భారత్ పాక్ యుద్ధం 1971

వికీపీడియా నుండి
భారత్ పాక్ యుద్ధం 1971
1971 surrender.jpg
పాకిస్తాన్ సైన్యాధిపతి ఎ.ఎ.కె. నియాజి తన సైన్యంతో బాటు భారత్ సైన్యాధిపతి జగ్జీత్ సింగ్ అరోరాకి లొంగిపోతున్నట్టుగా సంతకం చేస్తున్న దృశ్యం.
తేదీ 3 డిసెంబర్ – 16 డిసెంబర్ 1971
ప్రదేశము తూర్పున:
తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)
పశ్చిమాన:
భారత్-పశ్చిమ పాకిస్తాన్ సరిహద్దు
ఫలితము తూర్పున:
నిర్ణయాత్మకమైన భారత్ విజయం. పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది.
పశ్చిమాన:
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
భూభాగంలో మార్పులు తూర్పు పాకిస్తాన్(ప్రస్తుతం బంగ్లాదేశ్) స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
యుద్ధముంలో పాల్గొన్న దేశాలు
Flag of భారత దేశం
భారత్
Flag of పాకిస్తాన్
పాకిస్తాన్
సేనాధిపతులు
Flag of భారత దేశం శామ్ మానెక్షా
Flag of భారత దేశంజగ్జీత్ సింగ్ అరోరా
Flag of భారత దేశంజి.జి. బేవూర్
Flag of భారత దేశంకె.పి. కాన్డెత్
Flag of పాకిస్తాన్ గుల్ హసన్ ఖాన్
Flag of పాకిస్తాన్ అబ్దుల్ హమూద్ ఖాన్
Flag of పాకిస్తాన్ టిక్కా ఖాన్
Flag of పాకిస్తాన్ ఎ.ఎ.కె. నియాజి
బలగం
500,000 సైనికులు 365,000 సైనికులు
ప్రాణ నష్టం మరియు ఇతర నష్టాలు
3,843 మరణించారు[1]
9,851 గాయపడ్డారు[1]
1 ఫ్రిగేట్
1 నావల్ ప్లేన్
9,000 మరణించారు[2]
4,350 గాయపడ్డారు
97,368 పట్టుబడ్డారు[3]
2 డిస్ట్రాయర్స్[4]
1 మైన్ స్వీపర్[4]
1 సబ్ మెరీన్[5][6]
3 పాట్రోల్ వెసెల్స్
7 గన్ బోట్లు

భారత్-పాకిస్తాన్ ల మధ్య అతి పెద్ద యుద్ధం 1971లో జరిగింది. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ విమోచన ప్రధాన అంశంగా నిలిచింది. డిసెంబరు 3, 1971 సాయంత్రం మొదలయిన యుద్దం డిసెంబరు 16, 1971 తేదీన పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్దంలో భారత సైన్యంతో కలసి బంగ్లాదేశ్ సైన్యం కలసి కట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాడడం విశేషం.

విషయ సూచిక

[మార్చు] నేపథ్యం

పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్), తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఈ యుద్దానికి బీజం వేసింది. 1970లో జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్ పార్టీ అయిన అవామీ లీగ్ మొత్తం 169 సీట్లలో 167 గెలుచుకొని, 313 సీట్లు ఉన్న పాకిస్తాన్ పార్లమెంట్ దిగువసభలో ఆధిక్యతను సాధించింది. అవామీ లీగ్ పార్టీ అధ్యక్షుడయిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి హక్కు ఉన్నదని ప్రతిపాదించినపుడు, అప్పటి పాకిస్తాను అధ్యక్షుడు అయిన యాహ్యా ఖాన్ అందుకు అంగీకరించలేదు.

తూర్పు పాకిస్తాన్ నాయకులను అణచివేయడానికి యాహ్యా ఖాన్ మిలిటరీని రంగంలోకి దింపినపుడు తూర్పు పాకిస్తాన్లో నిరసనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున బందులు జరిగాయి. అవన్నీ అణిచివేస్తూ మార్చి 25, 1971ఢాకాను మిలిటరీ స్వాధీనపరచుకొంది. చాలామంది నాయకులు పారిపోయి భారత దేశం చేరుకొన్నారు. ముజిబుర్ రెహ్మాన్‌ను అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తానుకు తీసుకెళ్ళారు.

ఇది జరిగిన రెండు రోజులకు పాకిస్తాను సైన్యంలో మేజర్ అయిన జియా ఉర్ రెహ్మాన్ తనకుతానుగా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం ప్రకటించాడు. అవామీ లీగ్ నాయకులు కొందరు కలసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొనగా ప్రజలే గెరిల్లా గ్రూపులుగా మారి తమకున్న ఆర్మీతో కలసి పాకిస్తానుతో యుద్దానికి సిద్దమయ్యారు.

[మార్చు] భారత్ రంగప్రవేశం

1971 మార్చి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యపోరాటానికి పూర్తి మద్దతు తెలిపి బంగ్లా శరణార్థులకోసం భారత సరిహద్దులను తెరిపించారు. దాదాపు కోటిమంది శరణార్థులు పలురాష్ట్రాల్లోని శిబిరాల్లో తలదాచుకొన్నారు. అంతమంది శరణార్థులకు అవసరమయిన సౌకర్యాలు కలిపించడానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టసాగింది భారత ప్రభుత్వం.

అమెరికా పశ్చిమ పాకిస్తానుకు మొదటినుండి మిత్రదేశం కావడం వల్ల, పాకిస్తానుకు అవసరమయిన ఆయుధాలు మరియు సామగ్రి సమకూర్చడానికి సిద్ధమయింది. వెంటనే ఇందిరా గాంధీ యూరప్ పర్యటన జరిపి యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఫ్రాన్స్ లు పాకిస్తానుకు వ్యతిరేకంగా పనిచేయునట్లు ఒప్పించింది. ఆగష్టులో సోవియట్ యూనియన్‌తో ఇరవయ్యేళ్ళ మైత్రీ ఒప్పందం కుదుర్చుకొని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. భారత్‌కు సోవియట్ యూనియన్ అండ చూసిన చైనా యుద్ధంలో పాల్గొనలేదు కానీ పాకిస్తానుకు కొన్ని ఆయుధాలు సరఫరా చేసింది.

[మార్చు] యుద్ధం

చలికాలంలో హిమాలయ పర్వతాల మధ్య ఉన్న దారులన్నీ మంచుతో మూసుకుపోవడంవల్ల చైనా సైన్యం ముందుకు సాగలేదని, నవంబరు వరకు వేచిఉండి, ఆ తర్వాత భారత్ భారీగా తన సైన్యాన్ని సరిహద్దులవెంట మోహరించసాగింది. నవంబరు 23 న యాహ్యా ఖాన్ పాకిస్తానులో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలందరినీ యుద్దానికి సిద్ధమవమని పిలుపు ఇచ్చాడు.

డిసెంబర్ 3 సాయంత్రం 5.30 నిమిషాలకు భారతదేశ వైమానిక స్థావరాలపైన దాడి చేయమని యాహ్యా ఖాన్ ఇచ్చిన ఆదేశాలమేరకు పాకిస్తాన్ వైమానిక దళాలు ఎనిమిది భారత స్థావరాల పైన బాంబు దాడులు జరిపాయి. ఈ దాడులు ఎక్కువ నష్టం కలిగించకపోయినా, పాకిస్తాన్ పైన దాడి చేయడానికి భారత్‌కు సరి అయిన కారణం దొరికింది. అర్థరాత్రికల్లా భారత యుద్ద విమానాలు పాకిస్తాన్ పైన దాడులు చేయడం మొదలు పెట్టాయి. మరుసటిరోజుకల్లా భారత్ తనకున్న సైన్యం, నావికా దళం మరియు వైమానిక దళ బలగాలతో ముప్పేట దాడులు జరపడం మొదలు పెట్టింది.

యుద్ధంలో పాల్గొన్న భారత యుద్ద నౌక INS-విక్రాంత్

లాంగ్‌వాలా విజయం: యుద్దం ప్రారంభమయిన రెండు రోజులకే 2000-3000 మంది పాకిస్తాన్ సైనికులు 60 యుద్ద ట్యాంకులతో చీకటిలో రాజస్తాన్లోని లాంగ్‌వాలా చెక్‌పోస్ట్‌ను సమీపించారు. అక్కడ ఉన్న చెక్‌పోస్ట్ అధికారి అయిన ధరం వీర్ ఇది తెలుసుకొని తమ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌కు ఈ విషయాన్ని తెలిపి వెంటనే సైన్యం, ఆయుధాలు పంపమని కోరాడు. అంత తక్కువ వ్యవధిలో అవి సమకూర్చడం కష్టమని జవాబు వచ్చినా వీర్ తన దగ్గర ఉన్న కేవలం 120 సైనికులు, అతి కొద్ది ఆయుధాలతో పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కొనడానికి సిద్దమయ్యాడు. సూర్యోదయం అయ్యేవరకు దాదాపు రెండుగంటలపాటు ధరం వీర్ తన సైన్యంతో పాకిస్తాన్ సైన్యాన్ని నిలువరించగలిగాడు. భారత యుద్ద విమానాలకు రాత్రి పూట యుద్దం చేసే సదుపాయాలు లేకపోవడంతో అవి సూర్యోదయం వరకు వేచి ఉండి, ఆ తరువాత పాకిస్తాన్ సైన్యం పైన బాంబుల వర్షం కురిపించి మధ్యాహ్నానికల్లా పాకిస్తాన్ సైన్యాన్ని చిన్నాభిన్నం చేసి భారత్‌కు మొదటి విజయాన్ని అందించాయి.


అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారత నావికా దళం కరాచీ పోర్టు పైన మెరుపుదాడి చేసి యుద్ద నౌకలను ధ్వంసం చేసింది. బంగాళాఖాత జల ప్రాంతాలన్నింటినీ ఇండియన్ నేవీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరో వైపు భారత వైమానిక దళం దాదాపు 4000 యుద్ద వాహనాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫొర్స్‌ను ధ్వంసం చేసింది. భారతసైన్యం ముందు నిలువలేక పాకిస్తాన్ కేవలం 15 రోజుల్లో, అంటే డిసెంబర్ 16 న లొంగిపోయింది. మరుసటిరోజు భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది.

[మార్చు] యుద్ధ పరిణామాలు

ఈ యుద్ధం వల్ల బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం లభించింది. పాకిస్తాన్ అధ్యక్షుడు అయిన యహ్యా ఖాన్ రాజీనామా చేసాడు. ముజీబుర్ రెహ్మాన్ తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్ళి అధికారం చేపట్టాడు. దాదాపు 3,843 భారత సైనికులు మృతి చెందగా 9,851 మంది క్షతగాత్రులయ్యారు. పాకిస్తాన్ తనకున్న నేవీలో సగభాగం, ఎయిర్ ఫోర్స్‌లో పాతిక మరియు దాదాపు మూడొంతుల సైన్యాన్ని నష్టపోయింది. 90,000 పాకిస్తాన్ దేశస్తులు యుద్దఖైదీలుగా పట్టుబడ్డారు.

తూర్పు పాకిస్తానులో ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య ఇదమిత్థంగా తెలీదు. పదిలక్షల నుండి ముప్పైలక్షల వరకు మరణించి ఉంటారని ఆర్.జె. రమ్మెల్ అంచనా వేసాడు. [7] ఇతర అంచనాల ప్రకారం ఈ సంఖ్య 300,000 వరకు ఉండవచ్చు. డిసెంబరు 14 న ఓటమి అంచున ఉండగా, పాకిస్తాను సైన్యం, స్థానిక సహచరులతో కలిసి, ఒక పద్ధతి ప్రకారం పెద్ద సంఖ్యలో బెంగాలీ డాక్టర్లు, ఉపాధ్యాయులు, మేధావులను హతమార్చింది.[8][9]. మేధావి వర్గానికి చెందిన హిందూ మైనారిటీలపై జరిగిన ఊచకోతలో భాగమే ఇది. [10][11] తిరుగుబాటు చెయ్యగలరని భావించిన విద్యార్థులు, యువకులు కూడా ఈ దాడులకు గురయ్యారు.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు ఈ యుద్ధంలోనే సంభవించింది. యుద్ధనేరాలకు గాను 200 మంది ఖైదీలను విచారించాలని తొలుత భారత్ భావించినప్పటికీ, సంధికి చొరవ తీసుకొనే దిశగా ఖైదీలందరినీ విడుదల చేసేందుకు అంగీకరించింది. ఆ మరుసటి సంవత్సరంలో కుదుర్చుకొన్న సిమ్లా ఒప్పందంతో యుద్ధంలో తాను గెల్చుకున్న 15,000 చ.కి.మీ పైచిలుకు పాకిస్తాను భూభాగాన్ని భారత్ తిరిగి పాకిస్తానుకు ఇచ్చివేసింది. పొరుగు దేశాలను ఆక్రమించుకొనే ఉద్దేశం లేదన్న సూచనగాను, పాకిస్తానుతో చిరకాల శాంతిని నెలకొల్పేందుకుగానూ భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.


[మార్చు] ఇవి కూడా చూడండి

భారత్ పాక్ యుద్దం 1965
కార్గిల్ యుద్ధము

[మార్చు] మూలాలు వనరులు

  1. 1.0 1.1 Official Government of India Statement giving numbers of KIA, Parliament of India Website
  2. Leonard, Thomas. Encyclopedia of the developing world, Volume 1. Taylor & Francis, 2006. ISBN 0415976626, 9780415976626. 
  3. Quantification of Losses Suffered
  4. 4.0 4.1 Indo-Pakistani War of 1971. Global Security. తీసుకొన్న తేదీ: 2009-10-20.
  5. The Sinking of the Ghazi. Bharat Rakshak Monitor, 4(2). తీసుకొన్న తేదీ: 2009-10-20.
  6. Operations in the Bay of Bengal: The Loss of PNS/M Ghazi. PakDef. తీసుకొన్న తేదీ: 2009-10-20.
  7. Rummel, Rudolph J., "Statistics of Democide: Genocide and Mass Murder Since 1900", ISBN 3-8258-4010-7, Chapter 8, table 8.1
  8. "125 Slain in Dacca Area, Believed Elite of Bengal", New York Times, డిసెంబరు 19, 1971, p. 1. Retrieved on 2008-01-04. “At least 125 persons, believed to be physicians, professors, writers and teachers, were found murdered today in a field outside Dacca. All the victims' hands were tied behind their backs and they had been bayoneted, garroted or shot. These victims were among an estimated 300 Bengali intellectuals who had been seized by West Pakistani soldiers and locally recruited supporters.”
  9. Murshid, Tazeen M. (December 2, 1997). "State, nation, identity: The quest for legitimacy in Bangladesh". South Asia: Journal of South Asian Studies, 20 (2): 1–34. DOI:10.1080/00856409708723294. ISSN 14790270. 
  10. Khan, Muazzam Hussain (2003), "Killing of Intellectuals", Banglapedia, Asiatic Society of Bangladesh
  11. Shaiduzzaman (December 14, 2005), "Martyred intellectuals: martyred history", The Daily New Age, Bangladesh
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె