ఫాలన్ దాఫ

వికీపీడియా నుండి
(ఫాలన్‌ దాఫ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఫాలన్‌ గాంగ్‌/ ఫాలన్‌ దాఫ. ఫాలన్‌ గాంగ్‌ పదం అభ్యాసానికి వర్తిస్తే, ఫాలన్‌ దాఫ ప్రబోధానికి వర్తిస్తుంది. పాశ్చాత్య దేశాలలో అనేక కొత్త మతాలు పుట్టినట్లు, ఆసియా ఖండంలోనూ కొన్ని కొత్త విశ్వాసాలూ, మతాలూ ఉద్భవించాయి. చైనాలో 20 వ శతాబ్ది చివరి దశకంలో పుట్టి, ఇంటర్నెట్‌ పుణ్యాన అతి వేగంగా ప్రపంచవ్యాప్తమైన కొత్త ఆధ్యాత్మిక ఉద్యమం ‘ఫాలన్‌ గాంగ్‌’. ఇది ఒక మతం కాదనీ, ఒక విద్య వంటిదనీ దానిని అనుసరిస్తున్న వారు అంటారు. లీ హాంగ్‌ ర ఈ ఉద్యమ వ్యవస్థాపకుడు. అతడు పుట్టింది 1951లోనో, 1952లోనో. బుద్ధిజం, కన్ఫ్యూసియనిజం, టావోయిజం సంప్రదాయాల నుంచీ, చైనా జానపదుల విజ్ఞానం నుంచీ సేకరించిన కొన్ని విద్యలను కలిపి ‘లీ’ ఈ కొత్త విద్యను రూపొందించాడు. ఇందులో భారతీయుల యోగాభ్యాసం వంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని ఆచరించినందువల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉండి, ఆధ్యాత్మిక సాధనలో పురోగమనం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్‌ వల్ల ఈ భావన చాలా వేగంగా వ్యాపించింది. ఈ విద్యను అభ్యాసం చేయడం వల్ల తమ ఆరోగ్యం బాగుపడిందని భావించిన వారు మరి కొందరికి నేర్పి, ఉద్యమం వ్యాపించడానికి తోడ్పడ్డారు. ఇదొక వ్యక్తి ఆరాధనగా, కొత్త ‘గురు సంప్రదాయం’గా స్థిరపడుతున్నదని భావించిన చైనా ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నిషేధించి, ‘లీ’ని అదుపు చేయడానికి ప్రయత్నించింది. కాని, అతడు అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఈ ఉద్యమాన్ని అనుసరిస్తున్న వారిపై కమ్యూనిస్టు ప్రభుత్వం దారుణ హింసాకాండ అమలు జరిపిందని ఫాలన్‌ గాంగ్‌ శిష్య గణాలు తమ వెబ్‌సైట్‌లో బొమ్మలతో సహా ప్రచారం చేశారు, ఇంకా చేస్తున్నారు. చైనా ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ విద్యను అభ్యసించి పాటించేవారి సంఖ్య ఇరవై నుంచి ముప్పది లక్షల వరకు ఉంటుంది. ‘లీ’ వర్గీయులు మాత్రం తమ సంఖ్య ఏడు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉంటుందని అంటారు. ఫాలన్‌ గాంగ్‌ అంటే ‘ధర్మ చక్ర’ అభ్యాసం అని అర్థం. భారతీయ యోగ శాస్త్రంలో వలెనే మూలాధారం నుంచి సహస్రారం వరకు చక్రాలు ఉంటాయనీ, అందులో పొత్తికడుపు ప్రాంతంలో ఉండే చక్రంలో (మూలాధారం) చైతన్యం తీసుకొని రావడం ద్వారా సాధన పురోగమిస్తుందనీ ఉద్యమ నిర్వాహకులు అంటారు. చక్రాల నుంచి ఉద్భవించే శక్తిని చైనీయుల భాషలో ‘చీ’ (Qui) అంటారు.

  • [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ]
"https://te.wikipedia.org/w/index.php?title=ఫాలన్_దాఫ&oldid=3487450" నుండి వెలికితీశారు