ముగ్గురు కొడుకులు (1952 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముగ్గురు కొడుకులు
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.నాగేంద్రరావు
తారాగణం ఆర్.నాగేంద్రరావు ,
మద్దాలి కృష్ణమూర్తి,
కన్నాంబ,
జానకి,
సూర్యప్రభ,
సరస్వతి,
గిరిజ,
పుష్ప
నిర్మాణ సంస్థ జెమినీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇదే సినిమాను ఏకకాలములో తెలుగుతో పాటు తమిళంలో మూండ్రు పిళ్లైగళ్గా తీశారు. ఈ చిత్రములో నూతన నాట్య తారలుగా గిరిజ, పుష్ప పరిచయమైనారు.

నటీనటులు[మార్చు]

  • పసుపులేటి కన్నాంబ - గౌరీ
  • ఆర్.నాగేంద్రరావు - సోమశేఖర్
  • ఎం. కె. రాధా - ప్రకాశం
  • శ్రీరాం - రాము
  • గణేశ్ - గోపాలం
  • జానకి - కమల
  • సుందరీబాయి - కాంతం
  • సూర్యప్రభ - ఛాయ
  • నారాయణరావు - ఫిలిం ప్రొడ్యూసర్
  • పండిట్‌రావు - రాందాసు
  • చంద్రబాబు - మ్యూజిక్ డైరెక్టర్
  • మద్దాలి కృష్ణమూర్తి - చెవిటిమనిషి
  • హెచ్.కృష్ణమూర్తి - ప్రొడక్షన్ అసిస్టెంట్

సాంకేతిక వర్గం[మార్చు]

కథ[మార్చు]

ఒక బియ్యపువర్తకుని యొద్ద మ్యానేజర్ ఉద్యోగం చేస్తూన్న సోమశేఖర్, భార్య, నలుగురుబిడ్డలతో సంతోషంగా జీవితం గడుపుతూ వుంటాడు. ఒకనాడు ఆతని యజమాని దొంగలెక్కలు వ్రాయమంటే సోమశేఖర్ ఒప్పుకోక తన వుద్యోగానికి రాజీనామా చేస్తాడు. తరువాత ఎక్కడ ప్రయత్నం చేసినా పనిదొరక్క కష్టపడతాడు. అతని ఇల్లు వేలానికి రాగానే వేరే ఉపాయం లేక పాతయజమాని కాళ్లపైబడి ఉద్యోగమిమ్మని బ్రతిమాలుతాడు. కాని అతడు కనికరం లేక వెళ్ల గొడతాడు. న్యాయానికి కట్టుబడితే ప్రపంచంలో బ్రతకడానికి వీల్లేదని సోమశేఖర్ దొంగవృత్తిలో పడిపోతాడు.

ఇలా సంవత్సరాలు గడచిపోతాయి. పెద్దకుమారుడు ప్రకాశం ఆలుబిడ్డలతో వేరేకాపురం ఉంటాడు. రెండవవాడు గోపాల్ పెళ్లామే గతియని బొంబాయిలో సుఖంగా వుంటాడు. ఆడబిడ్డ సుశీలకూడా పెండ్లాడి బొంబాయికి మొగుడిదగ్గరి కెళ్లి పోతుంది. చిన్నకుమారుడు రాము మాత్రం తల్లిదండ్రులతో వుంటాడు. వాడు చిన్నప్పటి నుంచి బ్యాంకర్ రామదాసు కూతురైన కమలను ప్రేమిస్తూంటాడు.

ఇలా వుండగా అలక్ష్యంగా ఖర్చుపెట్టడానికి అలవాటు పడిన ప్రకాశానికి డబ్బు ఇబ్బంది కలిగి తండ్రిని డబ్బుకోసమని బతిమాలుతాడు. సోమశేఖర్ వాడిని మందలిస్తూ డబ్బుకోసం రామదాసుగారింట్లో దొంగతనం చేస్తాడు. కమల పుట్టిన రోజు పండుగ అని రామదాసుగారింటికి వచ్చిన రాముయే దొంగను పట్టుకుంటాడు.

తండ్రిని తప్పించడానికి చోరీ అస్తితో కూడా రాము పోలీసువాళ్ళకు పట్టుబడి జైలుకు పోతాడు.

తాను చేసిన నేరానికి కొడుకు శిక్ష అనుభవిస్తుంటే సహించుకోలేక సోమశేఖర్, అధికారులుకు నిజం తెలియజేసి ఆత్మహత్య చేసుకుంటాడు. రాము విడుదలై ఇంటికి చేరుకుంటాడు.

ఆ వూళ్లో వుండటానికి ఇష్టంలేక రాము మదరాసుకు వెళ్ళి అక్కడో సినీమా కంపెనీలో నటించడానికి ఒప్పుకుంటాడు. తల్లికోసమని వెయ్యిరూపాయలు ప్రకాశం పేరిట పంపుతాడు. ఆ డబ్బంతా సొంతానికి వాడుకుని ప్రంకాశం తల్లిని మోసం చేస్తాడు. ప్రకాశం తల్లిని తనయింటికి తీనుకొస్తాడు. ప్రకాశం భార్య కాంతం అత్తగారిని ఎప్పుడూ సూటిపోటి మాటలాడుతూ వుంటుది. దీనికి తోడుగా ప్రకాశం కూడా తల్లికి నొప్పికలిగేట్టు మాట్లాడగా ఆమె తన రెండవకుమారుడైన గోపాల్ దగ్గరికి బొంబాయి కెళ్లిపోతుంది. అక్కడ కూడా అవమానం పొంది కూతురింటిలోనైనా నాలుగు రోజులుందామని పోగా ఒక్క-నిమిషంకూడా తనయింట్లో వుండటానికి వీలులేదని అల్లుడు కసురుకుంటాడు. నలుగురుబిడ్డల్ని కనికూడా పలుకరించే వారులేక పోయినందుకు కుమిలి తల్లి బొంబాయివిడిచి తిరిగి వూరికొస్తుంది.

ఇంటిలో మనస్సుకు శాంతిలేక ఆవిడ బ్రతుకు అంధకారమయమై పోతుంది.

జడివానలో పిచ్చిదానిలా వీధులెంబడి పోతూ కోవెలగుమ్మంలో స్మృతి తప్పి పడిపోతుంది. అక్కడున్నవారు జాలికలిగి లోపలికి తీసుకెళ్లతారు. ఆవిడ దైవసన్నిధిలో సేవజేస్తూ వుంటుంది.

కమల ప్రకాశం చేసిన మోసాన్ని తెలుసుకుని వెంటనే రమ్మని రామూకు టెలిగ్రామిస్తుంది. రాము దిగులుపడి వెంటనే బయలుదేరి వస్తాడు. తన తల్లికైన గతి కళ్లారచూస్తాడు. దానికంతటికీ కారణం తన అన్నే అని తెలిసి ప్రకాశాన్ని కొడతాడు. ఈలోగా తల్లి అక్కడికొచ్చి రామును మందలిస్తుంది. రాము, కమల ఇద్దరికీ పెళ్ళి జరుగుతుంది. తల్లి వారిని ఆశీర్వదిస్తుంది[1].

మూలాలు[మార్చు]

  1. ముగ్గురు కొడుకులు (1952) పాటలపుస్తకం ఆధారంగా