బాపూ నాదకర్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాపూ నాదకర్ణి

రమేష్‌చంద్ర గంగారాం బాపూ నాదకర్ణి అనే పూర్తి పేరు కలిగిన బాపూ నాదకర్ణి (Rameshchandra Gangaram 'Bapu' Nadkarni) 1933, ఏప్రిల్ 1న మహారాష్ట్ర లోని నాసిక్ లో జన్మించాడు. ఇతడు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అత్యంత పొదౌపైన బౌలింగ్ వేయడంలో ఇతను ప్రసిద్ధిగాంచాడు.

క్రీడా జీవితం[మార్చు]

1950-51 లో పూనా విశ్వవిద్యాలయం తరఫున రోహింటన్ బారియా ట్రోఫిలో తొలిసారిగా ఆడినాడు. ఆ తదుపరి సంవత్సరం మహారాష్ట్ర తరఫున తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినాడు. రెండు సంవత్సరాల అనంతరం ముంబాయి లోని బ్రబోర్న్ స్టేడియంలో తొలి శతకాన్ని నమోదు చేయగలిగినాడు. 1955-56 లో న్యూజీలాండ్ పై ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి టెస్ట్ ఆడి ఆరంగేట్రం చేశాడు. ఆ టెస్టులో ఇతనికి స్థానం ఇవ్వడానికి వినూ మన్కడ్ ను తప్పించవలసి వచ్చింది. ఆ టెస్టులో 68 (నాటౌట్) పరుగులు సాధించిననూ బౌలింగ్‌లో 57 ఓవర్లు వేసిననూ ఒక్క వికెట్టు కూడా దక్కలేదు. మన్కడ్ మళ్ళీ జట్టులోకి రావడంతో ఇతను జట్టువెలుపలికి వచ్చి అదే సంవత్సరం మహారాష్ట్ర రంజీ జట్టుకు నాయకత్వం వహించాడు.

పొదుపైన బౌలింగ్‌లో రికార్డు[మార్చు]

నాదకర్ణి బౌలింగ్‌లో వికెట్లు తీయడంలో కన్నా పొదుపైన బౌలింగ్‌లో ప్రసిద్ధి చెందినాడు. సగటున ఓవర్‌కు 2.00 పరుగుల కంటే తక్కువ ఇచ్చాడు. 1963-64 లో ఇంగ్లాండు పై చెన్నై లో జరిగిన టెస్టులో మూడవ రోజు 29 ఓవర్లు వేసి వికెట్లు ఏమీ సాధించకున్ననూ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో 26 ఓవర్లు ఉండటం గమనార్హం. ఆ ఇన్నింగ్సులో అతని బౌలింగ్ విశ్లేషణ 32-27-5-0. అందులో వరుసగా 21 మెయిడిన్ ఓవర్లు (131 వరుస బంతుల్లో పరుగులు ఇవ్వలేదు) ఉండటం విశేషం.[1]

1964-65 లో ఆస్ట్రేలియా పై చెన్నై లో రెండు ఇన్నింగ్సులలోను ఐదేసి వికెట్లు (5/31, 6/91) సాధించాడు. అప్పుడే బిషన్ సింగ్ బేడి జట్టులో వెలగడంతో ఇతని అవకాశాలు సన్నగిల్లాయి. 1967 లో ఇంగ్లాండు పర్యటనలో ఇతడిని జట్టు నుంచి తొలిగించారు. ఆ తరువాత న్యూజీలాండ్ తో టెస్ట్ ఆడి వెల్లింగ్టన్ టెస్టును తన బౌలింగ్‌తో (6/43) గెలిపించాడు. ఇదే అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ. ఆ పర్యటన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

నాదకర్ణి మొత్తం 41 టెస్టులు ఆడి 29.07 సగటుతో 88 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను ఒక సారి తీసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 43 పరుగులకు 6 వికెట్లు. బ్యాటింగ్‌లో 25.70 సగటుతో 1414 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ 7 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 122 నాటౌట్.

మూలాలు[మార్చు]

  1. Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. pp. 124–125. ISBN 978-1-84607-880-4.

బయటి లింకులు[మార్చు]