రసారాలదే అగ్రస్థానం.
పెదవేగి దగ్గరలో (ముండూరు, ఏడోమైలు దగ్గర) ఒక పాతకాలం విమానాశ్రయం ఉంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో సైన్యం అవసరాలకోసం నిర్మించబడింది. తరువాత దీని వినియోగం లేదు. ఖాళీ స్థలంగా ఉండేది. ఇప్పుడు ఈ స్థలంలో జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు.
ఆలయాలు [మార్చు]
పెదవేగి గ్రామంలో శివాలయం చాలా పురాతనమైనది. గర్భగుడి మాత్రమే ఆ కాలానికి చెందినది. చుట్టూరా ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు. వూరిలో ఒక చిన్న బ్రహ్మంగారిగుడి ఉంది. శివారు గ్రామాలలో చిన్నచిన్న గుళ్ళు ఉన్నాయి. గార్ల మడుగులో ఒక సాయిబాబా గుడి ఉంది. విమానాశ్రయం వద్ద (లక్ష్మీపురం తోటలలో) ఒక చక్కని సాయిబాబా గుడి ఉంది. అక్కడ వెయ్యి అడుగుల సాయి స్తూపం ఉంది. పెదవేగి, గోపన్నపాలెం రొడ్డుమీద పెద్ద రావిచెట్టు క్రింద నాగేంద్ర స్వామి, హనుమంతుడు విగ్రహాలుండేవి. 2005 తరువాత అక్కడ ఒక ఆలయంలా నిర్మించి నాగాంజనేయ స్వామి మందిరం అని పిలుస్తున్నారు.
దిబ్బగూడెం సెంటరులో ఒక మసీదు ఉంది. క్రైస్తవులు ఎక్కువగా నివశించే గూడెంలలో చర్చిలు ఉన్నాయి.
పెదవేగి చుట్టుప్రక్కల గ్రామాలలో జరిగే రాట్నాలమ్మ తల్లి జాతర (రాట్నాలకుంట), అచ్చమ్మ పేరంటాళ్ళ తిరుణాలు (గాలాయగూడెం), బలివే జాతర (బలివే) ఈ ప్రాంతంలో ముఖ్యమైన ఉత్సవాలు.
పరిశ్రమలు [మార్చు]
సహకార పామాయిల్ కర్మాగారము ఈ వూరిలోనే ఉన్నది. ఊరిలో ఒక బ్యాంకు, ఒక ప్రాధమిక పాఠశాల, ఒక ప్రాధమిక ఆరోగ్యకేంద్రము ఉన్నాయి. ఇక్కడ శివాలయము చాలా ప్రాచీనమైనది. క్రొత్తగా కట్టిన బ్రహ్మంగారి గుడి ఉంది. చర్చి, మసీదు ఉన్నాయి.
భారత ప్రభుత్వము, పెదవేగిలో జాతీయ పరిశోధనా కేంద్రము (పామ్ ఆయిల్)ను నెలకొల్పింది. ఈ కేంద్రములో పామాయిల్ సాగులోని ఆధునిక మెళుకువలలో రైతులకు శిక్షణ ఇస్తారు.[1]
చరిత్ర [మార్చు]
పెదవేగి ప్రస్తుతము ఒక చిన్న గ్రామము గాని, దీనికి ప్రముఖమైన చరిత్ర ఉన్నది. వేంగి రాజ్యం ఆంధ్రుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు.
పెదవేగి సమీపంలో జీలకర్రగూడెం, కంఠమనేనివారిగూడెం వంటి ప్రాంతాలలో క్రీ.పూ. 200 నాటి బౌద్ధారామ అవశేషాలు బయల్పడినందువలన శాతవాహనుల, ఇక్ష్వాకుల, కాలం నాటికే ఇది ఒక ముఖ్యమైన నగరం అయి ఉండే అవకాశం ఉంది. 4వ శతాబ్దంలో ఇక్ష్వాకుల సామ్రాజ్యం (విజయ పురి శ్రీపర్వత సామ్రాజ్యం) పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. అంతకు పూర్వం క్రీ.శ.140 కాలంలో గ్రీకు చరిత్ర కారుడు టాలెమీ వేంగి నగరం శాలంకాయనుల రాజధాని అని వర్ణించాడు. విష్ణుకుండినుల కాలంలోను, తూర్పు చాళుక్యుల ఆరంభ కాలంలోను ఆంధ్ర దేశానికి రాజకీయంగాను, సాంస్కృతికంగాను వేంగిపురం ఒక ప్రధానకేంద్రంగా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.[2]
- బృహత్పలాయనులు - ఇక్ష్వాకుల తరువాతి కాలం (క్రీ.శ.300) - వేంగినగరం వారి రాజధాని.
- శాలంకాయనులు - క్రీ.శ. 300 - 420 మధ్యకాలం - వేంగినగరం వారి రాజధాని. వీరిలో హస్తివర్మ సముద్రగుప్తుని సమకాలికుడు.1వ మహేంద్రవర్మ అశ్వమేధయాగం చేశాడని అంటారు. శాలంకాయనులు పాటించిన చిత్రరధస్వామి (సూర్యుడు) భక్తికి చెందిన ఆలయము యొక్క శిధిలాలు పెదవేగిలో బయల్పడ్డాయి.[3][4]
- విష్ణుకుండినులు, పల్లవులు - క్రీ.శ. 440 - 616 - వీరి రాజధాని వినుకొండ. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
- తూర్పు చాళుక్యులు - పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం తెలుగుభాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు తెలుగును అధికార భాషగా స్వీకరించి దాని ప్రగతికి పునాదులు వేశారు. వేంగి రాజ్యంలో రాజమహేంద్రవరం ఒక మణిగా వర్ణించబడింది. క్రమంగా తూర్పు చాళుక్యులు తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.
పురావస్తు పరిశొధన త్రవ్వకాలలో పెక్కు శిధిలాలు బయట పడినాయి. వీటిలో ఒక మంటపము ఉన్నది.
త్రవ్వకాలు [మార్చు]
పూర్వము పెదవేగిని వేంగీపుర అని పిలిచేవారు. పెదవేగిలోని ధనమ్మ దిబ్బ వద్ద జరిపిన త్రవ్వకాలలో దిబ్బ మధ్యన పెద్ద రాతి కట్టడము బయల్పడినది. దీనిని ఒక బౌద్ధ స్థూపముగా గుర్తించారు.
ఆ ప్రదేశములో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన నంది, పూసలు, కర్ణాభరణాలు మరియు పాచికలు కూడా ఉన్నవి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే నగర దేవత అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తున్నది.[5] చాలా శిల్పాలను శివాలయంలోని వరండాలో ఉంచారు.
సాహిత్యంలో పెదవేగి [మార్చు]
కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తమ "ఆంధ్ర ప్రశస్తి" ఖండ కావ్యములో "వేంగి క్షేత్రము" అనే కవితలో ఈ స్మృతులగురించి చక్కగా వర్ణించినాడు. వాటిలో మచ్చుకు రెండు పద్యాలు...
ఇట వేగీశుల పాదచిహ్నములు లేవే! లేవుపో: భావనా
స్ఫుట మూర్తిత్వమునైన బొందవు, నెదో పూర్వాహ్ణ దుష్కాలపుం
ఘటికల్ గర్భమునందిముడ్చుకొనియెం గాబోలు, నీ పల్లెచో
టట లోకాద్భుత దివ్య దర్శనమటే! యాభోగమేలాటిదో!
వేగిరాజ్యపు పల్లెవీధుల జెడుగుళ్ళ రిపుల గవ్వించు నేరుపుల దెలిసి
ఎగురుగోడీబిళ్ళ సొగసులో రిపుశిరస్సు బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పు దెచ్చిననాడె శాత్రవ వ్యూహముల్ పగిలించు నొరపు గఱచి
కోతికొమ్మచ్చిలో కోటగోడల నెగబ్రాకి లంఘించు చంక్రమణమెరిగి
తెనుగు లంతప్డె యవి నేర్చుకొనియ యుందు
రెన్నగా తెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గు పాలతో రంగరించి
బొడ్డు కోయని కూనకే పోయుదురట!
గ్రామాలు, జనాభా [మార్చు]
| వూరు | నివాసాలు | జనాభా | పురుషులు | స్త్రీలు |
| పెదవేగి మండలం | 19347 | 81355 | 41714 | 39641 |
| బాపిరాజుగూడెం | 901 | 3729 | 1904 | 1825 |
| కొండలరావుపాలెం | 421 | 1513 | 753 | 760 |
| రాయన్నపాలెం | 1099 | 4480 | 2259 | 2221 |
| న్యాయంపల్లి | 460 | 1928 | 988 | 940 |
| రామసింగవరం | 1674 | 7230 | 3734 | 3496 |
| తాళ్లగోకవరం | 401 | 1679 | 865 | 814 |
| వేగివాడ | 1035 | 4403 | 2205 | 2198 |
| బత్తెవరం | 133 | 654 | 340 | 314 |
| కే.కన్నాపురం | 298 | 1295 | 680 | 615 |
| చక్రాయగూడెం | 296 | 1283 | 642 | 641 |
| ముండూరు | 1034 | 4338 | 2195 | 2143 |
| పెదవేగి (గ్రామం) | 2622 | 11608 | 6092 | 5516 |
| ముత్తనవీడు | 442 | 1779 | 889 | 890 |
| మైలవరపువారిగూడెం | 14 | 51 | 20 | 31 |
| నడిపల్లి (పెదవేగి) | 434 | 1832 | 982 | 850 |
| విజయరాయి | 996 | 4035 | 2042 | 1993 |
| అల్లివీడు | 10 | 36 | 20 | 16 |
| జగన్నాధపురం | 1041 | 4206 | 2177 | 2029 |
| కవ్వగుంట | 514 | 2188 | 1104 | 1084 |
| వంగూరు | 541 | 2200 | 1109 | 1091 |
| పినకడిమి | 520 | 2251 | 1109 | 1142 |
| బీ.సింగవరం | 258 | 1118 | 563 | 555 |
| కొప్పాక | 2446 | 10116 | 5221 | 4895 |
| భోగాపురం | 565 | 2228 | 1130 | 1098 |
| దుగ్గిరాల | 726 | 3320 | 1756 | 1564 |
| గోకినపల్లి | 201 | 791 | 412 | 379 |
| దొండపాడు | 265 | 1064 | 523 | 541 |
- మరి కొన్ని గ్రామాలు
(పై జనాభా లెక్కలలో ఇతర గ్రామాలలో కలిపివేయబడినవి)
- గార్లమడుగు
- దిబ్బగూడెం లక్ష్మీపురం
- పెదకడిమి
- కూచింపూడి
- రాజాంపాలెం (నిర్జన గ్రామము)
- అంకన్నగూడెం (పెదవేగి మండలం)
- రాట్నాలకుంట
- జానంపేట - విజయరాయి వద్ద
ఇవికూడా చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ http://www.aphorticulture.com/oilpalm_D.htm
- ↑ The Ancient City of Vengipura : Archaeological Excavations at Peddavegi/I.K. Sarma. Delhi, Book India Publishing Co., 2002, xviii, 118 p., 33 figs., 53 plates, $72. ISBN 81-85638-15-2. https://www.vedamsbooks.com/cgi-bin/main.cgi?no31025.htm (Vijaya Vengipura was a flourishing city in ancient Andhra after the decline of Sriparvata Vijayapuri of the Ikshvaku dynasty by about 4 century A.D. Infact Ptolemy (140 A.D.), refers to Vengi as the capital city of the Salankayanas. During the Vishnukundi and early Eastern Chalukyan rule Vengipura played a crucial role as a political centre as well as a great cultural capital of Andhradesa)
- ↑ D. R. Bhandarkar Volume By Devadatta Ramakrishna Bhandarkar, Bimala Churn Law పేజీ.216 [1]
- ↑ Sculptural Heritage of Andhradesa By Mohan Lal Nigam పేజీ.35 [2]
- ↑ http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html
- ↑ http://www.westgodavari.org/Census%20Htm/Pedavegi.htm
బయటి లింకులు [మార్చు]
|
|||||||
|
|
|
|---|---|
| బాపిరాజుగూడెం • కొండలరావుపాలెం • రాయన్నపాలెం • న్యాయంపల్లి • రామసింగవరం • తాళ్లగోకవరం • వేగివాడ • బత్తెవరం • కే.కన్నాపురం • చక్రాయగూడెం • ముండూరు • పెదవేగి (గ్రామం) • ముత్తనవీడు • మైలవరపువారిగూడెం • నడిపల్లి • విజయరాయి • అల్లివీడు • చ జగన్నాధపురం • కవ్వగుంట • వంగూరు • పినకడిమి • బి.సింగవరం • కొప్పాక • భోగాపురం • దుగ్గిరాల • గోకినపల్లి • దొండపాడు • పెదకడిమి • కూచింపూడి • రాట్నాలకుంట • రాజాంపాలెం • జానంపేట |