మూగ నోము (సినిమా)
మూగ నోము (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జమున |
సంగీతం | ఆర్. గోవర్ధన్ |
నిర్మాణ సంస్థ | ఎ.వి.యం. స్టూడియోస్ |
భాష | తెలుగు |
మూగ నోము అక్కినేని నాగేశ్వర్రావు, జమున, ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలలో నటించగా ఎవియం సంస్థ నిర్మించి 1969 లో విడుదలైన సినిమా. కథ అంతా గోపీ అనే పిల్లవాడి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో తల్లివి నీవే తండ్రివి నీవే అనే పాట ప్రేక్షకాదరణ పొందింది.
కథ
[మార్చు]పెద్ద జమీందారు, దివాన్ బహద్దూర్ రాజగోపాలరావు (యస్వీ రంగారావు) జమిలో వ్యవసాయం చేసే రైతు సోమయ్య (నాగయ్య), కూతురు గౌరి (జమున). జమీందారు పుత్రుడు వేణుగోపాల్ (అక్కినేని) ఇంగ్లండులో చదివి ఇండియా వస్తాడు. అనుకోకుండా రైలులో కలిసిన గౌరితో తనొక ఎలక్ట్రిక్ ఉద్యోగినని పరిచయం చేసుకుంటాడు. ఊరికి వచ్చిన తరువాత అతడు జమీందారని తెలిసి దూరం కావాలనుకుంటుంది గౌరి. కాని తను మనసారా ప్రేమించానని ఆమెకు చెప్పి ఒప్పించి, ఊరి గుడిలో తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. తరువాత తండ్రి చెప్పిన పనిమీద సింగపూర్ వెళ్తాడు. గౌరిని వేణు వివాహం చేసుకున్నాడని తెలుసుకుంటాడు జమీందారు. ఆమె గర్భవతి అని కూడా తెలుస్తుంది. దాంతో ఆమెను, ఆమె తండ్రిని ఊరువిడిచి వెళ్ళమంటాడు. వేణుతో వివాహం సంగతి ఎవరికీ తెలియనీయవద్దని ఆమెచే ప్రమాణం చేయించుకుంటాడు. ఆ ప్రకారం ఊరు వదిలి వెళ్లిన గౌరి ఒక మగపిల్లవాడిని ప్రసవిస్తుంది. అయితే ఆమె తండ్రి, ఆ పిల్లాడిని రామాపురం అనాధాశ్రమంలో వదిలిపెట్టి, బాబు మరణించాడని గౌరికి చెబుతాడు. ఆమె బాధతో కుమిలిపోతుంది. సింగపూరు నుంచి వచ్చిన వేణు గౌరికోసం వెతికి, ఆమె జాడ తెలియక తాగుడు వ్యసనానికి బానిసవుతాడు. పట్నంలో ఒక నర్తకి (విజయలలిత) ఇంట్లో ఆమెను చూసి ఆమె శీలం గురించి నిందిస్తాడు. తరువాత గౌరి రామాపురం స్కూల్లో టీచర్‌గా చేరటం, అక్కడ ఆమె కొడుకు గోపి (బేబీ బ్రహ్మజీ) ఓ అనాధగా పరిచయమై ఆమెకు చేరువకావటం జరుగుతుంది. స్కూలు వార్షికోత్సవంలో గౌరిని ఊరు తీసుకెళ్తాడు. షావుకారు రంగయ్య (రాజనాల), తన కూతురు రజని (వెన్నిరాడై నిర్మల)తో వేణుకు వివాహం చేయాలనుకొని పెద్ద జమిందారును ఒప్పిస్తాడు. గోపీ బలవంతంతో వేణు ఈ పెళ్లికి అంగీకరిస్తాడు. సోమయ్య వలన గోపియే తన కుమారుడని తెలిసి గౌరి అక్కడకు వస్తుంది. ఆమెను ద్వేషిస్తూ వేణు నిందిస్తాడు. గోపి తన కొడుకని చెప్పిన గౌరిని మరింతగా వేణు అవమానంగా మాట్లాడినా గౌరి ఏం మాట్లాడదు. అదే సమయంలో ఆస్తి మొత్తం పెళ్లికిముందే రాసిమ్మని కోరిన షావుకారు, అతని కుమార్తె నైజం గ్రహిస్తాడు జమిందారు. వెంటనే గౌరి తన కోడలని, గోపి తన మనవడని ప్రకటించటంతో ఆమె మూగనోము సమాప్తమై, అందరూ ఆనందించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.[1]
నటీనటులు
[మార్చు]- వేణుగోపాల్ గా అక్కినేని నాగేశ్వరరావు
- గౌరిగా జమున
- జమీందారుగా ఎస్.వి. రంగారావు, వేణుగోపాల్ తండ్రి
- చిత్తూరు నాగయ్య
- విజయలలిత
- రాజనాల
- వెన్నిరాడై నిర్మల
- బేబీ బ్రహ్మాజీ
- పద్మనాభం
- గీతాంజలి
- కోళ్ల సత్యం
- డాక్టర్ రమేష్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఆర్. గోవర్ధనం స్వరాలు సమకూర్చగా దాశరథి, ఆరుద్ర, సి. నారాయణరెడ్డి పాటలు రాశారు.[2] [3]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఈవేళ నాలో ఎందుకో ఆశలు-లోలోన ఏవో విరిసెలే వలపులు | దాశరథి కృష్ణమాచార్య | ఆర్.గోవర్ధనం | ఘంటసాల పి.సుశీల |
ఊరుమారినా ఉనికి మారునా | ఆరుద్ర | ఆర్.గోవర్ధనం | ఘంటసాల |
తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే దైవము నీవే | ఆరుద్ర | ఆర్.గోవర్ధనం | పి.సుశీల, బృందం |
నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే | దాశరథి కృష్ణమాచార్య | ఆర్.గోవర్ధనం | ఘంటసాల |
పగడాల జాబిలి చూడు - గగనాల దాగెను నేడు | సి.నారాయణరెడ్డి | ఆర్.గోవర్ధనం | ఘంటసాల పి.సుశీల |
అందం నీలో ఉందని అది,రచన: దాశరథి, గానం. ఘంటసాల, పి సుశీల
అలాఉంటే ఎలా ఇలా రావోయీ , రచన: దాశరథి, గానం.పి.సుశీల
ఊరు మారినా ఉనికి మారునా, రచన: ఆరుద్ర, గానం. పీ. బి శ్రీనివాస్
గొంతు విప్పి నే పాడుతినా ,(నాటకం) రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.మాధవపెద్ది, పిఠాపురం, పి సుశీల , వసంత బృందం
సాంకేతికవర్గం
[మార్చు]- సంభాషణలు: డివి నరసరాజు
- కథ: జావర్ సీతారామన్
- సంగీతం: ఆర్ గోవర్ధనం
- కూర్పు: ఆర్ విఠల్
- కళ: ఏకె శేఖర్
- ఛాయాగ్రహణం: పి భాస్కరరావు
- దర్శకత్వం: డి యోగానంద్
- నిర్మాతలు: మురుగన్, కుమరన్, శరవణన్
విశేషాలు
[మార్చు]- కళత్తూర్ కన్నమ్మ అనే తమిళ సినిమా ఈ సినిమాకు మాతృక. తమిళ సినిమాలో సావిత్రి, జెమినీ గణేశన్, చిన్నపిల్లవాడిగా కమల్ హాసన్ నటించారు.
- హిందీలో ఈ చిత్రాన్ని మై ఛుప్ రహూఁగీగా 1962లో సునీల్ దత్, మీనాకుమారి జంటగా నిర్మించారు.
- తరువాత సింహళంలో మాంగలీక్ టైటిల్‌తో నిర్మితమైంది.[1]
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (26 January 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 మూగనోము". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 27 January 2019.[permanent dead link]
- ↑ డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ↑ సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి. ఘంటసాల గళామృతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.