మల్లాడి సత్యలింగ నాయకర్

వికీపీడియా నుండి

తూర్పు గోదావరి జిల్లా లో ప్రముఖ వ్యక్తులు సర్ ఆర్ధర్ కాటన్, కందుకూరి వీరేశలింగం, మల్లాడి సత్య లింగ నాయకర్ లు. వీరిలో మల్లాడి సత్య లింగ నాయకర్ స్వతంత్రము రాక పూర్వము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ పట్టణం నందు యం.యస్.యన్.ఛారిటీస్ అనబడు స్వఛంద సంస్థ స్థాపనకు మూల పురుషుడు.


మల్లాడి సత్య లింగ నాయకర్ 1912 సం.లో రంగూన్ ( బర్మా) లోని జిల్లా కోర్టులో ఒక వీలునామా ను రిజిష్టర్ చేయించిరి. ఆ వీలునామా ప్రకారం తాను సంపదించిన ఆస్థి లో ఎనిమిది లక్షల రూపాయలను విద్యాలయములు మరియు దేవాలయముల నిర్వహణకు, బీద విధ్యార్ధులు ఉన్నత విద్య మరియు వృత్తి విద్యలు అభ్యసించుటకు, బీదవారికి తిండి పెట్టుట తదితర సేవా కార్యక్రమములకు కేటాయించిరి.


మల్లాడి సత్య లింగ నాయకర్ వీలునామా ప్రకారం దీవాన్ బహదూర్ డి.శేషగిరి రావు పంతులు ప్రధాన ధర్మ కర్త గా, మల్లాడి సత్య లింగ నాయకర్ యొక్క దత్త పుత్రుడయిన సుబ్రహ్మణ్యం నాయకర్, పినపోతు గోవింద రాజు మరియు కొవ్వూరి ఆదియ్యరెడ్డి లు ధర్మ కర్తలు గా యం.యస్.యన్.ఛారిటీస్ అనబడు స్వఛంద సంస్థను ఏర్పాటు చేసిరి.


దిగువ బర్మా లోని ప్రధాన కోర్టు చే మార్చి నెల 4 వ తారీఖు,1915 సం.లో కాకినాడ పట్టణం నందు యం.యస్.యన్.ఛారిటీస్ ధర్మ కర్తలకు వీలునామాలో పేర్కొన్నవిధముగా ఎనిమిది లక్షల రూపాయలు అందచేయబడినవి.వీలునామా ప్రకారం ఎనిమిది లక్షల రూపాయలలో అయిదు లక్షల రూపాయలు వ్యవసాయ భూములను శాస్వత ప్రతిపదికన కొనుగోలు చేయుటకు,రెండు లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయుటకు,మిగిలిన ఒక లక్ష రూపాయలను విశాలమయిన ఆట స్థలముతో ఒక పాఠశాల భవనము , ఆధునిక వ్యాయామశాల, పాఠశాల భవనము ప్రక్కగా బీద వారికి భోజన సదుపాయము అందించే ఒక సత్రము, చొల్లంగి గ్రామములో దేవాలయములు నిర్మించుటకు ఉద్దేశించబడినది.ఎనిమిది లక్షల రూపాయలలో ఒక లక్ష రూపాయలు నిర్మాణములకు కేటయించగా మిగిలిన ఏడు లక్షల రూపాయలమీద వచ్చు ఆదాయమును పాఠశాల, సత్రము,దేవాలయముల నిర్వహణకు మరియు ఉన్నత విద్యను అభ్యసించువారికి ఒక నిధి ఏర్పాటు కు ఖర్చు పెట్టుటకు ఉద్దేశించబడినది.


చొల్లంగి గ్రామములో ఒక స్నాన వాటిక, ఒక శివాలయము,శ్రీ రాములవారి మరియు ఆంజనేయులవారి ఆలయములు, అర్చకులకు ఒక భవనము, యాత్రికులకు ఒక విశ్రాంతి గృహము దశలవారిగా నిర్మించబడినవి.


[మార్చు] సంస్థలు

మల్లాడి సత్య లింగ నాయకర్ వీలునామా ప్రకారం ఈ క్రింద పేర్కొన్న సంస్థలు యం.యస్.యన్.ఛారిటీస్ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణములో స్థాపించబడి,నడుపబడుచున్నవి.


  • శ్రీ మల్లాడి సత్య లింగ నాయకర్ ఛారిటీస్ 1915 సం.లో పేదవారికి, పేద విద్యార్ధులకు ఉచిత వసతి మరియు ఉచిత ఆహారము అందించు సదుద్దేశ్యము తో స్థాపించబడినది.నేడు సుమారు 275 మంది పేద విద్యార్ధులకు ప్రతి రోజు రెండు పూటల ఉచిత ఆహారము పెట్టుటకు యం.యస్.యన్.ఛారిటీస్ రూ.8,00,000/- ఖర్చు పెట్టుచున్నది.వీరిలో వైద్య విద్య, ఇంజనీరింగ్, న్యాయ శాస్త్ర,పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్, ఐ.టి.ఐ,హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ మరియు వేద పాఠశాల విద్యలు అభ్యసించు విద్యార్ధులు కలరు.


  • 19వ తారీఖు అక్టోబరు నెల,1915 సం.లో అద్దె భవనమునందు ఒక సత్రమును ప్రారంభించిరి.24వ తారీఖు ఆగస్ట్ నెల,1916 సం.లో సుమారు 40 ఎకరాల స్థలమును ప్రభుత్వము వారు సేకరించి, {యం.యస్.యన్.ఛారిటీస్ ]] ధర్మ కర్తలకు అప్పజెప్పిరి. ప్రస్తుతము ఉన్న సత్రము భవనము 29వ తారీఖు ఆగస్ట్ నెల,1918 సం.లో ప్రారంభించబడినది.


  • 4వ తారీఖు అక్టోబరు నెల,1919 సం.లో పాఠశాల భవనము ప్రారంభించబడినది.


  • 1946 సం.లో ఉన్నత పాఠశాల స్థాపించబడినది.



  • 1954 సం.లో వేద పాఠశాల స్థాపించబడినది.


  • 1969 సం.లో జూనియర్ కళాశాల స్థాపించబడినది.


  • 1971 సం.లో డిగ్రీ కళాశాల స్థాపించబడినది.


  • 1986 సం.లో కాకినాడ - పిఠాపురం రోడ్డు మీద అచ్ఛంపేట జంక్షను వద్ద యం.యస్.యన్.ఛారిటీస్ కు చెందిన సుమారు పది కోట్ల రూపాయల విలువ గల 40 ఎకరాల భూమిని ఆంధ్రా విశ్వ విద్యాలయము పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ స్థాపనకు విరాళము గా ఇవ్వబడినది.అందువలన మల్లాడి సత్య లింగ నాయకర్ ఆంధ్రా విశ్వ విద్యాలయ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ అని నామకరణము చేయబడినది.



  • ప్రముఖ శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సుబ్బారావు (ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనెను) కు యం.యస్.యన్.ఛారిటీస్ ద్వారా విదేశాలలో విద్యను అభ్యసించుటకు ధన సహాయము అందించబడినది.


  • యం.యస్.యన్.ఛారిటీస్ ప్రారంభమయినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు ఒక లక్షా ఇరవై వేల మంది విద్యార్ధులు యం.యస్.యన్.ఛారిటీస్ ద్వారా నడుపబడుచున్న విద్యా సంస్థలలో ఒకటవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మరియు ఆంధ్రా పాలిటెక్నిక్ నుండి విద్య ను అభ్యసించినారు.
పేజీకి సంభందించిన లింకులు