ముత్యాల సీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రవాస భారతీయురాలు ముత్యాల సీత వేమన గురించి, ఆయన పద్యాల్లోని నీతి గురించి అమెరికన్‌ బాలలకు తెలిపే కృషి చేస్తున్నారు. సొంతూరు కాకినాడకు చెందిన అరట్లకట్ట. తల్లి చుండ్రు సుబ్బాయమ్మ. భర్త ముత్యాల భాస్కరరావుతో టెక్సాస్‌లోని సుగర్‌ల్యాండ్‌లో స్థిరపడ్డారు. అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లోనే డిగ్రీ (సీపీఏ), పీజీ (ఎగ్జిక్యూటివ్‌-ఎంబీఏ) చదివిన ఆమె ఇండియానా యూనివర్సిటీలో ఐటీ ప్రొఫెషనల్‌గా, వివిధ బ్యాంకు, చమురు సంస్థల్లో ఉన్నతోద్యాగాలూ నిర్వహించారు.

పదవీ విరమణ చేశాక మనవళ్లకు వేమన శతక పద్యాలు నేర్పే క్రమంలో సీతకు వేమన నీతులు దేశ, ప్రాంత, కాల విచక్షణ లేకుండా సర్వత్రా ఆచరించదగ్గవని, ప్రత్యేకించి బాలల భవిష్యత్తుకు ఎంతో దోహదం చేస్తాయని స్ఫురించింది. శతకంలోని ఐదు పద్యాలను ఎంచుకొన్నారు. సర్వమానవ సమానత్వాన్ని వివరించే 'పశుల వన్నె వేరు.. పాలేక వర్ణమౌ' పద్యాన్ని, దయాగుణం విశిష్ఠత చెప్పే 'తప్పులెన్నువారు తండోప తండంబు.. పద్యాన్ని, అనవసర వాదాలొద్దని తెలిపే 'చెప్పులోని రాయి.. చెవిలోని జోరీగ' పద్యాన్ని, మంచి పనుల ప్రభావం అపారంగా ఉంటుందన్న అంశాన్ని తెలియచేసే 'చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు..' పద్యాన్ని, వినయంగా ఉండాలని బోధించే 'అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను' పద్యాన్ని తీసుకున్నారు. వాటిని యథాతధంగా తెలుగు లిపిలో ఇస్తూ, ఆ పక్కనే ఇంగ్లీషులో ఎలా పలకాలో, పదాలకు అర్ధం, భావం ఏమిటో వివరించారు. పద్యం సారాంశాన్ని, అందులోని నీతిని బాలలకు సులభంగా అర్థమయ్యేలా చక్కటి బొమ్మలతో నీతి కథనూ చేర్చారు. 'వాట్‌ ఈజ్‌ వేమన సేయింగ్‌?' శీర్షికతో అందంగా బాలల్ని ఆకట్టుకునేలా వున్న ఈ పుస్తకాన్ని 'తానా' ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అమెరికాలోని 'మామ్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ అసోసియేషన్‌' అందించే '2009- ఉత్తమ బాల సాహిత్యం' పురస్కారం ఈ పుస్తకానికి దక్కడం విశేషం. టెక్సాస్‌ ప్రాంతంలోని పలు పాఠశాలల్లో ఈ పుస్తకంలోని పద్యాలు బోధిస్తున్నారు.[1]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-09. Retrieved 2010-02-26.