మావో జెడాంగ్

వికీపీడియా నుండి
(మావో నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
毛泽东
మావో జెడాంగ్
మావో జెడాంగ్


పదవీ కాలం
1945 – 1976
ముందు చెన్ దుక్షూ
తరువాత హువా గ్వోఫెంగ్

పదవీ కాలం
1954 – 1959
ముందు లేరు
తరువాత లియూ షావోకీ

వ్యక్తిగత వివరాలు

జననం (1893-12-26)1893 డిసెంబరు 26
హునాన్, క్వింగ్ వంశం
మరణం 1976 సెప్టెంబరు 9(1976-09-09) (వయసు 82)
బీజింగ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
జాతీయత చైనీయుడు
రాజకీయ పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీ
జీవిత భాగస్వామి యాంగ్ కాయ్‌హూయ్ (1920–1930)
హెజిజేన్ (1930–1937)
జియాంగ్ క్వింగ్ (1939–1976)

మావో జెడాంగ్ (Mao Zedong) (జననం: డిసెంబరు 26, 1893-మరణం: 1976 సెప్టెంబరు 9) ను మావో సే టుంగ్ (Mao Tse-tung) అని కూడా పలుకుతుంటారు. 1949లో చైనాలో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు మావో. అప్పటి నుండి 1976లో మరణించే వరకు ఈయన చైనాను పరిపాలించాడు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తులలో మావో కూడా ఒకరు. మావో చైనా యొక్క సైనిక, పారిశ్రామిక, వ్యావసాయిక, మేధోపరమైన, సాంస్కృతిక పరమైన అన్ని ప్రణాళికలను నియంత్రించాడు.

కమ్యూనిష్టులు చైనాలో అధికారంలోకి వచ్చిన తరువాత మావో ప్రపంచమంతటా సుపరిచితుడు అయ్యాడు. చైనాలో పిన్నలు, పెద్దలు ఆయన నినాదాలను, ఆయన రచనలను అధ్యయనం చేసారు. గెరిల్లా యుద్ధం, సామ్యవాద విప్లవాలలో రైతాంగం యొక్క పాత్ర మొదలైన అంశాల గురించి ఆయన రచనలు చైనా వెలుపల చాలా ప్రభావం చూపాయి. మావో ఒక కవి కూడా.

బాల్యం మరియూ చదువు[మార్చు]

మావో చైనాలో హూనాన్ రాష్ట్రంలోని షావోషాన్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. చైనాలో క్వింగ్ వంశస్థుల మంచూ సామ్రాజ్యం 1911-12 విప్లవంలో కూలిపోయి చైనా ఒక రిపబ్లిక్ గా అవతరించిన సమయంలో మావో ఇంకా విద్యార్థి దశ లోనే ఉన్నాడు. మావో కొద్దికాలం పాటు ఈ పోరాటంలో పాల్గొన్నాడు. 1918లో మావో పెకింగ్ (నేటి బీజింగ్) లోని నేషనల్ యూనివర్శిటీలో లైబ్రరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్నపుడు సామ్యవాద సిద్దాంతాల వైపు ఆకర్షింపబడ్డాడు. 1921లో మావో మరో 11మందితో కలసి షాంఘైలో చైనీస్ కమ్యూనిష్టు పార్టీని (CCP) స్థాపించాడు.

యుద్ధం మరియూ తిరుగుబాటు[మార్చు]

చైనా ఆ రోజులలో అనేక మంది ప్యూడల్ యుద్ధ ప్రభువుల ఆధీనంలో చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి ఉండేది. వీరందరినీ తుదముట్టించి చైనాను ఏకీకృతం చేయుటకు కమ్యూనిష్టులు మొదట సన్ యెట్ సెన్ నాయకత్వంలోని కొమింటాంగ్ అనబడే ఒక జాతీయ పార్టీతో కలసి కృషి చేశారు. కానీ 1925లో సన్ యెట్ సెన్ మరణించిన తరువాత కొమింటాంగ్ పార్టీకి చియాంగ్ కైషెక్ నాయకుడయ్యాడు. ఇతనితో కమ్యూనిష్టులకు సయోధ్య కుదరలేదు. వీరి మధ్య ఘర్షణ త్వరలోనే యుధ్దంగా మారింది. దీనితో మావో మరి కొంతమంది కమ్యూనిష్టు నాయకులతో కలసి తమ సైన్యాన్ని 1928లో జియాంగ్జి రాష్టానికి తరలించాడు. 1931 నుండి చియాంగ్ ఈ సైన్యం మీద అనేకసార్లు దాడులు చేసి కమ్యూనిష్టులను తీవ్రంగా నష్టపరిచాడు. దానితో 1934లో మావో కమ్యూనిష్టు సైన్యాన్ని షాంగ్జీ (షెన్సీ) రాష్ట్రానికి తరలించాడు. ఈ తరలింపు చరిత్రలో లాంగ్ మార్చ్ గా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక సంవత్సర కాలం పైగా పట్టిన 9,700 కిలో మీటర్ల సుదీర్ఘమైన నడక. మార్గమధ్యంలో అనేక మంది చనిపోయారు.

1931లో జపాన్ చైనా లోని మంచూరియా ప్రాంతం మీద దండెత్తినది. 1937లో జపాన్ పూర్తి స్థాయి యుద్ధానికి తెరతీసింది. కమ్యూనిష్టులు కొమింటాంగ్ పార్టీ జాతీయ సైన్యంతో మరలా కలసి జపాన్‌ను ఎదుర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొమింటాంగ్ సైన్యాలు దేశం లోపలి ప్రాంతాలకు తరిమి వేయబడటంతో మావో తన గెరిల్లా యుద్ధ తంత్రంతో 1945 కల్లా చైనా లోని అధిక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. 1946లో మంచూరియా ప్రాంతంలో కమ్యూనిష్టులకు జాతీయ సైన్యానికి యుద్ధం ప్రారంభమైనది. 1949 అక్టోబరు కల్లా కమ్యూనిష్టులు చైనాను పూర్తిగా ఆక్రమించుకుని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించారు. కొమింటాంగ్ పార్టీ తైవాన్ వరకే తన అధికారాన్ని పరిమితం చేసుకున్నది.

అధికారంలోకి రాగానే మావో సోవియట్ యూనియన్తో స్నేహం చేసి వారి సహాయంతో చైనా సైన్యాన్ని బలోపేతం చేసాడు. 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్దంలో సామ్యవాద దేశమైన ఉత్తర కొరియాకు మావో సహాయం చేసాడు.

కొరియా యుద్ధం తరువాత వ్యావసాయిక, పారిశ్రామిక ఉత్పాదకతను పెంచటానికి మావో చర్యలు తీసుకున్నాడు. 1958లో గొప్ప ముందడుగు (Great Leap Forward) అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సోవియట్ యూనియన్ను అనుసరించకుండా చైనా తనదైన పంథాలో నడవటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం విజయ వంతం కాలేదు. 1960 వ దశకంలో సోవియట్ యూనియన్ చైనాల మధ్యన విభేదాలు పొడసూపాయి.

అణు పరిశోధనా కార్యక్రమాన్ని ప్రారంభించి 1960 వ దశకంలో మావో నాయకత్వంలో చైనా అణుపరీక్షలు జరిపినది.1959లో మావో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ఛైర్మన్ పదవి నుండి తప్పుకున్నాడు. కానీ దేశం మీద, పార్టీ మీద నియంత్రణను మాత్రం వదులుకోలేదు. 1960వ దశకంలో చైనా, సోవియట్ విభేదాలు ముదిరి కమ్యూనిష్టు ప్రపంచ నాయకత్వం కొరకు పరస్పరం సంఘర్షించుకున్నారు. మార్క్స్, లెనిన్, స్టాలిన్ ల అసలైన వారసుడు తానేనని మావో భావించాడు. సోవియట్ కమ్యూనిష్టులు అమెరికా యెడల అనుసరిస్తున్న మెతక వైఖిరి మావోకు నచ్చలేదు.

సాంస్కృతిక విప్లవం[మార్చు]

1960వ దశకం మధ్యలో చైనా దౌత్యపరమైన అనేక అపజయాలను చవిచూసింది. మావో ఈ సమయంలోనే విప్లవ స్ఫూర్తిని నిలిపి ఉంచుటకొరకు సంస్కరణ వాదులకు వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవానికి (1966-69) పిలుపునిచ్చాడు. పాత ఆచారాలు, పాత అలవాట్లు, పాత సంస్కృతి, పాత ఆలోచనా విధానాన్ని తుదముట్టించుట ఈ విప్లవ లక్ష్యంగా చెప్పబడింది.

1970 వ దశకం ప్రారంభంలో చైనా పశ్చిమ దేశాలతో తన సంబంధాలను మెరుగు పరచుకున్నది. మావో 1976 సెప్టెంబరులో మరణించాడు.

మావో మరణం తరువాత చైనా నాయకులు అతని విధానాలను చాలావరకు వదులుకున్నారు. చైనా పరిశ్రమలను, వ్యవసాయాన్ని, సాంకేతిక పరిజ్ఞాన్ని, సైన్యాన్ని ఆధునీకరించుటకు జపాన్, అమెరికా, ఐరోపా దేశాల సహాయాన్ని అర్థించారు.

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.