బుర్రిపాలెం బుల్లోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుర్రిపాలెం బుల్లోడు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం బీరం మస్తాన్ రావు
నిర్మాణం కె.విద్యాసాగర్
రచన జంధ్యాల, సత్యానంద్
తారాగణం కృష్ణ,
శ్రీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ తిరుపతి ఇంటర్నేషనల్
పంపిణీ నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థ
భాష తెలుగు

బుర్రిపాలెం బుల్లోడు సినిమా బీరం మస్తాన్‌ రావు దర్శకత్వంలో కె. విద్యాసాగర్ నిర్మాణంలో ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా రూపొందిన 1979 నాటి తెలుగు చలన చిత్రం. ఇది బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించిన తొలి సినిమా. నిర్మాత విద్యాసాగర్ మస్తాన్ రావుకు తొలి సినిమా అవకాశం ఇస్తామన్నాకా ఆయనకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో మస్తాన్ రావు చొరవ తీసుకుని ఓ తమిళ చిత్రం డబ్బింగ్ చేయించి లాభాలు రప్పించారు. దాంతో ఈ సినిమా ప్రారంభమైంది. మొదట కష్మేవాదే అన్న హిందీ సినిమాను కృష్ణ, జయప్రద జంటగా పునర్నిర్మిద్దామని భావించారు. అయితే ఆ సినిమా తెలుగు హక్కులున్న సుందర్ లాల్ నహతా, ఆయన కుమారుడు శ్రీకాంత్ మొదట రూ.60వేలకు ఇస్తామన్నారు. తర్వాత తామే స్వయంగా తీస్తామని మాట మార్చడంతో కథానాయికగా చేస్తానన్న జయప్రద కూడా వెనక్కితగ్గారు.
కృష్ణ ఇచ్చిన కాల్షీట్లు చేజారిపోకుండా ఆయనకు నచ్చే మరో రీమేక్ కథ వెతికి తెద్దామని ఆఖరి ఆరురోజుల వ్యవధిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ క్రమంలో మస్తాన్ రావు అనుకున్న చిన్న లైను నచ్చడంతో రచయితలు జంధ్యాల, సత్యానంద్ ఈ కథగా అభివృద్ధి చేశారు. ఆ కథనే కృష్ణకు వినిపించి ఒకే చేసుకున్నారు. జయప్రద ఆఖరి నిమిషం వరకూ తేల్చకపోతూండంతో శ్రీదేవికి ఈ కథ చెప్పారు. వారిద్దరి డేట్స్ కూడా కుదరకపోతూండడంతో అడ్జస్ట్ చేసి చిత్రీకరణ పూర్తిచేశారు.
సినిమా విడుదలకు ముందు కూడా పంపిణీదారులు క్లైమాక్స్ పూర్తిగా తొలగించేస్తామన్నారు, ఆ సమస్య కూడా దాటుకుని విడుదల చేశారు. సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా చివరకు ఘన విజయం సాధించింది. పూర్తిస్థాయి కామెడీగా సినిమా ఆద్యంతం నవ్వించడమే కాక, కృష్ణ, శ్రీదేవిలతో చేయించిన విభిన్నమైన నృత్యాలు ప్రేక్షకాదరణ పొందాయి.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

జగ్గయ్య, వరప్రసాదరావు, కె.బాపయ్య, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకుల సినిమాల్లో దర్శకత్వ శాఖలో పనిచేసిన బీరం మస్తాన్‌ రావుకు దర్శకునిగా ఇది తొలి చిత్రం. సాహసవంతుడు సినిమాకు కో-డైరెక్టర్ గా మస్తాన్ రావు పనిచేస్తున్నప్పుడు ఆయనకు ఆ చిత్ర నిర్మాత కె.విద్యాసాగర్ తర్వాతి చిత్రానికి దర్శకునిగా అవకాశం ఇస్తానన్నారు. సినిమాకు కృష్ణ కథానాయకునిగా చేయాలన్న ఆలోచనతో సంప్రదించగా ఆయన డేట్స్ ఇచ్చేశారు, అయితే అప్పటి కృష్ణ-రామారావు పోటీ వాతావరణంలో ఆ విషయాన్ని ప్రకటించలేదు.
సాహసవంతుడు సినిమా విడుదలై పరాజయం పాలైంది. నిర్మాత విద్యాసాగర్ పెట్టుబడి పెట్టే స్థితిలో లేరు. మరోవైపు కృష్ణ ఇచ్చిన డేట్స్ దగ్గరపడుతున్నాయి. ఆయన మరెవరికైనా ఇచ్చేస్తే సినిమా నిర్మాణం ఇక అసాధ్యమైపోతుంది. ఆ దశలో తమిళంలో రజనీకాంత్ కథానాయకునిగా, ముత్తురామన్ దర్శకత్వంలో రూపొందించిన ప్రియ సినిమా మస్తాన్ రావు చూశారు. తెలుగులో డబ్బింగ్ చేస్తే మంచి విజయవంతమవుతుందని నమ్మిన మస్తాన్ రావు ఆ విషయం నిర్మాత విద్యాసాగర్ కి చెప్పి ఒప్పించారు. ఆ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు రూ.2లక్షలకు మాట్లాడుకుని డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ప్రియ సినిమా ఫస్ట్ కాపీ రావడంతోనే డిస్ట్రిబ్యూటర్లు కొనేయడంతో నిర్మాతకు దాదాపు రూ.5లక్షలు లాభం వచ్చింది.
దాంతో సినిమా నిర్మాణ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. మస్తాన్ రావును ఏదైనా విజయవంతమైన సినిమా చూసుకుని రీమేక్ చేస్తే బావుంటుందని కృష్ణ సలహాయిచ్చారు. రమేష్ బెహ్ల్ నిర్మాణ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసిన హిందీ సినిమా కష్మేవాదే తెలుగు రీమేక్ హక్కులు సుందర్ లాల్ నహతా వద్ద ఉన్నాయని వాళ్ళు తీయట్లేదని తెలసిందని ఆ సినిమా హక్కుల కోసం అడగమని కృష్ణ సూచించారు. హక్కుల కోసం నహతా కుమారుడు శ్రీకాంత్ తో మాట్లాడి రూ.60వేలకు ఒప్పించారు. అడ్వాన్స్ తీసుకోకుండా రికార్డింగ్ ముందురోజు ఇవ్వమన్నారాయన. రికార్డింగ్ ముందురోజున వెళ్తే సుందర్ లాల్ స్వయంగా సినిమా తీద్దామనుకుంటున్నారని ఇవ్వమని తేల్చిచెప్పారు.
వారం రోజుల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సివుండగా మస్తాన్ రావు, రచయిత జంధ్యాలతో కలిసి బెంగళూరులో ఏదైనా మంచి కన్నడ సినిమా దొరికితే హక్కులు కొందామని బయలుదేరారు. ఏవీ దొరకక తిరిగి వచ్చేప్పుడు దారిలో మస్తాన్ రావుకు ఓ కథాంశం ఆలోచనకు వచ్చింది. అది జంధ్యాలకు నచ్చడంతో మద్రాసుకు వచ్చేసి సత్యానంద్తో కూర్చొని దాన్నే అభివృద్ధి చేశారు. ఆ కథ హీరో కృష్ణకు కూడా నచ్చడంతో సినిమా కథ కోసం ప్రయత్నాలు ముగించి, చిత్రీకరణ ప్రారంభించారు.[1]

నటనటుల ఎంపిక[మార్చు]

బీరం మస్తాన్ రావుకు దర్శకునిగా అవకాశం ఇస్తానని నిర్మాత విద్యాసాగర్ చెప్తూనే, హీరోగా ఎవరిని అనుకుంటున్నావని అడిగారు. అప్పటికే తనకు పరిచయం ఉన్న కృష్ణ హీరోగా సినిమా తీస్తే బావుంటుందని మస్తాన్ రావు సూచించారు. నిర్మాత అంగీకారంపై, కృష్ణను మస్తాన్ రావు సంప్రదించగా ఆయన 5నెలల తర్వాత డేట్లు కేటాయించారు. హీరోయిన్ గా జయప్రదకి అడ్వాన్స్ ఇచ్చి ఆమె కాల్షీట్లు తీసుకున్నారు. ముందుగా అనుకున్న కష్మేవాదే సినిమాను హక్కుదారులు చివర సమయంలో ఇవ్వననడంతో, జయప్రద వేరే కథ తీస్తుంటే తన కాల్షీట్లు కాన్సిల్ చేసుకుంటానని చెప్పేశారు. దర్శకుడు సినిమా చిత్రీకరణకు సమయం సమీపించిన విషయాన్ని చెప్పగా ఆమె తన తండ్రితో మాట్లాడి మూడురోజుల్లో చెప్తానన్నారు. సరిగ్గా నాలుగో రోజున సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతూండడంతో ఒక్కరోజు ముందు వరకూ హీరోయిన్ విషయంలో అనిశ్చితి పెట్టుకునే ధైర్యం చేయలేకపోయారు. ఆమె చెప్పిన మూడు రోజుల గడువు తర్వాత సినిమా చేస్తానని మందుకువచ్చినా దర్శక నిర్మాతలు ఒప్పుకోలేదు. అప్పటికి తమిళంలో పదునారు వయదినిలే సినిమా చేసి, వెలుగులోకి వచ్చిన శ్రీదేవిని కలిసి పరిస్థితి వివరించి ఈ సినిమా కథ చెప్పారు. కథ నచ్చడంతో తన వద్ద ఉన్న డేట్స్ వారికే ఇచ్చి వీలున్నంతలో సర్దుబాటు చేసుకోమన్నారు. వెతకగా అక్కడక్కడా ఓ 8 రోజులు దొరికాయి. మార్చుకున్న కథని మళ్ళీ కృష్ణకి చెప్పగా ఆయనకు చాలా నచ్చింది. కానీ సినిమాకి కథ దొరకలేదని, ప్రారంభం కాదని అభిప్రాయంతో ఉన్న కృష్ణ ఆ కాల్షీట్లు వేరే సినిమాలకు ఇచ్చేశారు. మస్తాన్ రావు కృష్ణని ఆయా నిర్మాతలతో మాట్లాడి వీలున్నన్ని డేట్స్ వెనక్కి తీసుకోమని, దొరికినన్నిటితోనే చిత్రీకరిస్తానని కోరారు. అలా లభించిన కృష్ణ 20 కాల్షీట్లు, శ్రీదేవి 8 కాల్షీట్లు కలిసేరావడం సినిమా చిత్రీకరణకు ఉపకరించింది.[1]

చిత్రీకరణ[మార్చు]

సినిమా చిత్రీకరణకు ఆఖరి నిమిషంలో ఖరారైన హీరోహీరోయిన్ల డేట్లు అడ్జస్టు చేసుకుంటూ తీయడమే పెద్ద సవాలు. హీరోహీరోయిన్లు ప్రయత్నించి ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ సాగించారు. సినిమాకు నవయుగ వారు పంపిణీదారులుగా వ్యవహరించారు. సినిమాకు షూటింగ్ ప్రారంభమవుతూనే పంపిణీదారులతో ఒప్పందం చేసుకున్నారు. సినిమాలో పదిరీళ్ళు షూట్ చేశాకా నవయుగ సంస్థ వారు చూసి సినిమా నాటకాల పద్ధతిలో వస్తోంది, ఎవరైనా అనుభవజ్ఞులకు చూపించి సలహాలు తీసుకుంటే బావుంటుంది అన్నారు. దాంతో నిర్మాత ఆ విషయాన్ని దర్శకునికి చెప్పి, దర్శకత్వశాఖలో మస్తాన్ రావు గురువులైన బాపయ్య, కె.రాఘవేంద్రరావు వంటివారికి చూపించి సలహాతీసుకుందామని ప్రతిపాదించారు. దానికి దర్శకుడు మస్తాన్ రావు-మీకు నమ్మకం లేకుంటే తప్పుకుంటాను, ఆ దర్శకుల్లో ఒకరిని నేనే మాట్లాడిపెడతాను. అంతేకానీ ఈ దశలో వేరే జోక్యాలు తీసుకురావద్దని చెప్పేశారు. పైగా సినిమా ఘనవిజయం సాధించేందుకు నాదీ పూచీ అని నమ్మకం కలిగించారు. దాంతో షూటింగ్ దశలో వచ్చిన ఆటంకాలు కూడా తొలగిపోయి సాఫీగా చిత్రీకరణ సాగింది.[1]

విడుదల[మార్చు]

సినిమా 1979 చివర్లో విడుదలైంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లైన నవయుగ పంపిణీదారులు విడుదలకు కొన్ని గంటల ముందు పంపిణీ సంస్థకు సంబంధించిన కొందరు సినిమా చూశారని పెద్ద విజయవంతం కాదనీ, క్లైమాక్స్ మరీ బాగోలేదని చెప్పారంటూ దర్శకుడితో చెప్పి వాళ్ళ సూచనల మేరకు క్లైమాక్స్ తొలగిస్తామన్నారు. దర్శకుడు మస్తాన్ రావు నవయుగ వారితో - ఎలాగూ సినిమా కాసేపట్లో మొదలుకానుంది కాబట్టి మార్నింగ్ షో యధాతథంగా వేసేయమని, ప్రేక్షకుల స్పందనను బట్టి అవసరమైతే తర్వాతి షో నుంచి క్లైమాక్స్ ట్రిమ్ చేయవచ్చని కోరారు. అందుకు వాళ్ళు అంగీకరించి యధాతథంగా సినిమాను ప్రదర్శించారు.
మొదటి షో నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి షోలో దర్శకుడు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడడంతో, సినిమా అయ్యాకా ఆయనను గుర్తుపట్టి పూలమాలలు వేసి థియేటర్ చుట్టూ ఊరేగించారు.[1] సినిమా ఘన విజయాన్ని సాధించి, రజతోత్సవం కూడా జరుపుకుంది.

సంగీతం[మార్చు]

సినిమాకు చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు.[1]

పాటలు[మార్చు]

బుర్రిపాలెం బుల్లోడి సినిమాలోని పాటల జాబితా ఇది.[2]

  1. బుర్రిపాలెం బుల్లివాడ్ని
  2. చిన్నది కాదమ్మో
  3. మాయదారి సచ్చినోళ్ళు
  4. నా జీవన బృందావనిలో

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 బీరం, మస్తాన్ రావు (ఫిబ్రవరి 2008). "మొదటి సినిమా-బీరం మస్తాన్ రావు". కౌముది.నెట్. Retrieved 25 ఆగస్టు 2015.
  2. "బుర్రిపాలెం బుల్లోడు". సఖి యా. 4 జూన్ 2011. Archived from the original on 2015-08-16. Retrieved 25 ఆగస్టు 2015.