బాలల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలల దినోత్సవం
బాలల దినోత్సవం
బాలల దినోత్సవం వికీపీడియా లోగో
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా
రకంఅంతర్జాతీయం
జరుపుకొనే రోజునవంబర్ 14
సంబంధిత పండుగఅంతర్జాతీయ పురుషుల దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఫాదర్స్ డే, మదర్స్ డే, పేరెంట్స్ డే
ఆవృత్తిసంవత్సరం

అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.

భారతదేశంలో[మార్చు]

భారత దేశాన్ని దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్‌లాల్‌ నెహ్రూ సొంతం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషువారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాధించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిజేశారు. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే... నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు.[1]

చరిత్ర - లక్ష్యం[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1954కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు.[2][3] 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ చిల్డ్రన్స్‌ డే లక్ష్యం.[4]

వివిధ దేశాల్లో[మార్చు]

బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది.

  1. చైనాలో జూన్‌ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచివున్నా తరగతులు జరగవు.
  2. పాకిస్తాన్‌లో నవంబర్‌ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు.
  3. జపాన్‌లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో వున్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటుచేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు.
  4. దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున ఇక్కడ పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు.
  5. పోలాండ్ లో జూన్‌ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆరోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
  6. శ్రీలంకలో అక్టోబర్‌ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు.

మూలాలు[మార్చు]

  1. తెలుగు వెబ్ దునియా, బాలప్రపంచం. "చాచాజీ పుట్టినరోజు.. బాలల దినోత్సవం". telugu.webdunia.com. Retrieved 12 November 2017.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 November 2019). "బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత". www.andhrajyothy.com. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
  3. ఆంధ్రభూమి, మెయిన్ ఫీచర్ (19 November 2019). "బాలల హక్కులను కాపాడుదాం." www.andhrabhoomi.net. డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి. Archived from the original on 7 డిసెంబరు 2019. Retrieved 7 July 2020.
  4. డే సెలబ్రేషన్స్ బ్లాగ్. "బాలల దినోత్సవం ,Children's Day". daycelebrations.blogspot.in. Dr. Seshagirirao, MBBS. Archived from the original on 14 నవంబరు 2017. Retrieved 12 November 2017.